హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు. ఓటు హక్కు వయస్సు, ఎన్నికల నిబంధనలు వంటి అంశాలను నిర్ణయించే అధికారం భారత ఎన్నికల సంఘం (Election Commission of India) మరియు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఇటువంటి అంశాలపై ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధికి తగదన్నారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని,. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కావడంతో విద్యార్థులు తమ విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఇతర అంశాలపై దృష్టి మళ్లించడం సరైంది కాదన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నామన్నారు.


