Air India Crash: బోయింగ్‌ 787పై కొత్త సందేహాలు | Air India Crash FIP Seeks Probe Into Boeing 787 Electrical History | Sakshi
Sakshi News home page

Air India Crash: బోయింగ్‌ 787పై కొత్త సందేహాలు

Sep 20 2026 8:22 AM | Updated on Sep 20 2026 8:25 AM

Air India Crash FIP Seeks Probe Into Boeing 787 Electrical History

న్యూఢిల్లీ: 2025 జూన్‌ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తులో మరిన్ని సాంకేతిక అంశాలను లోతుగా పరిశీలించాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ పైలట్స్‌ (ఎఫ్‌ఐపీ) కోరింది. ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787 విమానం వీటీ- ఎఎన్‌బీకి సంబంధించిన పూర్తి ఎలక్ట్రికల్‌, సాంకేతిక, నిర్వహణ చరిత్రను సమీక్షించాలని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ)ని కోరింది.

ఎఫ్‌ఐపీ అధ్యక్షుడు కెప్టెన్‌ సిఎస్‌ రంధావా సెప్టెంబరు 18న ఏఏఐబీకి పంపిన లేఖలో అమెరికాకు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఏవియేషన్‌ సేఫ్టీ (ఎఫ్‌ఏఎస్‌)అందించిన సాంకేతిక సమాచారాన్ని పరిశీలించాలని కోరారు. అందులో విమానం ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌, ఫ్లైట్‌ కంప్యూటర్‌ వ్యవస్థల్లో గతంలో పలుమార్లు తలెత్తిన లోపాలు, నిర్వహణకు సంబంధించిన అంశాలున్నాయని ఎఫ్‌ఐపీ పేర్కొంది.

ఆర్‌ఏటీ సమయంపై సందేహాలు
విమానంలోని రామ్‌ ఎయిర్‌ టర్బైన్‌ (ఆర్‌ఏటీ) పనిచేసిన సమయానికి సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా పరిశీలించాలని ఎఫ్‌ఐపీ కోరింది. సిమ్యులేటర్‌ పరీక్షల్లో ఇంధన సరఫరా నిలిచిపోవడం, ఆర్‌ఏటీకి హైడ్రాలిక్‌ పవర్‌ అందడం మధ్య వ్యవధి.. ప్రాథమిక ప్రమాద నివేదికలోని టైమ్‌లైన్‌తో భిన్నంగా ఉందా అనే అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. అయితే, దీనిపై ముందస్తు నిర్ధారణకు రాలేదని రంధావా స్పష్టం చేశారు.

ఎఫ్‌డీఆర్‌, సీవీఆర్‌ డేటాతో సరిపోల్చాలి
సిమ్యులేటర్‌ ఫలితాలను ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (ఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌), ఇతర విమాన రికార్డర్ల నుంచి లభించిన సమాచారంతో సరిపోల్చాలని ఎఫ్‌ఐపీ సూచించింది. ఇందుకోసం సిమ్యులేటర్‌ ధ్రువీకరణ, ఇంజినీరింగ్‌ విశ్లేషణ చేపట్టాలని కోరింది.

విద్యుత్‌ వ్యవస్థపై సమగ్ర పరిశీలన
పవర్‌ జనరేషన్‌, బ్యాటరీలు, ఫ్లైట్‌ కంట్రోల్‌ కంప్యూటర్లు, డేటా నెట్‌వర్క్‌, సెన్సర్లు, ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌ వ్యవస్థలతో పాటు పవర్‌ అంతరాయాలు, వోల్టేజ్‌ హెచ్చుతగ్గులు, సాఫ్ట్‌వేర్‌ రీసెట్లు, ప్రాసెసర్‌ రీబూట్లు, కమ్యూనికేషన్‌ వైఫల్యాలను పరిశీలించాలని కోరింది.

పాత నిర్వహణ రికార్డులూ కీలకమే
వీటీ- ఏఎన్‌బీకి సంబంధించిన నిర్వహణ లాగ్‌లు, పునరావృత లోపాలు, ఎంఈఎల్‌ అంశాలు, ట్రబుల్‌షూటింగ్‌ రికార్డులు, విడిభాగాల మార్పులు, ఇంజినీరింగ్‌ చర్యలను సమీక్షించాలని ఎఫ్‌ఐపీ పేర్కొంది. సాంకేతిక లోపం లేదా భద్రతా ముప్పు గుర్తిస్తే తుది నివేదిక కోసం వేచి చూడకుండా మధ్యంతర భద్రతా సిఫార్సులు జారీ చేయాలని కోరింది. దర్యాప్తు శాస్త్రీయంగా, స్వతంత్రంగా, ఆధారాలపై సాగాలని, ప్రజలకు వాస్తవాధారిత సమాచారం క్రమం తప్పకుండా అందించాలని సూచించింది.

ఇదీ చదవండి: కేతన్ అగర్వాల్ హత్య కేసు: 5,053 పేజీల ఛార్జ్‌షీట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement