తమిళనాడులో పోక్సో కేసు వ్యవహారం రాజకీయంగా మరోసారి చర్చకు వచ్చింది. గ్రానైట్ వ్యాపారి వీరమణికి సంబంధించిన పోక్సో కేసును గతంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం దాచిపెట్టిందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై డీఎంకే, అన్నాడీఎంకే ఎందుకు మౌనం వహిస్తున్నాయంటూ సీఎం ప్రశ్నించారు.
మదురాంతకం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న విజయ్.. ఈ కేసు గత డీఎంకే ప్రభుత్వ హయాంలోనే వెలుగులోకి వచ్చిందని, అయితే ఆ కేసును, దాని పూర్వాపరాలను ప్లాన్ ప్రకారమే దాచిపెట్టారని ఆరోపించారు. స్టాలిన్ సర్.. నోరు విప్పండి. ఈ విషయంలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని మౌనంగా ఉంటారా?’ అంటూ ప్రశ్నించారు. మహిళల భద్రత కోసం తామే పనిచేస్తున్నామని డీఎంకే చేస్తున్న ప్రచారాన్ని కూడా విజయ్ విమర్శించారు. వీరమణి ఎంతోమంది యువతుల జీవితాలను నాశనం చేశారని ఆరోపిస్తూ.. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకే ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
పెన్‌డ్రైవ్‌తో మొదలై.. క్లోజర్ రిపోర్ట్ వరకు
2025 అక్టోబర్‌లో ఓ స్వచ్ఛంద సంస్థకు గుర్తుతెలియని వ్యక్తి పెన్‌డ్రైవ్, లేఖ అందజేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో ఓ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఉందని పేర్కొంటూ వీరమణి పేరు ప్రస్తావించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుమారు ఐదు నెలల విచారణ అనంతరం పోలీసులు క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. వీడియోలో కనిపిస్తున్న బాలికను గుర్తించలేకపోవడం, ఒరిజినల్ వీడియో లభించకపోవడం, తగిన ఆధారాలు లేకపోవడం వంటి కారణాలను అందులో పేర్కొన్నారు. అయితే ప్రత్యేక పోక్సో కోర్టు ఈ క్లోజర్ రిపోర్టును అంగీకరించలేదు. మరింత దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో కేసులో కీలక మలుపు
కోర్టు ఆదేశాల తర్వాత దర్యాప్తు వేగం పుంజుకుంది. వీడియోలో కనిపించిన బాలికను పోలీసులు గుర్తించి.. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు విస్తరించడంతో మరికొందరు బాధితులు కూడా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఏడుగురికి పైగా బాధితులను గుర్తించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరమణితో పాటు ఆయనకు చెందిన ఇద్దరు సహాయకులు మహేంద్ర సిమ్హన్, ఆయన భార్య శాంతిని ఆగస్టు 28న అరెస్టు చేశారు.
విజయ్ సర్కార్ చర్యలు
కేసు తీవ్రత పెరగడంతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని ఆదేశించింది. గత దర్యాప్తులో ఎవరైనా నిర్లక్ష్యం వహించారా? కేసును బలహీనపరిచే ప్రయత్నం జరిగిందా? అన్న కోణాల్లోనూ విచారణ సాగుతోంది. పోలీసు వ్యవస్థలోని అధికారుల పాత్రపై కూడా సమీక్ష మొదలైంది. దీంతో ఈ కేసు కేవలం నిందితులపై దర్యాప్తుకే పరిమితం కాకుండా.. గతంలో కేసును హ్యాండిల్ చేసిన తీరుపైనా విచారణ జరుగుతున్న వ్యవహారంగా మారింది.
విజయ్ సర్కార్‌పై స్టాలిన్ సమాధానం..
ఇదిలా ఉండగా.. కేసును అడ్డుకున్నారంటూ గత డీఎంకే ప్రభుత్వంపై టీవీకే వర్గాల నుంచి ఆరోపణలు రావడంతో రాజకీయ దుమారం మొదలైంది. వీరమణిని కాపాడాలని తమ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తనపై, తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు అసత్యం, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. బాలికలకు న్యాయం జరగడమే ఈ వ్యవహారంలో అందరి ప్రధాన లక్ష్యం కావాలని స్టాలిన్ పేర్కొన్నారు. దీంతో వీరమణి కేసు ఇప్పుడు క్రిమినల్ దర్యాప్తుతో పాటు తమిళనాడు రాజకీయాల్లోనూ ప్రధాన చర్చగా మారింది.
ఇదీ చదవండి: కర్ణాటక సీఎం నోట సంచలన వ్యాఖ్యలు..


