తర్వాతి హైడ్రోజన్ రైలు రూట్లు ఇవే.. | India Hydrogen Train Trial Success Paves Way for Delhi Kalka-Shimla Routes | Sakshi
Sakshi News home page

తర్వాతి హైడ్రోజన్ రైలు రూట్లు ఇవే..

Jul 28 2026 2:55 PM | Updated on Jul 28 2026 2:59 PM

India Hydrogen Train Trial Success Paves Way for Delhi Kalka-Shimla Routes

పర్యావరణహిత రవాణా వ్యవస్థే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’లో భాగంగా ప్రవేశపెట్టిన దేశపు తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు ఇటీవలే విజయవంతంగా పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్-సోనెపట్ మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన రైలు ఇప్పటికే 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఈ విజయవంతమైన ట్రయల్స్ ఆధారంగా త్వరలోనే ఢిల్లీ రూట్‌తో పాటు చారిత్రాత్మక కాల్కా-శిమ్లా, ఇతర పర్వత ప్రాంతాల (హెరిటేజ్ రూట్లు) వైపు ఈ సేవలను విస్తరించేందుకు భారతీయ రైల్వే వేగంగా అడుగులు వేస్తోంది.

జింద్ - సోనెపట్ సక్సెస్

తొలి విడతగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ హైడ్రోజన్ రైలు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందించింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడమే కాకుండా, పర్యావరణానికి ఎంతో మేలు చేసింది.

3,200+ లీటర్ల డీజిల్ పొదుపు: కేవలం 1,200 కి.మీల ప్రయాణంలోనే దాదాపు 3,200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ వాడకాన్ని తగ్గించింది.

జీరో కార్బన్ ఉద్గారాలు: ఈ రైలు నుంచి విషపూరిత పొగ లేదా కార్బన్ డై ఆక్సైడ్ వెలువడదు. రసాయన ప్రక్రియ ద్వారా కేవలం నీటి ఆవిరి, స్వచ్ఛమైన గాలి మాత్రమే ఉపఉత్పత్తిగా బయటకు వస్తాయి.

శబ్ద రహిత ప్రయాణం: సాంప్రదాయ డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే శబ్ద కాలుష్యం దాదాపు శూన్యం.

ఢిల్లీ, కాల్కా-శిమ్లా హెరిటేజ్ రూట్లకు విస్తరణ

జింద్-సోనెపట్ రూట్‌లో విజయం సాధించడంతో రైల్వే శాఖ తదుపరి దశ పరీక్షలకు సిద్ధమైంది. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఢిల్లీ మార్గంలో ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు. ప్రకృతి అందాలకు నిలయమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాల్కా-శిమ్లా నారోగేజ్ ట్రాక్‌పై ఈ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, మాథేరాన్ హిల్ రైల్వే, కాంగ్రా వ్యాలీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో డీజిల్ రైళ్ల స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ రైళ్లను తీసుకురానున్నారు.

ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement