గందర్‌బాల్: జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 39 మంది గాయపడ్డారు. కంగన్ ప్రాంతంలోని హరిగన్వాన్ వద్ద మలుపు తిరుగుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంటిపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, బస్సు సింధు నదిలోకి పడిపోకుండా ఆ ఇల్లు అడ్డుకుంది.
అమర్‌నాథ్ పవిత్ర గుహను దర్శించుకుని తిరిగి వస్తున్న యాత్రికులు ఈ ప్రమాదానికి గురయ్యారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే జమ్ముకశ్మీర్ పోలీసులు, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్, భారత సైన్యం సిబ్బందితో పాటు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎక్కువ మందికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గందర్‌బాల్ డిప్యూటీ కమిషనర్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జూలై 2న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు 4.15 లక్షలకు పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆగస్టు 28తో ఈ వార్షిక యాత్ర ముగియనుంది.
ఇది కూడా చదవండి: కోర్టులో సాక్ష్యానికి ఏఐ సాయం .. చివరికి ఏమైందంటే?


