అస్సాం: నీటిలో 631 గ్రామాలు.. 4.45 లక్షల మంది విలవిల | Assam Floods Worsen: 4.45 Lakh Affected Across Six Districts as 631 Villages Submerged | Sakshi
Sakshi News home page

అస్సాం: నీటిలో 631 గ్రామాలు.. 4.45 లక్షల మంది విలవిల

Jul 28 2026 7:56 AM | Updated on Jul 28 2026 7:55 AM

Assam Floods Worsen: 4.45 Lakh Affected Across Six Districts as 631 Villages Submerged

డిస్పూర్‌: అస్సాంలో భీకర వరదలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వరద తీవ్రత కారణంగా సుమారు 4.45 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీఆర్‌ఐఎంఎస్) నివేదిక ప్రకారం శివసాగర్, గోలాఘాట్, చరైదేవ్, జొర్హాట్, నాగావ్, కామరూప్ (మెట్రోపాలిటన్) జిల్లాల్లో వరద పరిస్థితి అత్యంత భీకరంగా ఉంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఏఎస్‌డీఎంఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి నాటికి 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 631 గ్రామాలు నీటమునిగాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో చరైదేవ్ జిల్లా అత్యధికంగా నష్టపోయింది. ఇక్కడ 1.88 లక్షల మంది ప్రభావితం కాగా, శివసాగర్ జిల్లాలో 1.44 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నుమాలిగఢ్‌ వద్ద ధాన్సిరి నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37,139 హెక్టార్లలో పంట పొలాలు నీటమునిగాయి. అలాగే 2.56 లక్షలకు పైగా మూగజీవాలు వరద బారిన పడగా, సుమారు 26 వేలకు పైగా పశువులు కొట్టుకుపోయాయి.

ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా 184 పునరావాస శిబిరాలు, సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో 28,695 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో 97 మంది గర్భిణులు, బాలింతలు, 42 మంది దివ్యాంగులు ఉన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు స్థానిక యంత్రాంత్రంతో కలిసి 67 పడవలను వినియోగించి, సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వరద నీటి కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురికాగా, 171 ఇళ్లు పూర్తిగా, 4,667 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శివసాగర్, జొర్హాట్ జిల్లాల్లో కొన్ని ప్రాథమిక పాఠశాలలు నీటమునిగాయి. బాధితులకు బియ్యం, కందిపప్పు, ఉప్పు వంటి నిత్యావసర సరుకులను ప్రభుత్వం అందజేస్తోంది. ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: భర్తను ఎదిరించి మరీ రాజకీయాల్లోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement