హైదరాబాద్‌లో హిట్‌ అండ్‌ రన్‌.. మూడేళ్ల బాలుడు దుర్మరణం | Hit and run in Hyderabad Santosh Nagar: 3 year old boy dies in accident | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో హిట్‌ అండ్‌ రన్‌.. మూడేళ్ల బాలుడు దుర్మరణం

Sep 20 2026 7:31 AM | Updated on Sep 20 2026 7:36 AM

Hit and run in Hyderabad Santosh Nagar: 3 year old boy dies in accident

సాక్షి,హైదరాబాద్: నగరంలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తండ్రి చెయ్యి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఓ మూడేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారవడంతో ఇది 'హిట్ అండ్ రన్' కేసుగా నమోదైంది.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ నగర్ ప్రాంతంలో మూడేళ్ల బాలుడు ఇజాన్, తన తండ్రితో కలిసి రోడ్డుపై వెళ్తున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఒక కారు అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి బాలుడిని బలంగా ఢీకొట్టింది.   ఈ ప్రమాదంలో చిన్నారి ఇజాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు ఢీకొట్టినప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు.  

సమాచారం అందుకున్న వెంటనే సంతోష్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న కారును, దాని డ్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న చిన్నారి ప్రాణం గాలిలో కలవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement