తాడేపల్లిగూడెం అర్బన్: పట్టణంలో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఉర్ల బాలకృష్ణ వర్ధన్ (36) శనివారం వేకువజామున తన ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుల వేధింపులే తన మృతికి కారణమంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని తండ్రి ఉర్ల రామచంద్ర వసంత లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, సెల్ఫీ వీడియో ఉన్న మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం.. బాలకృష్ణ వర్ధన్ ఒక యూట్యూబ్ చానల్‌లో కెమెరాపర్సన్‌గా పనిచేస్తున్నాడు. ఆ చానల్ నిర్వాహకులిద్దరూ జీతం ఇవ్వకుండా వర్ధన్‌తో విపరీతంగా పనిచేయించుకుంటూ, ఉద్యోగ రీత్యా దూషిస్తూ, అవమానిస్తూ, కులం పేరుతో బూతులు తిడుతూ వచ్చారు. గత నెలలో మృతుడు అనారోగ్యానికి గురై తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరాడు. నిందితులు అతడిని మరో ఆసుపత్రిలో చేర్చాలని వర్ధన్ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ ఆసుపత్రికి వచ్చిన నిందితులు మృతునితో గొడవపడి, అతడు అడిగిన బకాయి జీతం ఇవ్వడానికి నిరాకరించి తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేశారు. మృతుడు తన వైద్యం కోసం స్నేహితుల నుంచి ఆర్థిక సాయం కోరగా, నిందితులు సోషల్ మీడియాలో అతనిపై అవమానకరమైన, నిందాపూర్వక పోస్టులు పెట్టి, ఎవ్వరూ వర్ధన్‌కు సాయం చేయకుండా దుష్ప్రచారం చేశారు. దీనికి మృతుడు సోషల్ మీడియాలోనే వారికి సమాధానం ఇచ్చాడు. ఘటనకు కొన్ని రోజుల ముందు మృతుని తల్లిదండ్రులకు సదరు యూట్యూబ్ చానల్ వ్యక్తి మొబైల్ నంబరు నుంచి విడివిడిగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దారికి రాకపోతే వర్ధన్‌పై అబద్ధపు కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో తీవ్రంగా మనస్తాపానికి గురైన మృతుడు శనివారం ఉదయం సుమారు ఆరు గంటలకు తన గదిలోని సీలింగ్ ఫ్యానుకు శాలువాతో ఉరివేసుకున్నాడు. తండ్రి గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా వర్ధన్ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి మొబైల్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫీ వీడియోలో తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి యూట్యూబ్ చానల్ నిర్వాహకులు రంగ సురేష్, దేవ శివ కారణమని వర్థన్ స్పష్టంగా పేర్కొన్నాడు. దీనిపై ఎస్సై బి.శ్రీనివాస్ కేసు నమోదు చేయగా, డీఎస్పీ రవిచంద్ర పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసుల కేసు నమోదు


