చాట్‌జీపీటీ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశం, అమెరికా సహా పలు దేశాల్లో జులై 27 రాత్రి దాదాపు 8-11 గంటల ప్రాంతంలో వినియోగదారులు ఏఐ ఆధారిత చిత్రాలను రూపొందించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది వినియోగదారులు చాట్‌జీపీటీని పూర్తిగా యాక్సెస్ చేయలేకపోయినట్లు, మరికొందరికి ఇమేజ్ క్రియేట్ ఫీచర్ పనిచేయలేదని అవుటేజ్ ట్రాకింగ్ వేదిక డౌన్‌డిటెక్టర్‌లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఈ సమస్యపై ఓపెన్‌ఏఐ అధికారికంగా స్పందించింది. ఎక్స్ వేదికలో చేసిన పోస్టులో, ‘చాట్‌జీపీటీలో ఇమేజ్ క్రియేషన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయని మాకు తెలుసు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ఈ అసౌకర్యానికి క్షమించండి’ అని పేర్కొంది. అలాగే ఓపెన్‌ఏఐ అధికారిక స్టేటస్ పేజీలో కూడా సమస్యను ధ్రువీకరించింది. ప్రభావిత సేవల్లో వినియోగదారులు అధిక సంఖ్యలో లోపాలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని, మూల కారణాన్ని గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అనంతరం సేవలు పూర్తిగా పునరుద్ధరించినట్లు స్టేటస్ పేజీలో ప్రకటించింది.
రెండు రోజుల్లో రెండోసారి అంతరాయం
ఇది చాట్‌జీపీటీకి వరుసగా రెండు రోజుల్లో ఎదురైన రెండో అంతరాయం కావడం గమనార్హం. అంతకుముందు జులై 25న కూడా సేవల్లో అంతరాయం ఏర్పడి వెబ్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు ఇతర ఫీచర్ల వినియోగంలో సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో డౌన్‌డిటెక్టర్‌కు వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.
ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!


