తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎల్‌నినో ప్రభావమో..వాతావరణం మార్పులో.. రుతుపవనాలు రాకో.. వాయుగుండం ప్రభావమో తెలియదు గాని ఇటీవల కాలంలో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విభిన్న పరిస్థితులు కానవస్తున్నాయి. వర్షాకాలం వచ్చినా ఉదయం, మధ్యాహ్నాం ఉష్ణోగ్రతలు కొనసాగుతూనే ఉన్నాయి. వేసవిని తలపించే విధంగా ఎండలు కాస్తున్నాయి. మధ్యాహా్నం సమయంలో గాల్పులు వీస్తున్నాయి.
వాతావరణం వేడిగా ఉండి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పగటి పూట ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. కార్యాలయాలు వద్ద జనసంచారం తగ్గుతుంది. జ్యూస్ షాపులు వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. ఇది ఇలా ఉంటే సాయంత్రం అయ్యే సరికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వస్తున్నాయి. ఆకాశం మేఘావృతం కావడం కొన్ని సందర్భాలలో ఈదురు గాలులు వీచి మేఘాలు వర్షం పడకుండానే దూరంగా వెళ్లిపోవడం, కొన్ని సందర్భాలలో తేలికపాటి చిరు జల్లులు పడుతూ విచిత్రమైన, విభిన్నమైన పరిస్థితులు కానవస్తున్నాయి.
మేఘాలు వస్తే వర్షాలు భారీగా పడుతాయన్న ప్రజల ఆశలు ఆవిరి అవుతున్నాయి. ఉక్కపోత తప్పడం లేదు. ఇటువంటి వాతావరణ పరిస్థితులు కొత్తగా చూస్తున్నట్లు ఉందని పలువురు అంటున్నారు. రాత్రి సమయాల్లో వేడి కారణంగా ఉక్కపోత, దోమల బెడదతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. వర్షాలు పడాలని, ఇటువంటి పరిస్థితులు గతంలో చూడలేదని, ఎంత కాలం ఇలా కొనసాగుతుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.


