పిల్లలతో సీఎం విజయ్‌.. స్వయంగా వడ్డించి, వారితోనే టిఫిన్‌ | Vijay Expands Free Breakfast Scheme to Classes 6 to 8 Dines With Students | Sakshi
Sakshi News home page

పిల్లలతో సీఎం విజయ్‌.. స్వయంగా వడ్డించి, వారితోనే టిఫిన్‌

Sep 22 2026 10:40 AM | Updated on Sep 22 2026 10:45 AM

Vijay Expands Free Breakfast Scheme to Classes 6 to 8 Dines With Students

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం మరో కీలక పథకం ఆచరణలోకి తెచ్చింది. పాఠశాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఉచిత అల్పాహార పథకం మరింత విస్తరించింది. ఇప్పటివరకు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే అందుతున్న పథకాన్ని.. ఇప్పుడు 6 నుంచి 8వ తరగతి వరకు విస్తరించారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ మంగళవారం ఉదయం చెన్నై తిరువాన్మియూర్‌లోని గాంధిగ్రామం ప్రభుత్వ పాఠశాలలో దీనిని ప్రారంభించారు.

‘పెరుం‌తలైవర్‌(మహానేత) కామరాజర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌’ పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం విస్తరణతో రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 15.30 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. 15,454 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 6, 7, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఉదయం అల్పాహారం అందనుంది. ఇప్పటివరకు ప్రాథమిక తరగతులకే పరిమితమైన ఈ పథకం తొలిసారి మధ్య పాఠశాల స్థాయికి చేరింది.

పథకం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయ్‌ పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వారికి అల్పాహారం వడ్డించి, వారితో కలిసి కూర్చుని తిన్నారు. గాంధిగ్రామం పాఠశాలలో ప్రారంభ కార్యక్రమం సందర్భంగా 217 మంది విద్యార్థులు అల్పాహారం తీసుకున్నారు. వారికి పొంగల్‌, సాంబార్‌, స్వీట్‌ వడ్డించినట్లు సమాచారం. విద్యార్థులతో వారి చదువు, తరగతుల గురించి కూడా విజయ్‌ మాట్లాడారు. ఈ విస్తరణ కోసం 2026–27 ఆర్థిక సంవత్సరంలో టీవీకే ప్రభుత్వం అదనంగా రూ.217.63 కోట్లు కేటాయించింది. దీంతో అల్పాహార పథకానికి మొత్తం కేటాయింపు రూ.724 కోట్లకు చేరింది.

రెండు జిల్లాల్లో మాత్రం నో..
అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న చెంగల్పట్టు, తిరుప్పూర్‌ జిల్లాల్లో మాత్రం ఈ విస్తరణను మంగళవారం నుంచి అమలు చేయలేదు. మదురాంతకం, ధరాపురం నియోజకవర్గాలకు అక్టోబర్‌ 6న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు మినహాయింపు ఇచ్చారు. మిగిలిన రాష్ట్రంలోని అర్హత ఉన్న పాఠశాలల్లో పథకం అమల్లోకి వచ్చింది.

చెన్నై నగర పరిధిలోని 447 ప్రభుత్వ, ప్రభుత్వ సాయంతో నడిచే పాఠశాలలకు సమీకృత వంటశాలల(ఒకే దగ్గర వండి) ద్వారా అల్పాహారం అందించనున్నారు. ఇతర నగరాలు, మున్సిపాలిటీలు, వాటికి ఆనుకుని ఉన్న పట్టణ ప్రాంతాల్లోని 2,150 పాఠశాలలకు కూడా ఇదే రీతిలో ఆహారం సరఫరా చేస్తారు. గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లోని 12,857 పాఠశాలల్లో స్థానికంగా వంట చేసి విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేశారు.

మెనూలో ఏం ఉంటుందంటే..
విద్యార్థులకు అందించే అల్పాహారంలో ఉప్పుమా, కిచిడీ, పొంగల్‌ వంటి వంటకాలు ఉన్నాయి. వారంలో కొన్ని రోజులు చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని కూడా అందించేలా ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో మెనూలో ప్రొటీన్‌ శాతం పెంచేందుకు నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌ తెలిపారు. కొత్త మెనూను ముందుగా ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత అమలు చేయనున్నట్లు చెప్పారు.

తల్లిదండ్రులకు విజయ్‌ పేరుతో మెసేజ్‌
పథకం విస్తరణ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్లకు ముఖ్యమంత్రి విజయ్‌ పేరుతో SMSలు కూడా పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా పథకం విస్తరణపై తల్లిదండ్రులకు సమాచారం అందించేలా ఈ సందేశాలను పంపినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.

స్టాలిన్‌ హయాంలోనే..
తమిళనాడులో పాఠశాల పిల్లలు ఉదయం ఆకలితో తరగతులకు హాజరుకాకుండా చూడటం, పోషకాహారాన్ని అందించడం, పాఠశాల హాజరు–చదువుపై ఏకాగ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ అల్పాహార పథకాన్ని 2022లో ప్రారంభించారు. తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అమలు చేసి, ఆ తర్వాత ఎయిడెడ్‌ స్కూళ్లకు కూడా విస్తరించారు. తాజా నిర్ణయంతో 6 నుంచి 8వ తరగతి విద్యార్థులూ ఈ పథకం పరిధిలోకి వచ్చారు.

ఇదీ చదవండి: ఆయన వయసు 125 ఏళ్లు.. సర్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement