సాక్షి, చెన్నై: చెన్నైలో సంచలనం సృష్టించిన ఎస్‌ఐ రాజ్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి విస్మయాన్ని కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నాడని భావించిన ఈ ఘటన వెనుక భార్య, ఆమె ప్రియుని ఘాతుకమే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. చెన్నై నుంగంబాక్కంకు చెందిన రాజ్ (58) పుదుపేట ఆర్మ్‌డ్ ఫోర్స్ మోటార్ విభాగంలో సబ్–ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య సెల్వ రాణి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
నాలుగు రోజులుగా రాజ్ సెలవులో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ ఇంటి మొదటి అంతస్తులో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. శరీరం అంతా మంటలతో రాజ్ కేకలు వేయడంతో, సెల్వ రాణి చుట్టుపక్కల వారి సహాయంతో ఆయనను కిల్‌పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు. తొలుత రాజ్ పోక్సో కేసులో చిక్కుకున్నాడని, ఆ మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ఘటన జరిగిన సమయంలో ఒక యువకుడు తన ముఖాన్ని దాచుకుంటూ హడావుడిగా ఇంటి నుండి బయటకు పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిపై పోలీసులు సెల్వరాణిని తమదైన శైలిలో ప్రశ్నించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. సెల్వరాణికి గతంలోనే వివాహమై, మొదటి భర్తకు దూరమయ్యాక రాజ్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరికి వయసులో 26 ఏళ్ల వ్యత్యాసం ఉంది.
ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి..
అయితే గత మూడు నెలలుగా సెల్వరాణి సెల్‌ఫోన్‌లో ఎక్కువ సమయం గడపడాన్ని రాజ్ గమనించి ప్రశ్నించాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆగ్రహించిన సెల్వరాణి తన ప్రియుడు దేవాను ఇంటికి రప్పించి, రాజ్‌కు నిద్ర మాత్రలు కలిపిన ఆహారం తినిపించింది. గాఢ నిద్రలో ఉన్న రాజ్‌పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి ఆత్మాహుతి చేసుకున్నట్టుగా నాటకం రచించినట్టు విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి సెల్వ రాణిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: సాంబారు గిన్నెలో పడి మహిళ మృతి


