రక్షణ రంగంలో లీడర్‌గా ఎదుగుతాం | Former DRDO chairman Satheesh Reddy honoured with Changemaker-2026 award | Sakshi
Sakshi News home page

రక్షణ రంగంలో లీడర్‌గా ఎదుగుతాం

Jul 27 2026 12:50 AM | Updated on Jul 27 2026 12:50 AM

Former DRDO chairman Satheesh Reddy honoured with Changemaker-2026 award

సతీశ్‌రెడ్డి దంపతులను సన్మానిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి. చిత్రంలో ఏపీ మంత్రి సత్యకుమార్, కేవీపీ రామచంద్రరావు తదితరులు

ఏమీ లేని స్థితి నుంచి ఎగుమతులు చేసే స్థాయిలో ఉన్నాం 

సాంకేతికతలో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడ్డాం 

జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడు డా.జి.సతీశ్‌ రెడ్డి 

చేంజ్‌ మేకర్‌–2026 అవార్డు ప్రదానం

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: రక్షణ రంగంలో ప్రపంచ లీడర్‌గా భారత్‌ ఎదుగుతుందని జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడు, ప్రముఖ రక్షణ శాస్త్రవేత్త డా.జి.సతీశ్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రక్షణ రంగ పరికరాల కోసం ఒకప్పుడు పూర్తిగా దిగుమతులపై భారత్‌ ఆధారపడిందని, ఏమీ లేని స్థితి నుంచి నేడు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకున్నామని గర్వంగా చెప్పారు. మిసైల్స్, రాడార్స్, గన్స్, నిఘా.. ఇలా అన్ని విభాగాల్లోనూ సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతున్నామన్నారు.

ఆదివారం జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ‘ఎమెస్కో–డా.బి.వి.పట్టాభిరామ్‌ అవార్డు ‘చేంజ్‌ మేకర్‌–2026’అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రక్షణ రంగంలో దేశవ్యాప్తంగా 25వేల పైచిలుకు కంపెనీలు నిమగ్నమయ్యాయి. 2025–26లో రూ.1,78,000 కోట్ల విలువైన రక్షణ రంగ పరికరాలు భారత్‌లో తయారయ్యాయి. భారత్‌ ఉపయోగిస్తున్న మొత్తం రక్షణ ఉత్పత్తుల్లో 65–70 శాతం దేశీయంగా ఉత్పత్తి అయినవే. మన దేశం నుంచి ఏటా ఎగుమతులు రూ.15వేల కోట్లు పెరుగుతున్నాయి. అర్మేనియా ఇటీవల నిర్వహించిన ఆర్మీ పరేడ్‌లో భారత్‌ సరఫరా చేసిన ఆయుధాలను ప్రదర్శించింది’అని చెప్పారు. 

శత్రువుకు చిక్కకుండా.. 
కార్గిల్‌ యుద్ధంలో అత్యంత ఎత్తైన, చలి ప్రదేశంలో పోరాడి సైన్యం విజయం సాధించడంలో డీఆర్‌డీఓ ముఖ్యభూమిక పోషించిందని సతీశ్‌ రెడ్డి వివరించారు. ఆపరేషన్‌ సిందూర్‌లో శత్రుదేశంపై వాడిన యుద్ధ పరికరాలు 80–90 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసినవేనని తెలిపారు. ‘పాక్‌ నుంచి వచి్చన డ్రోన్స్‌ ఏవీ కూడా మన దేశంలోని లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. వాటిని మనం ధ్వంసం చేశాం. యాంటీ శాటిలైట్‌ మిసైల్‌ వ్యవస్థను అభివృద్ధి చేసి రష్యా, అమెరికా, చైనా సరసన మనం నిలుచున్నాం. 155 ఎంఎం గన్స్‌ తయారు చేస్తున్నాం.

 డీఆర్‌డీఓ తయారు చేసిన యాంటీíÙప్‌ హైపర్‌సోనిక్‌ మిసైల్‌ ధ్వని కంటే 8రెట్లు వేగంగా దూసుకుపోతుంది. ప్రపంచంలో మరే దేశం దగ్గర ఈ వ్యవస్థ లేదు’అని తెలిపారు. భారత్‌ను యువత ముందుండి నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో మన దేశంలో 450 స్టార్టప్స్‌ ఉండేవని, ఇప్పుడు ఈ సంఖ్య 2,35,000 దాటిందన్నారు. స్కైరూట్‌ వంటి కంపెనీలు సత్తా చాటుతున్నాయని తెలిపారు.  

అవార్డు ప్రదానం 
డీఆర్‌డీఓకు చెందిన వేల మంది శాస్త్రవేత్త లు దశాబ్దాలుగా తమ జీవితాన్ని ధారపోస్తున్నా రని సతీశ్‌ రెడ్డి తెలిపారు. వారు విశేషంగా కృషి చేయడం వల్లే స్వతంత్రంగా ఈ దేశాన్ని రక్షించుకునే స్థితికి వచ్చామని కితాబిచ్చారు. వారి సేవలకు గుర్తింపుగానే తనకు ఈ అవార్డు దక్కిందని తెలిపారు. ప్రముఖ నటుడు చిరంజీవి మాట్లాడుతూ.. అబ్దుల్‌ కలాం అంతటి సామర్థ్యం ఉన్న వ్యక్తి సతీశ్‌ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, కేవీపీ రామచంద్ర రావు, ‘ఎమ్మెస్కో’విజయ్‌ కుమార్, సీనియర్‌ జర్నలిస్ట్‌ కె.రామచంద్ర మూర్తి, జయ పట్టాభిరామ్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement