సౌదీకి బిగ్‌ రిలీఫ్‌.. హౌతీల దాడుల వేళ తుర్కియే సంచలన నిర్ణయం! | Pakistan Role in Saudi Turkey Defence Pact Amid Houthi Attacks | Sakshi
Sakshi News home page

సౌదీకి బిగ్‌ రిలీఫ్‌.. హౌతీల దాడుల వేళ తుర్కియే సంచలన నిర్ణయం!

Sep 20 2026 8:00 AM | Updated on Sep 20 2026 8:05 AM

Pakistan Role in Saudi Turkey Defence Pact Amid Houthi Attacks

సౌదీపై హౌతీల దాడులు.. రియాద్‌లో వరుస పేలుళ్లు.. ఆకాశంలో క్షిపణులు, డ్రోన్ల కలకలం. పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్న వేళ తుర్కియే సంచలన ప్రకటన చేసింది. సౌదీకి అవసరమైన సైనిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అంకారా స్పష్టం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్‌తో కలిసి సౌదీతో రక్షణ ఒప్పందం చేసుకున్న తుర్కియే ఇప్పుడు సైనిక-సాంకేతిక సాయం చేస్తామని ప్రకటించడం పశ్చిమాసియాలో కొత్త టెన్షన్‌కు తెరలేపింది. హౌతీల దాడులు మరింత పెరిగితే ఈ రక్షణ కూటమి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.

కాగా, యెమెన్‌ హౌతీల వరుస క్షిపణి, డ్రోన్‌ దాడులతో సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌదీకి అవసరమైన సైనిక సహాయం అందించేందుకు తుర్కియే సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి హకాన్‌ ఫిదాన్‌ ప్రకటించారు. ముఖ్యంగా సైనిక సాంకేతిక అవసరాలను తీర్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామం ఇటీవల తుర్కియే, సౌదీ, పాకిస్తాన్‌ మధ్య కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై మరోసారి దృష్టిని మళ్లించింది.

సౌదీ రాజధాని రియాద్‌ సహా పలు ప్రాంతాలపై హౌతీలు దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం రియాద్‌లోని కీలక ప్రాంతాలను క్షిపణులు, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు వెల్లడించారు. ఇదే సమయంలో నగరంలోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు, భారీగా పొగ కనిపించింది. సౌదీ అధికారులు రియాద్‌ వైపు వచ్చిన బాలిస్టిక్‌ క్షిపణిని అడ్డుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాణనష్టం జరిగినట్లు వెల్లడించలేదు. అయితే, హౌతీల దాడులు కేవలం రాజధాని రియాద్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇంధన మౌలిక వసతులు, నగరాలు, సముద్ర రవాణా మార్గాలపైనా దాడుల ముప్పు పెరిగింది. దీంతో ప్రపంచ చమురు సరఫరా, ఎర్ర సముద్ర వాణిజ్య మార్గాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విమానాశ్రయం వద్ద ఏం జరిగింది?
రియాద్‌ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ కనిపించడంతో పాటు మంటలు కూడా చెలరేగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంటలు ఇంధన నిల్వ ప్రాంతానికి సమీపంలో కనిపించినట్లు రాయిటర్స్‌ దృశ్యాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దాడుల హెచ్చరికల నేపథ్యంలో సౌదీ అధికారులు రియాద్‌, అల్‌-ఖర్జ్‌ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో ‘ఆల్‌ క్లియర్‌’ ప్రకటించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో రియాద్‌లో ఈ స్థాయిలో వైమానిక దాడి హెచ్చరికలు రావడం ఇదే తొలిసారి అని నివేదికలు చెబుతున్నాయి.

తుర్కియే కీలక ప్రకటన..
ఈ పరిస్థితుల్లో తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్‌ ఫిదాన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సౌదీ అరేబియా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వంపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సౌదీకి కొన్ని సైనిక అవసరాలు, ముఖ్యంగా సాంకేతిక రంగంలో అవసరాలు ఉండొచ్చని.. వాటిని తీర్చేందుకు తుర్కియే సిద్ధంగా ఉందని చెప్పారు. అంటే వెంటనే తుర్కియే సైన్యాన్ని యెమెన్‌లోకి పంపుతామని హింట్‌ ఇచ్చారు. ఇదే సమయంలో యుద్ధాన్ని మరింత విస్తరించకుండా దౌత్యపరమైన పరిష్కారం కోసం కూడా తుర్కియే ప్రయత్నిస్తున్నట్లు ఫిదాన్‌ తెలిపారు.

‘మక్కా డిఫెన్స్‌ ప్యాక్ట్‌’ ఏంటి?
ఇటీవల తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌ మధ్య మక్కా జాయింట్‌ డిఫెన్స్‌ అగ్రిమెంట్‌ కుదిరింది. ఈ ఒప్పందంలోని కీలక అంశం ఏమిటంటే.. మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించేలా పరస్పర రక్షణ సూత్రాన్ని రూపొందించారు. అందుకే సౌదీపై హౌతీల దాడులు పెరిగిన సమయంలో తుర్కియే నుంచి వచ్చిన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ ఒప్పందం ఆధారంగా పాకిస్తాన్‌, తుర్కియే తక్షణమే ప్రత్యక్ష సైనిక చర్యకు దిగుతాయని చెప్పడానికి ప్రస్తుతానికి అధికార ప్రకటన చేయలేదు. 
మరోవైపు.. సౌదీపై హౌతీల దాడుల నేపథ్యంలో మక్కా ఒప్పందం కింద పాక్‌ సైనిక చర్యపై ఎలాంటి చర్చలు జరగలేదని ఇస్లామాబాద్‌ తెలిపింది. అదే సమయంలో సౌదీ భద్రతకు సంబంధించిన తమ బాధ్యతలను పాకిస్తాన్‌ గుర్తిస్తోంది. దీంతో ఒప్పందంలోని పరస్పర రక్షణ హామీ ఇప్పుడు ఆచరణలో ఎలా అమలవుతుందన్నది కీలక అంశంగా మారింది.

హౌతీల హెచ్చరిక..
ఇదిలా ఉండగా తుర్కియే, పాకిస్తాన్‌.. సౌదీకి సైనికంగా మద్దతు ఇచ్చే అవకాశాలపై హౌతీలు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాము సైనికంగా జోక్యం చేసుకుంటే తీవ్రమైన గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఒకవైపు సౌదీపై దాడులు.. మరోవైపు తుర్కియే మద్దతు ప్రకటన.. ఇంకోవైపు పాకిస్తాన్‌ ముందు ఉన్న కీలక రక్షణ ఒప్పంద బాధ్యతలు.. మొత్తం పరిణామం పశ్చిమాసియాలో కొత్త భద్రతా సమీకరణాలకు దారితీసే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో హౌతీల దాడులు మరింత విస్తరిస్తే ఈ మూడు దేశాల పరస్పర రక్షణ హామీ ఏ రూపంలో ఆచరణలోకి వస్తుందన్నది ఇప్పుడు పశ్చిమాసియా పరిణామాల్లో కీలకంగా మారింది.

ఇదీ చదవండి: సౌదీలో మోగిన హెచ్చరిక సైరన్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement