source: X
సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ కొలిన్ ఇంగ్రామ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 41 ఏళ్ల ఇంగ్రామ్ తన 22 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు సెప్టెంబర్ 22న సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే, క్రికెట్‌కు పూర్తిగా దూరం కావడం లేదని, కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన 13 ఏళ్ల తర్వాత ఇంగ్రామ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం విశేషం.

జాతీయ జట్టు తరఫున ఇంగ్రామ్ కెరీర్ అంత ఆశాజనకంగా సాగకపోయినా, దేశవాలీ క్రికెట్‌లో మాత్రం అదరగొట్టాడు. ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లామోర్గన్ తరఫున 11 ఏళ్ల పాటు కెరీర్ కొనసాగించిన అతడు.. మొత్తం 22 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 10 వేలకుపైగా పరుగులు చేశాడు. సుదీర్ఘ కాలం ఆటగాడిగా ప్రాతినిథ్యం వహించిన గ్లామోర్గన్ క్లబ్‌కే ఇంగ్రామ్ ఇకపై కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇంగ్రామ్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల్లోనూ ఆడాడు. 2010లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్రామ్.. తన రెండో వన్డే సెంచరీని పాకిస్థాన్‌పై సాధించాడు.
ఆ తర్వాత 2013లో పాకిస్థాన్‌పైనే మరో శతకం బాదాడు. దక్షిణాఫ్రికా తరఫున తొమ్మిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 2012లో భారత్‌తో జరిగిన ఏకైక టీ20లో 78 పరుగులు సాధించాడు. అదే అతడి చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 31 వన్డేలు, 9 టీ20లు ఆడిన ఇంగ్రామ్ 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీల సాయంతో 1053 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి: కాసేపట్లో లంకతో తొలి వన్డే.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ గుడ్‌బై


