నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరోసారి ఉత్కంఠకు దారితీస్తోంది. కేంద్రంతో చర్చల అనంతరం ఆందోళనను విరమించిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు ఆ హామీలు అమలు కావడం లేదని ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో కేంద్రానికి మరోసారి అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేరుస్తూ ఇవాళ గనుక రాతపూర్వక హామీ ఇవ్వకుంటే.. మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించింది.
నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జులై 25న తాత్కాలికంగా ముగిసింది. అదే సమయంలో ఈ నిరసనలకు మద్దతుగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యమించారు. అయితే వాళ్లపైనా ఆయా చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నీట్ నిరసనలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మళ్లీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో జరిగిన చర్చల్లో.. నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇచ్చారని సీజేపీ పేర్కొంది. ఆ తర్వాత కూడా బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల అరెస్టులు కొనసాగుతున్నాయని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారంటూ ఆరోపించింది.
‘‘హామీ ఉల్లంఘిస్తే నమ్మకద్రోహమే’’
సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు కేంద్రానికి డిమాండ్లు పెట్టారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చిన హామీలపై లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు కాకపోతే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చర్చలను నమ్మి ఉద్యమాన్ని విరమించారని.. ఇప్పుడు మాట తప్పడం లక్షలాది మంది యువత నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
వార్నింగ్ ఎఫెక్ట్.. బిహార్ ప్రభుత్వ హామీ
సీజేపీ హెచ్చరికల తర్వాత బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 26 సాయంత్రం 6 గంటల వరకు నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది. అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేస్తామని, భవిష్యత్తులోనూ వారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది.
బిహార్‌లో నిరసనల సందర్భంగా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. మొత్తం 335 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆందోళనల సమయంలో హింస, ఆస్తుల నష్టం, పోలీసులపై దాడుల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.
ఏకే-47 ఘటనపై దుమారం
బిహార్‌లోని సివాన్‌లో నిరసనల సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. జేపీ చౌక్ వద్ద భారీగా చేరుకున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ అభిషేక్ కుమార్‌ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆందోళనల్లో మొత్తం 694 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో 339 మందిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసనల్లో పోలీసు అధికారులు సహా 91 మంది గాయపడ్డారని, 14 ప్రభుత్వ వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.
బెంగాల్‌లోనూ కేసులు.. 16 మంది అరెస్టు
ఇటు పశ్చిమ బెంగాల్‌లో నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోల్‌కతాలోని డొరినా క్రాసింగ్ వద్ద అనుమతి లేకుండా గుమిగూడి, పోలీసులపై రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరారని పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుల ఉపసంహరణపై బెంగాల్ ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కొన్ని కేసుల విషయంలో నేరుగా ఉపసంహరణ సాధ్యం కాకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
అసోంలోనూ అరెస్టులు.. కేసుల ఉపసంహరణకు నిర్ణయం
అసోంలోనూ నిరసనలకు సంబంధించి చర్యలు తీసుకున్నారు. ప్రజా శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణలతో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. లఖింపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ద్వారా నిరసనకు మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే..
సీజేపీ హెచ్చరికల నేపథ్యంలో అసోం ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన ఐదు కేసులను ఉపసంహరించేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అరెస్టైన 13 మందిని విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలిపింది. నిరసనల్లో పాల్గొన్న వారిపై భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చట్టపరమైన చర్యలు ఉండవని స్పష్టం చేసింది.
ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో సోషల్ మీడియాపై నిఘా
ఇదిలా ఉండగా.. నిరసనల సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లాలో ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌పై మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ, ఢిల్లీ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది.
ముంబైలో కొనసాగుతున్న పోలీసుల నోటీసులు
సీజేపీ ప్రకటన తర్వాత కూడా.. ముంబైలో కొంతమంది నిరసనకారులకు పోలీసుల నోటీసులు కొనసాగుతున్నాయి. కేసుల దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే నోటీసులు ఇస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అధికారికంగా కేసుల ఉపసంహరణ ఉత్తర్వులు వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
విద్యార్థుల న్యాయ పోరాటానికి సిబల్ చేయూత
నీట్ నిరసనల్లో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ముందుకొచ్చారు. సీజేపీ ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ ఫండ్‌కు రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయవాదులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
పైన పేర్కొన్న రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సహా పలు ప్రాంతాల్లో నీట్ నిరసనలకు సంబంధించి కేసులు, అరెస్టుల ప్రక్రియ కొనసాగింది. అయితే కేవలం ప్రకటనలతోనే ఈ వివాదం ముగిసిపోతుందా? కేసుల ఉపసంహరణ, అరెస్టయిన విద్యార్థుల విడుదల అంత సులువైన ప్రక్రియేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు, దర్యాప్తు దశలో ఉన్న కేసులు, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు కీలకంగా మారాయి.
తమ డిమాండ్లు నెరవేరకపోతే మళ్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు దిగుతామని సీజేపీ స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయి? విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? లేక ఈ వ్యవహారం మరోసారి దేశవ్యాప్త ఉద్యమానికి దారితీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేంద్రం తదుపరి చర్యలపైనే నీట్ ఉద్యమం భవిష్యత్ ఆధారపడి ఉంది.


