షాకిస్తున్న దాల్‌ సరస్సు.. ఏవీ నాటి అందాలు? | Dal Lake in Crisis Sewage Threatens Kashmirs Iconic Landmark | Sakshi
Sakshi News home page

షాకిస్తున్న దాల్‌ సరస్సు.. ఏవీ నాటి అందాలు?

Sep 23 2026 7:27 AM | Updated on Sep 23 2026 7:27 AM

Dal Lake in Crisis Sewage Threatens Kashmirs Iconic Landmark

శ్రీనగర్‌: కశ్మీర్ అందాలకు ప్రతీకగా నిలిచిన శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సు ఇప్పుడు తీవ్ర పర్యావరణ సమస్యలతో సతమతమవుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు, పాటల్లో అద్భుతంగా కనిపించిన ఈ దాల్‌ సరస్సు ఇప్పుడు మురుగునీరు, చెత్త, కలుపు మొక్కలతో నిండిపోయి ద‍ర్శనమిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం శ్రీనగర్‌లో రోజూ ఉత్పత్తయ్యే సుమారు 201 మిలియన్ లీటర్ల మురుగునీటిలో 73 శాతం శుద్ధి కాకుండానే ఈ జల వనరుల్లోకి చేరుతోంది. 

రోజూ 147 మిలియన్ లీటర్ల మురుగు?
దాల్ సరస్సు, జీలం నది శ్రీనగర్‌తో పాటు మొత్తం కశ్మీర్‌కు కీలకమైన జల వనరులు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా పెరిగిన జనాభా, ఆక్రమణలు, చెత్త, మురుగునీరు, డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు వీటిని కాలుష్యం బారిన పడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా శుద్ధి చేయని మురుగునీరు సరస్సులోకి చేరడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తయ్యే 201 మిలియన్ లీటర్ల మురుగునీటిలో 73 శాతం శుద్ధి కావడం లేదు. ఫలితంగా దాదాపు 147 మిలియన్ లీటర్ల మురుగునీరు ప్రతిరోజూ దాల్, జీలం నదికి చేరుతోంది.

మురుగు ఒక్కటే కారణం కాదు..
దాల్ సరస్సు పరిస్థితి దిగజారడానికి మురుగునీటితో పాటు చెత్త, ఆక్రమణలు, భవన నిర్మాణాలు, లోపభూయిష్ట డ్రైనేజీ వ్యవస్థ, నీటి సహజ ప్రవాహానికి ఏర్పడుతున్న అడ్డంకులని స్థానికులు, కార్యకర్తలు చెబుతున్నారు. దాల్ గేట్, సహజ కాలువలు వంటి నీటి ప్రవాహ మార్గాల్లో అడ్డంకులు ఏర్పడటంతో సరస్సులోని నీరు సరిగా బయటకు వెళ్లలేకపోతోందని వారు అంటున్నారు. దీంతో నీటి ప్రవాహం మందగించి, మురికి పేరుకుపోయే పరిస్థితి ఏర్పడుతోంది. సరస్సు చుట్టుపక్కల జరుగుతున్న నిర్మాణాలు, నూతన రహదారులపైనా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కమలాల స్థానంలో కలుపు మొక్కలు
స్థానికుడు ఇజాజ్ అహ్మద్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ప్రజలు దాల్ సరస్సు నీటితో వుజూ చేసుకుని నమాజ్ చేసేవారని గుర్తుచేశారు. ఇప్పుడు నీటి నుంచి దుర్వాసన వస్తోందని, దాన్ని తాకడం కూడా ఇబ్బందిగా మారిందని చెప్పారు. గతంలో సరస్సులో పసుపు, తెలుపు రంగుల కమల పుష్పాలు కనిపించేవని, ఇప్పుడు సరస్సులోని పలు చోట్ల దట్టమైన కలుపు మొక్కలు కనిపిస్తున్నాయన్నారు. మరో స్థానికుడు అబ్దుల్ రజాక్ కూడా గతంలోని దాల్ లేక్‌తో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.

ఉపాధిపైనా ప్రభావం
దాల్ లేక్ కశ్మీర్ పర్యాటక రంగానికి ముఖ్యమైన గుర్తింపు. ఈ సరస్సు అందాలు.. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. అయితే సరస్సు పరిస్థితి ఇలాగే కొనసాగితే పర్యాటకుల రాక తగ్గే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పర్యాటక రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధిపైనా ప్రభావం పడవచ్చంటున్నారు. మరోవైపు ప్రతి సంవత్సరం సరస్సు శుభ్రత కోసం యంత్రాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ అవి కొంతకాలానికే ఒడ్డున నిలిచిపోతున్నాయని ఓ స్థానికుడు తెలిపారు.

‘ఫొటోలు కాదు.. మురుగు ఆపాలి’
దాల్‌ సరస్సు పరిరక్షణకు సంబంధించిన కార్యకర్త తారిఖ్ పత్లూ తెలిపిన వివరాల ప్రకారం కాగితాలపై ప్రణాళికలు రూపొందించడం లేదా అరకొరగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టడం సరిపోదు. ఇంజినీరింగ్ లోపాలు, శిక్షణ పొందిన సిబ్బంది కొరత, కొన్ని విధానపరమైన సమస్యలు కూడా సరస్సును ప్రభావితం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని సుమారు 80 పంప్ స్టేషన్లను ప్రస్తావిస్తూ, వాటి ద్వారా శుద్ధి చేయని మురుగునీరు సరస్సులు, నదుల్లోకి చేరుతున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ డీవాటరింగ్ పంప్ స్టేషన్లను మురుగునీటి శుద్ధి కేంద్రాలుగా (ఎస్టీపీ) మార్చాలని సూచించారు. కాలుష్యం వల్ల జల జీవావరణం కూడా ప్రభావితమవుతోందని ఆయన  అన్నారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది? పరిష్కారం ఏంటి?
వాతావరణ నిపుణుడు డాక్టర్ తౌసీఫ్ భట్  మాట్లాడుతూ దాల్ లేక్, జీలం నదిని కేవలం నీటి వనరులుగా కాకుండా కశ్మీర్ జీవనాధారం, ఆర్థిక వ్యవస్థ, గుర్తింపుతో ముడిపడిన వనరులుగా చూడాలని అన్నారు. శ్రీనగర్‌లో ఒక్కొక్కరు రోజుకు సుమారు 120 నుంచి 150 లీటర్ల నీటిని వినియోగిస్తారని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మురుగునీటి కనెక్షన్ల సమస్య ఉందని తెలిపారు. నిపుణుల సూచనల ప్రకారం సరస్సు నుంచి కలుపు, బురద తొలగించడమే కాకుండా ముందుగా శుద్ధి చేయని మురుగునీరు సరస్సులోకి చేరకుండా చూడటం, అవసరమైన ప్రాంతాల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేయడం, పాత ఎస్టీపీల సామర్థ్యాన్ని పెంచడం, పంప్ స్టేషన్లను సమీక్షించడం, సహజ నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించడం, చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవడం తక్షణం చేపట్టాల్సి ఉంది.

ఇదీ చదవండి: చాట్‌జీపీటీ, జెమినీలను వణికిస్తున్న ‘జేవ్‌ ఏఐ’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement