సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం మరణం మా కుటుంబానికి తీరని లోటు’’ అని ఆయన కుమారుడు గిరిబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా తండ్రికి నివాళులర్పించిన అందరికీ మా కృతజ్ఞతలు. నా తండ్రిని బతికించేందుకు వైఎస్ జగన్ చాలా ప్రయత్నం చేశారు. ముద్రగడ ఆరోగ్యం గురించి వైఎస్ జగన్ ఫోన్ చేసి తెలుసుకునేవారు. ముద్రగడను బతికించేందుకు వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడేవారు’’ అని గిరిబాబు తెలిపారు.
నా తండ్రి పాడెను వైఎస్ జగన్ మోయడం ఎప్పటికీ మర్చిపోలేం. ఇది రాజకీయ లబ్ధికాదు. కుమారుడు తండ్రికి ఇచ్చిన గౌరవం. వైఎస్ జగన్ పట్ల మా కుటుంబంలో మరింత గౌరవం పెరిగింది. ముద్రగడ చెప్పినట్టే నడుచుకున్నాం. మా సోదరి క్రాంతిని రానివ్వద్దని ముద్రగడ మాకు చెప్పారు. కానీ పోలీసులు బలవంతంగా క్రాంతిని తీసుకొచ్చారు. మేం క్రాంతిని తీసుకురావద్దని చెప్పినా పోలీసులు వినలేదు’’ అని ముద్రగడ గిరిబాబు చెప్పారు.
అంబటి రాంబాబుపై కేసు పెట్టడం సరికాదు. అంత్యక్రియలకు అధికార లాంఛనాలు వద్దని మేమే చెప్పాం. మా తండ్రి అంత్యక్రియలు ప్రశాంతంగా చేసుకోనివ్వలేదు. నా సోదరి క్రాంతిని అడ్డుపెట్టుకుని జనసేన రాజకీయం చేస్తోంది. నా సోదరి క్రాంతి చేసింది మహాపాపం’’ అని గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


