ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియాలో సభ్యురాలైన భారత మహిళా క్రికెటర్ జి కమలికి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.75 లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు వెల్లడించారు.
మదురైకి చెందిన కమలిని ప్రతిభను ప్రత్యేకంగా అభినందించిన సీఎం విజయ్.. ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
కమలిని విజయం రాష్ట్రంలోని యువతకు, మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జట్టు సాధించిన చారిత్రాత్మక విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కమలిని ఇప్పటికే భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2024లో మహిళల అండర్-19 ఆసియా కప్, 2025లో అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్లలో ఆమె భాగమైంది.
వైస్ జగన్ అభినందనలు
మరోవైపు ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా అభినందించారు. జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీ చరణిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
కాగా, నిన్న జరిగిన ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఫైనల్స్‌లో భారత్ శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసి, వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, శ్రీచరణి, శ్రేయాంక, షఫాలీ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇదీ చదవండి: ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. స్వర్ణం మనదే!


