31న స్కీమ్‌ వర్కర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

31న స్కీమ్‌ వర్కర్ల నిరసన

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

31న స్కీమ్‌ వర్కర్ల నిరసన తణుకు అమ్మాయి.. స్పెయిన్‌ అబ్బాయి కేంద్ర మంత్రి దృష్టికి ఆక్వా సమస్యలు అట్టహాసంగా ఈశా గ్రామోత్సవం

భీమవరం: స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 31న కలెక్టరేట్‌ వద్ద జరిగే కార్యక్రమంలో స్కీమ్‌ వర్కర్స్‌ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ డి.కల్యాణి పిలుపునిచ్చారు. శనివారం భీమవరం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో స్కీమ్‌ వర్కర్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు స్కీమ్‌ వర్కర్స్‌ పట్ల చిన్న చూపు చూస్తోందని, రోజు రోజుకు ఽనిత్యావసరాల ధరలు పెరుగుతున్నా వేతనాలు పెంపుదల లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు బి.వరలక్ష్మి పాల్గొన్నారు.

తణుకు అర్బన్‌: స్పెయిన్‌ అబ్బాయితో పశ్చిమగోదావరి జిల్లా తణుకు పాతవూరుకు చెందిన అమ్మాయికి శనివారం స్థానిక సీఎం ఫంక్షన్‌ హాలులో వైభవంగా వివాహం జరిగింది. స్పెయిన్‌కు చెందిన అమిన్‌ అల్‌ రహద్‌ను తణుకుకు చెందిన ప్రియదర్శిని వివాహం చేసుకుంది. ఎంఎస్‌ కోసం ఏడేళ్ల క్రితం స్పెయిన్‌ వెళ్లిన ఆమె అమీన్‌తో ప్రేమలో పడింది. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌ నుంచి అమీన్‌ కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రియదర్శిని తండ్రి మరణించగా.. తల్లి భారతి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తూ కుమార్తెను ఉన్నత చదువులు చదివించారు.

భీమవరం: ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఫీడ్‌, సీడ్‌ ధరల పెంపు, రొయ్య ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు వివరించినట్లు రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ చెప్పారు. శనివారం భీమవరంలో పాకాను ఆక్వా రైతుల సంఘం నాయకులు కలిసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. ఆక్వా రంగానికి వరి పండించే రైతులకు ఇస్తున్న సబ్సిడీలను వర్తింపచేస్తే సమస్యలు కొంత పరిష్కారమవుతాయని చెప్పినట్లు తెలిపారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆక్వా ఎగుమతుల్లో 70 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే వస్తున్నాయని.. అత్యధిక భాగం గోదావరి జిల్లాల నుంచే వెళ్తుందన్నారు. పాకాను కలసిన వారిలో రొయ్య రైతులు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మళ్ల తులసీరామ్‌, గాదిరాజు వెంకటసుబ్బరాజు, గౌరవ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్‌ తదితరులున్నారు.

భీమవరం: భీమవరం పట్టణంలోని డీఎన్నార్‌ కళాశాల ఆవరణలో 18వ ఈశా గ్రామోత్సవం శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅఽతిధిగా హాజరైన జాయింట్‌ కలెక్టర్‌ కేఆర్‌ కల్పనశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆటలు, యోగా, ధ్యానం వంటి వాటిని రోజూవారీ జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. ఈశా ఫౌండేషన్‌ నిర్వహించిన క్రీడా పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు వాలీబాల్‌, త్రోబాల్‌, లెమన్‌ స్పూన్‌, గోనె సంచి పరుగు పందెం వంటి విభాగాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షుడు గోకరాజు పాండురంగరాజు, ప్రిన్సిపల్‌ జి.మోజేస్‌, కె.రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement