రూ.1లక్ష పెట్టారు.. రూ.4.44 లక్షల లాభం పట్టారు! | RBI Sovereign Gold Bond Returns How Rs 1 Lakh Investment Surged to Rs 4 44 Lakh | Sakshi
Sakshi News home page

రూ.1లక్ష పెట్టారు.. రూ.4.44 లక్షల లాభం పట్టారు!

Aug 16 2026 1:26 PM | Updated on Aug 16 2026 1:30 PM

RBI Sovereign Gold Bond Returns How Rs 1 Lakh Investment Surged to Rs 4 44 Lakh

భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) 2019-20 సీరీస్-3 ప్రీమెచ్యుర్‌ రిడెప్షన్‌(ముందస్తు విరమణ) పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. ఈ సిరీస్ బాండ్లను ముందస్తుగా రీడీమ్ చేసుకునేందుకు ఆర్‌బీఐ రూ.15,310 ధరను ఖరారు చేసింది. దీనితో డిజిటల్ పద్ధతిలో దరఖాస్తు చేసిన మదుపరులకు ఏకంగా 344 శాతం (సుమారు 343.9%) అసాధారణ రాబడి లభించింది.

పెట్టుబడి నాలుగు రెట్లకు పైగా పెరుగుదల

2019 ఆగస్టు 14న ఈ సిరీస్ బాండ్లను ప్రభుత్వం విడుదల చేసింది. అప్పట్లో గ్రాము ధర రూ.3,499గా ఉండగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.50 డిస్కౌంట్‌తో రూ.3,449కి ఆఫర్‌ చేసింది. నియమాల ప్రకారం ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ముందస్తు ఎగ్జిట్ ఆప్షన్ లభిస్తుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ నిర్ణయించిన రూ.15,310 రీడెంప్షన్ ధరతో బాండ్ విలువ నాలుగు రెట్లకు పైగా పెరిగింది.

ఉదాహరణకు, 2019లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన మదుపరి బాండ్ విలువ ప్రస్తుతం రూ.4.44 లక్షలకు చేరుకుంది. అంటే కేవలం ధర పెరుగుదల రూపంలోనే రూ.3.44 లక్షల నికర లాభం సమకూరింది. దీని వార్షిక రాబడి రేటు దాదాపు 23.7 శాతంగా నమోదైంది.

అదనపు వడ్డీ ప్రయోజనం

పసిడి ధరల పెరుగుదల ద్వారా వచ్చిన మూలధన లాభంతో పాటు ఈ బాండ్లపై ఏడాదికి 2.5 శాతం స్థిర వడ్డీని పెట్టుబడిదారులు అర్ధవార్షికంగా పొందుతూ వచ్చారు. ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే ఎస్‌జీబీల్లో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ, భద్రతా వ్యయాల భారం లేకపోవడమే కాకుండా వడ్డీ ఆదాయం కూడా దక్కడం విశేషం.

ధర నిర్ణయం ఎలా జరిగిందంటే?

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించే 999 స్వచ్ఛత కలిగిన బంగారం చివరి మూడు పనిదినాల సరళ సగటు ధర ఆధారంగా ఆర్‌బీఐ ఈ రీడెంప్షన్ ధరను ఖరారు చేస్తుంది. ఆగస్టు 11, 12, 13 తేదీల ముగింపు ధరల ఆధారంగా ఈ ఆకర్షణీయమైన రూ.15,310 ధర నిర్ణయించారు. ధీర్ఘకాలిక భద్రతతో పాటు అత్యధిక రాబడులు అందించేందుకు ఎస్‌జీబీలు సరైన వేదికని ఈ సీరీస్ నిరూపించింది.

ఇది చదవండి: ఒరిజినల్‌ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement