breaking news
Prabowo Subianto
-
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక వారసత్వం
యోగ్యకార్తా: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశ సాంస్కృతిక వారసత్వం కనిపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియాలోని యోగ్యకార్తాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంతో కూడా ఉన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఈ ఆలయాన్ని ఉమ్మడిగా పరిరక్షించే ప్రాజెక్టును ఇరువురు నేతలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని భారత్, ఇండోనేసియాల మధ్య చిరకాల నాగరికతా బంధాలకు ఒక అద్భుతమైన నిదర్శనంగా మోదీ అభివర్ణించారు. శతాబ్దాలుగా ఇరుదేశాల ప్రజలను అనుసంధానిస్తున్న ఉమ్మడి వారసత్వానికి ఇదొక గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు. భారత్ సహాయంతో ఆలయ సముదాయ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇరు దేశాలు మంగళవారం ఒక అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ తరపున ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కీలకంగా వ్యవహరించే ఈ ఉమ్మడి సంరక్షణ ప్రాజెక్టు.. అలాగే ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని మోదీ, సుబియంతో కలిసి సందర్శించడం వంటి పరిణామాలు భారత్–ఇండోనేసియా బంధానికి తిరుగులేని ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఆలయ ప్రదేశంలో ఏఎస్ఐ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రారంభానికి గుర్తుగా ఒక ఫలకాన్ని వారిద్దరూ ఆవిష్కరించారు. ఇది దైవత్వ భావనతో నిండిన క్షణం తొలుత ప్రంబనన్ ఆలయానికి చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. ఆలయ ప్రాంగణంలో కలియతిరుగుతూ ఇక్కడి విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ చరిత్రను వివరించారు. మోదీ, సుబియంతో పరస్పరం కరచాలనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఆలయ సముదాయానికి సంబంధించిన ఉమ్మడి పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవమని మోదీ పేర్కొన్నారు. మిత్రుడు, అధ్యక్షుడు సుబియంతోతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించడం వల్ల ఈ సందర్భం తనకు మరింత ప్రత్యేకంగా మారిందన్నారు. ఇండోనేసియా ప్రజలు ఈ గొప్ప వారసత్వాన్ని భక్తిభావంతో సంరక్షిస్తూ వస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఇండోనేసియా ప్రజలకు, ఇప్పటివరకు ఈ దేశాన్ని పాలించిన పాలకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఆ ఆలయాన్ని సందర్శించిన క్షణం దైవత్వ భావనతో నిండిన క్షణం అని వ్యాఖ్యానించారు. భారత్–ఇండోనేసియా స్నేహాన్ని బలోపేతం చేయడం, ఉభయ దేశాల ప్రజల సంక్షేమం, శీఘ్ర అభివృద్ధి కోసం భగవంతుడిని ప్రార్థించానని మోదీ తెలిపారు. ప్రంబనన్ ఆలయ సముదాయంలో సంరక్షణ, పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్న తరుణంలో, భారతీయ పర్యాటకులు కచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని విశ్వాసం ఉందన్నారు. ‘‘ప్రపంచంలోని సుదూర ప్రాంతాల్లో మనం ఎక్కడికి వెళ్లినా భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని చూడవచ్చు. ఆగ్నేయాసియాలో భారత వారసత్వానికి సంబంధించిన అతిపెద్ద గుర్తింపుల్లో ఆ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ శివుడు, దుర్గాదేవి, గణేశుడి విగ్రహాలు ఉన్నాయి. శతాబ్దాలుగా ప్రజలు పూజలు చేస్తున్నారు. నేడు ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసే అదృష్టం నాకు దక్కడం సంతోషంగా ఉంది’’అని మోదీ వివరించారు. కాలాతీత చిహ్నం ఇండోనేసియా అధ్యక్షుడితో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘అద్భుతమైన ప్రంబనన్ దేవాలయం మన సాంస్కృతిక, ఆధ్యాతి్మక అనుబంధాలకు కాలాతీత చిహ్నంగా నిలుస్తుంది. ఇటువంటి వారసత్వాన్ని పరిరక్షించడం అంటే తరతరాలకు స్ఫూర్తినిచ్చే సంప్రదాయాలను కాపాడుకోవడమే. ఈ ప్రయత్నంలో ఇండోనేసియాతో భాగస్వామి కావడం భారత్‌కు దక్కిన అదృష్టం. గాఢమైన సాంస్కృతిక సంబంధాలున్న దేశాలుగా భారత్, ఇండోనేయాలు ఉమ్మడి గతాన్ని స్మరించుకుంటూ, మరింత బలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయి’’అని మోదీ పేర్కొన్నారు. ప్రంబనన్ గుడి యోగ్యకార్తా నగరానికి ఈశాన్యంగా సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ఇండోనేసియాలో అతిపెద్ద హిందూ ఆలయంగా పరిగణిస్తారు. 9వ శతాబ్దంలో నిర్మించారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు అంకితం చేశారు. ఈ ఆలయ సముదాయం భారతదేశం, ఇండోనేసియాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
ఇండోనేసియా చేతికి బ్రహ్మోస్!
జకార్తా: భారత అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ఇకపై మిత్రదేశం ఇండోనేసియా సైనిక పాటవాన్ని సైతం ద్విగుణీకృతంచేయనుంది. ఇరుదేశాల రక్షణ బంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేసియాకు సరఫరాచేసేందుకు భారత్ మంగళవారం సమ్మతి తెలుపుతూ ఒప్పందం కుదుర్చుకుంది. గగనతలం నుంచి ప్రయోగించి గగనతల లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని సైతం ఇండోనేసియాకు సరఫరాచేయనున్నారు.ఇండోనేసియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియంతోతో విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్కు సరఫరా మొదలు, సముద్రప్రాంత భద్రత, ఔషధాలు, విద్య, అంతరిక్ష పరిశోధన, ఆవిష్కరణలు, టెలీకమ్యూనికేషన్స్, ఆహార భద్రత, అత్యంత అరుదైన లోహాలు, భూఅయస్కాంతాల వంటి ప్రధాన రంగాల్లో 14 కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక చర్చల తర్వాత సంయుక్త ప్రకటనలో మోదీ మాట్లాడారు. ఇకపై ఇరుదేశాల బంధంలో సువర్ణాధ్యాయం ఆరంభంకానుందని వ్యాఖ్యానించారు.బ్రహ్మోస్, అస్త్ర ఇలా రెండు రక్షణ రంగ కీలక ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించి దాదాపు రూ.5,694 కోట్ల విలువైన ఒప్పందాలు ప్రధాని మోదీ సమక్షంలో కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం. పాక్ సైన్యాన్ని బెంబేలెత్తించిన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల సత్తా చూశాక వీటి కొనుగోలుకు ఇండోనేసియా ఆసక్తి చూపడంతో వీటిని సరఫరాచేసేందుకు భారత్ తన సమ్మతి తెలిపింది. దక్షిణ చైనా సముద్రంపై చైనా తన భల్లూకం పట్టుబిగిస్తున్న నేపథ్యంలో ఆగ్నేయాసియాలో చైనా ఆధిపత్యానికి గండికొట్టేందుకు దాని సమీప దేశాల సైనికసామర్థ్యాలను భారత్ ఇనుమడింపజేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఇండోనేసియాకు భారత్ తన బ్రహ్మోస్ వంటి కీలక ఆయుధాల సరఫరాకు ముందుకొచ్చింది.‘‘ఇండో–పసిఫిక్‌లో భద్రతకు మా సమష్టి శక్తియుక్తులు ఎంతో అవసరం. ఆసియా దేశాలకు భారత్ సదా సముచిత స్థానం, గౌరవం ఇస్తుంది. హిందూసముద్రప్రాంతంలోని భారత ఇంటిగ్రేటెడ్ ఫ్యూజన్ సెంటర్లోకి ఇండోనేసియా లియేసన్ ఆఫీసర్‌ను ఇకపై పంపవచ్చు. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం అనేది రక్షణ, భద్రత, సముద్రయానంలో సహకారాన్ని బలోపేతంచేస్తోంది. ఇకపై విపత్తు నిర్వహణ, పారిశ్రామికసహకారం సహా ఎన్నో రంగాల్లో మరింతగా సహకరించుకోబోతున్నాం. మలక్కా జలసంధి ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన సబాంగ్ నౌకాశ్రయాన్ని ఇరుదేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి’’అని మోదీ ప్రకటించారు. ఈ పోర్ట్ భారత గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్‌కు కేవలం 100 మైళ్లదూరంలో ఉండటం గమనార్హం. భారీస్థాయిలో పెట్టుబడులు... ‘‘ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తికి సంబంధించిన ఇండోనేసియా పరిశ్రమల్లో భారత్ పెట్టుబడుల వరద పారిస్తాం. నేటి ప్రపంచంలో ఉత్పత్తుల సరఫరా గొలుసు పటిష్టంగా ఉండటమనేది కీలకంగా తయారైంది. అందుకే ఇండోనేసియాలో అరుదైన మూలకాలు, స్టీల్ సరఫరా గొలుసు బలోపేతానికి కృషిచేస్తాం. దీనికితోడు ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారత్‌కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) అనుసంధానమై అక్కడి పౌరులకు సేవలు అందిస్తాం. 