అమితాబ్‌కు షాకిచ్చిన మూడడుగుల డాక్టర్‌ గణేశ్‌! | Worlds Shortest Doctor Dr Ganesh Baraiya on Kaun Banega Crorepati | Sakshi
Sakshi News home page

అమితాబ్‌కు షాకిచ్చిన మూడడుగుల డాక్టర్‌ గణేశ్‌!

Aug 16 2026 12:10 PM | Updated on Aug 16 2026 12:10 PM

Worlds Shortest Doctor Dr Ganesh Baraiya on Kaun Banega Crorepati

ముంబై: జీవితంలో ముందుకు సాగాలనే తపన, పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చని డాక్టర్ గణేష్ బరైయా నిరూపించారు. కేవలం మూడు అడుగుల ఎత్తు ఉన్న ఆయన, ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్‌గా గుర్తింపు పొందారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా గోర్ఖీ గ్రామానికి చెందిన గణేష్ బరైయా కేబీసీ షోలో పాల్గొన్నారు. తన ఎత్తు తక్కువ కారణంగా ఎంబీబీఎస్ ప్రవేశం కోసం ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, న్యాయపోరాటం గురించి వివరిస్తూ  భావోద్వేగానికి గురయ్యారు. అమితాబ్ బచ్చన్ ఆయనను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి, ఆయన ధైర్యాన్ని, పట్టుదలను కొనియాడారు. అయితే మూడు లక్షల రూపాయల ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇవ్వడంతో ఆయన కేబీసీ ప్రయాణం ముగిసింది.

బాల్యంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గణేష్ గుర్తు చేసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రోజుల్లో కొందరు సర్కస్ నిర్వాహకులు తమ ఇంటికి వచ్చారని, తనను తమ వెంట పంపిస్తే రూ. ఐదు లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని చెప్పారు. కానీ ఆయన తండ్రి ఆ భారీ మొత్తాన్ని తిరస్కరించి, కొడుకును చదివించడమే ముఖ్యమని భావించారు. తల్లిదండ్రులు రోజూ ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న పాఠశాలకు వారి భుజాలపై తనను మోసుకుంటూ వెళ్లేవారిని తెలిపారు.

‘నీట్’ పరీక్షలో మంచి మార్కులు సాధించినప్పటికీ,  ఎత్తు తక్కువ కారణంగా మొదట్లో ఏ కాలేజీ కూడా ఆయనకు ఎంబీబీఎస్ సీటు ఇవ్వడానికి నిరాకరించింది. నిరుత్సాహపడకుండా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన న్యాయ పోరాటం చేశారు. పట్టుదల వీడకుండా పోరాడి ఎంబీబీఎస్ పూర్తి చేసి, నేడు డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఆయన సంకల్పం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: దుకాణంలో రూ.16 ఆఫర్‌.. జనం తొక్కిసలాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement