ఎల్‌ నినో పంజా.. రుతుపవనాల పరుగుకు బ్రేక్‌! | El Nino Strikes Again: India Monsoon Momentum Faces a Break | Sakshi
Sakshi News home page

ఎల్‌ నినో పంజా.. రుతుపవనాల పరుగుకు బ్రేక్‌!

Jul 10 2026 1:12 PM | Updated on Jul 10 2026 1:30 PM

El Nino Strikes Again: India Monsoon Momentum Faces a Break

దేశవ్యాప్తంగా వర్షాల లోటును పూడ్చుతూ వరుసగా తొమ్మిది రోజుల పాటు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనప్పటికీ.. రుతుపవనాలు మళ్లీ బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాల జోరుకు బ్రేక్‌ పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై మధ్యలో వర్షాలకు విరామం రావచ్చన్న అంచనాలు ఇటీవలే ఖరీఫ్‌ పంటలు వేసిన రైతుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.

జూన్‌లో దాదాపు మూడు వారాల పాటు రుతుపవనాలు మందగించడంతో దేశంలో వర్షపాతం లోటు తీవ్రంగా పెరిగింది. అయితే జూలై ప్రారంభం నుంచి వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు, బంగాళాఖాతం నుంచి వచ్చిన తేమ గాలుల కారణంగా రుతుపవనాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో పశ్చిమ, మధ్య, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.

ఈ వర్షాలతో దేశ సీజనల్‌ వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సాధారణం కంటే 14.3 శాతం తక్కువగా ఉన్నప్పటికీ.. రుతుపవనాల వర్షపాతం సాధారణ స్థాయికి చేరినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాలు సూచిస్తున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడం, నేలలో తేమ మెరుగుపడటం, ఖరీఫ్‌ సాగు వేగం పుంజుకోవడం వంటి ప్రయోజనాలు కనిపించాయి. అయితే ఈ ఊపు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

మళ్లీ వర్షాలకు బ్రేక్‌?
జూలై 10 నుంచి 15 మధ్య ఉత్తర, పశ్చిమ, మధ్య భారతంతో పాటు పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడన వ్యవస్థ బలహీనపడటం, మేఘాల విస్తరణ తగ్గడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. ఈ వర్ష విరామం కారణంగా జూలై మధ్య నాటికి దేశ మొత్తం వర్షపాతం మళ్లీ లోటు స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా ఇటీవల వరి, ఇతర వర్షాధార ఖరీఫ్‌ పంటలు వేసిన ప్రాంతాల్లో నేలలో తేమ తగ్గితే మొలక దశలో ఉన్న పంటలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో పెరగనున్న ఎండల తీవ్రత
మరోవైపు వర్షాల విరామ ప్రభావంతో తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూలై 10 నుంచి 15 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఎల్‌నినో ప్రభావమేనా?
సాధారణంగా ఎల్‌నినో పరిస్థితులు భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో ఒకేసారి భారీ వర్షాలు కురిసిన తర్వాత.. ఎక్కువ కాలం వర్ష విరామాలు ఏర్పడే ధోరణి కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే రుతుపవనాలు మొత్తం సీజన్‌లో సమానంగా విస్తరించకుండా.. భారీ వర్షాలు, పొడి కాలాల మధ్య ఊగిసలాడే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇటీవల వర్షాలతో దేశ నీటి పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ.. రుతుపవనాల గమనం ఇంకా అనిశ్చితంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. జూలై చివరి వారంలో మరోసారి వర్షాలు పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అప్పటి వరకు రైతులు ఆకాశం వైపే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా 9 రోజుల వర్షాలతో ఊపిరి పీల్చుకున్న భారత్‌కు.. ఇప్పుడు మరో వర్ష విరామం పరీక్షగా మారనుంది. ఎల్‌నినో ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది రాబోయే వారాల్లో తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement