‘పాత సామాను కొంటాం’ నుంచి నీట్ విజయం వరకు.. | Scrap Collector's Son Cracks NEET: Sagar Regar's Journey to Becoming a Doctor | Sakshi
Sakshi News home page

‘పాత సామాను కొంటాం’ నుంచి నీట్ విజయం వరకు..

Aug 4 2026 1:18 PM | Updated on Aug 4 2026 1:55 PM

Scrap Collectors Son Cracks NEET From Financial Struggles to Medical Dream

‘పాత సామాను కొంటాం’ అంటూ ఇంటింటికీ తిరుగుతూ పొట్ట పోషించుకునే చిరు వ్యాపారి కుమారుడు ‘నీట్‌’లో సత్తా చాటాడు. దీంతో తమ కొడుకు డాక్టర్‌ కాబోతున్నాడంటూ ఆ తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతున్నారు. రాజస్థాన్‌లోని కోట సమీపంలోని గోద్ల్యాహేది గ్రామానికి చెందిన సాగర్ రేగర్ అనే విద్యార్థి ఈ ఘనత సాధించాడు. అతని తండ్రి మురళి రేగర్ ఇంటింటికీ తిరిగి పాత సామాగ్రి సేకరిస్తూ, వాటిని విక్రయించి కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి గృహిణిగా ఉంటూ భర్తకు సాయం చేస్తున్నది. వీరు ఇరుకుగా ఉన్న రెండు గదుల చిన్న ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

సాగర్ తన ప్రాథమిక విద్యను కైథూన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించి, పదో తరగతిలో 76 శాతం, ఇంటర్మీడియట్‌లో 92 శాతం మార్కులు సాధించారు. నీట్-యూజీ పరీక్షలో 564 మార్కులు సాధించి 98.6296 శాతంతో ఆల్ ఇండియా కేటగిరీలో 27,157వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో 684వ ర్యాంకును సొంతం చేసుకున్నారు.

కుటుంబంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు బంధువులు వ్యసనాల బారిన పడ్డారని, గుట్కా వంటి అలవాట్ల కారణంగా తన పినతల్లి కూతురు క్యాన్సర్‌తో మృత్యువాత పడటం తనను తీవ్రంగా కలచివేసిందని సాగర్ తెలిపాడు. ఈ ఘటనే తనలో వైద్యుడిగా మారాలనే దృఢ సంకల్పాన్ని నింపిందని పేర్కొన్నారు. డాక్టర్‌ అయ్యాక సమాజంలో వ్యసనాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడమే తన ధ్యేయమని చెప్పారు.

పేదరికం కారణంగా వైద్య విద్య కోచింగ్ ఖర్చులు భరించలేని పరిస్థితిలో, కైథూన్ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అందించిన ప్రోత్సాహంతో ఆయనకు ‘శిక్షా సంబల్ యోజన’ గురించి తెలిసింది. ఈ పథకం ద్వారా ఎల్ఎన్ మహేశ్వరి పరామర్త్న్యాస్ సంస్థ అందించిన ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు ఏడాది పాటు ఉచిత నీట్ కోచింగ్ లభించింది. ఈ సాయంతోనే తాను ఈ విజయాన్ని సాధించగలిగానని సాగర్ వివరించాడు.

ఇది ​కూడా చదవండి: లావోస్‌ జార్‌లో 37 కాలని అస్థిపంజరాలు.. శాస్త్రవేత్తలు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement