ఎల్‌ నినో సంక్షోభం: 5 కోట్ల మందికి ‘ఒక్క పూట’ కూడా కష్టమే.. | English Headline El Niño Raises Asias Food Crisis Alarm | Sakshi
Sakshi News home page

ఎల్‌ నినో సంక్షోభం: 5 కోట్ల మందికి ‘ఒక్క పూట’ కూడా కష్టమే..

Sep 20 2026 7:02 AM | Updated on Sep 20 2026 7:52 AM

English Headline El Niño Raises Asias Food Crisis Alarm

ఆసియాను భారీ వాతావరణ ముప్పు అతలాకుతలం చేయనుందా? సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావం కలిసి ఈ ఏడాది ఎల్‌ నినోను మరింత శక్తిమంతంగా మారుస్తున్నాయన్న హెచ్చరికలు ఆందోళనకరంగా మారాయి. దీని ప్రభావంతో ఆసియాలో సుమారు 5 కోట్ల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూపీ) హెచ్చరించింది. భారత్, శ్రీలంకతో పాటు పలు దేశాలు ఇప్పటికే కరువు, నీటి కొరత, ఆహార భద్రతపై ముందస్తు చర్యలు ప్రారంభించాయి.

ఎల్‌ నినో ఎందుకింత ప్రమాదకరం?
ఐక్యరాజ్యసమితి వర్గాల హెచ్చరికల ప్రకారం ఎల్‌ నినో ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పసిఫిక్‌ మహాసముద్రంలో అసాధారణంగా వేడెక్కుతున్న నీరు, వాతావరణ మార్పులు కలిసి పరిస్థితిని క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌ నినో గత కొన్ని దశాబ్దాల రికార్డులను అధిగమించే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ కూడా ఎల్‌ నినో ప్రభావం క్రమంగా తీవ్రతరం అవుతున్నదని హెచ్చరించారు. వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు వ్యవసాయం, నీటి లభ్యత, ఆహార సరఫరాపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

భారత్‌లో ఇప్పటికే కనిపిస్తున్న సంకేతాలేంటి?
భారత్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కొనసాగుతున్న రుతుపవన కాలంలోనే కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్‌, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవగా, సెప్టెంబర్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కరవు పరిస్థితుల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్‌ పంటలైన వరి, పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్నల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దిగుబడులు తగ్గితే ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉండటంతో తక్కువ ఆదాయ, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పెరగవచ్చని అంచనా.

భారత్‌ ఏం చేస్తోంది?
శాస్త్రవేత్తల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి పెట్టింది. రైతులకు రక్షణ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 350కిపైగా జిల్లాల్లో నీటి సంరక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. తక్కువ నీటితో పండే, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలైన పప్పుధాన్యాలు, సజ్జలు వంటి వాటిని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

శ్రీలంకలో నీటి కష్టాలు ముదిరాయా?
ఎల్‌ నినో ప్రభావంతో శ్రీలంకలో గత దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నట్లు నివేదిక తెలిపింది. 1.6 లక్షలకుపైగా ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. పలు జలాశయాలు ఎండిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. యాలా నేషనల్‌ పార్క్‌ వంటి పర్యాటక ప్రాంతాలను సైతం మూసివేయాల్సి వచ్చింది. వన్యప్రాణులకు నీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. ఈశాన్య ప్రాంతాల్లో చెరువులు ఎండిపోవడంతో వేలాది చేపలు మృతి చెందాయి. సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే ప్రణాళికపై శ్రీలంక విపత్తు నిర్వహణ సంస్థ పనిచేస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆ సామర్థ్యం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

ఆగ్నేయాసియాలో బియ్యం కొరత ముప్పు?
ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఆహార భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈసారి బియ్యం ఉత్పత్తి 8 నుంచి 10 శాతం వరకు తగ్గవచ్చని అంచనాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాల్లో కుటుంబ ఆదాయంలో గణనీయమైన భాగం ఆహారానికే ఖర్చవుతుంది. పంట దిగుబడులు తగ్గి ధరలు స్వల్పంగా పెరిగినా కుటుంబాలపై ఆర్థిక భారం పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహార భద్రతను కేవలం వ్యవసాయ సమస్యగా కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పలు దేశాలు పరిగణిస్తున్నాయి. సేంద్రియ ఎరువులు, పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే చర్యలు కూడా చేపడుతున్నాయి.

వేడి, భారీ వర్షాలు.. తుపాన్ల ముప్పు కూడా?
తూర్పు ఆసియాలో ఎల్‌ నినో ప్రభావం కేవలం వర్షాభావానికే పరిమితం కాకుండా తీవ్ర వేడి, భారీ వర్షాలు, తుపాన్ల రూపంలోనూ కనిపించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దక్షిణ కొరియాలో జూలై అత్యంత పొడి నెలగా నమోదైన తర్వాత భారీ వర్షాలు కురిశాయి. 18 ఏళ్ల తర్వాత అక్కడ హీట్‌వేవ్‌ హెచ్చరిక వ్యవస్థను మార్చారు. జపాన్‌లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైన రోజును అధికారికంగా ‘క్రూరమైన వేడి’ రోజుగా గుర్తించారు. సూపర్‌ టైఫూన్ల ముప్పు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హాంకాంగ్‌లో తీవ్ర వేడి సమయంలో ఉద్యోగులకు చల్లదనం కల్పించే ఏర్పాట్లు కంపెనీలకు తప్పనిసరి చేశారు. చైనాలో 100 రోజుల వాతావరణ ప్రమాద నివారణ కార్యక్రమం ప్రారంభించగా, తైవాన్‌ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే పరిస్థితులపై సిమ్యులేషన్‌ నిర్వహించింది. మొత్తంగా అల్‌ నినో ప్రభావం ఆహారం, నీరు, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థలపై ఒకేసారి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు కీలకంగా మారాయి.

ఇదీ చదవండి: ‘మరో రోహిత్‌ వేముల..’ దళిత పీహెచ్‌డీ విద్యార్థి ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement