ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక వారసత్వం  | PM Narendra Modi visited the iconic Prambanan Temple complex | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక వారసత్వం 

Jul 9 2026 4:56 AM | Updated on Jul 9 2026 4:56 AM

PM Narendra Modi visited the iconic Prambanan Temple complex

ప్రధాని మోదీ స్పష్టీకరణ  

ఇండోనేసియాలో ప్రంబనన్‌ ఆలయ సందర్శన  

ఇది భారత్, ఇండోనేసియాల నాగరికతా బంధాలకు నిదర్శనమని వెల్లడి  

ఆలయ పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభం  

యోగ్యకార్తా: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశ సాంస్కృతిక వారసత్వం కనిపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియాలోని యోగ్యకార్తాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత ప్రంబనన్‌ ఆలయ సముదాయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంతో కూడా ఉన్నారు. 

యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఈ ఆలయాన్ని ఉమ్మడిగా పరిరక్షించే ప్రాజెక్టును ఇరువురు నేతలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని భారత్, ఇండోనేసియాల మధ్య చిరకాల నాగరికతా బంధాలకు ఒక అద్భుతమైన నిదర్శనంగా మోదీ అభివర్ణించారు. శతాబ్దాలుగా ఇరుదేశాల ప్రజలను అనుసంధానిస్తున్న ఉమ్మడి వారసత్వానికి ఇదొక గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు. 

భారత్‌ సహాయంతో ఆలయ సముదాయ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇరు దేశాలు మంగళవారం ఒక అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌ తరపున ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) కీలకంగా వ్యవహరించే ఈ ఉమ్మడి సంరక్షణ ప్రాజెక్టు.. అలాగే ప్రంబనన్‌ ఆలయ సముదాయాన్ని మోదీ, సుబియంతో కలిసి సందర్శించడం వంటి పరిణామాలు భారత్‌–ఇండోనేసియా బంధానికి తిరుగులేని ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఆలయ ప్రదేశంలో ఏఎస్‌ఐ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ ప్రారంభానికి గుర్తుగా ఒక ఫలకాన్ని వారిద్దరూ ఆవిష్కరించారు.  

ఇది దైవత్వ భావనతో నిండిన క్షణం 
తొలుత ప్రంబనన్‌ ఆలయానికి చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. ఆలయ ప్రాంగణంలో కలియతిరుగుతూ ఇక్కడి విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ చరిత్రను వివరించారు. మోదీ, సుబియంతో పరస్పరం కరచాలనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఆలయ సముదాయానికి సంబంధించిన ఉమ్మడి పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవమని మోదీ పేర్కొన్నారు.

 మిత్రుడు, అధ్యక్షుడు సుబియంతోతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించడం వల్ల ఈ సందర్భం తనకు మరింత ప్రత్యేకంగా మారిందన్నారు. ఇండోనేసియా ప్రజలు ఈ గొప్ప వారసత్వాన్ని భక్తిభావంతో సంరక్షిస్తూ వస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఇండోనేసియా ప్రజలకు, ఇప్పటివరకు ఈ దేశాన్ని పాలించిన పాలకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఆ ఆలయాన్ని సందర్శించిన క్షణం దైవత్వ భావనతో నిండిన క్షణం అని వ్యాఖ్యానించారు. భారత్‌–ఇండోనేసియా స్నేహాన్ని బలోపేతం చేయడం, ఉభయ దేశాల ప్రజల సంక్షేమం, శీఘ్ర అభివృద్ధి కోసం భగవంతుడిని ప్రార్థించానని మోదీ తెలిపారు.

 ప్రంబనన్‌ ఆలయ సముదాయంలో సంరక్షణ, పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్న తరుణంలో, భారతీయ పర్యాటకులు కచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని విశ్వాసం ఉందన్నారు. ‘‘ప్రపంచంలోని సుదూర ప్రాంతాల్లో మనం ఎక్కడికి వెళ్లినా భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని చూడవచ్చు. ఆగ్నేయాసియాలో భారత వారసత్వానికి సంబంధించిన అతిపెద్ద గుర్తింపుల్లో ఆ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ శివుడు, దుర్గాదేవి, గణేశుడి విగ్రహాలు ఉన్నాయి. శతాబ్దాలుగా ప్రజలు పూజలు చేస్తున్నారు. నేడు ప్రంబనన్‌ ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసే అదృష్టం నాకు దక్కడం సంతోషంగా ఉంది’’అని మోదీ 
వివరించారు.  

కాలాతీత చిహ్నం  
ఇండోనేసియా అధ్యక్షుడితో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘‘అద్భుతమైన ప్రంబనన్‌ దేవాలయం మన సాంస్కృతిక, ఆధ్యాతి్మక అనుబంధాలకు కాలాతీత చిహ్నంగా నిలుస్తుంది. ఇటువంటి వారసత్వాన్ని పరిరక్షించడం అంటే తరతరాలకు స్ఫూర్తినిచ్చే సంప్రదాయాలను కాపాడుకోవడమే. ఈ ప్రయత్నంలో ఇండోనేసియాతో భాగస్వామి కావడం భారత్‌కు దక్కిన అదృష్టం. 

గాఢమైన సాంస్కృతిక సంబంధాలున్న దేశాలుగా భారత్, ఇండోనేయాలు ఉమ్మడి గతాన్ని స్మరించుకుంటూ, మరింత బలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయి’’అని మోదీ పేర్కొన్నారు. ప్రంబనన్‌ గుడి యోగ్యకార్తా నగరానికి ఈశాన్యంగా సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ఇండోనేసియాలో అతిపెద్ద హిందూ ఆలయంగా పరిగణిస్తారు. 9వ శతాబ్దంలో నిర్మించారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు అంకితం చేశారు. ఈ ఆలయ సముదాయం భారతదేశం, ఇండోనేసియాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement