విజయవాడ: బెజవాడ దుర్గమ్మకు తెలంగాణలోని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర‍్పించింది. బంగారు బోనం సమర్పణలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ‘‘ఆషాడ మాసంలో తెలంగాణ మహంకాళీ జాతర ఎంతో వైభవంగా సాగుతుంది. 17 ఏళ్ల నుంచి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున బోనం సమర్పిస్తున్నాం.
ఏటా క్రమం తప్పకుండా బంగారు బోనం సమర్పిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి తీవ్రమైన వర్షాభావ పరిస్థితులున్నాయ్. కనకదుర్గమ్మ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఉండాలి. వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలి. రైతులంతా సుభిక్షంగా ఉండాలి’’ అని అన్నారు.