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతిపొందిన ఇరుదేశాల బంధం ఇప్పుడు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.సహకార రంగంతోపాటు అభివృద్ధి, భద్రత, సాంకేతిక, సాంస్కృతిక, విద్యరంగాల్లోనూ సువర్ణాధ్యాయం మొదలుకాబోతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)బెంగళూరు శాఖను ఇండోనేసియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్‌లోని సింఘసారీ స్పెషల్ ఎకనమిక్ జోన్లో ఆరంభించబోతున్నాం’’అని మోదీ తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణలో భారత్ సాధించిన అపార అనుభవం ఇండోనేసియాకు అక్కరకురానుంది. ఎన్నికల నిర్వహణతోపాటు ఈవీఎంల ఎగుమతికి సంబంధించి ఇరుదేశాల మధ్య అవగాహనఒప్పందం కుదిరింది. మోదీకి ఇండోనేసియా అత్యున్నత పురస్కారంఇరుదేశాల మధ్య సత్సంబంధాల బలోపేతానికి మోదీ చేస్తున్న కృషికిగాను ఇండోనేసియా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’తో సత్కరించింది. సుబియంతో స్వయంగా దీనిని మోదీకి ప్రదానంచేశారు. ఈ సందర్భంగా మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘అవార్డ్ పొందటం ఎంతో గర్వంగా ఉంది. పురస్కారం గౌరవం కోట్లాదిమంది భారతీయులకు దక్కుతుంది’’అని అన్నారు.నేడు ప్రాంభనన్ ఆలయ సందర్శనమంగళవారం మోదీ యోగ్యకర్త నగరంలోని అతిపెద్ద శివాలయం ప్రాంభనన్ను దర్శించుకోనున్నారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో నిలిచిన వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయ కాంప్లెక్స్ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో భారత్ సైతం పాలుపంచుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ఆరంభించేందుకు ఆసక్తి పత్రాలను ఇరుదేశాల ఉన్నతాధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించారు.సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు⇒ ఇదే మంత్రంతో భారత్ దూసుకెళ్తోంది⇒ ఇండోనేసియాలో భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగంజకార్తా: సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు మంత్రం జపిస్తూ భారత్ ముందుకు దూసుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇండోనేసియాలోని జకార్తా నగరంలో పర్యటిస్తున్న మోదీ మంగళవారం అక్కడి భారతీయ సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘భారత్ జపిస్తున్న స్వావలంభన మంత్రం ఒక్క ఇండోనేసియాకేకాదు యావత్ ఆసియాన్ దేశాలు ఆచరించాలి. భారత్ ఒక్కో సంస్కరణను అమలుచేస్తూ వస్తోంది. ఇప్పుడు భారత్ పెనుమార్పులకు నిలయంగా మారింది. భారత ప్రగతి వేగాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే 140 కోట్ల స్ఫూర్తికణికలు ప్రజ్వరిల్లుతున్నాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థ మాత్రమేకాదు ఇది వంద కోట్ల కలల పయనం. ఇంధనం, అనుసంధానం, చిప్‌ల తయారీ ఇలా ప్రతి రంగంలోనూ భారత్ ముందడుగేస్తోంది. భారత్ సొంత కలలనేకాదు సోదర దేశాల కలలనూ తీర్చేందుకు తహతహలాడుతోంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మంత్రాన్నీ మేం పఠిస్తాం. భారత్ తన నౌకాశ్రయాలను ఆధునీకరిస్తోంది. నూతన సముద్రమార్గాలను అన్వేíÙస్తోంది. ఈ పయనంలో ఇండోనేసియా మాకు మంచి మిత్రునిగా వెంట నడుస్తోంది’’ అని అన్నారు. నాలో ఇండియా డీఎన్ఏ: సుబియంతో మోదీ ప్రసంగం వేళ అక్కడే ఉన్న ఇండోనేసియా అధ్యక్షుడు సుబియంతో మాట్లాడారు. ‘‘అధికార పగ్గాలు చేపట్టిన 3 నెలలకే భారత్ ఆహా్వనించింది. గత ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నా. ముఖ్య అతిథిగా ఆహ్వానించిన భారత్‌కు నా కృతజ్ఞతలు. 1950లో భారత తొలి గణతంత్ర వేడుకలకు ఇండోనేసియా తొలి అధ్యక్షుడు సుకర్ణో హాజరయ్యారు. ఇలా 2 దేశాలు దశాబ్దాలుగా మిత్రులుగా మెలుగుతున్నాయి. గత ఏడాది భారతపర్యటన ముగించుకుని తిరిగిరాగానే జన్యక్రమ విశ్లేషణ పరీక్ష చేయించుకున్నా. డీఎన్ఏ టెస్ట్ పూర్తయింది. నాలో భారతీయ డీఎన్ఏ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అందుకే అనుకుంటా.. ఎప్పుడు భారతీయ సంగీతం విన్నాసరే నా శరీరం ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది. నా కేబినెట్ మంత్రులు, ఆర్మీ జనరల్స్ కూడా డాన్స్ ఇష్టపడతారు. పాడటమూ ఇష్టమే. ఒకవేళ వాళ్లలోనూ చాలా మందిలో భారత డీఎన్ఏ ఉందేమో’’ అని సుబియంతో అనగానే అక్కడి వాళ్లంతా ఫక్కున నవ్వారు. మోదీ పథకాలు కాపీ కొట్టా.. మోదీ గౌరవార్థం ఇచ్చిన విందులో సుబియంతో మాట్లాడారు. మోదీనుద్దేశిస్తూ.. ‘‘భారత్‌లో మీరు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నేను అచ్చుగుద్దినట్లు ఇండోనేసియాలో అమలుచేసేందుకు ప్రయత్నిస్తుంటా. ఎన్నో పథకాలను కాపీ చేశా. ఇది బహిరంగంగా చెప్పడానికి ఏమాత్రం సంకోచించను’’ అని అన్నారు.విస్తరణవాదానికి దూరంగా ప్రగతిపథానికి దగ్గరగా ఇదే భారత్ పంథా: మోదీ జకార్తా: భారత్ ఎల్లవేళలా అభివృద్ధి పథంలోనే పయనిస్తోందని, ఏనాడూ విస్తరణవాదం వైపు మొగ్గుచూపలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియా పార్లమెంట్లో అక్కడి చట్టసభ సభ్యులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ఇరుదేశాల మైత్రి మరింతగా విస్తరించాలి. 140 ఏళ్ల భారతీయులు, 29 కోట్ల ఇండోనేసియన్ల ఉమ్మడి శ్రేయస్సు కోసం ముందడుగువేద్దాం. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన, సమ్మిళిత ఇండో–పసిఫిక్ కోసం భారత్ ఎల్లప్పుడూ కృషిచేస్తుంది. ఇండో–పసిఫిక్‌లో స్వేచ్ఛావాణిజ్యాన్ని భారత్ కోరుకుంటోంది. భారత్ ఏనాడైనా అభివృద్ధి బాటనే అనుసరిస్తుంది. రాజ్య విస్తరణవాదం వైపు అస్సలు నడవదు’’అంటూ దక్షిణచైనా సముద్రంలో చైనా ఆధిపత్యం, ఆగ్నేయాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. -
యుద్ధవిమానాలు తోడ్కొని రాగా..
జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. మిత్రదేశ సారథికి సాదర స్వాగతం పలికేందుకు అత్యంత అధునాతన యుద్ధవిమానాలను ఎదుర్కోలుకు పంపింది. సోమవారం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ విమానం ఇండోనేసియా గగనతలంలోకి రాగానే ఆ దేశానికి చెందిన ఎఫ్–16, సుఖోయ్–30 యుద్దవిమానాలు ఎదురొచ్చి మరీ సాదరంగా జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయానికి దారిచూపించాయి. ఫైటర్జెట్లు ఎస్కార్ట్‌గా వెంట రావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేస్తూ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు.గగనతలం మొదలు ఎయిర్పోర్ట్ దాకా ఇండోనేసియా ప్రభుత్వం చేసిన సాదర స్వాగత కార్యక్రమం తన మనసును హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ప్రధాని మోదీకి ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోబో సుబియంతో సాదరస్వాగతం పలికారు. నలుగురు మంత్రులతో కలిసి వచి్చమరీ ఆయన ప్రధానిని ఆప్యాయంగా హత్తుకుని కుశల ప్రశ్నలువేశారు. మంగళవారం సుబియంతో, మోదీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టతే లక్ష్యంగా కీలక రంగాల్లో సహకారం, వాణిజ్యంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.ఇరుదేశాల బంధాన్ని 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించాక మోదీ ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. ‘‘మంగళవారం సుబియంతోతో కలిసి యోగ్యకర్త నగరంలోని దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ప్రభానన్ను దర్శించుకుంటా. ఇది ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబించనుంది. భారతీయులతోనూ మాట్లాడబోతున్నా. విదేశంలో భారతీయులు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. విదేశంలో ఉంటూ భారత ప్రగతికి వీళ్లంతా కృషిచేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. భారతీయ సంగతి తమ ఘన విజయాల ద్వారా భారత బంధాన్ని ప్రపంచ దేశాలతో బలపరుస్తున్నారు’’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. నృత్య ప్రదర్శన, తోలు బొమ్మలాట.. ఎయిర్పోర్ట్ నుంచి తాను బసచేయబోయే హోటల్‌కు చేరుకోగానే అక్కడే వేచి ఉన్న భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. వాళ్లతో మోదీ కొద్దిసేపు మాట్లాడి షేక్‌హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా రామయణ గాథను కళాత్మకంగా వివరిస్తూ కళాకారులు ప్రదర్శించిన ఇండోనేసియా సంప్రదాయక తోలుబొమ్మలాట ‘వయాన్గ్ కులిత్’ను మోదీ తిలకించారు. సమన్వయ గ్రూప్ చేసిన భరతనాట్యం నృత్య ప్రదర్శననూ ప్రధాని ఆసక్తిగా చూశారు.బౌద్ధమతంలోని త్రిరత్న(బుద్ధ, ధామ, సంఘ)ను వివరిస్తూ విహార ధర్మరత్న బృందంచేసిన ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందని మోదీ ఆ కళాకారులను పొగిడారు. భారత్ యాక్ట్ ఈస్ట్ ఆసియా, మహాసాగర్ విజన్‌లో భాగంగా మోదీ సోమవారం మూడు దేశాల పర్యటన మొదలెట్టారు. ఇండోనేసియా పర్యటన తర్వాత అటునుంచి మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనిస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లి ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తోనూ చర్చలు జరపనున్నారు. -
బలమైన బంధం దిశగా..!
భౌగోళికంగానే కాదు... సంస్కృతి, నాగరికతల్లోనూ శతాబ్దాలుగా సన్నిహితమైన రెండు దేశాల మధ్య సహకారం సహజం. ఉమ్మడి ప్రయోజనాలూ అనేకం. ప్రయాణ, వాణిజ్యాలు చిరకాలంగా ఉన్నా, ఇప్పటి దాకా ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడ్డ భారత, ఇండొనేసియాలు దాన్ని చక్కదిద్దుకొనే పనిలో పడ్డాయి. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 4 రోజులు భారత్‌లో పర్యటించి, భారత 76వ గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం బలమైన బంధానికి పునరంకితమయ్యే వీలు కల్పించింది. అన్నీ సాకల్యంగా చర్చించు కొనే విలువైన అవకాశం వచ్చింది. మొత్తం 55 పేరాల తాజా ఉమ్మడి ప్రకటనలో ఇరుపక్షాలూ విస్తృత ద్వైపాక్షిక, అంతర్జాతీయ సహకారంపై ఏకస్వరంతో మాట్లాడడం అందుకు నిదర్శనం. భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా భారత్‌తో ఇండొనేసియా అను బంధం బలమైనది. చిత్రమేమిటంటే చిరకాలంగా బలమైన బంధమున్నా అది భారీ స్థాయిలో ప్రతి ఫలించినట్లు కనిపించదు. అగ్రరాజ్యాల అధికార రాజకీయాలకు వ్యతిరేకతతో, అలీనోద్యమంతో ఆది నుంచి ముడిపడిన ఈ ఉభయ దేశాలూ వలస పాలనానంతర ఆసియా ఖండంలో ద్వైపాక్షికంగానూ, నాయకత్వంలోనూ కలసి అడుగేయాల్సింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఢిల్లీ, జకార్తాలు దూరం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తాజా ఢిల్లీ పర్యటన ఆశావహ పరిణామం. ఉభయదేశాల మధ్య అనుబంధానికి అవసరమైన వ్యూహాత్మక ప్రేరణను ఈ పర్యటన అందించింది. భారత గణతంత్ర దినోత్సవ కవాతుకు ముఖ్య అతిథిగా ఇండొనేసియా అధ్యక్షులు హాజరవడం ఇది నాలుగోసారి. భారత్ తొలిసారి జరుపుకొన్న రిపబ్లిక్ డే వేడుకలకు 1950లో సైతం ఇండొనేసియా అధ్యక్షుడే (సుకర్ణో) ముఖ్య అతిథి. ఆపైన సుసిలో బమ్బాగ్ యుధొయోనో (2011), జోకో విడోడో (2018), ఇప్పుడు సుబియాంటో! గమనిస్తే, ఆగ్నేయాసియా దేశాలతో బలమైన స్నేహం 1990ల నుంచి భారత ప్రయత్నం.అందులో భాగంగా జకార్తా, ఢిల్లీల మధ్య దూరం క్రమంగా తగ్గసాగింది. చైనా వ్యూహాత్మక ప్రాబల్యానికి పగ్గం వేసేలా ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని భారత్ ‘ప్రాచ్యానికి ప్రాధాన్య విధానం’ (యాక్ట్ ఈస్ట్ పాలసీ) చేపట్టింది. ఇండో – పసిఫిక్ ప్రాంతం కీలకమని గుర్తించింది. అయినా, ఇరు దేశాల భాగస్వామ్యం ఉండాల్సినంత లేదు. సుమత్రా, జావా... ఇలా 17 వేలకు పైగా ద్వీపాలతో కూడిన ఇండొనేసియా 28 కోట్లకు పైగా ప్రజలతో జనసంఖ్యలో ప్రపంచంలో నాలుగోది. దాదాపు 1.4 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థతో వచ్చే 2030 నాటి కల్లా ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి ఎకానమీల్లో ఒకటిగా నిలవడానికి ఉరకలు వేస్తోంది. ఈ దేశ వేలాది ద్వీపాలు హిందూ, పసిఫిక్ మహా సముద్రాల మధ్య వారధుల లాంటివి. ఇండొనేసియా సముద్ర జలాలు భారత్ సహా ఈ ప్రాంతంలో పలు దేశాల ప్రపంచ వాణిజ్యానికి ఆయువుపట్టు. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ అతి పెద్ద ద్వీపసమూహ దేశంతో బంధం భారత ఆర్థికప్రగతికి కీలకమనీ, బంధాన్ని బలోపేతం చేసుకోవాలంటున్నది అందుకే!అధ్యక్షుడి తాజా పర్యటనలో ఆరోగ్యం, సాంప్రదాయిక వైద్యం, సముద్రయాన భద్రత, డిజిటల్ అభివృద్ధి, సాంస్కృతిక సహకారంపై 5 అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుది రాయి. అలాగే, రక్షణ సహకారాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న మాట ఉమ్మడి ప్రకటనలోనూ ప్రస్తావించారు. అయితే, భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ఇండొనేసియా కొననున్నదంటూ పర్యట నకు ముందు వార్తలు గుప్పుమన్నా, ఆ రకమైన ఒప్పందమేదీ జరగలేదు. ఇండో– పసిఫిక్‌లో అమెరికా– చైనా శత్రుత్వం, దక్షిణ– తూర్పు చైనా సముద్రాల్లో చైనా బిగిస్తున్న పట్టు లాంటి సున్నిత అంశాలు, వాటి భౌగోళిక రాజకీయ ప్రభావాలు చర్చకు వచ్చిందీ, లేనిదీ తెలియలేదు. ఆర్థికాభివృద్ధిలోనూ ఇరుపక్షాలూ చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం 3 వేల కోట్ల డాలర్లే ఉన్న రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ద్విగుణం, బహుళం చేయాలి. రెంటి మధ్య రాకపోకలు, ఆదానప్రదానాల పెంపుదల, పారిశ్రామిక భాగస్వామ్యాలను పెంచుకోవాలి. అధ్యక్షుడి వెంట దాదాపు 100 మంది సభ్యుల వ్యాపార బృందం వచ్చినందున ఆ రంగంలో పురోగతి కనిపిస్తుందని ఆశించవచ్చు. ఇండో–పసిఫిక్ ప్రపంచ వివాదానికి కేంద్రమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ద్వైపాక్షిక,ప్రాంతీయ సహకారానికి ఉభయ దేశాలూ నడుంకట్టాలి. గత అక్టోబర్‌లో ఇండొనేసియా అధ్యక్షు డిగా పదవీ బాధ్యతలు చేపట్టి, ప్రస్తుతం ఆ దేశంలో అమితమైన ప్రాచుర్యం ఉన్న సుబియాంటో గద్దెనెక్కిన కొద్దికాలానికే భారత్‌లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలకు ఉత్ప్రేరకమే. ఇరు దేశాలు సన్నిహిత మిత్రులుగా, భాగస్వాములుగా కొనసాగాలని ఆయన