అద్దె బస్సులపై అమాత్యుల వద్దకు..! | Internal discussion among rental bus owners in RTC creates chaos | Sakshi
Sakshi News home page

అద్దె బస్సులపై అమాత్యుల వద్దకు..!

Jul 27 2026 4:44 AM | Updated on Jul 27 2026 4:44 AM

Internal discussion among rental bus owners in RTC creates chaos

అవి కొనసాగాలంటే కొంత ఖర్చుకు సిద్ధం కావాల్సిందే

ఆర్టీసీలో అద్దె బస్సు యజమానుల అంతర్గత చర్చ కలకలం..

సంస్థ ఎండీ వద్దకు సమావేశం వీడియో 

పరోక్ష హెచ్చరికలు జారీ చేసిన మేనేజింగ్‌ డైరెక్టర్‌ 

ఆర్టీసీ అధికారిక ప్రకటనలనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆర్టీసీలో ప్రైవేటు అద్దె బస్సులను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే అద్దె బస్సులు తిప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే మన అద్దె బస్సులు ఉండవు. ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం వెలువడేలోపే మనం మేల్కోవాల్సి ఉంది. ప్రభుత్వంలో గట్టి పట్టున్న ముగ్గురు, నలుగురు మంత్రులతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన అద్దె బస్సులు కొనసాగేలా చూడాలి. ఇది జరగాలంటే కొంత మొత్తం ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. అద్దె బస్సు నిర్వాహకులు తలా రూ.లక్ష చొప్పున చెల్లించాలి..’.. కొద్దిరోజుల క్రితం ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సమావేశంలో జరిగిన చర్చ ఇది. సమావేశం వివరాలు బయటకు పొక్కనప్పటికీ, అందుకు సంబంధించిన వీడియో ఒకటి నేరుగా ఆర్టీసీ ఎండీకి చేరింది. దీంతో ఆ అంశం ఆర్టీసీలో పెద్ద చర్చకు దారితీసింది. మంత్రుల పేర్లను ప్రస్తావించటంతో, దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, అద్దె బస్సు యజమానులను పరోక్షంగా హెచ్చరిస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. 

మహిళా సంఘాల ఎంట్రీతో ముప్పు! 
ఆర్టీసీలో చాలా కాలంగా అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల అవసరాలకు కావాల్సినన్ని బస్సులను సొంతంగా సమకూర్చుకోవటం ఆర్టీసీకి తీవ్ర భారంగా పరిణమిస్తోంది. దీంతో కొన్నింటిని ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకుని నడిపించే పద్ధతిని రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభించింది. అప్పటినుంచి క్రమంగా వీటి సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం 3 వేలకు పైగా అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఇవి కాకుండా గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు పద్ధతిలో తిరుగుతున్న ఎలక్ట్రిక్‌ బస్సులు కూడా అద్దె ప్రాతిపదికన తీసుకున్నవే. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీలు) బస్సులు కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఎస్‌హెచ్‌జీలకు ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో మహిళా సంఘాలు బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిస్తున్నాయి. ఆ బస్సులకు ఆర్టీసీ ప్రతినెలా అద్దె చెల్లిస్తోంది. 

అలా ప్రస్తుతం మహిళా సంఘాల ఆధ్వర్యంలో 553 బస్సులు తిరుగుతుండగా, మరో 27 బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో ఆ సంఖ్య 600కు చేరనుంది. క్రమంగా ఈ సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీలైతే అన్ని  అద్దె బస్సులను మహిళా పొదుపు సంఘాల ఆధ్వర్యంలోనే తిప్పితే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ బస్సులను ప్రారంభించే సమయంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కూడా దీనికి బలం చేకూర్చేదిలా ఉంది. అది జరగాలంటే ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్న అద్దె బస్సులు తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అద్దె బస్సుల యజమానుల్లో కలకలం ప్రారంభమైంది. మరోవైపు ఇటీవల కొన్ని ప్రైవేటు అద్దె బస్సుల కాంట్రాక్టు గడువు పూర్తయింది. వాటి స్థానంలో కొత్త టెండర్లు పిలవాలా, లేక మహిళా సంఘాలకు కేటాయిస్తారా స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆర్టీసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో అద్దె బస్సు నిర్వాహకుల్లో టెన్షన్‌ మరింత పెరిగింది. దీంతో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకుని తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకునే క్రమంలో ఈ వివాదం వెలుగు చూసింది. 

ఎవరూ డబ్బులు చెల్లించొద్దు: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి 
తాజా ఉదంతంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందించారు. పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.  ‘అద్దె బస్సుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది. అధికారికంగా ఆర్టీసీ చేసే ప్రకటనలనే పరిగణనలోకి తీసుకోవాలి. కొందరు దళారులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే మాటలు నమ్మి అద్దె బస్సు యజమానులు ఆందోళనకు గురికావొద్దు. రకరకాల కారణాలు చెప్పి డబ్బు వసూలు చేసేవారి మాటలు నమ్మొద్దు. డబ్బులు ఎవరికీ చెల్లించొద్దు..’ అని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement