బెంగళూరు: ‘నా బ్యారక్‌లో నైజీరియా మహిళా ఖైదీలు నన్ను హింసిస్తున్నారు. వారు నన్ను చంపేస్తామని చెబుతున్నారు’ అని నటి పవిత్రగౌడ జడ్జి ముందు విలపించింది. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో పరప్పన జైల్లో ఉన్న ఆమె బెయిలు కోసం బెంగళూరు 59 సీసీహెచ్ కోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది. పవిత్రగౌడ విలపిస్తూ గోడును వెళ్లబోసుకుంది. తన బ్యారక్‌లో నైజీరియా మహిళా నిందితులు ఉన్నారని, గతంలో వేధిస్తున్నారని జైలు అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిసి మరింత సతాయిస్తున్నారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని పవిత్ర రోదించింది. తనకు చనిపోవాలని ఉందని, విషం కావాలని విలపిస్తూ చెప్పిందని ఆమె న్యాయవాదులు తెలిపారు.
హైకోర్టుకు దర్శన్ భార్య
రేణుకాస్వామి హత్యకేసులో అప్రూవర్‌గా మారతానని ప్రకటించిన ప్రదోశ్‌కు వ్యతిరేకంగా రెండో నిందితుడు, నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతడు దర్శన్‌కు శత్రువని, స్వార్థం కోసం అప్రూవర్ అవుతున్నాడని, అనుమతించరాదని కోరారు.