అభిలషించడం గమనార్హం. ‘ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య’కు మూలస్తంభమైన ఇండొనేసియా ప్రాంతీయ ఆర్థిక సమన్వయానికి, రాజకీయ, భద్రతా అంశాలకూ ముఖ్యమైనది. ఆ సంగతి భారత్ గమనంలో ఉంచుకోవాలి. బీజింగ్ కళ్ళతో, భౌగోళిక రాజకీయాల కోణం నుంచే జకార్తాతో బంధాన్ని చూడరాదు. ఇండొనేసియా సైతం ఆది నుంచీ అగ్ర దేశాలతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆ సంగతి గుర్తించి, ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారం వెల్లివిరిసేలా భారత్ కృషి చేయాలి. ఆసియాలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనేలా చూడాలి. పర్యటనతో రాజకీయ నాయకత్వం చొరవ చూపినందున ఇప్పుడిక అధికార యంత్రాంగం, దౌత్యవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములు ఆచరణలో ముందుకు తీసుకుపోవాలి. -
గర్వించేలా గణతంత్రం
న్యూఢిల్లీ: భారత సైనిక శక్తిని, ఆయుధ పాటవాన్ని, సాంస్కృతి వైభవాన్ని ప్రదర్శిస్తూ 76వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాల ప్రదర్శన, జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. ‘సశక్త్ ఔర్ సురక్షిత్’ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఆదివారం జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, ప్రముఖుల పాల్గొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో కలిసి రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. త్రివిధ దళాల సైనికులు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ ప్రారంభమైంది. మొదట లెఫ్టినెంట్ అహన్‌కుమార్ నేతృత్వంలో 61 కావల్రీ సైనిక బృందం ముందుకు సాగింది. జాట్ రెజిమెంట్, గర్వాల్ రైఫిల్స్, మహర్ రెజిమెంట్, జమ్మూకశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్ వంటి దళాల కవాతు ఆకట్టుకుంది. దేశాభివృద్ధిని, ప్రజల సంక్షేమం, సాధికారతను కళ్లకు కడుతూ పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ థీమ్‌తో 31 శకటాలను ప్రదర్శించారు. వైమానిక దళానికి చెందిన 40 యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను అలరించాయి. 10 వేల మంది ప్రత్యేక అతిథులు రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రముఖులు సహా 10 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వీరిలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, విపత్తు సహాయక చర్యల సిబ్బంది, ఆశా వర్కర్లు, పారా ఒలింపిక్ అథ్లెట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కృషి సఖీలు, ఉద్యోగ్ సఖీలు తదితరులు ఉన్నారు. పలు ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పేటెంట్ హోల్డర్లు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరంతా జాతీయ యుద్ధ స్మారకం, పీఎం సంగ్రహాలయ్ తదితర కట్టడాలను సైతం సందర్శించారు. నాలో ఇండియన్ డీఎన్ఏ సుబియాంటో సరదా వ్యాఖ్యలు ఆహ్లాదంగా ‘ఎట్ హోమ్’గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి నిలయంలో ఆదివారం రాత్రి ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండొనేసియా అధ్యక్షుడు సుబియాంటో గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విందు ఆసాంతం సరదా సరదాగా సాగింది. తనకు భారతీయ మూలాలున్నాయని ఈ సందర్భంగా సుబియాంటో చెప్పారు. ‘‘కొన్ని వారాల క్రితమే జెనెటిక్ సీక్వెన్సింగ్, డీఎన్ఏ పరీక్షలు చేయించుకున్నా. నాలో ఇండియన్ డీఎన్ఏ ఉన్నట్లు తేలింది. భారతీయ సంగీతం విన్నప్పుడల్లా నేను డ్యాన్స్ చేస్తానని అందరికీ తెలుసు. నాలోని ఇండియన్ జీన్స్‌లోనే భారతీయ సంగీతం, నృత్యం దాగున్నాయి’’ అని సుబియాంటో చెప్పడంతో అతిథులంతా హాయిగా నవ్వేశారు. తమ భాషలో చాలా భాగం సంస్కృతం నుంచే వచ్చిందిన సుబియాంటో ఈ సందర్భంగా అన్నారు. తమ దేశంలో పేర్లు చాలావరకు సంస్కృతంలోనే ఉంటాయని చెప్పారు. తమరోజువారీ జీవితాల్లో భారతీయ ప్రాచీన నాగరికత ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు. భారత్, ఇండొనేసియా మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని ఆయన గుర్తు చేశారు. మోదీ తలపాగా గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఎరుపు, పసుపు రంగు గీతలతో కూడిన తలపాగా ‘సఫా’ను ధరించారు. దాంతోపాటు తెల్లరంగు కుర్తా–పైజామా, దానిపై ఊదారంగు బంద్గలా జాకెట్ ధరించారు. మోదీ ప్రతిఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్లో రంగురంగుల తలపాగాలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది గణతంత్ర ఉత్సవాల్లో ఆయన బహుళ రంగులతో కూడిన బాంధానీ ప్రింట్ సఫా ధరించారు. గూగుల్ డూడుల్ 76వ గణతంత్ర వేడుకల సందర్భంగా గూగుల్ ఆదివారం తీసుకొచ్చిన ప్రత్యేక డూడుల్ అందరినీ ఆకట్టుకుంది. లద్దాఖీ దుస్తులు ధరించిన మంచు చిరుత, ధోతీ–కుర్తా ధరించిన పులి వంటి జంతువులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వాయిద్యాలను ఇవి వాయిస్తున్నట్లుగా ఈ డూడుల్‌ను రూపొందించారు. ఇది జంతువుల పరేడ్‌లా ఉందని చెప్పొచ్చు. అంతర్లీనంగా గూగుల్ అనే అక్షరాలు పొందుపర్చారు. విదేశాల్లోనూ ఉప్పొంగిన దేశభక్తి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశా ల్లోనూ భారత గణతంత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయులతోపాటు స్థానికులు వాటి లో ఉత్సాహంగా పా ల్గొన్నారు. భారతీ యులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. భార తీయ నృత్యాలను ప్రదర్శించారు. నేపాల్, ఆ్రస్టేలియా, సింగపూర్, చైనా, శ్రీలంక, ఇజ్రాయెల్, జపాన్, ఇండొనేసియా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో రిపబ్లిక్ డే నిర్వహించారు. భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి. హైలైట్స్ → రాజ్యాంగానికి 75 ఏళ్లయిన సందర్భంగా వేడుకలు మరింత వైభవంగా జరిగాయి.→ గణతంత్ర వేడుకల్లో ఇండొనేసియా అధ్యక్షుడు పాల్గొనడం ఇది నాలుగోసారి. ఆ దేశ సైనిక బృందం కూడా పాలుపంచుకుంది.→ పరేడ్‌లో పరమ్‌వీర్ చక్ర అవార్డు గ్రహీతలు సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, అశోక చక్ర అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ కల్నల్ జస్రామ్ సింగ్ పాల్గొన్నారు.కర్తవ్య పథ్‌పై... మోదీ స్వచ్ఛభారత్ కర్తవ్యపథ్‌పై ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ చేసి చూపించారు. ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికయ్యాయి. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను స్వాగతించేందుకు వెళ్తుండగా దారిలో చెత్త కన్పించింది. దాంతో వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది చూస్తుండగా ఆయన కిందకు వంగి దాన్ని ఏరారు. డస్ట్‌బిన్‌లో పడేయాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మోదీ చర్యను నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు. సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి. -
ప్రధాని మోదీతో ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో భేటీ
-
భారత్‌కు ఇండోనేషియా అధ్యక్షుడు.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
ఢిల్లీ: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Prabowo Subianto) శనివారం భారత్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ (PM Modi) ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సమావేశం అయ్యారు. రాజకీయ భద్రత, రక్షణ, వాణిజ్య సహకారం, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో నాలుగో వ్యక్తి.భారత్, ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, తీవ్రవాద నిర్మూలన రంగాలలో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. సమావేశం అనంతరం ఇరుదేశాల నేతలు మీడియాతో మాట్లాడారు.భారత్‌కు ఇండోనేషియా కీలక భాగస్వామి అన్న మోదీ.. 10 సభ్య దేశాలు కలిగిన ఆసియాన్‌తో పాటు ఇండో పసిఫిక్ కూటమిలో ఇండోనేషియాకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఇండోనేషియా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు సుబియాంటో అన్నారు. ఫిన్‌టెక్, ఏఐ, ఐవోటీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు


