న్యూస్‌రీల్
ద్వారాలు పెద్దవి చేయాలి
నాలుగు గంటల నుంచి వేచి ఉన్నా..
లోపాలు సరిచేయాలి
నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్టుకు ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన బిక్కిన లక్ష్మీనరసమ్మ రూ.1,01,116 విరాళంగా అందజేశారు.
పెంటపాడు: ప్రత్తిపాడు గ్రామ దేవత పైళ్లమ్మ అమ్మవారికి శనివారం సారె కార్యక్రమం నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026
ద్వారకాతిరుమల: తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిలబడలేక పలువురు క్యూలైన్లలోనే కింద కూర్చుండిపోగా, ఆలయంలోకి వెళ్లకుండానే దేవుడు బయటే కనిపించాడు అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత క్యూ కాంప్లెక్స్ వినియోగంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, కొత్త క్యూ కాంప్లెక్స్ వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయని చర్చ సాగుతోంది.
దర్శనం త్వరగా పూర్తవుతుందన్న ఆశతో రూ.200 దర్శనం టికెట్లు కొనుగోలు చేసి క్యూలైన్లలోకి వచ్చిన భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.100 దర్శనం టికెట్ తీసుకున్నవారు, ఉచిత దర్శనం భక్తులు తమకంటే ముందుగా దర్శనానికి వెళ్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో కొందరు భక్తులు నిలబడలేక క్యూలైన్లలోనే కింద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సెల్‌ఫోన్లు భద్రపరిచేందుకు బారులు
సెల్‌ఫోన్లను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన డిపాజిట్ కౌంటర్ల వద్ద కూడా భక్తులు బారులు తీరారు. నూతన అనివెట్టి మండపం నుంచి అన్నమయ్య విగ్రహ కూడలి వరకు క్యూలైన్లు కొనసాగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కౌంటర్ వద్ద అప్పటికప్పుడు షామియానా ఏర్పాటు చేశారు.
కొత్త క్యూ కాంప్లెక్స్ ప్రారంభం తర్వాత..
నూతన శాశ్వత క్యూ కాంప్లెక్స్ ప్రారంభమైనప్పటి నుంచి భక్తుల ఇబ్బందులు మరింత పెరిగాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నమయ్య విగ్రహ ప్రాంతంలో తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ ఉన్నప్పుడు భక్తులకు ప్రశాంతంగా స్వామివారి దర్శనం జరిగిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆలయ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. మరోవైపు, అష్టకష్టాలు పడి ఆలయంలోకి చేరుకున్నా.. వెనుక భక్తుల రద్దీ ఎక్కువగా ఉందంటూ సిబ్బంది త్వరత్వరగా బయటకు పంపేస్తున్నారని, దీంతో స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునే అవకాశం దక్కడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ అవసరం
ఇటీవల ప్రారంభమైన నూతన శాశ్వత క్యూ కాంప్లెక్స్ భక్తుల రద్దీకి సరిపోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించిన అధికారులు నూతన అనివెట్టి మండపం పక్కన లక్షలాది రూపాయలు వెచ్చించి తాత్కాలిక క్యూలైన్లు నిర్మించి, వాటిపై వాటర్‌ప్రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు. ఆ క్యూలైన్ల లోంచి భక్తులు మళ్లీ శాశ్వత క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న క్యూలైన్లలోకి వెళ్లి, అందులో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వృద్ధులు, చిన్నారులు ఎక్కువసేపు నిలబడలేక క్యూ లైన్లలోనే ఇబ్బందులు పడుతున్నారు. నూతన అనివెట్టి మండపం పక్కన తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే భక్తులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. లేకపోతే ముక్కోటి ఏకాదశి, గోదావరి పుష్కరాలు జరిగే సమయంలో భారీగా తరలి వచ్చే భక్తులకు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అవాంచనీయ ఘటనలు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదని పేర్కొంటున్నారు.
శ్రీవారి అంతరాలయ ద్వారం, దాని ముందు, పక్కన ఉన్న ద్వారాలను పెద్దవి చేయాల్సిన అవసరం ఉందని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ అధికారులకు సూచించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, ఆలయ ప్రధానార్చకులు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులను వెంటబెట్టుకుని ఆయన రూ.100, రూ. 200, ఉచిత దర్శనం క్యూలైన్లలోకి వెళ్లారు. అక్కడ నుంచి చూసే సామాన్య భక్తులకు స్వామివారు కనిపించడం లేదని, ఆలయ ద్వారాలను పెద్దవి చేయాల్సి అవసరం ఉందని సూచించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ట్రస్టు బోర్డులో ఆమోదించి తనకు పంపాలని ఆదేశించారు.
తొలి ఏకాదశికి ద్వారకాతిరుమలకు పోటెత్తిన భక్తులు
దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ
నిలబడలేక చతికిలపడ్డ పలువురు భక్తులు
ఆలయ ద్వారాలు పెద్దవి చేయాలని దేవదాయ కమిషనర్ సూచన
రూ.200 దర్శనం క్యూలైన్‌న్‌లో 4 గంటల నుంచి వేచి ఉన్నా దర్శనం కాలేదు. రూ.100, ఉచిత దర్శనం భక్తులు కూడా ముందే వెళ్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది.
– చిన్నశెట్టి గోపీ, భక్తుడు – దమ్మపేట, తెలంగాణ
గతంలో దర్శనానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఇప్పుడు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. వృద్ధులు, చిన్నారులతో పాటు పలువురు భక్తులు ఎక్కువసేపు నిలబడలేక క్యూలైన్లలోనే కింద కూర్చుంటున్నారు.
– మన్నెం గంగాధరరావు – దమ్మపేట, తెలంగాణ


