ప్రతి ఒక్కరి జీవితంలో సొంతిల్లు అనేది ఒక అపురూపమైన స్వప్నం. అయితే, ఆకర్షణీయమైన బ్రోచర్లు, రంగురంగుల అడ్వర్టైజ్‌మెంట్లు చూసి తొందరపడి బిల్డర్ చేతిలో అడ్వాన్స్ పెడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే బిల్డర్‌కు డబ్బు చెల్లించే ముందే కొన్ని ప్రశ్నలు నిలదీయక తప్పదు.
రేరా నమోదు ఉందా?
ప్రాజెక్టుకు ‘రేరా’(భారత రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచడానికి, బిల్డర్ల మోసాల నుంచి ఇళ్లు కొనుగోలు చేసే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది) అనుమతి ఉందో లేదో కచ్చితంగా నిర్ధారించుకోవాలి. కేవలం మాటల గారడీకి మోసపోకుండా ప్రాజెక్ట్ రేరా రిజిస్ట్రేషన్ నంబర్, పురపాలక/పట్టణాభివృద్ధి సంస్థల ఆమోదిత ప్లాన్‌ను ప్రత్యక్షంగా పరిశీలించాలి.
కార్పెట్ ఏరియా ఎంత?
ఆస్తి విస్తీర్ణం లెక్కల్లో బిల్డర్లు చూపే సూపర్ బిల్టప్ ఏరియా మాయాజాలంలో పడకూడదు. అసలైన ‘కార్పెట్ ఏరియా’ (నివసించే స్థలం) ఎంత వస్తుందో తేల్చుకోవాలి. లేకపోతే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అవుతుంది.
దాగి ఉన్న రుసుములు
కేవలం బేస్ ప్రైస్ మాత్రమే కాకుండా కార్ పార్కింగ్, క్లబ్‌హౌస్, ప్లాన్ అప్రూవల్, ప్రీయారిటీ ల్యాండ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు రుసుముల వివరాలను పైసాతో సహా ముందే లిఖితపూర్వకంగా తీసుకోకపోతే బడ్జెట్ తలకిందులవుతుంది.
చెల్లింపుల ప్రణాళిక
ఒక్కసారే పెద్దమొత్తంలో చెల్లించకుండా నిర్మాణ పురోగతికి అనుగుణంగా చెల్లించే కన్‌స్ట్రక్షన్ లింక్డ్ ప్లాన్ ఎంచుకోవడమే క్షేమదాయకం.
స్వాధీన తేదీ.. పరిహారం
ప్రాజెక్టు పూర్తి చేసి ఇల్లు అప్పగించే తేదీ, ఒకవేళ నిర్మాణంలో ఆలస్యమైతే బిల్డర్ చెల్లించే పరిహారంపై బయ్యర్-బిల్డర్ అగ్రిమెంట్ (బీబీఏ)లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయో లేదో చూసుకోవడం ఉత్తమం.
ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?


