బిహార్ జముయిలో మోరల్ పోలీసింగ్ పేరిట జరిగిన దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పదో తరగతి విద్యార్థిని, ఆమె స్నేహితుడిపై ఓ గ్యాంగ్ దాడి చేయడం.. ఆమెను లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దారుణంపై పోలీసుల దర్యాప్తు, వరుస అరెస్టుల మధ్యే.. బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఘటనను ఖండించడం మాట అటుంచి. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి అనడంతో రాజకీయ దుమారం రేగింది.
జముయి ఘటనపై ప్రతిపక్షాలు బిహార్‌లో ‘జంగిల్ రాజ్’ నడుస్తోందంటూ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి శ్రవణ్ కుమార్.. ‘ఇది ఓ చిన్న ఘటన. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ప్రపంచంలో నేరం పూర్తిగా అంతం కాలేదు’ అంటూ వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత తీవ్రమైన ఘటనను సాధారణ నేరంగా చూడకూడదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో తన వ్యాఖ్యలను పొరపాటుగా అర్థం చేసుకున్నారని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో నితీశ్‌కుమార్, ఇప్పుడు సామ్రాట్ చౌద్రీ ఇలా ఎవరి హయాంలో అయినా ఇలాంటివి జరిగాయి. ఆ సమయాల్లో కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అదే పని చేస్తాం అని అన్నారాయన. అయినప్పటికీ మంత్రి తీరుపై పలువురు మండిపడుతున్నారు.
मंत्री श्रवण कुमार ने जमुई घटना हुई लड़की के साथ छेड़खानी की गई है उसे पर कहा बिहार में छुटपुट घटनाएं हो रही है उसे पर हम इनकार नहीं कर सकते हैं।
हम उसे दुखी हैं फिर से ऐसी घटना दोबारा ना हो कानून के हिसाब से दोषियों पर कार्रवाई की जाएगी अपराध मुक्त पूरी दुनिया भी नहीं है छिट… pic.twitter.com/IQ0TYNAsVG— Sadan Singh Rajput (@SadanJee) September 22, 2026
మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై జేడీయూ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ కుశ్వాహా కూడా స్పందిస్తూ.. తాను, మంత్రి చేసిన వ్యాఖ్యలను నోరు జారి చేసినవిగా(స్లిప్ ఆఫ్ ది టంగ్)గా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై గతంలోనూ చర్యలు తీసుకున్నామని, ఇకపైనా ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..
సెప్టెంబర్ 19న మడ్వా పహాడ్ ప్రాంతంలో కోచింగ్ క్లాస్ ముగించుకుని స్కూటర్‌పై తిరిగి వస్తున్న పదో తరగతి విద్యార్థులు.. ఓ గ్యాంగ్ బారినపడ్డారు. వారి వాహనాన్ని అడ్డుకున్న నిందితులు ఇద్దరినీ కిందకు దించి దాడి చేశారు. బాలుడిని కాలర్ పట్టుకుని లాగగా.. బాలిక రక్షించే ప్రయత్నం చేసింది. ఇంతలో ముసుగులో ఉన్న ఓ వ్యక్తి దూసుకొచ్చి బలవంతంగా ఆమెను ఎత్తుకుని పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆమెను అతను అసభ్యంగా తాకాడు.

అయితే ఆమె స్నేహితుడు వెంటపడి ఆమెను విడిపించగలిగాడు. ఇద్దరూ తమను వదిలేయాలని వేడుకున్నప్పటికీ గ్యాంగ్ కొంతసేపు వారిని వేధించారు. చివరకు.. చేతులెత్తి బతిమాలడంతో అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతింంచారు. ఈ ఘటనను గ్యాంగ్‌లోని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితురాలిని కాపాడుకున్న ఆ యువకుడు తెగువపై ప్రశంసలు కురిశాయి.
ముగ్గురు అరెస్ట్, ఏడుగురి గుర్తింపు
వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీడియో, ఇతర ఆధారాల ఆధారంగా మొత్తం ఏడుగురిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గాలిస్తోంది. పోక్సోతో పాటు సంబంధిత బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వీడియో షేర్ చేసినా చిక్కులే
ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఖాతాలపైనా పోలీసులు చర్యలు ప్రారంభించారు. బాలిక మైనర్ కావడంతో ఆమె గుర్తింపు బయటపడేలా వీడియోను ప్రసారం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటివరకు 13 ఫేస్‌బుక్, 12 ఇన్‌స్టాగ్రామ్, 7 ఎక్స్ ఖాతాలు.. మొత్తం 32 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి తొలగింపు చర్యలకు పంపినట్లు అధికారులు తెలిపారు.
మహిళా కమిషన్ల జోక్యం
ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బిహార్ డీజీపీని ఆదేశించి.. ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా జిల్లా యంత్రాంగం నుంచి వివరాలు కోరింది.
రాజకీయ దుమారం
ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఘోరమైన పాలన నడుస్తోందని.. మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక చేతులు జోడించి వేడుకున్నప్పటికీ గ్యాంగ్ ఆమెను వేధించడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. నిందితులందరినీ గుర్తించి పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మరోవైపు అధికార పక్షం మాత్రం ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దోషులుగా తేలిన ఎవరినీ వదిలిపెట్టబోమని చెబుతోంది. పోలీసులు ఇప్పటికే అరెస్టులు చేపట్టడంతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. దీంతో జముయి ఘటనలో అసలు నిందితులందరినీ ఎప్పుడు పట్టుకుంటారు? మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల వేళ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


