కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రఘునందన్, లక్ష్మణ్, దత్తాత్రేయ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి
భూసేకరణ పూర్తిచేస్తే గుట్టకు ఎంఎంటీఎస్ పనులు
తెలంగాణలో రూ.48 వేల కోట్లతో రైల్వే పనులు
కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సిద్దిపేటజోన్: మరో మూడేళ్లలో మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలో రూ. 6 కోట్లతో నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి సిరిసిల్ల, 2028 జూన్ నాటికి వేములవాడ రైల్వే స్టేషన్లను అందుబాటులోకి తెచి్చ, 2029 నాటికి కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చరిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. సికింద్రాబాద్ నుంచి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైల్వేలైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తే రైల్వే పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ ట్రైన్‌లు ఉండగా వాటిలో మూడు తెలంగాణ ప్రాంతానికి అనుసంధానం కావడంతో ఎంతో ప్రయోజనం కలుగుతోందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వం ఏది ఉన్నా నరేంద్రమోదీ సమన్యాయం పాటించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కొమురవెల్లి భక్తుల కల సాకారం అయిందని, ఆలయ అభివృద్ధి, విస్తరణకు రవాణా వ్యవస్థ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్‌రావు, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ రగడ..
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభ వేడుకల్లో ప్రొటోకాల్ అంశం వివాదాలకు దారి తీసింది. ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు నినాదాలు చేశారు. మరోవైపు జై శ్రీరామ్ అంటూ కొందరు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ప్రొటోకాల్ అంశంపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి ప్రారంభ వేడుక కంటే ముందే వెళ్లిపోయినట్టు సమాచారం.


