కేతన్ అగర్వాల్ హత్య కేసు: 5,053 పేజీల ఛార్జ్‌షీట్! | Ketan Agarwal Murder How the Accused Planned the Killing | Sakshi
Sakshi News home page

కేతన్ అగర్వాల్ హత్య కేసు: 5,053 పేజీల ఛార్జ్‌షీట్!

Sep 20 2026 7:37 AM | Updated on Sep 20 2026 7:54 AM

Ketan Agarwal Murder How the Accused Planned the Killing

పూణె: మహారాష్ట్రలోని పూణెలో కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. లోహగఢ్ కోటపై నుంచి కేతన్‌ను తోసివేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కాబోయే భార్య సియా ప్రవీణ్ గోయల్, ఆమెతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చేతన్ బాబులాల్ చౌధరి, రితేశ్ సంజయ్ హంగేపై పుణెలోని వడ్గావ్ మావల్ కోర్టులో పోలీసులు 5,053 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ముగ్గురూ ప్రస్తుతం జైలులో ఉన్నారు.

మొదట గాయపర్చాలని.. 
కేతన్‌ను తీవ్రంగా గాయపర్చేందుకు తొలుత నిందితులు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. ఇందుకోసం మహారాష్ట్ర వెలుపల కొందరిని సంప్రదించినట్లు తెలిపారు. అయితే ఈ వ్యవహారం తర్వాత తమకు సమస్యలు తెచ్చిపెట్టవచ్చని, పోలీసులకు కుట్ర విషయం తెలిసే అవకాశం ఉందని భావించి ఆ ప్రణాళికను విరమించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దశలో సంప్రదించిన వారిలో ఒకరు ప్రస్తుతం సాక్షిగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

సినిమాలు, పాడ్‌కాస్ట్‌లతో ప్రణాళిక?
ఆ తర్వాత కేతన్‌ను తామే హత్య చేయాలని నిందితులు నిర్ణయించుకున్నారని పోలీసులు ఆరోపించారు. హత్యల ఆధారంగా రూపొందిన సినిమాలు చూశారని, పోలీసులకు చిక్కకుండా ఉండే మార్గాలపై పాడ్‌కాస్ట్‌లు విన్నారని, మేఘాలయలో రాజా రఘువంశీ హత్య కేసును కూడా పరిశీలించారని తెలిపారు.

లోహగఢ్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
లొనావాలా పరిసరాల్లోని పలు ప్రాంతాలను నిందితులు పరిశీలించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మే చివర్లో సియా, చేతన్ టైగర్ పాయింట్ తదితర ప్రాంతాలను సందర్శించి ఒంటరి ప్రదేశాన్ని గుర్తించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. టైగర్ పాయింట్‌లో సీసీటీవీ కెమెరాలు లేవని గుర్తించినప్పటికీ, చివరకు గతంలో ఒక మహిళ మృతి చెందిన ఘటన కారణంగా లోహగఢ్‌ను ఎంచుకున్నట్లు తెలియవచ్చింది.

తొలి ప్రయత్నం విఫలం..
జూన్ 14న సియా, కేతన్ లోహగఢ్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ సియా.. కేతన్‌ను తోసేందుకు ప్రయత్నించినప్పటికీ అది విఫలమైందని తేలింది. అనంతరం పాము ఉందని చెప్పి అతడిని అంచువైపు వెళ్లేలా చేయడానికి ప్రయత్నించినట్లు  పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

నకిలీ ‘మాహి’ ఖాతాతో ఉచ్చులోకి?
జూన్ 18న ‘మాహి’ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. పరిచయమున్న ఓ యువతి ఫొటోను ఉపయోగించి రూపొందించిన ఈ ఖాతా ద్వారా కేతన్‌కు సందేశాలు పంపినట్లు ఆరోపించారు. మాహి తన స్నేహితురాలని భావించేలా చేసి, ఆమె పుట్టినరోజు సర్‌ప్రైజ్‌గా జరిపేందుకు సియాను లోహగఢ్‌కు తీసుకెళ్లాలని కేతన్‌ను ప్రేరేపించినట్లు పోలీసులు తెలిపారు. హంగే రూపొందించిన ఈ ఖాతాను హత్య అనంతరం తొలగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 
ఈ కేసులో 100 మందికి పైగా సాక్షులను పోలీసులు చేర్చారు. వారిలో ఐదుగురు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. మొబైల్ ఫోన్ డేటా, వాట్సాప్ చాట్లు, ఫొటోలు, కాల్ డీటెయిల్ రికార్డులు, సాంకేతిక విశ్లేషణతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను ఛార్జ్‌షీట్‌లో సమర్పించారు.

ఇదీ చదవండి: ఎల్‌ నినో సంక్షోభం: 5 కోట్ల మందికి ‘ఒక్క పూట’ కూడా కష్టమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement