సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కృష్ణా రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో ఆయన పరారీలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల మేరకు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన హైదరాబాద్ పోలీసులు, ఆయనకు నోటీసులు జారీ చేసేందుకు గత రెండు రోజులుగా తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే పోలీసుల విచారణకు సహకరించకుండా ఉదయ్ కృష్ణారెడ్డి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన రికార్డుల్లో పేర్కొన్న రెండు నివాస చిరునామాలను పోలీసులు పరిశీలించినప్పటికీ అక్కడ ఆయన ఆచూకీ లభించలేదు. అంతేకాకుండా తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఆయన పరారీలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఒకవైపు పోలీసుల గాలింపు తీవ్రతరం కాగా, మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తీవ్రత, నమోదు చేసిన సెక్షన్లు, ఆయన సమర్పించిన వాదనలపై హైకోర్టులో ఈరోజు మరోసారి కీలక విచారణ జరగనుంది. కానీ, ప్రస్తుతం ఆయన కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


