టెహ్రాన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ అమెరికాకు పిలుపునిచ్చింది. యుద్ధం ముగియాలంటే అమెరికా తమ ఏడు డిమాండ్లకు అంగీకరించాలని, లేదంటే ఆ దేశంతో చావోరేవో తేల్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది.
ఒకవేళ తాము పెడుతున్న ఏడు షరతులకు అమెరికా ఒప్పుకుంటే, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుపుతామని తెలిపింది. మరి ఇరాన్ డిమాండ్లపై అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సేన్ రెజాయీ ప్రముఖ ఖతార్ ఆంగ్ల మీడియా సంస్థ 'అల్ జజీరా'తో మాట్లాడారు. “అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ఖతార్ మధ్యవర్తిత్వంతో మా డిమాండ్లు ఏంటో అమెరికాకు తెలియజేశాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.
ఇరాన్ డిమాండ్లు ఇవే
అన్ని రకాల సరిహద్దుల్లోనూ యుద్ధాన్ని పూర్తిగా ఆపివేయడం,విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం.ఇరాన్‌పై విధించిన నావికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం. ఇలా మొత్తం ఏడు స్పష్టమైన డిమాండ్లను ఖతార్ ద్వారా అమెరికాకు తెలియజేసినట్లు రెజాయ్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ బెదిరింపుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ షరతులను అంగీకరించడమే అమెరికాకు మంచిదని రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా వైపు నుంచి భవిష్యత్తులోనూ దాడులు జరిగే అవకాశం ఉందని తమ సైనిక అంచనాలు చెబుతున్నాయని, దానిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్న అమెరికా నావికాదళ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తమ సైనిక వ్యూహాలను మార్చుకున్నట్లు తెలిపారు. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, ప్రాంతీయంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, వాణిజ్య సంస్థలపై తీవ్ర ప్రతిస్పందన ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
అణు విధానం
ఇరాన్ అణు విధానంలో ఎలాంటి మార్పు లేదని రెజాయ్ స్పష్టం చేశారు. అణు ఆయుధాలను నిషేధించే మతపరమైన ఫత్వాకు (డిగ్రీకి) తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే, అమెరికా అనుసరించే దురుసు విధానాల వల్ల తాము 'న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ' నుంచి వైదొలగవలసి వచ్చే పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు.
మధ్యవర్తిత్వ ప్రయత్నాలు
గతేడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ప్రారంభమైన ఈ సంఘర్షణను ముగించేందుకు ఖతార్,పాకిస్థాన్ దేశాలు దౌత్యపరమైన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఒకవైపు దౌత్య చర్చలకు సిద్ధమంటూనే, మరోవైపు సైనిక సన్నద్ధతను కూడా ఇరాన్ విడనాడలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఇరాన్ ప్రతినిధి బృందానికి అమెరికా విదేశాంగ శాఖ వీసాలు జారీ చేసినట్లు సమాచారం.


