చెర్వుగట్టులో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు
దగ్ధమైన దుకాణాలు.. రూ.3 కోట్ల ఆస్తి నష్టం
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవస్థానం వద్ద ఆదివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ అయి 17 వస్తు విక్రయ దుకాణాలు ఆహుతయ్యాయి. ఈ సంఘటనలో దాదాపు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. చెర్వుగట్టు గ్రామ పంచాయతీ దుకాణాల సముదాయం వద్ద భక్తులకు విక్రయించేందుకు బొమ్మలు, వివిధ ప్లాస్టిక్ వస్తువుల దుకాణాలున్నాయి.
ఆ షాపుల ముందు ఏర్పాటు చేసిన రేకులకు స్తంభం నుంచి వచ్చే వైర్ ద్వారా ఆదివారం తెల్లవారు జామున 3.15 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక షాపులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వరుసగా ఉన్న 17 షాపులు, తోపుడు బండ్లకు ఒకదాని వెంట మరోదానికి అంటుకుని కాలి బూడిదయ్యాయి. విషయం తెలిసిన వెంటనే నల్లగొండ, నార్కట్‌పల్లి సీఐలు ఆదిరెడ్డి, సురేశ్, ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. నల్లగొండ, రామన్నపేట, నకిరేకల్ నుంచి అగ్నిమాపక వాహనాల ద్వారా ఉదయం 5.30 గంటల వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
బాధితులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంఘటన స్థలానికి విచ్చేసి బాధితులకు తక్షణ సాయంగా రూ.20 వేల చొప్పున అందజేశారు. నష్టం జరిగిన దుకాణదారులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలసి ఈ సంఘటనను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు త్వరలో తగిన న్యాయం చేస్తామన్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పరామర్శించారు.


