యుద్ధవిమానాలు తోడ్కొని రాగా.. | PM Narendra Modi Lands in Jakarta | Sakshi
Sakshi News home page

యుద్ధవిమానాలు తోడ్కొని రాగా..

Jul 7 2026 1:27 AM | Updated on Jul 7 2026 1:27 AM

PM Narendra Modi Lands in Jakarta

ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఇండోనేసియా అధ్యక్షుడు సుబియంతో

ఇండోనేసియా గగనతలంలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం 

ఎయిర్‌పోర్ట్‌లో సాదర స్వాగతం పలికిన ఆ దేశాధ్యక్షుడు సుబియంతో

జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. మిత్రదేశ సారథికి సాదర స్వాగతం పలికేందుకు అత్యంత అధునాతన యుద్ధవిమానాలను ఎదుర్కోలుకు పంపింది. సోమవారం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ విమానం ఇండోనేసియా గగనతలంలోకి రాగానే ఆ దేశానికి చెందిన ఎఫ్‌–16, సుఖోయ్‌–30 యుద్దవిమానాలు ఎదురొచ్చి మరీ సాదరంగా జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయానికి దారిచూపించాయి. ఫైటర్‌జెట్‌లు ఎస్కార్ట్‌గా వెంట రావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేస్తూ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు.

గగనతలం మొదలు ఎయిర్‌పోర్ట్‌ దాకా ఇండోనేసియా ప్రభుత్వం చేసిన సాదర స్వాగత కార్యక్రమం తన మనసును హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ప్రధాని మోదీకి ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోబో సుబియంతో సాదరస్వాగతం పలికారు. నలుగురు మంత్రులతో కలిసి వచి్చమరీ ఆయన ప్రధానిని ఆప్యాయంగా హత్తుకుని కుశల ప్రశ్నలువేశారు. మంగళవారం సుబియంతో, మోదీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టతే లక్ష్యంగా కీలక రంగాల్లో సహకారం, వాణిజ్యంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

ఇరుదేశాల బంధాన్ని 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించాక మోదీ ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. ‘‘మంగళవారం సుబియంతోతో కలిసి యోగ్యకర్త నగరంలోని దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ప్రభానన్‌ను దర్శించుకుంటా. ఇది ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబించనుంది. భారతీయులతోనూ మాట్లాడబోతున్నా. విదేశంలో భారతీయులు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. విదేశంలో ఉంటూ భారత ప్రగతికి వీళ్లంతా కృషిచేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. భారతీయ సంగతి తమ ఘన విజయాల ద్వారా భారత బంధాన్ని ప్రపంచ దేశాలతో బలపరుస్తున్నారు’’అని మోదీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 

నృత్య ప్రదర్శన, తోలు బొమ్మలాట.. 
ఎయిర్‌పోర్ట్‌ నుంచి తాను బసచేయబోయే హోటల్‌కు చేరుకోగానే అక్కడే వేచి ఉన్న భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. వాళ్లతో మోదీ కొద్దిసేపు మాట్లాడి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా రామయణ గాథను కళాత్మకంగా వివరిస్తూ కళాకారులు ప్రదర్శించిన ఇండోనేసియా సంప్రదాయక తోలుబొమ్మలాట ‘వయాన్గ్‌ కులిత్‌’ను మోదీ తిలకించారు. సమన్వయ గ్రూప్‌ చేసిన భరతనాట్యం నృత్య ప్రదర్శననూ ప్రధాని ఆసక్తిగా చూశారు.

బౌద్ధమతంలోని త్రిరత్న(బుద్ధ, ధామ, సంఘ)ను వివరిస్తూ విహార ధర్మరత్న బృందంచేసిన ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందని మోదీ ఆ కళాకారులను పొగిడారు. భారత్‌ యాక్ట్‌ ఈస్ట్‌ ఆసియా, మహాసాగర్‌ విజన్‌లో భాగంగా మోదీ సోమవారం మూడు దేశాల పర్యటన మొదలెట్టారు. ఇండోనేసియా పర్యటన తర్వాత అటునుంచి మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనిస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లి ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌తోనూ చర్చలు జరపనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement