ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి రూ.2,278.14 కోట్లు | Telangana govt approves Rs 2278 cr Adilabad airfield project | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి రూ.2,278.14 కోట్లు

Jul 27 2026 1:14 AM | Updated on Jul 27 2026 1:14 AM

Telangana govt approves Rs 2278 cr Adilabad airfield project

నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ  

సాక్షి, హైదరాబాద్‌: ఇటు పౌర విమానాశ్రయం, అటు భారత వాయుసేన వ్యూహాత్మక కేంద్రం.. వెరసి జాయింట్‌ యూజర్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్‌ పట్టణాన్ని ఆనుకుని దాదాపు 2 వేలకుపైగా ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చేపట్టే ఈ విమానాశ్రయానికి భూసేకరణ, మౌలిక వసతుల కల్పన కోసం రూ.2,278.14 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తంగా 2,009.23 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం ఇందులో పేర్కొంది.

1,609.23 ఎకరాలు భారత వై­మా­నిక దళం శిక్షణ, ఆపరేషన్స్‌ కోసం కేటాయించారు. వాయుసేన అధీనంలో ఉన్న 369.45 ఎకరాలకు అదనంగా ఈ భూమిని రాష్ట్రప్రభుత్వం సేకరించి ఉచితంగా అందించనుంది. 400 ఎకరాలు సివిల్‌ ఏవియేషన్‌ (ప్రయాణికుల విమాన సేవలు), కార్గో సౌకర్యాలు, ఎంఆర్‌ఓ, హ్యాంగర్ల నిర్మాణానికి సేకరించనున్నారు. వైమానిక దళం, ఎయిర్‌బస్‌ లాంటి పెద్ద రవాణా విమానాలు సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేందుకు 9 వేల అడుగుల పొడవైన రన్‌ వేను నిర్మించనున్నారు. రూ. 2,278.14 కోట్ల బడ్జెట్‌లో భూసేకరణతో పాటు విమానాశ్రయ నిర్మాణానికి, అడ్డంకిగా ఉన్న రహదారులు, విద్యుత్‌ లైన్లు, నీటిపారుదల మార్గాలను మళ్లించడానికి నిధులు కేటాయించారు.

గత ఉత్తర్వుల రద్దు.. 
గతంలో 700 ఎకరాల భూసేకరణ కోసం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, వర్తమాన అవసరాలకు అనుగుణంగా 2,009.23 ఎకరాల సేకరణకు ప్రభుత్వం కొత్త ఆదేశాలిచి్చంది. భూసేకరణ చట్టంలోని కొన్ని అంశాల మినహాయింపులకు కూడా అనుమతించింది. భూసేకరణ ప్రక్రియతో పాటు విద్యుత్‌ లైన్లు, రోడ్ల మళ్లింపు పనులన్నింటినీ డిసెంబర్‌ 31 నాటికి వేగంగా పూర్తి చేయాలని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.  

ఎంతో ఉపయోగం: మంత్రి కోమటిరెడ్డి 
ఈ విమానాశ్రయ నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు విశేష ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement