లోక్‌సభలో పేపర్‌లీకేజీల బిల్లు  | Government introduces paper leak Bill in Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో పేపర్‌లీకేజీల బిల్లు 

Jul 28 2026 5:07 AM | Updated on Jul 28 2026 5:09 AM

Government introduces paper leak Bill in Lok Sabha

లీకేజీ వ్యక్తిగత నేరగాళ్లకు గరిష్టంగా పదేళ్ల జైలు, రూ. 50 లక్షల జరిమానా 

వ్యవస్థీకృత నేరగాళ్లకు గరిష్టంగా ఏడేళ్ల జైలు, రూ. 10 కోట్ల జరిమానా 

అన్ని రాష్ట్రాలు, యూటీల్లో లీకేజీ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు 

విపక్షాల నిరసనల మధ్యే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్‌ వంటి కీలక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో ఉద్యమించిన విద్యార్థిలోకాన్ని శాంతింపజేసేందుకు, లీకేజీ నేరగాళ్ల వెన్నులో వణుకుపుట్టేలా అత్యంత కఠిన శిక్షలు, అత్యధిక జరిమానాలతో నూతన చట్టానికి తుదిరూపునిచ్చి సంబంధిత బిల్లును మోదీ సర్కార్‌ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. 

ప్రభుత్వ పరీక్షలు(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు,2026ను ప్రధానికార్యాలయానికి సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్‌ సోమవారం లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టారు. బిల్లు ప్రతిపాదించేముందు నిబంధనల ప్రకారం సీనియర్‌ విపక్ష సభ్యులైన సౌగతా రాయ్‌(టీఎంసీ), మనీశ్‌ తివారీ(కాంగ్రెస్‌), ఎన్‌కే ప్రేమచంద్రన్‌(ఆర్‌ఎస్పీ)లను బిల్లుపై మాట్లాడాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. 

దానికి వాళ్లు ముందుకురాకపోవడంతో ఇక బిల్లును ప్రవేశపెట్టాలని సహాయమంత్రి జితేంద్రను స్పీకర్‌ కోరడంతో ఆయన బిల్లును సభముందుకు తెచ్చారు. వెంటనే స్పీకర్‌ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు తెస్తున్న బిల్లు ఇది. మీరు నినాదాలు ఆపేసి బిల్లుపై చర్చలో పాల్గొంటే బాగుంటుంది. చర్చ వేళ మీరు ఇచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది’’ అని స్పీకర్‌ అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్‌ ఎగ్జామ్‌లో అవకతవకలకు పాల్పడే వాళ్లను ప్రత్యేక చట్టాల కింద శిక్షించేందుకు మోదీ సర్కార్‌ 2024లో పబ్లిక్‌ ఎగ్జామ్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టం తెచ్చింది. యూపీఎస్‌సీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వేస్, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇతర ప్రభుత్వ సంస్థలు చేపట్టే పరీక్షల పేపర్లను లీక్‌చేసే వాళ్లను, ముఠాలను ఈ చట్టనిబంధనల కింద శిక్షిస్తున్నారు. తాజాగా నీట్‌ లీకేజీ ఉదంతం, విద్యామంత్రిగా ధర్మేంద్ర రాజీనామా డిమాండ్లు, విద్యార్థి నిరసనోద్యమంలో మోదీ సర్కార్‌ చట్టసవరణ చేస్తూ కొత్త బిల్లును తేవడం తెల్సిందే.

బిల్లులో ఏముంది? 
→ అక్రమ పద్దతులను అనుసరిస్తూ పోటీపరీక్షల ప్రశ్నపత్రాలను వ్యక్తిగతంగా లీక్‌చేసిన నేరగాళ్లకు కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టగా పదేళ్ల శిక్ష పడేలా బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచారు. ఈ నేరగాళ్లకు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు.  

→ వ్యక్తిగతంగా కాకుండా ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత నేరం చేసిన వాళ్లకు గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు. వీళ్లకు గరిష్టంగా రూ.10 కోట్ల జరిమానా విధిస్తారు.  

→ 2024లో అమల్లోకి వచ్చిన పాత చట్టం ప్రకారం పేపర్‌ లీకేజీ వ్యక్తిగతం నేరగాళ్లకు మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్ష విధించేవారు. వ్యవస్థీకృత నేరగాళ్లకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి జరిమానా విధిస్తారు. వీటిని పెంచుతూ సవరణ బిల్లును తెచ్చారు.

→ లీకేజీ సంబంధిత కేసుల సత్వర విచారణ కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదైనా సెషన్స్‌ కోర్టును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుగా ఏర్పాటుచేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు.

→ కేసును రోజువారీగా కోర్టులో విచారిస్తూ, ఆ కేసులో నేరాభియోగం(చార్జ్‌షీట్‌) దాఖలైన మూడు నెలల్లోపు కేసు విచారణ ముగించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేసు తీవ్రత దృష్టా అవసరమైతే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను
ఏర్పాటుచేయొచ్చు.

→ పరీక్షల నిర్వహణ కోసం అవసరమైతే ఇతర విభాగాల సాయం తీసుకోవచ్చు.

→ పరీక్ష కేంద్రాలు, పరీక్షార్థుల తనిఖీ, బయోమెట్రిక్‌ నమోదు, భద్రతా ప్రమాణాలు, సీట్ల కేటాయింపు, ప్రశ్నపత్రాల కూర్పు, పేపర్‌ల లోడింగ్, ఇని్వజిలేషన్‌లకు సంబంధించి కొత్త నిబంధనలు,ప్రమాణాల రూపకల్పనకు సంబంధించి బిల్లులో ప్రతిపాదనలుచేశారు

→ పేపర్‌ లీక్‌ చేయడం, ఓఎంఆర్‌ షీట్‌ ట్యాంపరింగ్, నకిలీ వెబ్‌సైట్ల రూపకల్పన, నకిలీ ఐడీ కార్డులను జారీచేయడం ఇలా 15 అనైతిక చర్యలను నేరాలుగా పేర్కొన్నారు. 

నేడు చర్చ! 
వరసబెట్టి వాయిదాలపర్వంతో ముగుస్తున్న లోక్‌సభ సెషన్‌లో తొలిసారిగా మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్ట సవరణ బిల్లు–2026 ను మంగళవారం లోక్‌సభో చర్చించనున్నారు. చర్చ కోసం అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లను స్పీకర్‌ బిర్లా ఒప్పించడంతో చర్చ సాధ్యంకానుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సభలో బిల్లుపై ఏడు గంటలపాటు చర్చించే వీలుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement