చాయ్‌ కోసం వెళ్తూ అనంతలోకాలకు! | Two teens killed and one injured in road accident in Hyderabad | Sakshi
Sakshi News home page

చాయ్‌ కోసం వెళ్తూ అనంతలోకాలకు!

Jul 27 2026 1:41 AM | Updated on Jul 27 2026 1:41 AM

Two teens killed and one injured in road accident in Hyderabad

మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన టిప్పర్‌

ఇద్దరు బాలురు మృతి.. తీవ్రంగా గాయపడిన మరో మైనర్‌

సాక్షి, హైదరాబాద్‌/మూసాపేట: ఆదివారం కావడంతో ఆటవిడుపు కోసం క్రికెట్‌ ఆడేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇద్దరు మైనర్లను మృత్యువు కబళించింది. ఈ ఉదంతంతో మరో బాలుడు గాయపడ్డాడు. యూసుఫ్‌గూడలోని బ్రహ్మశంకర్‌ నగర్‌కు చెందిన బేగరి మహేశ్, మన్నే లక్ష్మీతేజ, పులి కిరణ్‌కుమార్‌ స్నేహితులు. 17 ఏళ్ల వయసున్న ముగ్గురూ అమీర్‌పేట్‌లోని వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సెలవు రోజుల్లో వీళ్లు యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్‌ పార్క్‌ వద్ద క్రికెట్‌ ఆడుతుంటారు.

ఆదివారం కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన ఇంటి నుంచి బయటకు వచ్చిన మహేశ్‌ మిగిలిన ఇద్దరినీ కలిశాడు. ముగ్గురూ కలిసి కిరణ్‌కుమార్‌కు చెందిన ద్విచక్ర వాహనంపై కృష్ణకాంత్‌ పార్క్‌కు బయలుదేరారు. అయితే ఆట ప్రారంభించడానికి ముందు తరచూ వెళ్లినట్లే కూకట్‌పల్లిలోని మహాలక్ష్మి కేఫ్‌కు వెళ్లి చాయ్‌ తాగాలని భావించారు. కిరణ్‌ వాహనం నడుపుతుండగా వెనుక మహేశ్, లక్ష్మీతేజ కూర్చున్నారు. 4:55 గంటల సమయంలో కూకట్‌పల్లిలోని మెట్రో పిల్లర్‌ నం.796 వద్ద వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్‌ వీరి వాహనాన్ని గుద్దింది.

దీంతో మహేశ్, లక్ష్మీతేజ ఎగిరి ఎడమవైపునకు పడిపోయారు. వాహనం నడుపుతున్న కిరణ్‌ కుడివైపు పడ్డాడు. మహేశ్, లక్ష్మీ తేజలపై టిప్పర్‌ టైరు ఎక్కడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. గాయాల పాలైన కిరణ్‌ మహేశ్‌ తండ్రి సంగప్పకు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఈ ప్రమాదంపై సమాచారం అందుకుని ఘటనాస్థలికి వచ్చిన కూకట్‌పల్లి పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి, కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement