మహారాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే ధ్వజం
సీఎం ఫడ్నవీస్ వైఖరి సరికాదంటూ ఆగ్రహం
సాక్షి, ముంబై: పుణే–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మిస్తున్న ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టు, అయోధ్య రామమందిరంలో కానుకల చోరీ, రైల్వేల్లో స్థానికుల ఉద్యోగాల అంశాలపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మహాయుతి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర నవనిర్మాణ రైల్వే కార్మిక్ సేన వార్షికోత్సవం, నూతన కార్యాలయం, లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బెదిరింపు ధోరణి తగదు
‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజ్ ఠాక్రే విమర్శించారు. మహారాష్ట్ర శాసనసభలో మరాఠీ సభ్యుల మధ్య హిందీలో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రిగా ఉండి ’చూసుకుంటాం’ అనే భాష ఉపయోగించడం సరికాదు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ బెదిరింపుల ధోరణి తగదు‘ అని వ్యాఖ్యానించారు. ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టులో చోటుచేసుకున్న లోపాలపై ప్రజలు ప్రశ్నిస్తే దానిని మహారాష్ట్రకు అవమానంగా చిత్రీకరించడం సరికాదని రాజ్ ఠాక్రే అన్నారు. ప్రజలు అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారని, అధికారంలో లేనప్పుడు ఇదే అంశాలపై బీజేపీ కూడా ఉద్యమాలు చేసిందని గుర్తుచేశారు.
అన్నీ సహజమేనా?
ప్రభుత్వం ప్రతి లోపాన్నీ ’సహజం’గా పేర్కొంటోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నందుకే అన్ని ఘటనలను సమర్థించుకోవడం సరికాదని, రేపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే వైఖరి అవలంబిస్తారా అని ప్రశ్నించారు. అయోధ్య రామమందిరంలో విరాళాలు, నిధుల చోరీ ఆరోపణలపై స్పందించిన రాజ్ ఠాక్రే.. భక్తుల దేవుడి సొమ్ము భద్రతపై ప్రశ్నిస్తే మతవ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదన్నారు. రామమందిర ట్రస్ట్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించిన సభ్యులు ఎక్కువ మంది ఉన్నారని పేర్కొంటూ, అలాంటి పరిస్థితుల్లో చోరీ ఎలా జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చదవండి: ప్రజల మరణాలపై వెకిలి నవ్వులా?
‘స్థానిక’ హక్కులపై అప్రమత్తంగా ఉండాలి
2008లో రైల్వే నియామకాల కోసం చేపట్టిన ఉద్యమాన్ని గుర్తు చేసిన రాజ్ ఠాక్రే.. ఆ పోరాటం వల్లే స్థానిక భాషల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా రైల్వే నియామకాలు, స్టాళ్ల కేటాయింపుల్లో స్థానికుల హక్కులు దెబ్బతినకుండా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.


