భారతీయులకు అత్యంత సురక్షితమైన, నమ్మకమైన పెట్టుబడి మార్గం అనగానే ముందు గుర్తొచ్చేది ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ). స్థిరమైన రాబడి కోసం మెజారిటీ ప్రజలు ఎఫ్‌డీలనే ఆశ్రయిస్తుంటారు. అయితే, ఎలాంటి ముందస్తు ప్రణాళిక, పరిశోధన లేకుండా నిశ్చింతగా చేసే ఎఫ్‌డీ పెట్టుబడులు ఒక్కోసారి అసలుకే ఎసరు తెచ్చి తీవ్ర నిరాశను మిగిల్చే అవకాశం ఉంది. ఎఫ్‌డీల్లో డబ్బు దాచే ముందు ప్రతీ పెట్టుబడిదారు తప్పక గుర్తుంచుకోవాల్సిన ఐదు కీలకమైన పొరపాట్లు, వాటి పరిష్కారాలు ఇక్కడ పరిశీలిద్దాం..
పన్ను పరిణామాలను విస్మరించడం
ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మీ ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారమే పన్ను వర్తిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూ.40,000 (సీనియర్ సిటిజన్లకు రూ.50,000) దాటితే బ్యాంకులు మూలం వద్దే పన్ను మినహాయింపు (టీడీఎస్) చేస్తాయి. టాక్స్ పరిగణనలోకి తీసుకోకుండా వచ్చే వడ్డీ మొత్తాన్ని నికర లాభంగా భావించడం పెద్ద పొరపాటు.
ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అంచనా వేయకపోవడం
ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ రూపాయి కొనుగోలు శక్తి వేగంగా తగ్గుతుంది. మీ ఎఫ్‌డీ వడ్డీ రేటు 7 శాతం ఉండి, మార్కెట్లో ద్రవ్యోల్బణం కూడా 6–7% ఉంటే.. పన్నులు పోను మీ నికర వాస్తవ రాబడి సున్నాకే సమానం. కేవలం ఎఫ్‌డీలపైనే ఆధారపడకుండా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే ఇతర మార్గాలనూ పరిశీలించాలి.
గడువుకు ముందే ఉపసంహరణ
అత్యవసర నిధి వేరుగా ఉంచుకోకుండా మొత్తం సొమ్మును దీర్ఘకాలిక ఎఫ్‌డీల్లో పెడితే హఠాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఎఫ్‌డీని గడువు తీరకుండానే ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల బ్యాంకులు 0.5%-1% వరకు జరిమానా విధించడమే కాకుండా వడ్డీ రేటును తగ్గిస్తాయి.
ఎఫ్‌డీ లాడరింగ్ విధానం పాటించకపోవడం
మొత్తం సొమ్మును ఒకే ఎఫ్‌డీలో ఒకే కాలపరిమితికి లాక్ చేయడం వల్ల భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోతారు. అలాకాకుండా సొమ్మును విడదీసి వేర్వేరు గడువులతో (1 సంవత్సరం, 2 ఏళ్లు, 3 ఏళ్లు) డిపాజిట్ చేసే లాడరింగ్ పద్ధతి పాటిస్తే ద్రవ్యలభ్యత పెరగడంతో పాటు అధిక రాబడి లభిస్తుంది.
బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూడకపోవడం
కేవలం అలవాటు పడిన ఒకే బ్యాంకులోనే పెట్టుబడి పెట్టడం మరొక పొరపాటు. ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లతో పోల్చి చూసి ఆర్‌బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితులను (రూ.5 లక్షల వరకు భద్రత) దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.
ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?


