breaking news
West Godavari District News
-
వైఎస్సార్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపులు
అయితంపూడిలో ఇళ్లు కూల్చివేతపై మండిపాటుఇరగవరం: కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని, వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రభుత్వ మాజీ విప్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ధ్వజమెత్తారు. మండలంలోని అయితంపూడిలో వందలాది మంది పోలీస్ బలగాలను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ సర్పంచ్ భవనంతో పాటు ఐదుగురి ఇళ్లను అక్రమంగా కూల్చివేయడం దుర్మార్గమన్నారు. కూల్చివేసిన ఇళ్లను శనివారం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, భీమ వరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకట్రాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి ము రళీకృష్ణంరాజు తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధిని తాము స్వాగతిస్తామని, కానీ కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంలో అలైన్‌మెంట్‌ను మార్చి తెల్లవారుజామున వందలాది మంది పోలీసులను అడ్డుపెట్టుకుని ఇళ్లను కూల్చడం దారుణమని ప్రసాదరాజు అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాల వేళ ప్రభుత్వం బ్రిటిష్ పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పొక్లయిన్లు, 400 మందికి పైగా పోలీసులను మోహరించి ఇళ్లను కూల్చివేసి చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేలా.. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పదేళ్లుగా అవినీతి మచ్చ లేకుండా పనిచేసిన మాజీ సర్పంచ్ జితేంద్ర కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. తగిన మూల్యం తప్పదు రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ముఖ్య అనుచరుడైనందుకే జితేంద్రపై కక్ష సాధించారని, ప్రజా వ్యతిరేకతకు భయపడే వేకువజామున ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. శాసనమండలిలో ప్రస్తావిస్తా.. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గ్రామ పారిశుధ్య కార్మికులకు 11 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో శాసనమండలిలో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. మాజీ ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న, రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, సీఈసీ సభ్యుడు పెనుమత్స సుబ్బరాజు, మండల నాయకులు జాలి సుబ్బరావు, చోడే జోషి, చోడే ఏసు రత్నం, మాజీ సర్పంచ్‌లు ఉప్పులూరి లావణ్య, జితేంద్ర, బెల్లంకొండ హేమ కుమారి, సురేష్,సత్తి వెంకట రెడ్డి, దినేష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. -
బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
దెందులూరు: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ ఉద్యోగి కాలును కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు రూరల్ మండలం పాలగూడెం గ్రామానికి చెందిన మాత్రపు సతీష్ ఆశ్రం ఆసుపత్రిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పాలగూడెం రైల్వే గేటు సమీపంలోని హోటల్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ కుడికాలు కింద భాగం తెగి దూరంగా పడిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో క్షతగాత్రుడిని వెంటనే ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి గుంటూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
వివాదాస్పదంగా జాతీయ పతాకావిష్కరణ
● టీడీపీ నాయకుడితో పతాకావిష్కరణ చేయించిన తహసీల్దార్ ● జెండా పూర్తిగా ఎగరకముందే జాతీయ గీతం ఆలాపన కుక్కునూరు: కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం వివాదాస్పదమైంది. ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో తహసీల్దార్ ప్రోటోకాల్‌కు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తహసీల్దార్ చలపతిరావు.. మండల కూటమి నాయకుడు వచ్చే వరకు పతాకావిష్కరణ చేయకుండా వేచి ఉండటంతోపాటు, ఆ నాయకుడితో జాతీయ జెండాను ఎగరవేయించడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ కార్యాలయంలో జరిగే జాతీయ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చారంటూ పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జెండా ఎగరకముందే జాతీయగీతం? ఇదే కార్యక్రమంలో మరో అంశం కూడా విమర్శలకు దారితీసింది. జాతీయ జెండా పూర్తిగా పైకి ఎగరకముందే జాతీయగీతం ప్రారంభించి ఆలపించినట్లు కార్యక్రమానికి హాజరైన వారు తెలిపారు. జాతీయ పతాకం, జాతీయగీతం విషయంలో అత్యంత గౌరవం, నిబంధనలు పాటించాల్సిన అధికారిక కార్యక్రమంలో అధికారులు ఇలా వ్యవహరించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? జాతీయ పతాక గౌరవానికి సంబంధించిన నిబంధనలు, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్, 1971 తదితర చట్టాల ప్రకారం ఈ ఘటనలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. ఈ ఆరోపణలపై జిల్లా అధికారులు ఏ విధంగా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
శ్రీవారి కొండపైకి ‘ఫాస్ట్‌ట్యాగ్’ ప్రయాణం
ద్వారకాతిరుమల ఘాట్‌రోడ్డు టోల్గేట్ వద్ద కొత్త విధానం ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు దేవస్థానం ఘాట్‌రోడ్డులోని టోల్గేట్ వద్ద ఫాస్ట్‌ట్యాగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో తిరుమల తిరుపతిలో మినహా ఏ క్షేత్రంలోనూ ఈ విధానం అందుబాటులో లేకపోవడం విశేషం. శని, ఆదివారాలు, వారాంతాలు, ఇతర పర్వదినాల్లో ద్వారకాతిరుమల క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయాల్లో టోల్గేట్ వద్ద వాహనాలు బారులు తీరకుండా ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగపడనుంది. నూతన కాంట్రాక్టర్ చేబోలు రాజేష్ ఏర్పాటుచేసిన ఈ విధానంతో వాహనదారుల సమయం ఆదా కావడంతో పాటు ఘాట్‌రోడ్డులో రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు దోహదపడుతుంది. వేగంగా రాకపోకలు టోల్గేట్ వద్ద రద్దీకి పరిష్కారంగా ఫాస్ట్‌ట్యాగ్ ఏర్పాటు చేయడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్యాగ్ ఉన్న వాహనాలు గేట్ వద్ద నిలపాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా రుసుం చెల్లింపు పూర్తవుతుంది. నిమిషానికి 30 వాహనాలు ముందుకు వెళ్లేలా ఈ సిస్టమ్‌ను అమర్చారు. దీనివల్ల రద్దీ రోజుల్లోనూ టోల్గేట్ వద్ద వాహనాల నిలుపుదల గణనీయంగా తగ్గుతుంది. ఫాస్ట్‌ట్యాగ్‌కు ప్రత్యామ్నాయం : ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనదారులు యథావిధిగా నగదు చెల్లించి టికెట్ తీసుకునే వెసులుబాటును కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఉండవు కాబట్టి నగదు చెల్లించి, టికెట్ తీసుకోవాలి. కార్లు వంటి వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఉంటుంది కాబట్టి వారు టోల్‌గేటు వద్ద ఆగాల్సిన పనిలేదు. -
కోర్టుల్లో వేడుకలు
భీమవరం: 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవాలను శనివారం భీమవరంలోని అన్ని కోర్టుల ప్రాంగణంలో నిర్వహించారు. 3వ అదనపు జిల్లా న్యా యమూర్తి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు త్రిభాషా డిక్షనరీలు పంచారు. పోక్సో కోర్టు వద్ద సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎం.సుధారాణి జాతీయ జెండాను ఎగురవేశారు. 1వ అదనపు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తి పి.హనీష జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో జెండాను ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) సి.రమ్య ఎగురవేశారు. న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్ (న్యూటన్), ప్రధాన కార్యదర్శి బడుగు అశోక్‌బాబు, న్యాయవాదులు, కోర్టు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మిట్టగూడెంలో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు
అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు, గ్రామస్తులు నూజివీడు: కూటమి ప్రభుత్వ పాలనలో అనుమతులు లేని గ్రావెల్, మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నూజివీడు మండలం మిట్టగూడెం రెవెన్యూ పరిధిలోని అన్నేరావుపేట రోడ్డులో ఓ గుట్ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వి తరలించేందుకు యత్నించగా, వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు శుక్రవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. నూజివీడు పట్టణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పొక్లెయిన్, ఐదు టిప్పర్లతో గ్రావెల్ తరలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న మిట్టగూడెం సర్పంచి వెలివల నాగేశ్వరరావు, నాగా పద్మారావు, పోలగాని అయ్యప్ప, నల్లిబోయిన శంకర్‌తో పాటు దాదాపు 30 మంది గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తమ వద్ద ఏఎంఆర్ బిల్లులు ఉన్నాయని, అడ్డుకోవడానికి మీరెవరు అంటూ సదరు నాయకుడు వాదించారు. అయితే మైనింగ్ అనుమతి పత్రాలు చూపితేనే గ్రావెల్ తరలనిస్తామని గ్రామస్తులు స్పష్టం చేయడంతో, చేసేది లేక వారు పొక్లయిన్, టిప్పర్లతో వెనుదిరిగారు. ఈ ప్రాంతంలో గత ఏడాది కాలంగా రాత్రి వేళల్లో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని, గతంలో హనుమంతులగూడెం గ్రామస్తులు సైతం లారీలను నిలిపివేసినా అక్రమ రవాణా ఆగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.700 వసూలు చేస్తున్న ఏఎంఆర్ సంస్థ గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలు, మెరక కోసం పునాదుల్లో మట్టి తోలుకుంటున్నా ఏఎంఆర్ సంస్థ ఉద్యోగులు వచ్చి ట్రాక్టర్‌కు రూ.700 వసూలు చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. వాణిజ్య అవసరాలకు కాకుండా సొంత అవసరాలకే మట్టి తోలుకుంటున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వసూలు చేయడం దారుణమని వారు మండిపడుతున్నారు. -
దేశం మనదే.. తేజం మనదే..
● అట్టహాసంగా స్వాతంత్య్ర దినోత్సవాలు ● ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు ● మువ్వన్నెల జెండా రెపరెపలు ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026భీమవరం: భీమవరం కలెక్టరేట్ వద్ద 80వ స్వాతంత్య్ర దినోత్సవాలు అంబరాన్నంటాయి. జాతీయ పతకాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించి, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్సీ అద్నాన్ నయీం అస్మితో కలిసి పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలోని పోలీసు వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక, సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రశంసా పత్రాల ప్రదానం జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారి కుటుంబాలను సత్కరించారు. ప్రజాసేవలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థలు, దాతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను బహూకరించారు. అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన సేవకులకు, అధికారులకు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను అందించారు. ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు పతకాలను అందించారు. ఆకట్టుకున్న శకటాలు వైద్యారోగ్య, వ్యవసాయ, అగ్నిమాపక, విద్యాశాఖ, ఎస్ఈఆర్పీ–జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, గృహనిర్మాణ, రవాణా శాఖల శకటాలు ఆకట్టకున్నాయి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు ప్రదర్శనలు అలరించాయి. ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను మంత్రి రామానాయుడు పరిశీలించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని చాటేలా పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ఉత్తేజాన్ని రేకెత్తించాయి. రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), జేసీ కేఆర్ కల్పశ్రీ, డీఆర్వో పి.ప్రభాకర్, భీమవరం, నరసాపురం ఆర్డీఓలు కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దాసి రాజు, తహసీల్దార్ ఆర్.రాంబాబు పాల్గొన్నారు. వీక్షకులు నామమాత్రం వీక్షకులు పెద్దగా లేకపోవడంతో వేడుకలు నామమాత్రంగా జరిగాయా అనిపించింది. మంత్రి నిమ్మల, రాజ్యసభ సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే మినహా మిగిలిన ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. కలెక్టర్ నాగరాణి జెండా వందనం, పోలీసు కవాతు వరకూ మాత్రమే కనిపించారు. అలాగే గతంతో పోలిస్తే శకటాల సంఖ్య తగ్గింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అంతంతమాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. తణుకు రూట్స్ స్కూల్ విద్యార్థినుల రింగ్ డ్యాన్స్‌కు ప్రథమ, భీమవరం సెయింట్ మేరీస్ స్కూల్ విద్యార్థుల దేశభక్తి గేయంకు ద్వితీయ, భీమవరం పీఎంఎస్ బాలికల స్కూల్ విద్యార్థుల ప్రదర్శన, ఉండి హైస్కూల్ విద్యార్థుల కరాటే ప్రదర్శన, కర్రసాముకు తృతీయ బహుమతి లభించాయి. పాలకొల్లు భారతీయ విద్యాభవన్స్ విద్యార్థుల దేశభక్తి గేయం, తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను ఏపీఆర్ఎస్డబ్ల్యూఏ స్కూల్ విద్యార్థుల నేషనల్ బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు తన ప్రసంగంలో గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఇంటింటికీ పింఛన్, ఆక్వాకు సబ్సిడీ విద్యుత్, ధాన్యం సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో జమచేసే విధానం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేయగా.. కూటమి ప్రభు త్వానిదే ఘనత అన్నట్టు చెప్పుకొచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులను సన్మానించే కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణకు ప్రాధాన్యమివ్వలేదు. మంత్రి నిమ్మల, జేసీ కల్పశ్రీ, ఎస్పీ నయీం అస్మి తదితరులు మరో వేదికపై ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి సత్కారాలు చేశారు. అయితే ఆ వేదికపైకి పాకాను పిలవలేదు. -
ధీరుల త్యాగఫలమే స్వేచ్ఛా జీవనం
తణుకు అర్బన్: ఆనాటి ధీరుల త్యాగఫలం కారణంగా సాధించుకున్న స్వాతంత్య్రం మూ లంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నేతృత్వంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ పోరాట స్ఫూర్తిగా యువత దేశ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. గాంధీజీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్ల సురేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, లారెన్స్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశం చౌక్): దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరం కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధికి యంత్రాంగం అంకితభావంతో పనిచేయాలని కోరారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, డీఆర్వో పి.ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గన్‌మెన్ మంతెన శ్రీనివాసరాజు ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో 44 ఏళ్లపాటు సేవలు అందించినందుకుగాను మెడల్‌కు ఎంపికయ్యారు. ఆయన ఇప్పటికే పోలీస్ సేవాపతకం, పోలీస్ ఉత్తమ సేవాపతకం, అతి ఉతృష్ట సేవా పతకాలను అందుకున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చేతులమీదుగా పోలీస్ మెడల్‌ను అందుకోనున్నారు. ఏలూరు టౌన్: దేశ స్వాతంత్య్ర సాధనలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను మరువలేమని ఏలూరు రేంజ్ ఐటీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరులోని రేంజ్ ఐజీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం సమర్పించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద, జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం వద్ద వేడుకలు జరిగాయి. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహనీయుల పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించేలా ప్రతిఒక్కరూ బాధ్యతగా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాద్‌రావు, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, ఆర్ఐ పవన్‌కుమార్, ఆర్ఐ సతీష్, ఆర్ఎస్ఐ భాస్కరరావు, ఏఓ షేక్‌మస్తాన్ ఉన్నారు. -
గేటు పడిందా.. ప్రయాణం గోవిందా!
● సమయం వృథా ● ప్రతి పావు గంటకూ గేటు ● అండర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు ఎప్పటికి పూర్తయ్యేనో? ● పట్టించుకోని ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు ఆకివీడు: విజయవాడ–నరసాపురం బ్రాంచి రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పూర్తయ్యాక రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయాణం సుఖవంతమైనప్పటికీ, కొత్త రైళ్లతో పాటు ప్రతి పావుగంటకూ గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానిక రైల్వే గేట్ల వద్ద ప్రజల నరకయాతన వర్ణనాతీతంగా మారింది. గేట్లతో పెరుగుతున్న ఇక్కట్లు ఒకేసారి రెండుమూడు రైళ్ల కోసం పావుగంటకు పైగా గేట్లు వేస్తుండటంతో, ఎండల్లోనూ వానల్లోనూ ప్రజలు వేచి చూడాల్సి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. పడిపోయిన ఆస్తుల విలువలు రైల్వే గేట్లకు ఆవల ఉన్న ప్రాంతాల్లో భూముల విలువలు లక్షల్లో పడిపోయాయి. కొనుగోలుదారులు ముందుకు రాకపోగా, ఉన్న గృహాలకు అద్దెదారులు దొరక్క టూలెట్ బోర్డులు వెలుస్తున్నాయి. నిర్మాణాల్లో తీవ్ర జాప్యం ఆకివీడు జవహర్‌పేట, సిద్ధాపురం, గుమ్ములూరు, దుంపగడప, శృంగవృక్షం, వీరవాసరం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో గేట్ల సమస్య తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జీల నిర్మాణానికి అనుమతులు, టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. ఉండి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అధికారులు కొలతలతోనే సరిపెడుతున్నారని, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు తగిన చొరవ చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రైల్వే బడ్జెట్లు సూపర్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతున్నా, గేట్ల ఇక్కట్లకు పరిష్కారం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రైల్వే శాఖ, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెనల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరుతున్నారు. -
గ్రావెల్ తవ్వకాలపై ఆందోళన
ఆగిరిపల్లి : మండలంలోని కల్లుటూరు, ఈదులగూడెం సరిహద్దుల్లోని కొండ పోరంబోకు గట్టుపై జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల వలన తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 174లోని కొండగట్టుపై ఎల్అండ్టీ కంపెనీకి చెందినవారు అనుమతులు ఉన్నాయంటూ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి, లారీల్లో బయటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈదులగూడెం, కల్లుటూరుకు చెందిన రైతులు ఈ కొండపై అనేక సంవత్సరాలుగా జీవాలను మేపుకుంటూ, బోర్లు వేసుకుని వ్యవసాయం సాగు చేసుకుంటున్నారు. అమరావతికి గ్రావెల్ తరలించడం కోసం తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని రైతులు మండిపడ్డారు. మైనింగ్, పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వకాలు ఎలా చేస్తారంటూ గ్రావెల్ తవ్వక ప్రాంతానికి వెళ్లి నిరసన తెలిపారు. ఈ ఆందోళన సమయంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి కొల్లిపర సాంబశివరావు అక్కడకు చేరుకుని గ్రామస్తులను బెదిరింపులకు గురిచేశారు. తవ్వకాలు చేస్తుంది తానేనని, ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా తమకు ఏమీ కాదని హెచ్చరించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే తాము బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని, తవ్వకాలు నిలిపివేసే వరకు హైకోర్టును ఆశ్రయించి పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. -
మహిళ దారుణ హత్య
ఆకివీడు: స్థానిక ఉప్పుటేరు వంతెన సమీపంలోని మందపాడు రోడ్డులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసున్న ఈ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఉప్పుటేరు గట్టున పడేసి ఉంటారని భావిస్తున్నారు. వివస్త్రగా ఉన్న ఆమె ఒంటిపై గాయాలున్నాయి. ముఖం కందిపోయి ఉండగా, మృతదేహం వద్ద దుప్పటి ఉన్నట్లు గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి తీసుకువచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆకివీడు సీఐ కాళీచరణ్, ఎస్సై శుభశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం డాగ్ స్క్వాడ్‌లోని జాగిలం ఒక చెరువు గట్టు వద్దకు వెళ్లి ఆగినట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ విష్ణు మాట్లాడుతూ.. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దోషులను పట్టుకుంటామని చెప్పారు. మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. -
శ్రీవారి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తుల రద్దీతో అనివెట్టి మండపాలు, దర్శనం క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట తదితర ప్రాంతాలు కిక్కిరిశాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. క్షేత్రంలో సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. -
ప్రత్యేక అలంకరణలో వేములదీవి వెంకన్న
నరసాపురం రూరల్: మండలంలోని వేములదీవి కాపులకొడప శ్రీ వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి అరుణ్‌కుమార్ ఆచార్యులు స్వామివారిని పూలతో సుందరంగా అలంకరించి, విశేష సేవలు, అభిషేకాలు జరిపించారు. ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. టి.నరసాపురం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో భక్తి, దేశభక్తి మిళితమైన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయ ప్రధానార్చకుడు రవీంద్రబాబు స్వామివారి శివలింగాన్ని మువ్వన్నెల జాతీయ జెండా రూపంలో వర్ణశోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక జేపీ రోడ్డులోని శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్రం అనుబంధ సంస్థ అయిన శ్రీ పద్మావతీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాస మొదటి శనివారాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి సహస్ర దీపాలంకరణ, ఊంజల సేవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారు, అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి, వెయ్యి దివ్య దీపాల కాంతుల నడుమ అర్చకులు విశేష పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ మంతెన రామ్‌కుమార్ రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈఓ, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవలో తరించారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) మెగా రుణమేళాను సోమవారం నగరంలో నిర్వహించనున్నట్టు ఆ బ్యాంక్ విజయవాడ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. స్థానిక రామచంద్రరావుపేటలోని హోటల్ ఎన్ స్క్వేర్‌లో మేళా నిర్వహిస్తామని, వ్యవసాయ రంగానికి రుణాలు అందిస్తామన్నారు. అలాగే కోల్డ్ స్టోరేజ్, వేర్‌హౌస్‌ల ఏర్పాటుకు గరిష్టంగా రూ.50 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు గరిష్టంగా రూ.100 కోట్లు, పౌల్ట్రీ వ్యాపారానికి గరిష్టంగా రూ.50 కోట్లు అందిస్తామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరు (టూటౌన్): ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లకు రావాల్సిన 7 నెలల బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ నిర్ణయించింది. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో యూనియన్ నేతలు ఈ వివరాలను వెల్లడించారు. గత ఐదారు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రానున్న పంచాయతీ ఎన్నికల కోసం జి ల్లాలోని అన్ని గ్రా మ పంచాయతీల్లో ఈ ఏడాది జనవరి 1ని అర్హతగా పరిగణించి ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈనెల 21లోపు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా రూపొందించి, 23లోపు ప్రచురిస్తామన్నారు. జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను 26లోపు స్వీకరించి, 29న ఆమోదించిన అనంతరం 31న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురిస్తామన్నారు. సుమారు 600 మంది ఓటర్లకు ఒక ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిఉంటుందన్నారు. ఓటర్ల సంఖ్య 1,300 కంటే ఎక్కువగా ఉంటే, మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ,బీ,సీలుగా విభజించాలన్నారు. సాధారణంగా ఏ ఓటరు కూడా ఓటు వేయడానికి రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చూడాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం భీమవరం కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు నేరుగా వెబ్సైట్, టోల్‌ఫ్రీ 1100 ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారిని కేంద్రాలకు తీసుకురాకుండా, వారి ప్రతినిధుల ద్వారా అర్జీలు అందజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. తణుకు అర్బన్: ‘పశువైద్యం.. పూజ్యం’ శీర్షికన సాక్షిలో ఈనెల 15న ప్రచురించిన కథనానికి తణుకు పశు వైద్యశాల అధికారులు స్పందించారు. వైద్యులు, సిబ్బంది కొరత ఉండడం వాస్తవమేనని, పశువైద్య సేవల్లో ఎటువంటి లోపాలు లేకుండా రైతులకు సేవలందిస్తున్న ట్టు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వి.ప్రసాద్ తెలిపారు. ఉన్నతాధికారుల సహకారంతో వైద్యులు, పారా వెటర్నరీ సిబ్బంది, అటెండర్లను డిప్యుటేషన్‌పై తీసుకున్నామన్నారు. మందులు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర మందులు మాత్రమే బయట మందుల దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారని, మత్తు మెషీన్ సరఫరాకు కలెక్టర్‌కు ప్రతిపాదన పంపినట్టువివరించారు. మందుల బడ్జెట్ కూడా ప్రతి ఏడాది పెరుగుతుందని చెప్పారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డి మాండ్ చేస్తూ ఈనెల 18న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలుపనున్నట్టు ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తొర్లపాటి బా బు, రెడ్డి శ్రీనివాస్ డాంగే తెలిపారు. -
కడుపులో నొప్పి అని వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు
● నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో యువకుడి మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణనూజివీడు: కడుపు నొప్పితో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరిన రామకూరి ప్రేమ్‌బాబు (31) అనే వ్యక్తి మరుసటిరోజు తెల్లవారేసరికి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల ప్రకారం.. రామకూరి ప్రేమ్‌బాబుకు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కడుపులో గ్యాస్ సమస్య తలెత్తి రెండుసార్లు వాంతులు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, సైలెన్ ఎక్కించి అనంతరం వార్డుకు మార్చారు. అయితే, వార్డుకు మార్చినప్పటి నుంచి రాత్రంతా కడుపునొప్పి, ఆయాసం తీవ్రంగా ఉందని, మూత్రం రావడం లేదంటూ ప్రేమ్‌బాబు పలుమార్లు నర్సుకు మొరపెట్టుకున్నా వైద్యులు ఎవరూ వచ్చి పరిశీలించలేదని మృతుడి కుటుంబ సభ్యులు వాపోయారు. చివరికి పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు అతను ఆసుపత్రిలోనే మృతి చెందాడు. వైద్యులు, సిబ్బంది ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణివల్లే తమ కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు రోదిస్తూ ఆరోపించారు. బాధ్యులైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రేమ్‌బాబు మృతికి న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని మృతుడి బంధువు రాజు తేల్చిచెప్పారు. రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని, నాలుగు వార్డులకు కేవలం ఒక్కరే నర్సు ఉంటే సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. నిజ నిర్ధారణ చేస్తాం రామకూరి ప్రేమ్‌బాబు మృతిపై నిజ నిర్ధారణ నిమిత్తం విచారణ జరుపుతున్నట్లు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంఓ) డాక్టర్ వరప్రసాదరావు స్పష్టం చేశారు. విచారణ కమిటీ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
తేగల సాగు.. బహుబాగు
ద్వారకాతిరుమల: ఆర్గానిక్ ఫుడ్.. సూపర్‌ఫుడ్.. హెల్త్ ఫుడ్.. పేరేదైనా ఆరోగ్యకరమైన ఆహారం కోసం మనం నేటి కాలంలో వేలకు వేలు ఖర్చు చేస్తున్నాం. ఖరీదైన ప్యాకెట్లలో పోషకాహారాన్ని వెతుకుతున్న మనకు ప్రకృతి అందించే అద్భుతమైన ఆహారం తేగలు. రుచితో పాటు శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందించే తేగలు ఒకప్పుడు గ్రామీణుల సాధారణ ఆహారం కాగా.. ఇప్పుడు పట్టణాల్లోనూ ఆరోగ్యాభిలాషుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎలాంటి కృత్రిమ రంగులు, రసాయనాలు లేకుండా ప్రకృతి ప్రసాదించిన ఈ ఆహారం తక్కువ ఖర్చుతో కడుపు నింపడమే కాకుండా.. పోషకాలను అందించే పల్లె సంపదగా నిలుస్తోంది. శీతాకాలం నుంచి వేసవి ఆరంభం వరకు పల్లెల్లో, పట్టణ కూడళ్లలో గుట్టలుగా దర్శనమిచ్చే తేగల వెనుక ప్రకృతితో మమేకమైన ప్రత్యేక సాగు విధానం, రైతుల శ్రమ దాగి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తేగల సాగు జోరందుకుంది. అతి తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వీటి సాగుపై రైతులు ఆశక్తి చూపుతున్నారు. తాటి పండ్ల ఎంపిక, సేకరణ ఇలా.. ● వర్షాకాలం ఆఖరు(ఆగస్టు – సెప్టెంబర్)లో తేగల సాగును ప్రారంభిస్తారు. ● చెట్టు నుంచి సహజంగా కిందపడిన మంచి దృఢమైన పండ్లను రైతులు సేకరిస్తారు. ● తాటి పండ్ల పైన ఉండే మందపాటి నల్లటి తొక్కను తొలగిస్తారు. సాధారణంగా ఒక పండులో 2 నుంచి 3 టెంకలు ఉంటాయి. ● నాణ్యమైన విత్తన టెంక రావడానికి పీచును నీటితో బాగా కడిగి లేదా నేలకు రాసి, గుజ్జు అంతటినీ వేరు చేస్తారు. కొందరు రైతులు పశువులకు వాటిని అందించగా అవి గుజ్జును తిని, టెంకలను విడిచిపెడతాయి. ● బాగా బరువుగా, దృఢంగా ఉన్న టెంకలనే ఎంచుకుంటారు. తేలికగా ఉండే తాలు టెంకలను వేరు చేస్తారు. ● టెంకకు అడుగు భాగంలో ఉన్న ’కన్ను’ దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తపడతారు. ● గుజ్జు తొలగించిన టెంకలను 1–2 రోజులు నీడలో ఆరబెడతారు. దీనివల్ల చీడపీడలు పట్టకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ● ఆ తర్వాత వీటిని తేగ మడుల వద్దకు తరలిస్తారు. ఒక చిన్నపాటి తేగ మడికోసం 500 నుంచి 2,000 వరకు విత్తన టెంకలు అవసరమవుతాయి. సాగు విధానం ఇలా.. ● తేమను పట్టి ఉంచే ఇసుక లేదా మెత్తటి నేలను ఎంచుకుని 1–2 అడుగుల లోతులో మడులు తవ్వుతారు. ● సిద్ధంగా ఉన్న టెంకలను నేలలో ఒకదానికొకటి దగ్గరగా, వరుస క్రమంలో అమర్చి పైన 3 నుంచి 6 అంగుళాల మందంలో మట్టి లేదా ఇసుకను కప్పుతారు. ● ఎప్పటికప్పుడు నీరు చల్లుతూ నేలను తేమగా ఉంచుతారు. టెంక అడుగు భాగం నుంచి మొలక కిందకు పెరుగుతూ లావుపాటి దుంప (తేగ)గా మారుతుంది. ● 3–4 నెలల తర్వాత నేలపైన చిన్న ఆకుపచ్చని మొలకలు రాగానే, గునపంతో నేలను తవ్వి తేగలను టెంకలతో సహా బయటకు తీస్తారు. ● నవంబర్ నుంచి ఏప్రిల్ (శీతాకాలం నుంచి వేసవి ప్రారంభం) వరకు మార్కెట్లలో తేగలు విరివిగా అందుబాటులో ఉంటాయి. తాటి టెంక నుంచి తేగగా మారే అద్భుత ప్రయాణం పీచు పదార్థాలు, ఖనిజాలతో పోషకాల భాండాగారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున సాగు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతాలు, లంక గ్రామాలు, తీరప్రాంత మండలాల్లో తాటిచెట్లు అధికంగా ఉండటంతో తేగల పెంపకం, విక్రయాలు విస్తృతంగా జరుగుతుంటాయి. నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, యలమంచిలి, పోడూరు ప్రాంతాలతో పాటు ఆకివీడు, ఉండి, కాళ్ల మండలాల్లో, నల్లజర్ల మండలం అయ్యవరం, టి.నరసాపురం మండలం తెడ్లం వంటి పలు గ్రామాల్లో తేగల సాగు అధికంగా జరుగుతుంది. మా ఊరిలోనే 50 మంది వరకు తేగల పాతర వేస్తాం. ఉదయాన్నే ట్రాక్టర్లో మహిళా కూలీలను తీసుకుని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలకు వెళ్లి, చెట్ల కింద పడి ఉన్న తాటి పండ్లను సేకరిస్తాం. వాటిని తీసుకొచ్చి పశువుల ముందు వేస్తాం. అవి గుజ్జును తిని విడిచిపెట్టిన టెంకలను శుభ్రం చేస్తాం. ఆ తరువాత పాతర వేస్తాం. పొలం పనులు లేని సమయంలో వీటి ద్వారా జీవనోపాధిని పొందుతున్నాము. – బత్తిన సురేష్, రైతు, అయ్యవరం, నల్లజర్ల మండలం తేగలు మన పల్లెల్లో సహజంగా లభించే మంచి పోషకాహారం. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉండటంతో శరీరానికి శక్తిని అందించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా పేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, మలబద్ధకాన్ని తగ్గించేందుకు కూడా ఇవి దోహదపడతాయి. మితంగా తీసుకుంటే పొట్ట నిండిన భావన కలిగి, ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడతాయి. – ఎ.ప్రవీణ్ కుమార్, పీహెచ్సీ వైద్యాధికారి, ద్వారకాతిరుమల -
నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఆరుగురు భక్తులు వేరువేరుగా ఆదివారం రూ.10,01,333 విరాళంగా అందజేశారు. అందులో భాగంగా నిడమర్రు మండలం మందలపర్రు గ్రామానికి చెందిన పి.రామకృష్ణంరాజు రూ.5 లక్షలు, యలమంచిలికి చెందిన డీవీ శాస్త్రి, నాగలక్ష్మి దంపతులు రూ.లక్ష, హైదరాబాద్‌కు చెందిన జోశ్యుల సత్యన్నారాయణ మూర్తి రూ.లక్ష, పాలకొల్లుకు చెందిన ముచ్చర్ల సంజయ్ రూ.1,01,116, తాడేపల్లిగూడెంకు చెందిన దూసనపూడి రమేష్‌కుమార్ రూ.1,00,116, విజయవాడకు చెందిన వేమూరి వేంకట సుబ్బారావు రూ.1,00,101 ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాతలకు ఆలయ సూపరింటెండెంట్ గోవాడ సుబ్రహ్మణ్యం, ఐవీ రామారావు విరాళం బాండ్లను అందించారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో సీ్త్ర శక్తి పథకాన్ని 2.23 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించే ఈ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం ఏలూరు డీపీటీవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా జిల్లాలో మహిళలకు రూ. 73.56 కోట్లు లబ్ధి చేకూరిందని, రాష్ట్రవ్యాప్తంగా 87 కోట్ల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగా రూ. 3,095 కోట్ల లబ్ధి కలిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం మాట్లాడుతూ, ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోలకు త్వరలో 100 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు డిపో మేనేజర్ బి.వాణి పాల్గొన్నారు. ముదినేపల్లి(కై కలూరు): గ్రామంలో చిట్టీలు కట్టించుకుని నగదు చెల్లించలేదని బాధితులు అడగడంతో ఓ మహిళ అదృశ్యమైన ఘటన వడాలి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వడాలి గ్రామానికి చెందిన మరీదు ధర్మారావు భార్య అంకమ్మ గ్రామస్తుల వద్ద చిట్టీలు కట్టించుకుంది. ఈ క్రమంలో తమ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి పెరగడంతో ఆమె కనిపించకుండా పోయింది. భర్త ఫిర్యాదు మేరకు మహిళా హెడ్ కానిస్టేబుల్ సుధావాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్వారకాతిరుమల: వివాహేతర సంబంధం ఉన్న మహిళతో పాటు తన భర్త కూడా అదృశ్యమయ్యాడని స్థానిక పోలీస్టేషన్లో ఆదివారం ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే. మండలంలోని లైన్ గోపాలపురంనకు చెందిన వాడపల్లి గంగాధరరావు గత నెల 27న ఉదయం 11 గంటల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య వాడపల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తన భర్తతో వివాహేతర సంబంధం ఉన్న గుణ్ణంపల్లి గ్రామానికి చెందిన మహిళ కూడా అదే రోజు నుంచి కనిపించడం లేదని తెలిపింది. వెంకటలక్ష్మి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ముగిసిన చెస్ పోటీలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పీఎస్‌ఎఫ్‌ఐ, పీఎంఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏలూరు ఓపెన్ చెస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో మొదటి స్థానం సీహెచ్ వివేక్, 2వ స్థానం పీ సుచిత్ర, 3వ స్థానం ఎస్.శైలేష్, 4వ స్థానం జే అక్షిత్, 5వ స్థానం కే నవదీప్ గెలుపొందారు. కార్యక్రమంలో పీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ పీ శివశంకర్, పీఎన్ఎస్ జిల్లా కార్యదర్శి జీ శారద, అంతర్జాతీయ చెస్ రేటెడ్ ప్లేయర్ డీ లక్ష్మణరావు, చీఫ్ ఆర్బిటర్ కే కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యుఒడిలోకి..
ఇరగవరం: ఇరగవరం మండలంలోని ఓగిడికి చెందిన మండే గణేష్ అనే విద్యార్థి నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. గణేష్ సోదరుడు ప్రసాద్ వివాహం శనివారం తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరు గుతుండగా స్నేహితులను ఆహ్వానించాడు. వీరిలో సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, ఉయ్యూరువారి మెరక గ్రామాలకు చెందిన చెరుకువాడ రామ్‌చరణ్ అలియాస్ రాజారామ్ (17), పోతుల లక్ష్మీభాను వికాస్ (18), నాగిరెడ్డి దుస్వంత్ సాయి (18), పెనుమంట్ర మండలం సత్యవరానికి చెందిన నాగాబత్తుల సాయిసూర్యతేజ (19), నరసాపురానికి చెందిన మట్టా సంతోష్ (19), పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన వీరమల్లు వెంకట సాయికిరణ్ (19) కారులో పెరవలి వెళ్లారు. రాత్రి 7.30 గంటలకు వివాహం కాగా.. వీరంతా రాత్రి 11.30 గంటలకు అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఓగిడి గ్రామంలో పెళ్లి పనుల్లో ఉన్న గణేష్‌ను తమతో రావాలని కోరారు. అయితే అప్పటికే అలసిపోయిన గణేష్‌ను వీరితో పంపేందుకు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వీరు ఆరుగురు అదే కారులో ఓగిడి నుంచి అయితంపూడి వైపు వస్తూ ఉండగా అయితంపూడి లాకుల వద్ద వచ్చేసరికి వర్షం ఎక్కువగా రావడంతో దారి సరిగ్గా కనిపించలేదు. దీంతో రోడ్డు పక్కన ఉన్న నరసాపురం కాలువలోకి కారు దూసుకుపోయింది. ఐదుగురు కాలువలో నీటి ప్రవాహానికి గల్లంతు కాగా.. స్థానికుల సాయంతో సంతోష్ బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పాడు. పోలీసులు హుటాహుటిన ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీసి విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీఎస్పీలు రవిచంద్ర, విశ్వనాథ్‌ల పర్యవేక్షణలో సీఐలు వెంకటేశ్వరరావు, వెంకటరమణ, ఇరగవరం ఎస్సై నసీరుల్లా తణుకు, తణుకు రూరల్, అత్తిలి ఎస్సైలు వారి సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, రెవెన్యూ అధికారులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. లాకుల సమీపంలో రెండు, పెనుమంట్ర మండలం మార్టేరు లాకుల వద్ద మరో రెండు మృతదేహాలను బయటకు తీశారు. గల్లంతైన ఐదుగురిలో లక్ష్మీభాను వికాస్, దుస్వంత్సా యి, సాయిసూర్యతేజ, సాయికిరణ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. రామ్‌చరణ్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను తణుకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్యవరంలో విషాదఛాయలు పెనుమంట్ర: నాగాబత్తుల సాయి సూర్యతేజ మృతితో సత్యవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని సాకూరుకు చెందిన నాగాబత్తుల లోహిదాసు వ్యవసాయ కూలీ కాగా వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. దీంతో వీరి కుమారుడు సాయిసూర్యతేజ చిన్నప్పటి నుంచి సత్యవరంలో మేనమామ గడ్డం జగదీష్ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. సాయి సూర్యతేజ నరసాపురం స్వర్ణాంధ్ర కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. చేతికి అంది వస్తున్న కొడుకు మరణ వార్త తెలియడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులంతా బోరున విలపిస్తున్నారు. వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు.. స్నేహితుడి ఇంట వివాహ వేడుకకు హాజరయ్యారు.. ఆనందంగా గడిపి కారులో తిరుగు ప్రయాణమయ్యారు.. దారిలో సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ.. సంతోషంగా గడిపిన యువకులు గమ్యం చేరుకునే లోపు మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు.. నిశీధి వేళ ‘మృత్యు’ ప్రవాహంలో గల్లంతై అసువులు బాశారు. ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద నరసాపురం కాలువలోకి కారు దూసికెళ్లిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. నరసాపురం కాలువలోకి దూసుకెళ్లిన కారు ఐదుగురు విద్యార్థుల గల్లంతు నాలుగు మృతదేహాలు లభ్యం మరో విద్యార్థి కోసం గాలింపు ప్రాణాలతో బయటపడ్డ ఓ విద్యార్థి అయితంపూడిలో విషాద ఘటన ప్రమాదంలో బతికి బట్టకట్టిన సంతోష్‌ను ఓ చెట్టు కొమ్మ కాపాడింది. కారు కాలువలోకి దూసుకువెళ్లిన తర్వాత కారులోంచి బయటకు వచ్చిన ఆరుగురు కారు టాప్‌పైకి చేరుకున్నారు. కారు కాలువలో మునిగిపోతుందని గ్రహించిన వారంతా ఈదుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ గల్లంతయ్యారు. అదే కారు పైభాగంలో నిలుచున్న సంతోష్ కాపాడండంటూ కేకలు వేయడంతో రోడ్డున వెళుతున్న ఓ వ్యక్తి ‘నేను చేయిస్తాను.. నువ్వు దూకి పట్టుకో’ అని చెప్పడంతో సంతోష్ ప్రయత్నం చేశాడు. అయితే అతడి చేయి అందకపోవడంతో నీటిలో కొట్టుకుపోతుండగా ఓ చెట్టు కొమ్మ ఆసరాగా దొరికింది. దానిని పట్టుకుని సంతోష్ వేలాడుతుండగా గట్టుపై ఉన్న వ్యక్తి మరికొందరి సాయంతో తాడు వేసి సంతోష్‌ను రక్షించాడు. -
మళ్లీ తెరపైకి ఆయుధ డిపో
● దొడ్డిదారిన మంతనాలు ● డిపో కావాలంటూ ఆందోళనలు ● ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని రైతుల అల్టిమేటం కొయ్యలగూడెం: పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని ఆరు గ్రామాల్లో ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో అంశం మరోసారి వివాదాస్పదమైంది. సుమారు 1,200 ఎకరాల్లో ఈ డిపో నిర్మించ తలపెట్టగా, గతంలో రైతుల వ్యతిరేకత కారణంగా ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకుంటున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ప్రకటించారు. 80 శాతం మంది రైతులు ఆయుధ డిపోను తీవ్రంగా వ్యతిరేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రాజకీయరంగు, దళారుల దందా ప్రారంభమైందని డిపో వ్యతిరేక రైతులు ఆరోపిస్తున్నారు. దరిమిలా నేవీ ఆయుధ డిపో కావాలంటూ 20 శాతం మంది రైతులు దళారులను కలుపుకుని కిరాయి వ్యక్తులను ఏర్పాటు చేసి ఆందోళనలను ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. దొడ్డిదారిన మంతనాలు ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు డిపో సానుకూల వ్యక్తులతో మంతనాలు ప్రారంభించారని డిపో వ్యతిరేక రైతులు అంటున్నారు. అలాగేడిపోను వ్యతిరేకిస్తున్న ముఖ్య నేతలను లోబరుచుకుని వారి భూములను భూసేకరణ నుంచి మినహాయించేలా భేరసారాలు ఆడించినట్టు తెలిపారు. ఇందుకూ బాధిత రైతులు ఒప్పుకోకపోవడంతో విభజించి పాలించు అనే వారి ఆలోచన బెడిసి కొట్టింది అని అంటున్నారు. ఏది ఏమైనా ఆయుధ డిపో ఏర్పాటు చేసి తీరుతామంటూ దళారులు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. ఇందుకు కీలకంగా అధికార గణం మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయుధ డిపో భూమి సేకరణకు కావాల్సిన మొత్తం భూమిలో సర్వే చేయగా, ఎవరికీ చెందని మిగులు భూమి గుర్తించారని, దాంతో ప్రజాప్రతినిధులు తమ అనుయాయులకు డాక్యుమెంట్లు సృష్టించి మిగులు భూమిని కాజేసేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఇలా ప్రజాప్రతినిధులు, అధికారులు మిగులు భూమి నష్టపరిహారాన్ని కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దళారులతో అధికారులు చర్చలు జరుపుతున్నారని వాపోతున్నారు. ప్రాణాలు పోయినా సరే పుడమి తల్లిని వదులుకోబోమని డిపో వ్యతిరేక రైతులు అల్టిమేటం జారీ చేయగా, ఈ నేపథ్యంలో చివరకు ఎవరి మాట నెగ్గుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాణాలు తీసిన ఈత సరదా
వేండ్ర కాలువలో దిగి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం పాలకోడేరు: సెలవు రోజు కావడంతో సరదాగా కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతై మృతిచెందిన విషాద ఘటన పాలకోడేరు మండలం వేండ్రలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. భీమవరంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన నాలుగో సంవత్సరం విద్యార్థులు ఆరుగురు ఆదివారం మధ్యాహ్నం వేండ్రలోని జీఅండ్‌వీ మిగులు జలాల కాలువ వద్దకు వచ్చారు. వంతెన పై భాగంగా ఉన్న వైర్ ప్రాంతం వద్ద నుంచి భీమవరం గునుపూడిలోని బంట్రోతుల వీధికి చెందిన పెరుమాళ్ల సత్య భాస్కర విఘ్నేష్ (22), పార్వతీపురం మన్యం జిల్లా కొమర్యాడ మండలం ధనైపేట గ్రామానికి చెందిన శ్రీష్టు రాహుల్ (21), పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఎస్.సాయి స్నానం చేసేందుకు కాలువలో దూకారు. కాలువలో నీటి ప్రవాహానికి విఘ్నేష్, రాహుల్ గల్లంతుకాగా.. సాయిని మిగిలిన ముగ్గురు స్నేహితులు కర్రసాయంతో ఒడ్డుకు లాక్కొచ్చారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టగా విఘ్నేష్, రాహుల్ మృతదేహాలు లభించాయి. సాయిని చికిత్స నిమిత్తం భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విఘ్నేష్ మేనమామ మైలవరపు సీతారామమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థుల మృతదేహాలు -
అప్పలరాజుగూడెం ఏపీఆర్‌ఎస్‌కు అవార్డు
టి.నరసాపురం: టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ (ఏపీఆర్ఎస్) ప్రతిష్టాత్మక ఉత్తమ పాఠశాల అవార్డును సొంతం చేసుకుంది. విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో సీఎం చంద్రబాబు చేతులమీదుగా పాఠశాల హెచ్ఎం డాక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావు పురస్కారాన్ని అందుకున్నారు. పాఠశాలలో విద్యాభివృద్ధితో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, క్రీడలు, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ సాధించిన సమష్టి కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా భావిస్తున్నట్టు హెచ్ఎం తెలిపారు. ఉంగుటూరు: నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీవ్ర సంక్షోభంలో ఉందని ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ స్పందించారు. ప్రిన్సిపాల్‌ను సంజాయిషీ అడిగినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ కె.వసుధ సంజాయిషీ ఇచ్చారు. గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకున్నట్టు, పీఎం ఉషా బిల్డింగ్‌ను స్థానికుల సహకారం లేకపోవడంతో ప్రారంభించలేదని, మహిళను కావడంతోనే కమిటీ సభ్యులు తనను లక్ష్యంగా చేసుకున్నట్టు ఆరోపణలు చేస్తూ సమాధానమిచ్చినట్టు సమాచారం. -
గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి
వీరవాసరం: సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి సభ్యుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ అన్నారు.. మండలంలోని నౌడూరు జంక్షన్లో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప జాతి నాయకుడు గౌతు లచ్చన్న అని కొనియాడారు. ముందుగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాజీ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్, ఎంపీటీసీ కడలి నెహ్రూ, మాజీ సర్పంచ్ కౌరు భాస్కరరావు, కాండ్రేగుల శ్రీనివాస్, కడలి శ్రీరాములు, జుత్తిగ శ్రీనివాస్, కోటి, కోడి నరసింహ, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. భీమవరం : పట్టణంలోని డీఎన్నార్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్షకు 39 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన పరీక్షలకు 451 మందికి 412 మంది హాజరయ్యారన్నారు. -
ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
మునగాల : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం అర్ధరాత్రి రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాలివి. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు శనివారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరింది. బస్సు అర్ధరాత్రి సమయంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్దకు రాగానే ఏలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రెండు బస్సులు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయాయి. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ఈ ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న మునగాల ఎస్సై సంజీవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ సిబ్బంది, ఎన్హెచ్ఏఐ–65 సిబ్బంది, ఫైర్ సిబ్బంది సాయంతో రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకు వెళ్లి కల్వర్టును ఢీకొని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో 31 మంది, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు. పోలీసులు ప్రయాణికులను ఇతర బస్సుల్లోకి ఎక్కించి వారి గమ్యస్థానాలకు పంపించారు. గాయపడిన డ్రైవర్, ముగ్గురు ప్రయాణికులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీసిన పోలీసులు ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘటన -
ఏజెన్సీలో భారీ వర్షం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకూ భారీ వర్షం దంచికొట్టింది. ఈ వర్షానికి ఈ ఏడాది మొట్టమొదటిసారిగా పలు కొండకాల్వలు పొంగిపొర్లాయి. కొండలపై అధికంగా వర్షం కురవడంతో గుబ్బల మంగమ్మ గుడి పై నుంచి వరదనీరు భారీగా బుసలు కొడుతూ ప్రవహించింది. వాన పడుతున్నా ఆదివారం కావడంతో భక్తులు మంగమ్మతల్లి సన్నిధికి చేరుకున్నారు. అప్రమత్తమైన ఆలయ కమిటీవారు భక్తుల భద్రత దృష్ట్యా దర్శనానికి వెళ్లకుండా సుమారు 2 గంటలపాటు నిలిపివేశారు. అనంతరం వరద ఉధృతి తగ్గడంతో భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. పులిరాముడుగూడెం పరిసర ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురిసింది. -
వయ్యారిభామ ప్రమాదకారి
తాడేపల్లిగూడెం: పంటల్లో దిగుబడిని తగ్గించే, శ్వాసకోశ, చర్మ సంబంధ వ్యాధులకు కారణమయ్యే వయ్యారిభామ మొక్క ప్రమాదకరమని వెంకట్రామన్నగూడెం కేవీకేలో ఆదివారం రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కేవీకే సైంటిస్టు దేవీవరప్రసాదరెడ్డి అన్నారు. పార్ధీనియం మొక్కగా పిలిచే వయ్యారిభామ మొక్క వేగంగా వ్యాప్తి చెందుతూ పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా , మనుషులు. పశువుల్లో అలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు కలిగే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పార్ధీనియం విత్తనాలు విస్తృతంగా వ్యాప్తి చెంది భవిష్యత్‌లో కలుపు నియంత్రణ మరింత కష్ట తరమవుతుందన్నారు. ఈ మొక్కలను చిన్నదశలోనే పీకేయడం, పుష్పించే ముందు తొలగించడం, కలుపు నివారణ చర్యలు తీసుకోవడం, పొలాలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. సీనియర్ శాస్త్రవేత్త దేవీవరప్రసాదరెడ్డి -
క్షేమంగా ఇంటికి చేరిన విద్యార్థులు
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెంలో రెండు రోజుల క్రితం వాటర్ ట్యాంక్‌లో నీళ్లు తాగి అస్వస్థతకు గురైన 12 మంది విద్యార్థులు ఆసుపత్రిలో వైద్యం పొందుతూ కొలుకుని ఆదివారం క్షేమంగా ఇంటికి చేరినట్లు కార్యదర్శి సున్నం కృష్ణ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కై కలూరు: ప్రసిద్ధి చెందిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, చిన్న, పెద్ద తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.72,822 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
కూటమి సిఫార్సులు.. ఆగని అక్రమ నిర్మాణాలు
భీమవరం(ప్రకాశం చౌక్): ‘వడ్డించేవాడు మనవాడైతే చివర కూర్చున్నా అన్నీ వస్తాయి’ అన్న సామెత భీమవరం పట్టణంలో అక్రమ భవనాల నిర్మాణాల విషయంలో అక్షరాలా నిజమవుతోంది. స్థానిక టౌన్ ప్లానింగ్ విభాగాన్ని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు తమ గుప్పిట్లో ఉంచుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవన నిర్మాణాలు చేపట్టేవారు అధికారులను కలవాల్సిన పనిలేకుండా, నేరుగా కూటమి నాయకులను కలిసి ఒప్పందాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ‘ప్లాన్లు’.. రూల్స్‌కు తిలోదకాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మున్సిపల్ ఫీజులు, టౌన్ ప్లానింగ్ అనుమతులతో పనిలేకుండా నాయకులకు నజరానాలు చెల్లిస్తే చాలు.. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు సాగిపోతున్నాయి. ఎలాంటి ప్లాన్ లేకుండానే నాలుగు, ఐదు అంతస్తుల భవనాలను నిర్మించి వాణిజ్య సంస్థలకు అద్దెలకు ఇస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడుతూ, నాయకుల జేబులు నిండుతున్నాయి. పరిధుల వారీగా పంపకాలు వన్‌టౌన్, టూటౌన్ పరిధిలోని ప్రధాన ప్రాంతాలను ముగ్గురు భాగస్వామ్య పక్షాల నాయకులు పంచుకున్నట్లు సమాచారం. గడిచిన రెండేళ్లలో దాదాపు 10 నుంచి 15 వరకు అక్రమ భవనాలు, అదనపు అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. టూటౌన్లో నూతనంగా వెలిసిన ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, అలాగే వన్‌టౌన్‌లో మున్సిపల్ కార్యాలయ సమీపంలోని నిర్మాణాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. నిబంధనల ప్రకారం రోడ్డు మార్గానికి వదలాల్సిన సెట్ బ్యాక్ ఖాళీ స్థలాన్ని సైతం వదలకుండా నిర్మిస్తుండటంతో, వాహనాల పార్కింగ్ రోడ్లపైనే జరిగి తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు చర్యలకు సిద్ధమయ్యే అధికారులకు కూటమి ప్రజాప్రతినిధుల హెచ్చరికలు, సిఫార్సులు అడ్డుగా మారుతున్నాయి. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం నోటీసుల జారీకే పరిమితమవుతున్నారు. మున్సిపల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు టౌన్ ప్లానింగ్ అధికారులను ఉద్దేశించి ‘మీకు వసూళ్లు ఎక్కువయ్యాయి, సీబీఐకి పట్టిస్తా’ అని హెచ్చరించారు. అలాగే ఎంపీ శ్రీనివాసవర్మ కూడా బీజేపీకి చెందిన ఓ నాయకుడి భవనం విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులను హెచ్చరించడం గమనార్హం. ప్రజాప్రతినిధులే ఇలా ఉంటే అధికారులు ఎలా పనిచేస్తారని, ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అంతస్తులకు అడ్డే లేదు నేతల చేతుల్లో ‘టౌన్ ప్లానింగ్’ వీరు చెబితే చాలు బిల్డింగ్ ప్లాన్ అక్కర్లేదు! ప్రతి భవనం వెనుకా ఒక్కో నేత నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు నోటీసులకు పరిమితమవుతున్న అధికారులు -
షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులకు ముడుపులు!
● నలుగురి నుంచి రూ.40 లక్షల వసూలు ● ఆరోపణలతో నిలిచిన నియామక ప్రక్రియ ● డిప్యుటేషన్‌తో నెట్టుకొస్తున్న వైనం ● చర్చనీయాంశంగా సొమ్ముల వసూలు లోసరిలో విద్యుత్ సబ్‌స్టేషన్ భీమవరం: భీమవరం నియోజకవర్గంలో కూటమి పాలనలో అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల కోసం భారీగా డబ్బు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. నిధులు పంపిణీలో తేడాల కారణంగా నియామకాల్లో జాప్యం జరగడంతో, ప్రస్తుతం వేరే సబ్స్టేషన్ల సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించి నెట్టుకొస్తున్నారు. సబ్స్టేషన్ల ఏర్పాటు : భీమవరం రూరల్ మండలం లోసరి గ్రామం పరిసరాల్లో లో ఓల్టేజీ సమస్యతో ప్రజలు, ముఖ్యంగా ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ లేకపోవడంతో విద్యార్థులు సైతం అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి గత జగన్ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తదనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీని నిర్మాణానికి సుమారు రూ.3.80 కోట్లు మంజూరు చేసింది. ఈ సబ్‌స్టేషన్ ద్వారా పరిసరాల్లోని 16 గ్రా మాలకు లో ఓల్టేజీ సమస్య తీరనుంది. నియామకాల్లో అవకతవకలు.. ఆరోపణలు సబ్‌స్టేషన్ నిర్వహణను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఆ ఆపరేటర్ల నియామకం కాంట్రాక్టరే చే యాల్సి ఉండగా, పోస్టులకు డిమాండ్ పెరగడంతో రాజకీయ సిఫార్సులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధి నలుగురు షిఫ్ట్ ఆపరేటర్ పో స్టుల భర్తీ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. అయితే, కాంట్రాక్టర్‌కు తెలియకుండా ఈ వసూళ్లు జరగడంతో నియామక ప్ర క్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం సబ్‌స్టేషన్ ప్రారంభమైనా వేరే ప్రాంతాల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై రప్పించి పనులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో పోస్టింగ్‌లు, నామినేటెడ్ పదవుల పేరుతో పెద్దఎత్తున వసూళ్లు జరుగుతున్నాయనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. -
పశు వైద్యం.. పూజ్యం
తణుకు అర్బన్: అనుభవజ్ఞులైన వైద్యులతో మూగజీవాలకు విశిష్ట సేవలందిస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన తణుకు పశు వైద్యశాల ప్రస్తుతం తీవ్ర సమస్యలతో కునారిల్లుతోంది. నిత్యం 80 ఓపీ, నెలకు 90 శస్త్రచికిత్సలు, 500 వరకు రక్తపరీక్షలు నిర్వహించే ఈ ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి సరైన నిధుల కేటాయింపులు లేవు. బడ్జెట్ 30 శాతానికి మించి లేకపోవడంతో దూది (కాటన్), సిరంజీలు, బ్లడ్ టెస్టింగ్ కిట్లు వంటి ప్రాథమిక వైద్య పరికరాలు కూడా కరువయ్యాయి. శస్త్రచికిత్సలకు అవసరమయ్యే గ్యాస్ మత్తుమెషీన్ అందుబాటులో లేకపోవడం తీవ్ర లోపంగా మారింది. మందులను ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల కొరత మరోవైపు ఆసుపత్రిని వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల్లో ఇద్దరు ఉన్నప్పటికీ, ముగ్గురు పశువైద్యు లకు గాను ఒక్కరే పనిచేస్తున్నారు. ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్లు, నలుగురు ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ ఒక్కరే అందుబాటులో ఉన్నారు. తీవ్ర పనిఒత్తిడి కారణంగా ఇక్కడికి బదిలీపై వచ్చేందుకు సిబ్బంది వెనుకాడుతుండగా, హౌస్ సర్జన్ల సాయంతోనే సేవలు అందిస్తున్నారు. ప్రసవ సమస్యలు, ఆర్థోపెడిక్ సర్జరీలు, కుక్కలకు చేసే సంక్లిష్ట శస్త్రచికిత్సల్లో ఈ వైద్యశాల ఎంతో పేరుగాంచింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని, పో స్టులను భర్తీ చేసి ఉచిత మందులు అందుబాటులోకి తేలాలని పాడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తణుకు వైద్యశాఖలో దూదీకి దిక్కులేదు గతమెంతో ఘనం.. ప్రస్తుతం నిర్వీర్యం వైద్యులు, సిబ్బంది కొరత -
●పాహిమాం.. రక్షమాం
శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మెంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరీ దేవిని సుమారు 50 వేల గాజులతో అలంకరించారు. ముందుగా ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, లలిత సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం పట్టణానికి చెందిన పుప్పాల మల్లేశ్వరరావు, నాగమణి దంపతులు, భక్తుల సహకారంతో పూజ కార్యక్రమాలను చేసి, 30 వేల గాజులతో మూల విరాట్ అమ్మవారి విగ్రహానికి, 20 వేల గాజులతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరణ చేశారు. – భీమవరం (ప్రకాశంచౌక్) -
మెగా డీఎస్సీకి మంగళం?
● మళ్లీ తెరపైకి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు ● ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 143 పోస్టుల భర్తీకి సన్నాహాలు నిడమర్రు: మెగా డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. దీనికి స్పందనగా, నిరుద్యోగ ఉపాధ్యాయులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం అక్టోబర్‌లో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. మరోవైపు, పాఠశాలల్లో ఖాళీల భర్తీకి గతంలో అమలైన విద్యా వలంటీర్ల తరహాలోనే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 143 పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 143 పోస్టులు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో 6,534 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అవసరముందని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో ఉమ్మడి పశ్చిమ జిల్లాకు 143 పోస్టులు కేటాయించారు. ఏలూరు జిల్లాలో 11 స్కూల్ అసిస్టెంట్, 32 ఎస్జీటీ పోస్టులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 స్కూల్ అసిస్టెంట్, 92 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద (తాత్కాలిక) ప్రాతిపదికన మాత్రమే చేపట్టనున్నారు. అరకొర గౌరవ వేతనంతో తీవ్ర నిరాశ ప్రభుత్వం నిర్ణయించిన గౌరవ వేతనాలు అతి తక్కువగా ఉన్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్జీటీలకు రూ.10,000, స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500 మాత్రమే చెల్లించనున్నారు. ఎంపికై న వారు సెప్టెంబర్ 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఈ నియామకాలు కేవలం 2026–27 విద్యాసంవత్సరం ముగిసే వరకు (ఏప్రిల్ 30 వరకు, అనగా 8 నెలలు) మాత్రమే వర్తిస్తాయి. తాత్కాలిక నియామకాలు చేపట్టడంతో ఈ ఏడాది కూడా డీఎస్సీ ఉండే అవకాశం లేనట్లేనని అభ్యర్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంపిక విధానం ఇలా.. రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపడతారు. అకడమిక్ అర్హతలకు 75 శాతం వెయిటేజీ, వృత్తిపరమైన అర్హతలకు (బీఈడీ/డీఈడీ/టెట్) 25% వెయిటేజీ ఇస్తారు. స్థానిక గ్రామం/మండలానికి చెందిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ టెట్ అర్హత ఉన్నవారు అందుబాటులో లేకపోతే ఇతర అర్హతలు ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు. రేపటి నుంచే దరఖాస్తులు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు ఆయా మండల ఎంఈఓ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. అందిన దరఖాస్తులను పరిశీలించి, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ ఈ నెల 29న ఎంపిక జాబితాను ఖరారు చేస్తుంది. ఆగస్టు 30, 31 తేదీల్లో నియామక పత్రాలు అందజేస్తారు. ఎంపికై న వారు సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించాలి. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని వివిధ మండలాల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టుల్లో నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 11 సెకండరీ గ్రేడ్ టీచర్, 32 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వివిధ సబ్జెక్టులల వారీగా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు తమ మండలాల పరిధిలోని మండల విద్యాశాఖాధికారులకు ఈ నెల 21లోపు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలని సూచించారు. దరఖాస్తు నమూనా, అర్హతలు వంటి అంశాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. కనీస వేతన చట్టం ప్రకారం అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు గౌరవ వేతనం అందించాలి. సమగ్ర శిక్షలోని సీఆర్సీలు, ఎమ్మైఎస్లు, పార్ట్‌టైమ్ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే కనీసం రూ.23,500 చెల్లిస్తేనే నిరుద్యోగులు బోధనపై పూర్తి దృష్టి సారించగలరు. – బొర్రా గోపీమూర్తి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీబీఈడీ, టీటీసీ పూర్తి చేసి ఏపీ టెట్‌లో అర్హత సాధించిన వారికి రూ.10 వేలు, రూ.12,500 ఇవ్వడం దారుణం. అంత తక్కువ వేతనంతో అభ్యర్థులు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా బీఈడీ అభ్యర్థులకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం ఇస్తున్నారు. – కొరపాటి దివ్య, గోపీనాథపట్నం -
లారీ ఢీకొని నవ వరుడు మృతి
నరసాపురం రూరల్ : లారీ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ నవ వరుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారతిప్ప గ్రామానికి చెందిన స్థానిక నాయకుడు దొంగ శ్రీను కుమారుడు దొంగ విఘ్నేష్ (28) గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై ముత్యాలపల్లి వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టింది. లారీ చక్రాలు అతని పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని నరసాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతునికి రెండు నెలల క్రితమే వివాహమైందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వాసు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్రమణదారుల నుంచి ప్రాణహాని
తాడేపల్లిగూడెం: తమ పూర్వీకుల భూమిని కొందరు ఆక్రమించుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, దీనిపై తాము హైకోర్టులో పోరాడుతున్నామని దామోజీపురపు వంశీకులు తెలిపారు. ఈ క్రమంలో ఆక్రమణదారుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దామోజీపురపు ముఖ్యప్రాణారావు మనుమడు, ఇతర వారసులు మాట్లాడారు. తమ ముత్తాతలు 1916లో రైస్ మిల్లు నిర్వహణ కోసం 5.08 సెంట్ల భూమిని ఇద్దరు వ్యక్తులకు లీజుకిచ్చారని తెలిపారు. కాలక్రమంలో ఆ లీజు ఇతరుల చేతులు మారిందని, అయితే కొందరు బినామీలు కొన్ని సంవత్సరాలుగా లీజు సొమ్ము చెల్లించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి సన్నిహితుడైన మైలవరపు పెదబాబుకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చామన్నారు. అయినప్పటికీ ఆ ఆస్తి తనదేనంటూ పవన్ కుమార్ గుప్తా అనే వ్యక్తి 23 అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని మండిపడ్డారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించిందని తెలిపారు. అయితే ఆక్రమణదారులతో అధికారులు చేతులు కలిపి ఆ స్టేను రద్దు చేయించారని ఆరోపించారు. భూమిని కాపాడుకునే క్రమంలో పట్టణానికి చెందిన కొందరి నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
గజలక్ష్మిగా మావుళ్లమ్మ
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉత్సవమూర్తికి గజలక్ష్మి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెద్ద ఎత్తున గాజుల అలంకరణ చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు తెలిపారు. నరసాపురం: ప్రభుత్వ ఆహార సరఫరాకు సంబంధించి నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన నరసాపురంలో పర్యటించారు. పట్టణం, మండలంలోని పలు రేషన్ దుకాణాలు, ఏఎంసీ గోడౌన్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఏఎంసీ స్టాక్ పాయింట్ నుంచి సరఫరా అవుతున్న సరుకుల కొలతల్లో తేడాలుంటున్నాయని రేషన్ డీలర్లు ఫిర్యాదు చేయడంతో చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్ డీటీకి మెమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్లు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. నరసాపురం, ఎల్బీచర్ల గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. అందిస్తున్న ఆహారంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని లెనిన్ మున్సిపల్ స్కూల్లో బోధనా పద్ధతులు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లపై హెచ్ఎం కృషిని అభినందించారు. భీమవరం: పట్టణంలోని డీఎన్నార్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో శుక్రవారం నిర్వహించిన టెట్ పరీక్షలకు 43 మంది గైర్హాజరయ్యారని డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్ తెలిపారు. 451 మందికిగాను 408 మంది హాజరయ్యారని చెప్పారు. 318 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన టెట్ పరీక్షలకు 318 మంది హాజరయ్యారు. ఉదయం 175 మందికి 162 మంది, మధ్యాహ్నం 174 మందికి 156 మంది హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కేంద్రాలను తనిఖీ చేసిందని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. భీమవరం అర్బన్: ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని జేసీ కేఆర్ కల్పశ్రీ ఆదేశించారు. గొల్లవానితిప్ప పంచాయతీ గొందిలో సర్కార్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్‌కు సంబంధించిన లే అవుట్‌ను శుక్రవారం ఆమె పరిశీలించారు. హౌసింగ్, రెవెన్యూ అధికారులు 21 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి గుర్తించారు. లబ్ధిదారులను జేసీ కలిసి వారితో మాట్లాడారు. భూముల రికార్డులను పరిశీలించి అర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, సర్వేయర్ ప్రవీణ్, వీఆర్వో పుల్లయ్య ఉన్నారు. పోలవరం రూరల్: గోదావరి వరద మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదిలోకి నీరు చేరడంతో ప్రవాహం పెరిగింది. వారం రోజులుగా వరద తగ్గుతూ పెరుగుతూ నిలకడగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 28 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 2.28 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. -
రూ.53.5 కోట్లు.. 214 హెల్త్ క్లినిక్‌లు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసే నాటికి పంచాయతీల్లో సెక్రటరీ, బిల్ కలెక్టర్, అటెండర్ మాత్రమే ఉండేవారు. పనుల నిమిత్తం ప్రజలు వ్యయప్రయాసల కోర్చి మండల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. వారి వెతలకు తెరదించుతూ సచివాలయ వ్యవస్థను తెచ్చారు. జిల్లాలో 535 సచివాలయాలను ఏర్పాటుచేశారు. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్, ఉద్యాన అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులను నియమించించి 35 ప్రభుత్వ శాఖలకు చెందిన 500లకు పైగా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలో ఐదు వేలకు పైగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. రూ.141.2 కోట్లతో 353 సచివాలయాలకు సొంత భవనాల కోసం పనులు చేపట్టారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ఏ సర్వీస్ చార్జీ లేకుండానే 6,05,780 మందికి కుల ధ్రువీకరణ, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర సర్టిఫికెట్లు అందజేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆధునిక వసతులతో హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేసింది. వైద్యుని గది, ల్యాబ్, స్థానికంగా వైద్య సిబ్బంది నివాసం ఉండేందుకు, ఇతర వసతులతో వీటి నిర్మాణం చేసింది. రూ.53.5 కోట్లతో 214 భవనాలకు పనులు చేపట్టి 96 భవనాలను వినియోగంలోకి తెచ్చింది. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కింద స్పెషలిస్ట్ వైద్యులతో విలేజ్ క్లినిక్‌లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యశిబిరాలు నిర్వహించేవారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి 15 లక్షల మందికి పైగా రోగులకు వైద్యసేవలందించారు. ఆరోగ్యశ్రీలో రూ.5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు, 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 3,257కు పెంచారు. 535 సచివాలయాలు..5 వేలకు పైగా ఉద్యోగాలు -
మతిస్థిమితం లేని బాలుడి అప్పగింత
నూజివీడు: మతిస్థిమితం లేక ఇల్లు దాటి వెళ్ళిన తొమ్మిదేళ్ల బాలుడిని పోలీసులు సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని ఢమ్‌ఢమ్ గార్డెన్ ప్రాంతానికి చెందిన షేక్ ఫాతిమా కొడుకు షేక్ అబ్దుల్ సలీమ్ (9) మతిస్థిమితం లేక అజరయ్యపేట నుంచి రేగుంట వైపు వెళ్లాడు. గమనించిన రేగుంట గ్రామస్తులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ ఎస్సై జ్యోతీబసు సిబ్బందిని పంపి బాలుడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. చిన్నారి తమ తల్లిదండ్రుల వివరాలు చెప్పలేకపోవడంతో పోలీసులు ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న తల్లి ఫాతిమా సీఐ కార్యాలయానికి చేరుకోగా, సీఐ ఐవీ నాగేంద్రకుమార్, ఎస్సై జ్యోతీబసులు బాలుడిని ఆమెకు అప్పగించారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ ఏలూరు పరిధిలోని వినియోగదారులకు పలు ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు అందిస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ సీవీ రామరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆఫర్ల వివరాలను ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్లు సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కొత్త ఫైబర్ కనెక్షన్లకు ఏర్పాటు రుసుము లేకుండా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. భీమవరం: పార్సిళ్లు పంపేందుకు పోస్టల్ శాఖ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు డివిజినల్ సీనియర్ సూపరింటెండెంట్ కె.హరికృష్ణప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమీపంలోని పోస్టాఫీసుల ద్వారా విదేశాల్లోని బంధువులు, స్నేహితులకు విభిన్న వస్తువులను పంపుకోవచ్చని పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్ మెయిల్ సర్వీస్ ద్వారా డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ ద్వారా తక్కువ బరువున్న బహుమతులు పంపవచ్చని వివరించారు. అలాగే ఎక్కువ బరువున్న పార్సిళ్లను ఎయిర్ పార్సిల్ సర్వీస్ ద్వారా పంపుకునే సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
స్వరాజ్య బాట.. సంక్షేమ బావుటా
వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమ వైభవం మహాత్ముని బాటలో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ వ్యవస్థలతో పాలనను పల్లెకు తెచ్చింది. సంక్షేమ ఫలాలు, వైద్యసేవలను చెంతకు చేర్చింది. నాడు–నేడుతో ప్రభుత్వ బడులకు జీవం పోసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేళ జగన్ సర్కారు సాధించిన గ్రామ స్వరాజ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి, భీమవరంశనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లలు 1,320 వరకు ఉన్నాయి. 2019 నాటికి శిథిల భవనాలు, పెచ్చులు ఊడే పైకప్పులు, రాళ్లు పైకిలేచిన ఫ్లోరింగులు, కలుషిత తాగునీరు, దుర్గంధం వెదజల్లే టాయిలెట్లతో అధ్వాన స్థితికి చేరిన ప్రభుత్వ బడులకు జగన్ కొత్త ఊపిరిలూదారు. 1,150 పాఠశాలల్లో రూ.369.11 కోట్లు వ్యయంతో డిజిటల్ క్లాస్రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్స్, కిచెన్షెడ్లు, ప్రహరీ గోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుదీకరణ, మేజర్, మైనర్ మరమ్మతులతో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదని అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టి ఐదేళ్లలో 1,48,342 మంది తల్లుల ఖాతాలకు రూ. 887.9 కోట్లు జమచేశారు. పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేందుకు తరగతి గదుల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐపీపీ), స్మార్ట్ టీవీలు అందజేశారు. 28,143 మంది 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన రూ.30 వేల విలువైన ట్యాబ్‌లు అందజేశారు. ఆకర్షణీయ మెనూతో రోజుకో కొత్త రుచిని అందిస్తూ జగనన్న గోరుముద్ద పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా ఉన్నత విద్యకు ఊతమిచ్చారు. ఇలా ఐదేళ్లలో జగనన్న విద్యాదీవెన పథకం కింద 1,77,996 మంది విద్యార్థులకు రూ.485.33 కోట్ల సాయం అందించగా వసతి దీవెన పథకం కింద 1,76,142 మంది విద్యార్థులకు రూ.163.41 కోట్లు అందించారు. అన్నదాతల అవస్థలకు చెక్ పెడుతూ ఆర్బీకేల ద్వారా సాగులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విత్తు నుంచి పంట ఉత్పత్తులు విక్రయం వరకు ఇవి అన్నదాతలకు అడుగడుడునా అండయ్యాయి. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, విపత్తుల సమయంలో ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో రూ.65 కోట్ల వ్యయంతో 298 భవన నిర్మాణాలు చేపట్టి 211 భవనాలు వినియోగంలో తెచ్చారు. రూ.65 కోట్లు.. 298 ఆర్బీకే భవనాలు 28,143 మందికి ట్యాబ్‌లు.. సుమారు 3.54 లక్షల మందికి ‘దీవెనలు’ రూ.369 కోట్లు.. 1,150 పాఠశాలలు పాలనను పల్లెకు చేర్చిన ఘనత గ్రామంలోనే అన్నిరకాల సేవలు మినీ కలెక్టరేట్‌గా సచివాలయాలు ఆర్బీకేలతో అన్నదాతలకు భరోసా చెంతకే వచ్చి వైద్యం ప్రభుత్వ బడులకు జీవం పోసిన నాడు–నేడు -
వృద్ధుడిపై యువకుడి దాడి
భీమవరం: బైక్‌కు అడ్డువచ్చాడనే నెపంతో ఒక యువకుడు జరిపిన దాడిలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన భీమవరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అత్తిలిలో పొగాకు వ్యాపారం ముగించుకుని పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి వెళ్లేందుకు వి. ప్రకాశరావు (60) శుక్రవారం భీమవరం బస్టాండు వద్ద రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్ ఎం.రత్నకుమార్ బైక్‌పై వెళ్తూ, తన వాహనానికి అడ్డువచ్చాడని ప్రకాశరావుతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో రత్నకుమార్ తోసివేయడంతో ప్రకాశరావు కిందపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సీఐ ఎ.రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉండి: పరిచయస్తురాలైన మహిళ వివరాలు చెప్పకపోవడంతో ఆమె కుటుంబసభ్యులపై ఓ వ్యక్తి దాడికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి నిమ్మనపేటకు చెందిన దువ్వి సూరిబాబుకు గ్రామ శివారు రామాపురానికి చెందిన ఏసు కుమార్తెతో పరిచయం ఉంది. అయితే కొంతకాలంగా ఆమె కనిపించకపోవడంతో ఈనెల 12న రాత్రి సూరిబాబు ఏసు ఇంటికి వెళ్లాడు. సదరు మహిళ కోసం ఆరా తీయగా ఏసు ఏమీ చెప్పకపోవడంతో ఆగ్రహించి పదునైన ఆయుధంతో ఏసుపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన ఏసు భార్య, మనుమరాలిపైనా దాడికి తెగబడ్డాడు. గాయాలపాలైన వారంతా భీమవరం ప్రభుత్వాస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్సై హెచ్. మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టి.నరసాపురం: టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం గుడ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కె.జగ్గవరం గ్రామానికి చెందిన బర్రె ముత్తయ్య (53) మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా గుడ్లపల్లి వద్దకు రాగానే టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముత్తయ్య రెండు కాళ్లు తీవ్రంగా నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న టి.నరసాపురం ఎస్సై ఎం.జయబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. దెందులూరు: గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురై గోరిపర్తి నాంచారమ్మ (70) అనే వృద్ధురాలు శుక్రవారం మృతి చెందింది. భర్త, కుమారుడు ఇదివరకే మరణించడంతో ఆమె కోడలు, మనవడితో కలిసి నివాసం ఉంటుంది. శుక్రవారం మంచినీళ్ల మోటార్ స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న ఏఎస్సై వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యలమంచిలి: చించినాడ వద్ద వశిష్ట గోదావరి వంతెనపై నుంచి దూకి పెచ్చెట్టి దేవీస్మిత (23) అనే వివాహిత శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. దేవీస్మిత నదిలో దూకగా గమనించిన మత్స్యకారులు ఆమెను రక్షించి రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలే ఈ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. -
సుబ్బారాయుడి హుండీల ఆదాయం లెక్కింపు
ముదినేపల్లి(కై కలూరు): జిల్లాలో ప్రసిద్ధి చెందిన శింగరాయపాలెం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో గత 140 రోజులకు చెందిన హుండీ కానుకలను ఏలూరు జిల్లా సహాయ కమిషనర్ కూచిపూడి శ్రీనివాసు ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. ఆలయ హుండీల ద్వారా రూ. 16,12,494, అన్నదాన హుండీల ద్వారా రూ. 1,26,857 కలిపి మొత్తం రూ. 17,39,351 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగా శ్రీదేవి తెలిపారు. వీటితో పాటు 15 గ్రాముల బంగారం, 420 గ్రాముల వెండిని భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, పాలకమండలి సభ్యులు నీలం శివరమేష్, పరస కృష్ణ, బూరుబోయిన సోవమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణం వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి
పెనుగొండ: గ్రామంలోని ఓ మద్యం దుకాణం వద్ద శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అధికంగా మద్యం సేవించడం వల్ల మృతి చెందాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నీలం రంగు పొడుగు చేతుల చొక్కా, పచ్చ రంగు పువ్వుల లుంగీ ధరించి ఉన్నాడు. ప్రాథమిక విచారణలో అతను పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవించే వ్యక్తిగా గుర్తించినట్లు ఎస్సై కె.గంగాధర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని వివరించారు. నరసాపురం రూరల్: సత్యం చారిటబుల్ ట్రస్ట్‌లో రూ. 10 వేలు పెట్టుబడి పెడితే స్వల్పకాలంలోనే రూ. లక్ష ఇస్తామని నమ్మబలికి సుమారు 48 మందిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని యర్రంశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన కూనపరెడ్డి రామచంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన రామచంద్రరావుతో పాటు మరో 47 మంది నుంచి ఇలాగే డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు గుర్తించారు. ఎల్బీచర్ల గ్రామానికి చెందిన చిగురుపాటి వెంకట్రాజు ఈ మోసానికి పాల్పడినట్లు ఎస్సై వాసు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జనసేన నేతల నుంచి ప్రాణహాని
తాడేపల్లిగూడెం: జనసేన సానుభూతిపరులైన ముగ్గురు వ్యక్తుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని రిషిరాజ్, పదంకుమార్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, 120 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న ఆస్తులపై హైకోర్టు స్టే ఉన్నప్పటికీ మారం వెంకటేశ్వరరావు, మైలవరపు పెదబాబు, పైబోయిన కిరణ్‌కుమార్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా రిజిస్ట్రార్ సంయుక్తంగా ఆ అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారని రిషిరాజ్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్ రద్దు చేయించడంతో సదరు వ్యక్తులు రౌడీలను తీసుకొచ్చి బెదిరిస్తున్నారని, చంపేస్తామని హెచ్చరిస్తున్నారని వాపోయారు. ఈ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ బోణం ఆదిప్రసాద్ తెలిపారు. గతంలో కొందరు తమ ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు. తమకు వన్‌ప్లస్ ఫోర్ ఆర్మ్డ్ ఫోర్సు కావాలని వారు కోరారని, అయితే అది ఏర్పాటు చేయడం తమ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు. -
మావుళ్లమ్మ ఆలయంలో చండీహోమం
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు వేదపండితులు చండీహోమం నిర్వహించారు. 80 మంది దంపతులు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపొలు ఏడుకొండలు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో ఎంతో మేలని, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 13 వాహనాలను బుధవారం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు బుధవారం సమస్యలపై ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో ప్రభాకరరావుకు వినతిపత్రం అందచేశారు. వీఆర్ఏల ధర్నాలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తూ ఈనెల 19న చేపట్టిన చలో సీసీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. వీఆర్ఏల అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.జక్కరయ్య, పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ వీఆర్ఏలు అనేక సమస్యలతో సతమతమవుతూ రెవెన్యూ శాఖకు క్షేత్ర స్థాయిలో సేవలందిస్తున్నారన్నారు. ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 19న చేపట్టే చలో సీసీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వీఆర్ఏలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. భీమడోలు: శిథిలావస్థలో ఇరిగేషన్ కార్యాలయం శీర్షికన గత నెల 18న సాక్షిలో ప్రచురితమైన కథనానికి గుండుగొలను సెక్షన్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఎట్టకేలకు ఇరిగేషన్ కార్యాలయానికి మరమ్మతులు చేయాలన్న ఉద్దేశ్యంతో పనులు చేపట్టారు. స్లాబ్ లికేజీ కాకుండా సిమెంట్‌తో నిర్మాణ పనులు చేపట్టారు. గుండుగొలను సెక్షన్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గంథం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. బుట్టాయగూడెం: ఐటీడీఏ అధికారుల ప్రమేయం లేకుండానే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతిగృహాల్లో కమాటి, కుక్, శానిటేషన్ వర్కర్ల పోస్టులను భర్తీ చేసినట్లు తెలుస్తుంది. సంబంధిత ఐటీడీఏ పరిధిలోని అధికారులకు కూడా కనీస సమాచారం లేకుండా ఏకపక్షంగా అభ్యర్థులను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఎంపిక చేసి నియమించడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. -
62 వేల పదాలతో రూపొందిస్తున్నాం
టీసీఆర్, టీఎం శాఖల ఆధ్వర్యంలో సుమారు 62 వేల తెలుగు పదాలను తీసుకుని వాటిని కోయభాషలోకి అనువాదం చేస్తున్నాం. సుమారు నెల రోజుల పాటు విశాఖపట్నం, కేఆర్‌పురం ఐటీడీఏలో ఈ ప్రక్రియను పూర్తి చేశాం. కోయ భాషలో రూపొందించిన పదాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేస్తున్నాం. త్వరలోనే ఆదివాణీ యాప్‌లో కోయ భాష మాటలను వినబోతున్నాం. – నూపా నాగేశ్వరరావు, గిరిజన భాష రూపకల్పన ఉపాధ్యాయుడు, కేఆర్‌పురం ఆదివాణీ యాప్‌లో గిరిజన భాష అనువాదాలను అందించనున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ ఏ భాషలో కంటెంట్ ఇచ్చినా అది తమ కోరుకున్న గిరిజన భాషలోకి మారుతుంది. ఈ యాప్ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో గిరిజన భాషను రూపొందించడానికి మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నెల రోజులపాటు పనిచేసి ఈ ప్రక్రియను పూర్తి చేశాం. – మడకం పోశమ్మ ఉపాధ్యాయురాలు, కె. పండుగూడెం, జీలుగుమిల్లి మండలం గిరిజన భాషలను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ఆదివాణీ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సంతాలీ, భిలీ, ముండారి, గొండి భాషలు అనువాదానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. త్వరలోనే కోయ భాష కూడా ఈ యాప్‌లో అందుబాటులోకి రానుంది. ఆదివాణీ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. – కుంజా కన్నపరాజు, కోయ భాషా వలంటీర్ గాడిదబోరు, బుట్టాయగూడెం మండలం -
కక్షపూరితంగా ఇళ్లు కూలగొట్టారు
అయితంపూడి మాజీ సర్పంచ్ ఉప్పులూరి లావణ్య తణుకు అర్బన్: ఎమ్మెల్యే రాజకీయ కక్షతోనే తన ఇల్లు కూల్చివేశారని అయితంపూడి మాజీ సర్పంచ్ ఉప్పులూరి లావణ్య ఆరోపించారు. తణుకు అర్బన్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల ఆమె మాట్లాడుతూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. గత 15 ఏళ్లుగా సర్పంచ్‌గా సేవలందిస్తూ గ్రామస్థుల అవసరాలు తీర్చామని, జగన్ ప్రభుత్వ హయాంలో 80 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. ఆ భూమి కొనుగోళ్లలో రూ. 11 లక్షల సొంత నిధులు కూడా వెచ్చించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే తమపై వేధింపులు మొదలయ్యాయని, ఎమ్మెల్యే తమను రాజకీయ కక్షతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అయితంపూడి మెయిన్ రోడ్డు పనులను అడ్డుకోవడంతో పాటు, తమ ఇంటికి స్పీడ్ బ్రేకర్లు వేశారని, వాటిని హైకోర్టు ద్వారా తొలగించుకున్నామని చెప్పారు. తీరా ఈనెల 11వ తేదీ తెల్లవారుజామున నోటీసులు ఇవ్వకుండా, 50 ఏళ్లుగా ఉంటున్న తమ ఇల్లు రోడ్డులో ఉందంటూ జేసీబీలతో కూల్చివేశారని వాపోయారు. అదే రోజు ఉదయం కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చినప్పటికీ, కుట్రపూరితంగా 300 మంది పోలీసులను మోహరించి మరీ ఇల్లు పడగొట్టించారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆరోపణలు అవాస్తవం మహిళా సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించిన తనపై ఎమ్మెల్యే అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కోసం ప్రజల నుంచి రూ. 30 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేశారనడంలో ఎలాంటి నిజం లేదని, లబ్ధిదారులు ఈ ఆరోపణను సమర్థిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ ఆరోపణలు అవాస్తవమని తేలితే ఎమ్మెల్యే ఏం చేస్తారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అసైన్డ్ భూమి ఆక్రమణ ఆరోపణలపై స్పందిస్తూ, అప్పటికే టీడీపీ నాయకుడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఆ భూమిని తాము మూడో రిజిస్ట్రేషన్ కింద కొనుగోలు చేశామని వివరించారు. పంచాయతీ కార్మికులు, ఇతర అవసరాల నిమిత్తం మంజూరైన సుమారు రూ.7.35 లక్షల వేతనాలు, అభివృద్ధి నిధులను కూడా ఇవ్వొద్దని శాసనసభ్యులే ఆదేశించారని లావణ్య తెలిపారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి స్వయంగా ఈ ఏడాది మార్చి 2వ తేదీన జిల్లా గ్రామ పంచాయతీ అధికారికి రాతపూర్వకంగా తెలిపారని వెల్లడించారు. ఈ సమావేశంలో అయితంపూడి నుంచి వచ్చిన ఇళ్ల స్థలాల లబ్దిదారులు తాము స్థలాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ ఇరగవరం మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు మేడపాటి దినేష్‌రెడ్డి, లబ్దిదారులు పాల్గొన్నారు. -
శ్రీవారి క్షేత్రంపై అమావాస్య ఎఫెక్ట్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంపై బుధవారం అమావాస్య ప్రభావం కనిపించింది. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ఆలయ ప్రాంగణం నామమాత్రంగా వచ్చిన భక్తులతో సందడి లేకుండా కనిపించింది. దర్శన క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, అనివెట్టి మండపాలు, ప్రసాదం టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు స్వల్ప సంఖ్యలో భక్తులు కనిపించారు. సాధారణ రోజులతో పోలిస్తే భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. మధ్యాహ్నం తర్వాత ఆలయ పరిసరాలు మరింత నిర్మానుష్యంగా మారాయి. భీమవరం: జిల్లాలో బుధవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 416 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ సోమవారం చెప్పారు. పరీక్షలకు 450 మంది హాజరుకావల్సివుండగా 416 మంది హాజరయ్యారని తెలిపారు. -
ఆదివాణి.. గిరిజన బాణీ
బుట్టాయగూడెం: గిరిజన భాషలను సంరక్షించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ ఏఐ అనువాద యాప్ ‘ఆదివాణీ’ని రూపొందించింది. ఇప్పటికే ఈ యాప్‌లో సంతాలీ(ఒడిశా), భిలీ(మధ్యప్రదేశ్), ముండారి(జార్ఖండ్), గొండి(ఛత్తీష్‌గఢ్) వంటి గిరిజన భాషలు ఉన్నాయి. ప్రస్తుతం కోయ, గారో భాషలను కూడా ఈ యాప్‌లో రూపొందించేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సాయం తీసుకుంటోంది. తెలుగు పదాలను గిరిజన భాషలోకి అనువాదం చేసేందుకు కృషి చేస్తున్నారు. 2021 నాటి జనగణన లెక్క ప్రకారం దేశంలో షెడ్యూల్ తెగలకు చెందిన వారు 461 భాషలు మాట్లాడతారు. వీటిలో 81 భాషలు దుస్థితిలో ఉన్నాయని, 42 భాషలు అంతరించి పోయే దశకు చేరుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన శ్రీఆదివాణిశ్రీ యాప్ ఆయా గిరిజన భాషల్లోని మాటల్ని హింది, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించేందుకు సహాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కోయ భాషను కూడా రాష్ట్ర గిరిజన పరిశోధనా సంస్థలు(టీసీఆర్), టీఎమ్, స్థానిక గిరిజన భాష నిపుణుల సహకారంతో డిజిటలేషన్ ప్రక్రియను రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆదివాణీ యాప్‌లో గిరిజన భాషను ఏఐ డిజిటలేషన్ చేసేందుకు సుమారు 62 వేల తెలుగు పదాలను తీసుకుని వాటిని కోయభాషలోకి అనుభవజ్ఞులైన సుమారు 20 మంది గిరిజన నిపుణులు, ఉపాధ్యాయులు, అనువాదం చేస్తున్నారు. దాంతోపాటు కంప్యూటర్లో ఎప్పటికప్పుడు ఆ పదాలను డిజిటైజేషన్ చేస్తున్నారు. లిపి లేని గిరిజన భాషను తెలుగు పదాల సాయంతో కోయ భారతి పేరు మీద గిరిజన విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. కోయ భాషలో అనువదించిన పదాలను డిజిటలైజేషన్ చేస్తున్న దృశ్యం కేఆర్‌పురం ఐటీడీఏలో తెలుగు పదాలను కోయ భాషలోకి అనువాదం చేస్తున్న ఉపాధ్యాయులు ఏఐతో పదిలం కానున్న గిరిజన మాట ఆదివాసీ గిరిజన భాష సంరక్షణకు బీటా వెర్షన్ లిపిలేని కోయ భాషకు 62 వేల తెలుగు పదాలు కోయ భాషలోకి ఏఐ సాంకేతికతతో అనువదిస్తున్న ఉపాధ్యాయులు -
మోగనున్నపెళ్లి బాజా
గురువారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి, భీమవరం: నెల రోజుల విరామం తర్వాత పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆషాఢ మాసం ముగిసి శ్రావణం రావడంతో శుభ ముహూర్తాలు వచ్చేశాయి. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు నేపథ్యంలో శుభకార్యాలు చక్కబెట్టుకునే పనిలో జనం చకచక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సీజన్లో జిల్లాలో ఐదు వేలకు పైగా జంటలు మూడుముళ్ల బంధంతో ఏకం కానుండగా పెళ్లి ఖర్చు రూ.వెయ్యి కోట్ల పైమాటే నని అంచనా. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి ఉండటంతో మార్కెట్లు రద్దీగా మారుతున్నాయి. జూలై 15వ తేదీన ఆషాఢ మాసం రాకతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. గురువారం నుంచి శ్రావణం మాసం మొదలైంది. ఈ నెల 15, 16, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28, 30, సెప్టెంబరు 2, 3, 4, 5, 6, 7 తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. సెప్టెంబరు 12 నుంచి శూన్యం మాసం ప్రారంభవుతుంది. తర్వాత కార్తీకమాసంలో ముహుర్తాలు ఉన్నాయంటున్నారు. జిల్లాలో పెళ్లి సందడి మొదలవడంతో నెలరోజులుగా ఖాళీగా ఉన్న ఫంక్షన్ హాళ్లు భాజా భజంత్రీలు, మేళతాళాలతో తిరిగి సందడిని సంతరించుకోనున్నాయి. అంతంతమాత్రంగా ఉన్న బంగారం, దుస్తులు, కిరాణా అమ్మకాలు జోరందుకుంటున్నాయి. జిల్లాలోని పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో 150 వరకు ఫంక్షన్ హాళ్లు, 200కు పైగా కమ్యూనిటీ హాళ్లు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలోని సత్యనారాయణస్వామి, కాళ్ల మండలం కాళ్లకూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి, భీమవరం గునుపూడిలోని శ్రీసోమేశ్వర జనార్ధనస్వామి, పాలకొల్లులోని శ్రీరామలింగేశ్వరస్వామి, నరసాపురంలోని వేణుగోపాలస్వామి తదితర ఆలయాలు ఒకే ముహూర్తంలో ఐదు నుంచి పదికి పైగా వివాహాల నిర్వహణకు పేరొందాయి. వీటితో పాటు తక్కువ సంఖ్యలో వివాహాలు జరిగే చిన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణంలో దాదాపు 18 రోజుల్లో శుభముహుర్తాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు, ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ఇళ్ల వద్ద ఐదు వేలకు పైనే పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. ఆషాఢం మొదలుకావడానికి ముందే బుకింగ్‌లతో పంక్షన్‌హాళ్లు దాదాపు హౌస్ ఫుల్ అయిపోయాయని నిర్వాహకులు అంటున్నారు. ఫొటోస్, వీడియో షూటింగ్, కేటరింగ్, షామియానా, భాజా భజంత్రీలు, మండపాల డెకరేషన్, లైటింగ్ తదితర వాటికి సంబంధించి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్‌లు చేసేసుకున్నారు. పందిరి రాట వేసింది మొదలు వివాహ తంతులు ముగిసేంత వరకు పెళ్లి ఇంట ప్రతీది ఖర్చుతో కూడుకున్నదే. పేదవర్గాల వారు ఉన్నంతలో తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని భావిస్తుంటారు. కట్నకానుకలు మినహాయిస్తే వియ్యాల వారికి కావిళ్లు, పెళ్లి శుభలేఖలు, బంగారం, దుస్తులు కొనుగోలు, కల్యాణ మండపం, లైటింగ్, పచ్చిపూల మండపాలు, విందుభోజనాలు తదితర వాటికి లక్షల్లో ఖర్చవుతుంది. సామాన్య, దిగువ మధ్యతరగతి వర్గాల వారు స్థానిక కమ్యూనిటీహాళ్లు, చిన్నపాటి ఫంక్షన్‌హాళ్లు, ఇంటి వద్ద పెళ్లిళ్లు కోసం రూ. మూడు లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వెచ్చిస్తుంటారు. ఎగువ మధ్యతరగతి వర్గాల్లో హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ అంటూ ఏసీ ఫంక్షన్‌హాళ్లు, థీమ్ డికరేషన్లు, ఫొటోషూట్లు, విభిన్న రకాల వంటకాలతో విందులు తదితర వాటితో రెండుమూడు రోజుల పాటు జరిపే పెళ్లి వేడుకలకు కోసం రూ.10 లక్షల నుంచి రూ.35 లక్షలు వరకు ఖర్చుచేస్తుంటారు. సంపన్న వర్గాల డెస్టినేషన్ వెడ్డింగులు, స్టార్ హోటళ్లు, సినీ స్టార్లతో లైవ్ ఫెర్ఫార్మెన్సులు కోసం రూ.కోట్లల్లో ఖర్చుపెడతారు. ఏదిఏమైనప్పటికి సామాన్యుల నుంచి సంపన్నులు వరకు ఈ సీజన్లో వివాహ ఖర్చు మొత్తం రూ.1000 కోట్లుపైనే ఉంటుందని అంచనా. మొదలైన శ్రావణమాసం సెప్టెంబరు 7 వరకు ముహూర్తాలు తర్వాత రెండు నెలలు మూఢం జిల్లాలో మూడుముళ్ల బంధంతో ఏకంకానున్న జంటలు ఐదు వేలకు పైనే రద్దీగా మారుతున్న మార్కెట్లు పెళ్లి ఖర్చు రూ.వెయ్యి కోట్ల పైమాటే ఏఐ సృష్టించిన చిత్రం శ్రావణ మాసం ముగిసిన వెంటనే భాద్రపద శూన్యమాసం, చాతుర్మాస నియమాలు రానుండటంతో కార్తీకమాసం వరకు శుభకార్యాలకు తాత్కాలిక విరామం రానుంది. మరోపక్క వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలకు ఆరు నెలలు అటు ఇటు పెళ్లిళ్లు జరపకపోవడం అనాదిగా వస్తుంది. ఈ తరుణంలో ముహూర్తాల కోసం వేచి చూస్తున్న కుటుంబాలు ఈ శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లు జరిపించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీంతో కొంతకాలంగా వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్న వ్యాపారులు శ్రావణ మాసంపైనే గంపెడాసలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే బంగారం, వస్త్ర, కిరాణా, ఫ్యాన్సీ తదితర వ్యాపారాలు జోరందుకుంటున్నాయి. దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతం, అన్నా చెళ్లెళ్లకు ముఖ్యమైన రాఖీ పౌర్ణమి ఉండటం, ఆషాఢ మాసం ముగియడంతో అత్తవారింటికి వెళ్లే కొత్త అళ్లుళ్లు కొనుగోళ్లతో మార్కెట్లు రద్దీ అవుతున్నాయి, -
ఆక్వా రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద బుధవారం తెల్లవారుజామున లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 8లో uభీమవరం (ఆర్‌ఆర్‌పేట): ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. భీమవరంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీలను విస్మరించి, పవర్ ఫ్యాక్టర్ నిబంధనల పేరుతో విద్యుత్ సబ్సిడీని నీరుగారుస్తున్నారని ఆరోపించారు. పాలకొల్లు సభలో మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతుందరికీ రూ.1.50 కే సబ్సిడీ విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారని, జూన్ నెల 9న జీవో 169 ద్వారా రూ.1.50 విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని జీవో ఇచ్చి, మూడు నెలలకే రెండు జీవోలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పవర్ ఫ్యాక్టర్ నిబంధన వల్ల ఏ రైతుకు కూడా సబ్సిడీ వచ్చే అవకాశంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పవర్ ఫ్యాక్టర్ నిరూపించుకోవాలని రైతులకు చెప్పడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందన్నారు. వైఎస్ జగన్ హయాంలో రూ.3,800 కోట్ల మేర ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించినట్లు తెలిపారు. పెరిగిన ఫీడ్, సీడ్ ధరలను తగ్గించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కంపెనీలు నామమాత్రపు తగ్గింపు చేసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఫీడ్ ధరలు కిలోకు రూ.16 పెరిగితే కూటమి ప్రభుత్వం నోరు మెదపలేదని, రూ.4 తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఫీడ్ కంపెనీలు కేవలం రూ.2 తగ్గించాయని విమర్శించారు. నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీని వైఎస్ జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి కనీసం రూ. ఒక రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కృతజ్ఞతల సభలు పెడుతూ రైతులను మోసం చేస్తున్నారని, దీనికి తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు. -
ఆహార భద్రత అధికారుల తనిఖీ
తాడేపల్లిగూడెం: పట్టణంలోని ఫుడ్‌కోర్టు ప్రాంతంలో బుధవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొందరు వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఏఎస్ఆర్ రెడ్డి ఆదేశాలననుసరించి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి పి. పునీత్‌కుమార్ ఈ తనిఖీలు చేపట్టారు. ఆహార భద్రత, పరిశుభ్రతతో పాటు స్టాల్స్‌లో హానికరమైన ఫుడ్ కలర్స్ వాడుతున్నారా లేదా అనే కోణంలో ఆరా తీశారు. స్టాల్స్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించడంతో పాటు, లైసెన్సులు లేని నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా కొన్ని నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు పునీత్‌కుమార్ తెలిపారు. తాడేపల్లిగూడెం అర్బన్ : యూట్యూబ్ చానల్లో విలేకరిగా పనిచేస్తున్న ఉర్ల వర్ధన్ ఆత్మహత్యకు కారకులైన వారిపై తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న పాతకాకుల నాగరాజుపై అవాస్తవాలను ప్రసారం చేసి, బెదిరించి రంగా సురేష్, దేవా శివ నగదు వసూలు చేశారని ఫిర్యాదు చేయడంతో స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్సై కేసు నమోదు చేశారు. -
టెట్ ఒత్తిడి తగ్గించాలని వినతి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఉపాధ్యాయులపై టెట్ ఒత్తిడిని తగ్గించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతూ యూటీఎఫ్ నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ. సుభాషిని, ఆర్. రవికుమార్ మాట్లాడుతూ.. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం బాధాకరమన్నారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులందరినీ టెట్ రాయాలనడం అన్యాయమని, ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునిచ్చేలా విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. స్పెషల్ టెట్ నిర్వహణలో భాగంగా పాస్ మార్కులు తగ్గించాలని, పరీక్షను ఆఫ్‌లైన్‌లో, సంబంధిత సబ్జెక్టుల్లోనే నిర్వహించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు ఎస్. సుధారాణి, కోశాధికారి జీవీ రంగమోహన్, కార్యదర్శులు నంబూరి రాంబాబు, కె. కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా అరెస్టు
కాళ్ల : అక్రమంగా గంజాయి రవాణా చేసి విక్రయాలకు పాల్పడుతున్న తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కాళ్ల పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకివీడు రూరల్ సీఐ జి.కాళీచరణ్ వివరాలు వెల్లడించారు. జక్కరం గ్రామానికి చెందిన పంజుల పవన్‌కుమార్ కొద్ది రోజుల క్రితం మారేడుమిల్లి నుంచి 2.250 కిలోల గంజాయిని రూ.9 వేలకు కొనుగోలు చేశాడు. దాన్ని బుధవారం ఉదయం సీసలి గ్రామ శివారులోని డంపింగ్ యార్డు వద్ద మరికొందరితో కలిసి పంచుకుంటుండగా, పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పవన్‌కుమార్‌తో పాటు భీమవరానికి చెందిన ఈద ప్రకాశ్, గొల్లలకోడేరుకు చెందిన పాకర్ల సంజీవ్, నరసింహపురం గ్రామానికి చెందిన కొడమంచిలి మహిమానందం, బొండాడకు చెందిన పిల్లి నాని, బొండాడ పేటకు చెందిన బుంగా బెనర్జీ, కాళ్లకు చెందిన కంభంపాటి సాయి, పెదపుల్లేరుకు చెందిన కనుమూరి దుర్గరామవరప్రసాద్, జువ్వలపాలెంకు చెందిన సండక జశ్వంత్‌లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి గంజాయితో పాటు 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. నిందితులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని, కోర్టులో హాజరుపరుస్తామని సీఐ వెల్లడించారు. ఈ సందర్భంగా నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన సీఐ జి.కాళీచరణ్, కాళ్ల ఎస్సై గణేష్‌కుమార్, పోలీసు సిబ్బంది విజయ్, శివ, వాసు, మహేంద్ర, రవికుమార్‌లను ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆస్మి, డీఎస్పీ రఘువీర్ విష్ణు అభినందించారు. -
వంటింట్లో ధరల మంట
● ఎగబాకుతున్న కూరగాయల ధరలు ● నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు ● ఆందోళనలో మధ్య, పేద తరగతి ప్రజలుసరుకు ఆరు నెలల ప్రస్తుత క్రితం ధర ధర (రూ.లలో) (రూ.లలో) పామాయిల్ 110 135 సన్‌ఫ్లవర్ ఆయిల్ 140 185 వేరుశనగనూనె 150 185 పంచదార 45 53 బెల్లం 45 58 బియ్యం (25 కిలోలు) 1300–1400 1600–1700 వేరుశనగ గుళ్లు 125 160 కందిపప్పు 110 130 నూజివీడు: నిత్యావసర వస్తువుల ధరలకు తోడు కూరగాయల ధరలు భగ్గుమంటుండటంతో పేద, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ తలకిందులవుతోంది. వంటింట్లో ధరల మంట అనేది నేడు సామాన్యుడిని వేధిస్తున్న అతి పెద్ద సమస్యగా తయారైంది. ఏది కొనుగోలు చేయాలన్నా ధరలు షాక్ కొడుతున్నాయి. ముఖ్యంగా నూనెలు, బియ్యం ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. వీటికి తోడు పప్పులు, వేరుశనగ ధరలు కూడా పెరగడంతో సామాన్యులు ఏం కొనాలన్నా కష్టంగా మారింది. పోపు పెట్టాలన్నా, రుచికరంగా కూరలు వండాలన్నా, గారెలు, అట్లు వేసుకోవాలన్నా వంట నూనె ఉండాల్సిందే. ఇప్పుడా వంట నూనె ధరలు సలసలా కాగుతున్నాయి. వీటన్నింటికి తోడు కూరగాయల ధరలు పెరగడంతో ఒక చిన్న కుటుంబం రూ.400 నుంచి రూ.500 వెచ్చిస్తే కానీ వారానికి సరిపడే కూరగాయలు రావడం లేదు. బీర, టమోట, క్యారెట్, మిర్చి, చిక్కుడు తదితర కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. ఆరు నెలల కిందట ఉన్న నిత్యావసర ధరలకు, ప్రస్తుత ధరలకు భారీగా తేడా ఉంది. పెరిగిన ధరలతో సామాన్యుడి వంటగది బడ్జెట్ సైతం పెరిగింది. కనీసం వెయ్యి రూపాయల నుంచి రూ.1500 పెరగడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం గాని, అధికారులు గాని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. కనీసం ఆహార సలహా సంఘాల సమావేశాలను నియోజకవర్గస్థాయి, డివిజన్ స్థాయిల్లో కూడా నిర్వహించడం లేదు. దాదాపు ఈ సమావేశాలను నిర్వహించక రెండేళ్లకు పైగా అయింది. నిత్యావసర సరుకుల పంపిణీలో కోత చౌకధరల దుకాణాల్లో గత ప్రభుత్వంలో బియ్యం, పంచదార, కందిపప్పు కార్డుదారులకు ఇచ్చేవారు. పేదల సంక్షేమమే ధ్యేయమని చెప్పే చంద్రబాబు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందించే నిత్యావసర సరుకుల్లో కోత విధించింది. ప్రస్తుత ప్రభుత్వం బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే ఇస్తోంది. కందిపప్పును దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి కార్డుదారులకు ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. రాగులు, జొన్నలు, గోధుమలు సజ్జలు పంపిణీ చేస్తామని చెప్పి ఇంత వరకు కార్డులకు ఇచ్చిన దాఖలాలే లేవు. ఈ పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సరుకులు కొనుగోలు చేయడం తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. కూలి, నాలీ చేసుకునే వాళ్లం పెరిగిన ధరలతో నిత్యావసర వస్తువులు కొనాలంటే ఇబ్బందిగా ఉంది. వీటికి తోడు కూరగాయల ధరలు సైతం పెరిగాయి. నూనెలు, పప్పులు రేషన్ దుకాణాల్లో ఇస్తే పేదలకు కాస్త ఊరటగా ఉంటుంది. – చోడగిరి లక్ష్మి, మొర్సపూడి, నూజివీడు మండలం బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 25 కిలోల బస్తా రూ.1600 నుంచి రూ.1750 వరకు రకాన్ని బట్టి విక్రయిస్తున్నారు. ఇంత ధర పెట్టి పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి రైతుబజారుల్లో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో బియ్యంను రూ.52కు విక్రయించేలా చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంది. -
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి
చింతలపూడి (జంగారెడ్డిగూడెం) : జంగారెడ్డిగూడెం గ్రీన్‌ఫీల్డ్ హైవే సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు పరామర్శించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను, బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు త్వరితగతిన ఆర్థోపెడిక్ (ఎముకల సంబంధిత) వైద్యం అందడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం ఉచితంగా అందేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్సార్సీపీ జంగారెడ్డిగూడెం పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రహదారి ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ‘ఇంటర్సిటీ స్మార్ట్’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న ధాన్యం లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి బయలుదేరిన ఈ బస్సు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో పుట్లగట్లగూడెం వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సీట్లు, బెర్త్‌లలో ఉన్న ప్రయాణికులు కిందపడిపోవడంతో పలువురికి ముఖం, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న లక్కవరం, జంగారెడ్డిగూడెం పోలీసులు, 108 వాహన సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నలిగిపోవడంతో కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ వెంకటేష్‌ను పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు తీసి, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రహదారిపై నిలిచిపోయిన బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాయపడిన వారి వివరాలు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిలో మల్లిపూడి వెంకట్, దాట్ల అన్నపూర్ణదేవి, ఎస్. వెంకటరమణ, బహదూర్ షరీఫ్, వీరమళ్ల వెంకటరమేష్, డెండిప్రోలు కుమార్ రాజా, పలకూరి వెంకటప్రకాష్, ఎన్. నాగ (కాకినాడ), ఎండీ సికిందర్, బి.నరేష్, కె. శ్రీదుర్గ, గుడే లక్ష్మీనారాయణ, టి. సుబ్రహ్మణ్యం (హైదరాబాద్), వడిగల ఉమ (జగ్గంపేట), మేడిది మౌనిక (పిఠాపురం), షేక్ సజిత్, ఊరిగాటి శిరీష, రాయుడు దుర్గాసతీష్ (రాజమహేంద్రవరం), యలమర్తి కపిల సాయి, యలమర్తి వెంకటేష్ (కాకినాడ) తదితరులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాడి గేదెను కాపాడబోయి రైతు దుర్మరణం
చింతలపూడి: తన కుటుంబానికి జీవనాధారమైన మూగజీవి కళ్లెదుటే విద్యుత్ షాక్‌తో గిలగిలలాడుతుంటే ఆ పాడి రైతు తట్టుకోలేకపోయాడు. దాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలనే బలిపెట్టాడు. చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో బుధవారం చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. గ్రామానికి చెందిన రైతు గాలంకి నాగేసు (65) బుధవారం ఉదయం తన పాడి గేదెలను తోలుకుని సమీపంలోని ఆయిల్‌పామ్ తోట గుండా వెళ్తున్నాడు. అక్కడ తెగిపడి ఉన్న 11 కేవీ విద్యుత్ తీగ తగిలి ఓ గేదె విద్యుదాఘాతానికి గురైంది. కళ్లముందే ప్రమాదంలో చిక్కుకున్న ఆ మూగజీవిని రక్షించబోయిన నాగేసు కూడా కరెంట్ షాక్‌కు గురై.. క్షణాల వ్యవధిలోనే గేదెతో పాటే ప్రాణాలు విడిచాడు. పాడి పశువులనే నమ్ముకుని బతుకుతున్న ఇంటి పెద్ద దిక్కు అనంత లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు అక్కడున్న వారి హృదయాలను బరువెక్కించాయి. ఎస్సై కె.సతీష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీతో కలకలం ఏలూరు టౌన్: ఏలూరు అశోక్‌నగర్ కేపీడీటీ ఉన్నత పాఠశాల ఎదురు రోడ్లలో మేఘాలు దిగివచ్చాయా అన్నట్లు కనిపించింది. అటువైపుగా వెళ్లే వాహనదారులకు, ఇళ్లలోని జనాలకు కొంతసేపు ఏమీ అర్థం కాలేదు. తెల్లటి పొగమంచు ఆ ప్రాంతాన్ని చుట్టేస్తూ ఉంటే... ఏమి జరుగుతుందో అర్థంకాకపోవటంతో గందరగోళానికి గురయ్యారు. మంటలు లేవు... కానీ తెల్లటి పొగమంచులాంటిది ఆ ప్రాంతాన్ని కమ్మేస్తూ ఉంటే... మబ్బులే రోడ్లపైకి వచ్చేశాయా అనిపించింది. ఇదంతా ఏలూరు అశోక్‌నగర్‌లోని ఆయుష్ హాస్పిటల్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం 4:30 గంటలకు చోటుచేసుకున్న సంఘటన. ఆయుష్ హాస్పిటల్ ఆక్సిజన్ ట్యాంకర్‌ను రీఫిల్ చేస్తుండగా... ప్రమాదవశాత్తు లీకేజీ ఏర్పడింది. భారీఎత్తున ఆక్సిజన్ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. చుట్టుపక్కల రోడ్లన్నీ పొగలా కమ్మేస్తూ ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. అశోక్‌నగర్ కేపీడీటీ స్కూల్ ఎదురు రోడ్డులోని ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏలూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ట్యాంకర్‌కు ఉన్న క్యాప్‌ను మూసివేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
వృద్ధురాలిపై దాడి చేసి చోరీ
కుక్కునూరు: వృద్ధురాలిపై దాడి చేసి మెడలోని బంగారు నానుతాడును లాక్కెళ్లిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై కె.రాజారెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన 21.600 గ్రాముల (మూడు తులాల) బంగారు నానుతాడుతో పాటు, నేరానికి ఉపయోగించిన మారుతి సుజుకి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న గుండంబోరు గ్రామం వద్ద చర్చి నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న వృద్ధురాలిని కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించి, బెదిరించి దాడి చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు నానుతాడును లాక్కొని పరారయ్యారు. చోరీ అనంతరం వెంకటాపురం–తిమ్మంపేట రోడ్డు వైపు వెళ్తుండగా అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టి దెబ్బతింది. దీంతో నిందితులు ఆ వాహనాన్ని సమీపంలోని అడవిలో దాచిపెట్టి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బుధవారం ఉదయం వెంకటాపురం–తిమ్మంపేట అడ్డరోడ్డు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు పురుషులు, ఒక మహిళను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారే ఈ చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులు వీరే.. నిందితుల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన షేక్ ఖాసిం అలియాస్ బాషా (26), వాసంశెట్టి రామచంద్ర పవన్ కుమార్ అలియాస్ స్కైలాబ్ (19), నలుబోలు లోకేష్ (27), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుట్టా లక్ష్మీపురం గ్రామానికి చెందిన పాయం రూతు (26) ఉన్నారు. నిందితుల్లో ఖాసింపై గతంలో 17, పవన్ కుమార్‌పై 10, లోకేష్‌పై 3 కేసులు (కొన్ని హత్య కేసులు సహా) జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదై ఉన్నాయని ఎస్సై వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ పి.బాల సురేష్ బాబు, ఎస్సై రాజారెడ్డి, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. నలుగురు నిందితుల అరెస్ట్ -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఆచంట విద్యార్థులు
పెనుగొండ : అమరావతి చాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఆచంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులు ఎంపికై నట్లు పాఠశాల ప్రథానోపాధ్యాయుడు సీహెచ్ఎన్ఎస్ శ్రీనివాస్ బుధవారం విలేకరులకు తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ముగ్గురు విద్యార్ధులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు యుం ఉమామహేశ్వర్, కే దినేష్, ఎం ఉమా వైష్ణవ్ ఎంపిక కాగా, బాలికల విభాగంలో జిల్లాస్థాయి ద్వితీయ స్థానాన్ని వీ శ్రీవల్లి, పి రాజీ, ఏ సహస్ర, బి ప్రియాంక, యు శ్రీలేఖ సాధించారన్నారు. విద్యార్థులను, శిక్షణ నిచ్చిన పీఈటీలు బీఎన్ స్వామి, పి బెనహంలను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బీ కృష్ణమోహన్, రత్నకుమారి పాల్గొన్నారు. ఉంగుటూరు : నారాయణాపురం మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై ప్రతిభ చాటారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం (బైపీసీ) విద్యార్థి ఎ.రోహిత్ ఏలూరులో జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో అండర్–17 కబడ్డీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి, ఏలూరు జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అలాగే, సీఈసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి టి. శివదుర్గ హాకీ జట్టులో జిల్లా తరఫున ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. క్రీడల్లో రాణించిన ఈ విద్యార్థులను కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీ శ్రీనివాసు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించి హర్షం వ్యక్తం చేశారు. తణుకు అర్బన్ : దువ్వ గ్రామంలో మద్యం దుకాణం వద్ద ఈనెల 11న తంగెళ్ల రాంబాబు అలియాస్ రాము అనే వ్యక్తిపై బీరు బాటిల్‌తో దాడికి పాల్పడిన గ్రామానికి చెందిన లుకలపు కోటేశ్వరరావు అలియాస్ శివను అరెస్టు చేసినట్లు తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. పాత గొడవల నేపథ్యంలో జరిగిన ఈ దాడికి సంబంధించి శివను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు వివరించారు. -
నా ఉసురు చింతమనేనికి తగులుతుంది
సాక్షి, టాస్క్‌ఫోర్స్: నా ఉసురు కచ్చితంగా చింతమనేనికి తగులుతుందని వైఎస్సార్సీపీ నేత భాను సతీమణి పాలడుగు శ్రావణి అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆనాడు నా ఇంటికి వచ్చి ’భాను నువ్వు నా తమ్ముడివి, నువ్వు ఎక్కడికీ వెళ్ళవద్దు, నాతోనే ఉండు’ అని బ్రతిమలాడావు. కానీ నీ వ్యవహారం నచ్చక మేం వైఎస్సార్సీపీలో చేరాం. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరితోనే ఉంటాం. అబ్బయ్య చౌదరి విజయానికి కృషి చేస్తాం. నా భర్తను కొట్టిస్తే మేం భయపడిపోతామా? ఎంతమందిని కొడతారు? ఈరోజు భానుని.. రేపు ఇంకొకరిని.. ఇలా ఎంతమంది మీద దాడి చేయిస్తావు?‘ అని ఆమె ప్రశ్నించారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమ ప్రయాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ‘నా భర్త మీకోసం కోట్లు ఖర్చు పెట్టాడు. మీరు చెప్పిన ప్రతిపని నా భర్త తన శక్తి మేరకు చేశాడు. మానవత్వంతోనే నా భర్త ఇన్నాళ్లు మీతో కలిసి పనిచేశాడు. మీరేం చేశారు? నా భర్తను కొట్టిస్తారా? ఎంతమందిని తీసుకొస్తారు? ఎంతమందితో కొట్టిస్తారు?‘ అని నిలదీశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాము భయపడేది లేదని, వెనక్కు తగ్గేది లేదని పాలడుగు శ్రావణి తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ నేత భాను సతీమణి పాలడుగు శ్రావణి -
ఒత్తిడి ‘ఉరి’గొల్పిందా..
తణుకు అర్బన్: తణుకులో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థి ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తణుకు రైల్వే స్టేషన్ రోడ్డులోని వంశీ హాస్పిటల్ వెనుక వీధిలో సింహాద్రి లలిత తన ఒక్కగానొక్క కుమారుడు ఆదిత్య (18)తో కలిసి నివాసముంటోంది. లలిత ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, ఆదిత్య స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం లలిత స్నానాల గది నుంచి బయటకు వచ్చి చూసేసరికి, హాలులో ఆదిత్య ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చారు. వెంటనే స్థానికుల సాయంతో ఆదిత్యను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళాశాల అధ్యాపకులు తల్లిని తీసుకురావాలని ఆదిత్యకు పలుమార్లు చెప్పారు. ఈ విషయమై ఇంట్లో తల్లి, కొడుకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆదిత్య ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. చదువుల ఒత్తిడే కారణమా? ఎంతో హుషారుగా ఉండే విద్యార్థి ముక్కుపచ్చలారని వయసులోనే ఆత్మహత్యకు పాల్పడడం బంధువులను, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. విద్యా ఒత్తిడి కారణంగానే ఆదిత్య బలవన్మరణానికి పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై తణుకు పట్టణ ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహానికి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తణుకులో ఇంటర్ విద్యార్థి ఆదిత్య బలవన్మరణం -
గ్రావెల్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
ఆగిరిపల్లి: మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో మంగళవారం క్వారీల నుంచి గ్రావెల్ లోడుతో వెళ్తున్న 40 లారీలను గ్రామస్తులు అడ్డుకుని నిలిపివేశారు. తోటపల్లి, పోతవరప్పాడు క్వారీల నుంచి ప్రతిరోజూ వందలాది లారీల్లో నెక్కలం గొల్లగూడెం మీదుగా విజయవాడకు గ్రావెల్ తరలిస్తున్నారు. అధిక లోడు, మితిమీరిన వేగంతో లారీలు రాకపోకలు సాగిస్తుండటం వల్ల గ్రామంలో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్లు మద్యం తాగి వాహనాలను ఇష్టానుసారంగా నడపడం వల్ల రోడ్లపైకి రావాలంటేనే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో గ్రావెల్ లోడుతో వస్తున్న లారీ డ్రైవర్ గ్రామంలోని ఒక జ్యువెలరీ దుకాణాన్ని ఢీకొట్టాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని, దుకాణం ధ్వంసమవ్వడం వల్ల రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ యజమాని ఇప్పటివరకు నష్టపరిహారంగా రూపాయి కూడా ఇవ్వకపోగా, తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. క్వారీ యజమానులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు లారీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని గ్రామస్తులు తేల్చిచెప్పారు. దీంతో మూడు గంటల పాటు లారీలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పాఠశాలలో రికార్డుల తనిఖీ
టి.నరసాపురం: మండలంలోని గండిగూడెం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బియ్యం, గుడ్లు, చిక్కీల నిల్వ, వినియోగ వివరాల రికార్డులను నెలల తరబడి నమోదు చేయకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేయగా, అక్కడ కార్యకర్త అందుబాటులో లేకపోవడం, కేవలం హెల్పర్, కొద్దిమంది పిల్లలు మాత్రమే ఉండడం గమనించారు. బాలింతల నమోదు రికార్డులు ఖాళీగా ఉండడాన్ని చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ తనిఖీలు చేపట్టామని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. టి. నర్సాపురం: స్థానిక ఫెర్టిలైజర్ షాపు ప్రతినిధి పోలీస్ అధికారి పేరిట వచ్చిన ఫోన్ కాల్‌తో ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. టి.నరసాపురం ఎస్సై ఎం.జయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. టి.నరసాపురం పోలీస్ స్టేషన్ ఎస్సైగా నటిస్తూ ఒక గుర్తుతెలియని వ్యక్తి స్థానిక గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాప్ సేల్స్ మేనేజర్ పత్తిపాటి కుమార్‌బాబుకు ఫోన్ చేశాడు. అత్యవసర నిమిత్తం రూ.20 వేలు కావాలని, నగదును డ్రైవర్‌తో పంపిస్తానని, సదరు సొమ్మును యూపీఐ / క్యూఆర్ కోడ్ విధానం ద్వారా తనకు బదిలీ చేయాలని నమ్మబలికాడు. దీంతో కుమార్‌బాబు తన ఫోన్‌కు వచ్చిన క్యూఆర్ కోడ్‌కు నగదు బదిలీ చేశాడు. ఆ తర్వాత సదరు ఫోన్ నంబర్ నిలిచిపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటన ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై జయబాబు వెల్లడించారు. దెందులూరు: రామారావుగూడెం పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన రైతు పర్వతనేని నరేంద్రబాబు పొలంలో సోమవారం రాత్రి బోరు కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. మంగళవారం ఉదయం పొలానికి వెళ్లి కేబుల్ వైర్లు చోరీ అయినట్లు గమనించినట్లు బాధితుడు నరేంద్రబాబు తెలిపారు. సాగు అవసరాలకు ఉపయోగపడే బోరు కేబుల్ వైర్లు చోరీ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు రైతు తెలిపారు. వేలేరుపాడు: షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు పూర్తిగా దగ్ధమై, ఓ రైతు కుటుంబం వీధిన పడిన సంఘటన చాగరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిచ్చడి దేవయ్య అనే రైతు పూరిల్లు ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిబూడిదవడంతో పాటు సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు మంగళవారం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి బాడిశ రాము మాట్లాడుతూ బాధితునికి ప్రభుత్వం వెంటనే పక్కా ఇల్లు మంజూరు చేయాలని, తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితునికి సీపీఐ పార్టీ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆకివీడు: పెదకాపవరం గ్రామంలో రొయ్యల చెరువులో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన బాలు స్వర్గ లారే (52) సోమవారం మద్యం సేవించి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించినట్లు ఎస్సై శుభశేఖర్ మంగళవారం తెలిపారు. గత కొంతకాలంగా చెరువు వద్ద పనిచేస్తున్న లారేకు భార్య, కుమారుడు ఉన్నారు. వారు అస్సాంలోని బెట్ బరి గ్రామంలో ఉంటున్నారు. లారే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఆశల సం‘పత్తి’
కుక్కునూరు: ఎల్‌నినో ప్రభావం, ఖరీఫ్ ప్రారంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దిక్కుతోచని స్థితిలో పడిన పత్తి రైతులకు ఇటీవల కురుస్తున్న అనుకూల వర్షాలు కొండంత ఊరటనిస్తున్నాయి. ఎండల తీవ్రతకు ప్రారంభంలోనే మొలకలు వాడిపోతాయేమోనని, పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావని తీవ్ర ఆందోళన చెందిన రైతులకు ప్రస్తుత వర్షాలు కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. మండలంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పత్తి విత్తనాలు విత్తినంతనే ఒకటి, రెండు పలకరింపు వర్షాలు కురిశాయి. ఆ తర్వాత దీర్ఘకాలం పాటు వర్షాలు ముఖం చాటేయడంతో నేలలో తేమ తగ్గి పత్తి మొక్కల ఎదుగుదల పూర్తిగా మందగించింది. అయితే, గత కొన్ని రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో పొలాల్లో తగినంత తేమ చేరి పంట రూపురేఖలు మారిపోయాయి. మొక్కలు వేగంగా ఎదుగుతూ, పలు ప్రాంతాల్లో పూత దశకు చేరుకోవడంతో చేలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో వాతావరణం అనుకూలించి, సరైన సమయంలో వర్షాలు కురిస్తే పూత, కాయ బాగా పట్టి ఆశించిన స్థాయిలో మంచి దిగుబడి వస్తుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో ఊపిరి పీల్చుకుంటున్న రైతులుపత్తి విత్తనాలు వేసి మొలకలొచ్చే దశలో వర్షాలు లేక పంట దక్కుతుందో లేదోనని చాలా భయపడ్డాం. పంట ఎదుగుదల ఆగిపోవడంతో దిగుబడిపై ఆందోళన చెందాం. అయితే ప్రస్తుతం పడుతున్న వర్షాలు పత్తి పంటకు ప్రాణం పోశాయి. పంట ఎదుగుదల చాలా ఆశాజనకంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా వాతావరణం ఇలాగే సహకరించి, పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తే పత్తి రైతు ఈ ఏడాది సంక్షోభం నుంచి గట్టెక్కినట్టే. – మచ్చ బుచ్చిబాబు, పత్తి రైతు, ఇసుకపాడు, కుక్కునూరు మండలం -
అంగన్వాడీల్లో మెరుగైన విద్యే జ్ఞానజ్యోతి లక్ష్యం
భీమడోలు: అంగన్వాడీ చిన్నారులకు మెరుగైన విద్య అందించడమే ’జ్ఞానజ్యోతి’ లక్ష్యమని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పి.శారద అన్నారు. భీమడోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తల మూడు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఐసీడీఎస్ పీవో ఎంఎస్. రాజశేఖర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పీడీ పి.శారద ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆటపాటలు, కథల వంటి సృజనాత్మక పద్ధతుల్లో బోధించడం ద్వారా చిన్నారుల్లో శారీరక, మానసిక పరిపక్వత, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతాయన్నారు. పీవో రాజశేఖర్ మాట్లాడుతూ ప్రీ–స్కూల్ నిర్వహణతో పాటు టీఎల్ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) తయారీ, బొమ్మలు, సంజ్ఞల ద్వారా బోధనా పద్ధతులను వివరిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎం జీఎస్ పద్మజ మాట్లాడుతూ.. జ్ఞానజ్యోతి శిక్షణను సద్వినియోగం చేసుకొని అంగన్వాడీ కేంద్రాల్లో బాలలకు నాణ్యమైన విద్యనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్పర్సన్లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
విద్యుత్ తీగే యమపాశమై
ఆకివీడు: విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. విద్యుత్ తీగ రూపంలో మృత్యువు వారి వాకిట్లోకి వచ్చింది. భార్యాభర్తల్లో ఒకరిని కబళించాలనుకుందో ఏమో.. భార్యను గాయపరుస్తూ, భర్తను అనంత లోకాలకు తీసుకుపోయింది. మండలంలోని సిద్ధాపురం గ్రామ శివారు కాళింగగూడెంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఆకాశం మేఘావృత్తమై ఉండి, ఉదయం 8 గంటల వరకూ ఈదురుగాలులు వీచాయి. అదే సమయంలో వీచిన కొద్దిపాటి ఈదురుగాలికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని తెలియని అమాయకపు దంపతులు ఆ దుర్ఘటనకు బలయ్యారు. ఉదయం యథావిధిగా వాకిటిలో కల్లాపు చల్లి, ముగ్గు వేయడానికి వెళ్లిన కోమటిలంక భ్రమరాంబ అనుకోకుండా తెగిపడిన విద్యుత్ తీగను కాళ్లతో తొక్కింది. వెంటనే షాక్‌కు గురై ఆమె కేకలు వేసింది. అదే సమయంలో దగ్గరలో ఉన్న భర్త మురళి భార్యను రక్షించడానికి పరుగెత్తుకువచ్చాడు. ఆమెను విడిపించే ప్రయత్నంలో అతనూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విధి ఆడిన ఆటలో భార్యను కాపాడబోయిన మురళి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన భ్రమరాంబ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉండగా.. వారికి ఇప్పటికే పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరే ఆ ఇంట్లో జీవిస్తున్నారు. బాధితురాలు భ్రమరాంబ ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాళింగగూడెం ప్రాంతంలోని కాలనీ సమీపంలో విద్యుత్ తీగలన్నీ ప్రమాదకరంగా వేలాడుతున్నాయని, ఇప్పటికై నా అధికారులు స్పందించాలని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యను కాపాడబోయి భర్త మృతి -
మద్యం మత్తులో బీరు బాటిల్‌తో దాడి
తణుకు అర్బన్: మద్యం మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తణుకు మండలం దువ్వ గ్రామంలోని మద్యం దుకాణం వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దువ్వ గ్రామానికి చెందిన తంగెళ్ల రాంబాబు అలియాస్ రాము, లోకలపు కోటేశ్వరరావు అలియాస్ శివ స్నేహితులు. రాము తాపీ పని చేస్తుండగా, శివ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మంగళవారం ఇద్దరూ కలిసి మద్యం తాగేందుకు సూర్యారావుపాలెం రోడ్డులోని మద్యం దుకాణానికి వెళ్లారు. ఈ క్రమంలో పాత గొడవల నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. మాటామాట పెరిగిన తర్వాత శివ బీరు బాటిల్ పగలగొట్టి రాంబాబుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తణుకు రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై నాళం శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం అర్బన్ : వ్యాను ఢీకొని విధుల్లో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానిక 6వ వార్డులో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న అడపా విజయ్‌కుమార్ (39) .. తన మోటారుసైకిల్‌పై మామిడితోట గాంధీబొమ్మ సెంటర్ నుంచి కొండాలమ్మ గుడి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాన్స్‌పోర్టు వ్యాను ఆయన మోటారుసైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. కిందపడిపోయిన విజయ్‌కుమార్ నడుముపై నుంచి వ్యాను చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న సమీప నివాసి, 7వ వార్డు సచివాలయం అడ్మిన్ రంగనాథ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో బాధితుడిని అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందాడని నిర్ధారించారు. విజయకుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యాను డ్రైవరు నామిశెట్టి సత్యనారాయణను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడైన డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని సమాచారం. -
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
దెందులూరు: ప్రణాళికాబద్ధమైన నిరంతర సాధన, శిక్షణతోనే ఉన్నత విజయాలు సాధ్యపడతాయని గోపన్నపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సుభాషిని అన్నారు. అమరావతి కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికవ్వడంతో మంగళవారం ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన 8వ తరగతి విద్యార్థినులు ఎస్.సాయి కార్తిక, యు.హిమజ, లాంగ్ జంప్‌లో 10వ తరగతి విద్యార్థిని నాగ సింధుజ, వాలీబాల్‌లో 10వ తరగతి విద్యార్థిని ఎస్.రాజేశ్వరిలను హెచ్ఎం సుభాషిని అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయులు చిటికెన రమేష్, ఎండీ అమన్ సుల్తానా పాల్గొన్నారు. -
పోలీసు జులుం
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీపై దర్యాప్తు, మంత్రి పదవికి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ జిల్లా అంతటా నిర్వహించిన ర్యాలీలకు అనూహ్య స్పందన వచ్చింది. ర్యాలీలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ బలగాలను మోహరించి పోలీసు జులుంతో అడుగడుగునా అడ్డంకులు కల్పించినా పార్టీ శ్రేణులు, ప్రజలు తలొగ్గకుండా ప్రభుత్వంపై పోరుబాట సాగించారు. సాక్షి, భీమవరం: అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ మండుటెండ, ఉక్కపోతలను లెక్కచేయకుండా పాదయాత్రలు, మెటారు సైకిల్ ర్యాలీలతో హోరెత్తించారు. మెగా డీఎస్సీ–2025 అవినీతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు యువజన ర్యాలీలు, అధికారులకు వినతిపత్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేయడం చంద్రబాబు సర్కారును ఇరకాటంలో పడేసింది. సోమవారం శాంతియుత ర్యాలీలను భగ్నం చేసేందుకు పోలీసులను ఉసిగొల్పింది. ఈ క్రమంలో ర్యాలీలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ పోలీసులు ఆటంకాలు కల్పించారు. ● నరసాపురంలో.. నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహణకు ఏర్పాటు చేయగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డున్నారు. శాంతియుతంగా ర్యాలీ జరుగుతుందని చెప్పినా అంగీకరించలేదు. పార్టీ కార్యాలయం నుంచి స్టీమర్ రోడ్డు జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున పార్టీశ్రేణులతో ప్రసాదరాజు పాదయాత్ర చేశారు. లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీజీసీ సభ్యుడు పీడీ రాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బర్రే శ్రీవెంకటరమణ, పార్టీ నేతలు బంధన పూర్ణచంద్రరావు, పప్పుల రామారావు, షేక్ బులి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ● ఆచంట నియోజకవర్గంలో.. ఆచంట నియోజకవర్గ కో–ఆర్డినేటర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు నేతృత్వంలో తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయం నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ చేపట్టారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోడేరు తదితర గ్రామాల మీదుగా గోదావరి తీరం వరకు ర్యాలీ సాగింది. దారిపొడవునా పార్టీశ్రేణులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. పెనుమంట్ర, ఆచంట, పోడూరు, పెనుగొండ మండలాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ● తణుకులో.. తణుకులో మోటారు సైకిల్ ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. రాష్ట్రపతి రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని శిబిరం వద్ద నుంచి నరేంద్ర సెంటర్ వరకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఎస్ఈసీ సభ్యుడు పెండ్ర వీరన్న, నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు వెంకట నాగు, పార్టీ నేతలు వడ్లూరి సీతారాం, వెలగల సాయిబాబారెడ్డి, పొట్ల సురేష్, చోడే గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ● తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెంలో క్యాంపు కార్యాలయం నుంచి కోఆర్డినేటర్ వడ్డి రఘురాంనాయుడు బైక్ ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాహనదారుల నుంచి తాళాలు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో రఘురాంనాయుడుకి పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుమతి కోసం దరఖాస్తు ఇచ్చినా అడ్డుకోవడం సరికాదని, కావాలంటే అరెస్ట్ చేసుకోమని తెగేసిచెప్పారు. భారీ సంఖ్యలో పార్టీశ్రేణులు, యువతతో కలిసి పట్టణంలోని పోలీస్ ఐలాండ్ తదితర ప్రాంతాల మీదుగా పాదయాత్ర చేశారు. అనంతరం మోటారు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ● భీమవరంలో.. భీమవరంలోని పార్టీ అర్బన్ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు ఇంటి సమీపం నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మోటారు సైకిల్ ర్యాలీకి సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. అందరూ ఒకేసారి పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో బ్యాచ్‌లుగా విడిపోయి ర్యాలీ చేశారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడం కంటే ర్యాలీలో పాల్గొన్న వారి ఫొటోలు, వీడియోలు తీసేందుకే పోలీసులు ప్రాధాన్యమివ్వడం కనిపించింది. రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, పార్టీ నేతలు ఏఎస్ రాజు, మేడిది జాన్సన్, పాలవెల్లి మంగ, చిగురుపాటి సందీప్, గంటా రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ● ఉండిలో.. ఉండిలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ మంతెన యోగీంద్రకుమార్ ఆధ్వర్యంలో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు మీదకు రావద్దంటూ పార్టీ శ్రేణులను సందుల్లోకి గెంటివేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందిు. యోగీంద్రకుమార్ను నెట్టుకుంటూ ఒక ఇంటిలోకి తీసుకువెళ్లి బయటకురాకుండా నిర్భంధించారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వచ్చి బస్టాండు సెంటర్ వరకు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంత మంది నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఈసీ సభ్యుడు పాతపాటి శ్రీనివాసరాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ● పాలకొల్లులో.. పాలకొల్లులో ర్యాలీకి పోలీసులు ఆంక్షలు పెట్టారు. బైక్ ర్యాలీకి అంగీకరించకపోవడంతో నియోజకవర్గ కోఆర్డినేటర్ గుడాల శ్రీహరిగోపాలరావు పార్టీ శ్రేణులతో కలిసి యడ్ల బజార్ వరకు పాదయాత్ర చేశారు. లోకేష్ రాజీనామా చేయాలంటూ నల్ల బెలూన్లు గాల్లోకి వదిలి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్‌బాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, రాష్ట్ర అంగనన్‌వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు మద్దాల చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. తణుకులో ర్యాలీలో ముదునూరి మురళీకృష్ణంరాజు, గూడూరి ఉమాబాల తదితరులు ఆచంటలో మోటార్‌సైకిల్ ర్యాలీలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు ఉండిలో వైఎస్సార్సీపీ కన్వీనర్ యోగీంద్రబాబును అడ్డుకుంటున్న పోలీసులు తాడేపల్లిగూడెంలో వడ్డి రఘురాంను చుట్టుముట్టి ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు పాలకొల్లులో గుడాల గోపీతో మాట్లాడుతున్న పోలీసులు భీమవరంలో చినమిల్లి వెంకట్రాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసుల యత్నం అనుమతులు లేవంటూ నేతలతో వాగ్వివాదం బెదిరింపులను ఖాతరు చేయని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు జిల్లా అంతటా విజయవంతంగా ర్యాలీలు -
ఊరించి.. ఊసురుమనిపించారు !
● కొల్లేరు భూములపై స్వష్టమైన ప్రకటన చేయని సీఎం చంద్రబాబు ● టీడీపీకి దీటుగా జనసేన అత్యవసర సమావేశం సాక్షి టాస్క్‌పోర్స్: కొల్లేరు అభయారణ్య భూముల పంపిణీపై స్వష్టమైన హామీని ప్రకటిస్తారని వచ్చిన కొల్లేరు ప్రజలకు చంద్రబాబు మొండిచేయి చూపారు. కలిదిండిలో పట్టాల పంపిణికి సీఎం చంద్రబాబు వస్తున్నారని తెలియగానే చక్కటి ప్రకటన వస్తుందని కొల్లేరు నాయకులు ప్రజలను సభకు తీసుకొచ్చారు. చంద్రబాబు కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పుకొచ్చినా.. గతంలోనూ ఆయనే ఇదే చెప్పారని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కొల్లేరు ప్రజలు విరక్తి చెందారు. దీంతో నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కోర్టు పరిధిలో ఉండటం వల్ల చంద్రబాబు హామీ ఇవ్వలేదని చెప్పుకురావడం గమనార్హం. జనసేన శిబిరంలో ఆగ్రహం : పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు సాయంత్రం టీడీపీ కేడర్‌తో సమావేశం నిర్వహించారు. జనసేన నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో కలిసి కలిదిండి సమీపంలోని సానారుద్రవరం వద్ద కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇందులో అనేక మంది ఆగ్రహంతో మాట్లాడారు. మండలాల్లో జనసేన నాయకులు కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళుతుంటే ఎమ్మెల్యే సూచించిన వ్యక్తి సిఫార్సులు కావాలని చెబుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మనుషులను ప్రశ్నిస్తుంటే కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో అందరూ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పిన తర్వాత జనసేన నేతలు సమావేశమవడం గమనార్హం. ఆకలితో అలమటిస్తూ.. చంద్రబాబు సభలో ప్రసంగాలు ఆలస్యం కావడంతో వచ్చిన ప్రజలు ఆకలితో అలమటించారు. సీఎం చంద్రబాబు ఉదయం 11.45కు హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తహసీల్దారు కార్యాలయంలో 22ఏ పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. 12.45 గంటలకు వేదికపైకి వచ్చి 2.45 వరకూ ఉన్నారు. సాయంత్రం 4.20 నుంచి 6.10 వరకు కేడర్‌తో మీటింగ్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, బొమ్మనబోయిన విజయలక్ష్మీ, వీరమల్లు నరసింహారావు, బలే ఏసురాజు మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం భోజన సమయం కావడంతో వెనుక ఉన్న ప్రజలు అనేక మంది వెళ్లిపోయారు. స్వయంగా రెవెన్యూ వీఆర్వోలు ఇంటికి వెళ్లి సభకు రావాలని కోరారు. -
పోలవరం మండలంలోకి పులి
పోలవరం రూరల్: పోలవరం మండలంలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో టేకూరు, శివగిరి గ్రామాల మధ్య పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నెల రోజులు క్రితం ఇదే ప్రాంతం నుంచి పెద్ద పులి గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల మీదుగా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి మళ్లీ తిరుగుముఖం పట్టింది. రెండు రోజుల క్రితం బుట్టాయగూడెం మండలంలో సంచరిస్తూ తిరిగి పాపికొండల అభయారణ్య ప్రాంతంలోకి ప్రవేశించింది. పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతం నుంచి గోదావరి నది వైపు చేరింది. అటవీశాఖాధికారులు రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఆదివారం గడ్డపల్లి ప్రాంతం నుంచి జలతారు వాగు ప్రాంతం మీదుగా సంచరించింది. నెల రోజులుగా అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ పశువులను హతమార్చిన విషయం తెలిసిందే. మళ్లీ నది దాటి తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్తుండా లేదా తిరుగుముఖం పడుతుందా? అనేది తెలియడం లేదు. -
క్షీరారామంలో ఘనంగా జలాభిషేకం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పది రోజులుగా నిర్వహించిన వరుణ జపం పూజల్లో భాగంగా సోమవారం స్వామికి జలాభిషేకం చేశారు. ఉదయం గణపతి పూజ, 108 కలశాలతో అభిషేకం, రుద్ర పారాయణ, దేవతారాధన వంటి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కెనాల్ రోడ్డులో ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్దకు వెళ్లి కలశాలతో కాలువ నీళ్లు తీసుకుని వచ్చి స్వామికి జలాభిషేకం చేశారు. ఈ అభిషేకంలో పండిట్ భమిడిపాటి వెంకన్న, మద్దూరు సూరిబాబుల బ్రహ్మత్వంలో ఆలయ ప్రధానార్చకులు కిష్టప్ప, అనిల్, వీరబాబు, 25 మంది రుత్వికులు పాల్గొన్నారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్ పి.వాసు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. గత పది రోజులుగా జరిగిన వరుణ జపం, జలాభిషేకం పూజలపై పట్టణంలో ఎక్కడా ప్రచారం చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో మైక్ ద్వారా ప్రచారం చేసి ఉంటే భక్తులందరికీ తెలిసేదని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేవారని చెబుతున్నారు. క్షీరారామలింగేశ్వరస్వామికి జలాభిషేకం చేస్తున్న దృశ్యం.. కలశాలతో నీళ్లు తీసుకొస్తున్న అర్చక స్వాములు -
అర్జీలు గడువులోగా పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు అత్యంత బాధ్యతతో పరిశీలించి, వేగవంతంగా, నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం, అలసత్వానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యల తీవ్రత, వాస్తవ పరిస్థితులను తెలుసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. పరిష్కారం అనంతరం సంబంధిత దరఖాస్తుదారుకు సమాచారం అందించడంతో పాటు సమస్య పూర్తిగా పరిష్కారమైందో లేదో కూడా ధ్రువీకరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 190 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్‌లో 37 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కొన్ని అర్జీలు ● తణుకుకు చెందిన శ్రీదుర్గా చిట్‌ఫండ్స్‌లో చిట్స్ వేస్తే ఆ డబ్బంతా తీసుకుని గోలి శ్రీనివాసరావు పరారయ్యాడని బాధితులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ● అత్తిలి మండలానికి చెందిన పలువురు చేనేత కార్మికులు పీజీఆర్ఎస్కు వచ్చి తమకు ప్రభుత్వం అందించే చేనేత ఆర్థిక సాయం రూ.25 వేలు అందలేదని ఫిర్యాదు చేశారు. -
విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలి
వీరవాసరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రొయ్యల రైతులకు రూ.1.50కే కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు వెంటనే దానిని నెరవేర్చాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని నవుడూరు జంక్షన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల రైతులకు ఇచ్చిన హామీల మేరకు రెండున్నరేళ్ల నుంచి ఇవ్వాల్సిన రూ.1.50 సబ్సిడీ నగదును వెంటనే ఆయా రైతులకు జమ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ – 2025 స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని పరీక్ష లీకేజీ, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. ఆకివీడు: ఆకివీడు ప్రధాన సెంటర్లో జాతీయ రహదారి–165పై గంగానమ్మకోడు మురుగు కాల్వకు ఉన్న కల్వర్టు ఇటీవల ధ్వంసమైంది. దీంతో ప్రమాదభరితంగా మారింది. ఈ నెల 6వ తేదీన ‘ప్రమాదభరితంగా జాతీయ రహదారి కల్వర్టులు’ శీర్షికతో సాక్షిలో వచ్చిన ప్రత్యేక కథనానికి జాతీయ రహదారుల శాఖ అధికారులు స్పందించారు. వెంటనే ధ్వంసమైన కల్వర్టుకు పిట్టగోడ నిర్మాణం చేపట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో కల్వర్టుల గోడలు విరిగి ప్రమాదభరితంగా మారాయి. భీమవరం: తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయించే బాధితులకు పోలీసు శాఖ వెన్నెముకగా నిలిచి భరోసా కల్పించాలని జిల్లా అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ చెప్పారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయా పోలీసుస్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ఫిర్యాదులు పునరావృతం కాకుండా సమస్యపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. విచారణలో జాప్యంలేకుండా పారదర్శకమైన పద్ధతిలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కెవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ‘సర్’ ప్రక్రియలో భాగంగా నోటీసులను సంబంధిత ఓటర్లకు త్వరితగతిన జారీ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్లో ‘బుక్ ఎ కాల్’తో ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ప్రజలకు మరింత చేరువ అవుతుందని కలెక్టర్ అన్నారు. సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం తర్వాత అధికారులతో ఆమె సమీక్షించారు. అనంతరం భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్స్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఏలూరు (టూటౌన్): ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఏలూరు నగరంలో క్రైస్తవులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకుండా గత 76 సంవత్సరాలుగా తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆగస్టు 10న నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు గ్జేవియర్ నగర్‌లోని అమలోద్బవి కెథడ్రల్ గురువులు, పాస్టర్లు వివిధ మత శాఖలకు చెందిన క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఐసిఎం అగ్ర పీఠాధిపతులు రెవ.జాన్ ఎస్డి రాజు ప్రార్థన చేసి ర్యాలీని ప్రారంభించారు. అమలోద్భవి కెథడ్రల్ నుంచి ర్యాలీ ప్రధాన రహదారిలో కలెక్టరేట్‌కు వరకూ సాగింది. -
పొగాకు రైతు కుటుంబానికి వైఎస్ జగన్ ఆర్థిక సహాయం
బుట్టాయగూడెం: గుండెపోటుతో మృతి చెందిన పొగాకు రైతు పాలా వెంకటేశ్వరరావు కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీ తరఫున ప్రకటించిన రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చెక్కును సోమవారం రాత్రి బాధిత కుటుంబానికి అందజేశారు. ఇటీవల దేవరపల్లికి వచ్చిన వైఎస్ జగన్‌ను మృతి చెందిన పొగాకు రైతు వెంకటేశ్వరరావు భార్య సీతారత్నం, కుమారుడు శ్రీనివాస్, కుమార్తె సుజాత కలిసి తమ పరిస్థితిని వివరించారు. స్పందించిన వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పి, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, వైఎస్సార్సీపీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం కూడా స్పందించి ఈ రైతు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, పార్టీ జిల్లా కార్యదర్శులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాజీ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, నాయకులు పంపన నాగబాబు, పంపన కృష్ణ, జిత్తుక సురేష్, మేకరబోయిన శ్రీను, కుక్కల రాంపండు, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
గన్నవరం: గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ విక్రయిస్తున్న ఏడుగురు యువకుల ముఠా సోమవారం ఉంగుటూరు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు సోమవారం ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో నిందితులను అరెస్ట్ చూపించారు. ఈ సందర్భంగా ఎస్సై యూ గోవిందు మాట్లాడుతూ.. నూజివీడుకు చెందిన షేక్ సిద్ధిక్ హుస్సేన్‌బాషా, కస్తూరి హర్షవర్ధన్ అరకు ఏజెన్సీ ఏరియాలో గంజాయి కొనుగోలు చేసి మండల పరిధిలో విక్రయాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని గారపాడు వద్ద గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. బాషా, హర్షవర్ధన్‌తో పాటు మానికొండకు చెందిన కస్తూరి కార్తీక్, గోగు సంతోష్, ఆరేపల్లి సురేష్, చిట్టిపోతుల ప్రభు, చాట్ల చైతన్యను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రెండు కేజీల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు గంజాయికి అలవాటు పడడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. కేసులో ఏ–1 నిందితుడైన హుస్సేన్బాషాపై మాచవరం, విజయవాడ టూటౌన్, వీరవల్లి, ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. అనంతరం నిందితులను గన్నవరం కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
ఫ్లెక్సీల తొలగింపులో పక్షపాత వైఖరి
భీమవరం: భీమవరం పట్టణంలో మున్సిపల్ అధికారుల పక్షపాత వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు. కూటమి నాయకుల ఫ్లెక్సీలు తొలగించకుండా వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు, వైఎస్సార్ విగ్రహం దిమ్మెను మాత్రం తొలగించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతులకు భరోసా కల్పించడానికి గత నెల 15న భీమవరం పట్టణానికి వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేశారు. జగన్ పర్యటన ముగిసిన మరుసటి రోజునే మున్సిపల్ అధికారులు ఆ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఆగమేఘాలపై తొలగించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈనెల 4న కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో, యనమదుర్రు డ్రెయిన్ వంతెన ఇరువైపులా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేశారు. పుట్టినరోజు గడిచి వారం రోజులు కావస్తున్నా ఫ్లెక్సీలు తొలగించలేదని, ఇదేమి పక్షపాతమని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు వైఎస్సార్సీపీ నాయకులు సిమెంట్ దిమ్మె నిర్మించగా.. అక్కడ ఎటువంటి విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు లేవంటూ గత నెలలో మున్సిపల్ అధికారులు పొక్లెయినర్‌తో తొలగించారు. కానీ, అదే ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున ఆవిష్కరణలు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు పక్షపాత వైఖరిని విడనాడి విధులను సక్రమంగా నిర్వహించకపోతే తగిన శాస్తితప్పదని హెచ్చరిస్తున్నారు. -
పారా క్రీడాకారులకు అభినందనలు
భీమవరం (ప్రకాశంచౌక్): థాయ్‌లాండ్‌లోని శ్రీరాచాలో ఏప్రిల్‌లో నిర్వహించిన ’వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026లో జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఆ క్రీడాకారులు సోమవారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా నుంచి మరికొంతమంది క్రీడాకారులు తయారవ్వాలని ఆమె ఆకాంక్షించారు. పారా అథ్లెటిక్స్‌లో అత్తిలి గ్రామానికి చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ షాట్‌పుట్ ఎఫ్–42 కేటగిరీలో బంగారు పతకం, జావెలిన్ త్రో ఎఫ్–42 కేటగిరీలో కాంస్య పతకం సాధించారు. అలాగే పాలకొల్లుకు చెందిన మురపాక నళిని రాజశేఖర్ పారా పికిల్‌బాల్ పీపీ–54 కేటగిరీలో కాంస్య పతకం, జావెలిన్ త్రో ఎఫ్–54 కేటగిరీలో వెండి పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే.ఆర్. కల్పశ్రీ, డీఆర్వో పీ. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి చాంపియన్‌షిప్ క్రీడా పోటీలు ప్రారంభం
భీమవరం: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే మంచి శారీరక దారుఢ్యంతో పాటు విద్యలోనూ అగ్రస్థానంలో నిలుస్తారని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం అమరావతి చాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ డి.విశ్వనాథ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ పి.రవీంద్రనాథ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డెవలప్మెంట్ ఆఫీసర్) నూతక్కి మోహన్‌దాస్ మాట్లాడుతూ క్రీడాకారులు మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడా ప్రతిభను చాటాలన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి వాలీబాల్‌లో 190 మంది, వెయిట్ లిఫ్టింగ్‌లో ఏడుగురు, చెస్‌లో 41 మంది, బ్యాడ్మింటన్‌లో 56, యోగాలో 63 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు అధ్యక్షత వహించగా, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత వర్మ, సీహెచ్.దిలీప్ చక్రవర్తి, పీడీలు పాల్గొన్నారు. -
కుమార్తెని అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదు
నూజివీడు: ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిన యువకుడిపై యువతి తల్లిదండ్రులు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొల్లపల్లికి చెందిన యువతి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని తన మేనమామ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ, మూడు రోజుల క్రితం వివాహం చేసుకుని బాపులపాడు మండలం వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, యువతిని భర్త ఇంటికి పంపించారు. అయితే, తమ అమ్మాయిని తమ దగ్గరకు పంపించాలంటే ఆమె భర్త రూ.12 లక్షలు డిమాండ్ చేస్తున్నాడంటూ సోమవారం నూజివీడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం: సర్వోదయ మండలి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో ‘భారత స్వాతంత్య్ర ఉద్యమం – అమరవీరుల త్యాగఫలాలు‘ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో 20 రచనలను ఉత్తమమైనవిగా ఎంపిక చేసినట్లు సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. పాఠశాల స్థాయిలో పి.సుహాసిని శ్రీదుర్గ (దర్శిపర్రు), ఎండీ యాస్మిన్ జారా (ఏలూరు), పి.వర్షిణి (జీలకర్రగూడెం), కె.కుషాలి (బొర్రంపాలెం), టి.కుసుమ (కళ్లచెరువు), సీహెచ్ భాను (సీతంపేట), ఏవీ స్వాగత్ (భీమవరం), ఎస్‌సీహెచ్.సత్యబ్రాహ్మణి (కొయ్యలగూడెం), సి.సాహితి (అత్తిలి), కె.క్రాంతి (పెదనిండ్రకొలను), కె.వర్ష (పాలకోడేరు), సీహెచ్.నాగవర్షిణి (రాయకుదురు), కె.వైష్ణవి (అనాకోడేరు), డి.గీతాంజలి (పాలకొల్లు), కేడీ కార్తీక్ (పత్తేపురం), ఓ.బిందు (ఈస్ట్ విప్పర్రు), కె.నిత్యత (నాగులగూడెం) ఎంపికయ్యారు. అలాగే, కళాశాలల స్థాయిలో కె.ప్రియాంక (జంగారెడ్డిగూడెం), ఎ.వర్షిత్ (పెన్నాడ), జె.ప్రణవి (వీరవాసరం) ఎంపికయ్యారని, విజేతలకు ఈ నెల 13, 14 తేదీల్లో భీమవరం, ఏలూరులలో బహుమతులు అందజేస్తామని ప్రసాదరాజు చెప్పారు. తణుకు అర్బన్: అమరావతి చాంపియన్‌షిప్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను మునిసిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు ప్రారంభించారు. అథ్లెటిక్స్‌లో 100, 200, 400 మీటర్ల రన్నింగ్ పోటీలు, జావలిన్‌త్రో, హైజంప్, షాట్‌పుట్ విభాగాల్లో జిల్లా నలుమూలల నుంచి 140 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనగా 24 మంది క్రీడాకారులు మొదటి స్థానంలో నిలిచి విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, డీవైఈవో డి.మురళిసత్యనారాయణ, ఏంపీడీవో కార్యాలయ ఏవో వి.కృష్ణచంద్రరావు, క్రీడల కోఆర్డినేటర్ సంకు సూర్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
యువతి గల్లంతు పాలకోడేరు: ప్రేమ వ్యవహారంలో నిరాశకు గురైన ఓ ప్రేమజంట కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గొరగనమూడి లాకుల సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కుముదవల్లికి చెందిన తురగళ్ల సందీప్ కుమార్ (22), పినతల్లి వద్ద ఉంటున్న గుడ్ల శ్రీలలిత జగదాంబిక అనే యువతి ప్రేమించుకున్నారు. జీవితంపై విరక్తి చెంది సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గొరగనమూడి వద్ద ఉన్న వేండ్ర పెద్ద కాలువలోకి ఇద్దరూ ఒకేసారి దూకారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సందీప్‌కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో యువతి లలిత కాలువలో కొట్టుకుపోయింది. పాలకోడేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. గల్లంతైన యువతి ఆచూకీ కోసం భీమవరం అగ్నిమాపక కేంద్రం, రెస్క్యూ సిబ్బంది, శిక్షణ పొందిన ఈతగాళ్ల సహాయంతో కాలువలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెనుమంట్ర: పెనుమంట్ర–వీరవాసరం రోడ్డులోని పొలమూరు పెట్రోల్ బంకు వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైక్లిస్టు మృతి చెందాడు. ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్లకు చెందిన చెల్లబోయిన నాగరాజు (55) తన కుమార్తెను చూసేందుకు పెనుమంట్రకు సైకిల్‌పై వస్తున్నారు. ఈ క్రమంలో పొలమూరు పెట్రోల్ బంకు సమీపానికి రాగానే వేగంగా వచ్చిన కారు ఆయన్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ నేరుగా పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడి కుమారుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన
భీమవరం: రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. బలరామ్, ఆలిండియా అగ్రగామి కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి పీవీ సుందరరామరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమవారం భీమవరం హెడ్‌పోస్టాఫీసు వద్ద నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో వారు మాట్లాడారు. ముందుగా స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ సెంటర్, తాలూకా ఆఫీస్ మీదుగా పోస్టాఫీస్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో బలరామ్, సుందరరామరాజు మాట్లాడుతూ... నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక సంపద సృష్టికర్తలైన రైతు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కార్మికులకు మేలు చేసే చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు అనుకూలమైన లేబర్ కోడ్స్‌ను తెచ్చారన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వాసుదేవరావు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి మాట్లాడుతూ... ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే కనీస వేతనాలు అమలు చేయాలని, గ్రామీణ పేదలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు జైల్‌భరోను అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో అక్కడ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు దండు శ్రీనివాసరాజు, గొర్ల రామకృష్ణ, డి. కళ్యాణి, ధనికొండ శ్రీనివాస్, కె. తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రైలులో అస్వస్థతతో ప్రయాణికుడు మృతి
ఏలూరు టౌన్: రైలులో ఓ ప్రయాణికుడు అస్వస్థతతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. సికింద్రాబాద్ నుంచి జార్ఖండ్ వెళ్లేందుకు రైలులో ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. రైలు విజయవాడ రైల్వే స్టేషన్ దాటిన అనంతరం ప్రయాణికుడు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు మెడికల్ ఎమర్జెన్సీపై ఏలూరు రైల్వే స్టేషన్లో అతడ్ని దించారు. రైల్వే హాస్పిటల్ వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కమలేష్ చౌదరిగా గుర్తించారు. అనారోగ్యంతో కమలేష్ మృతి చెందటంతో ఏలూరు రైల్వే పోలీసులు సాధారణ మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. తణుకు అర్బన్: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. తణుకు రూరల్ ఎస్ఐ నాళం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూరులో నివసిస్తున్న ఒగ్గువోలు వాణి అలియాస్ రోజా (43) 20 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి, గ్రామానికి చెందిన కాళిదాసు చిన్నారావు అలియాస్ చిన్నితో సహజీవనం చేస్తున్నారు. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో చలనం లేకుండా పడి ఉండడంతో, ఆమె కుమారుడు విజయ్‌కుమార్‌కు చిన్ని ఫోన్ చేసి తెలిపారు. ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించిన కుమారుడు, తన తల్లి చనిపోయినట్లు గుర్తించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీతమ్మ గోడుపై ఎంత నిర్లక్ష్యం!
వేలేరుపాడు మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడకం సీతమ్మ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తాట్కూరుగొమ్ము రెవెన్యూ పరిధిలో ఆమె భర్త మడకం రాజయ్య పేరిట ఉన్న 3.79 ఎకరాల భూమికి అవార్డు పాస్ అయింది. దీనికి బదులుగా రాసన్నగూడెం రెవెన్యూ సర్వే నంబర్ 54/1ఇ1లో 1.13 ఎకరాలు, 55/1లో 1.50 ఎకరాలు, 54/1ఇ5లో 1.10 ఎకరాలు.. మొత్తం 3.79 ఎకరాలను 2017లో కేటాయించి హక్కు పత్రం అందజేశారు. రాజయ్య మృతి చెందడంతో ఆ పట్టాను భార్య మడకం సీతమ్మ పేరిట నమోదు చేశారు. అయితే, ఆ భూమిని మరొకరు సాగు చేసుకుంటున్నా, అధికారులు సీతమ్మకు అప్పగించడం లేదు. గత ఎనిమిదేళ్లుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, కేఆర్‌పురం ఐటీడీఏ పీఓ కార్యాలయం, జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో, తన బ్రతుకులో న్యాయం జరిగేలా లేదని సీతమ్మ కన్నీరుమున్నీరవుతోంది. వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రాణాలు వదలాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా యంత్రాంగం స్పందించి ఈ బాధిత గిరిజనులకు తగిన భూమిని అప్పగించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
కాళ్లరిగేలా తిరిగినా కనికరించక..
వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన 74 ఏళ్ల కారం లక్ష్మయ్య.. జీవనాధారమైన వ్యవసాయ భూమిని అధికారులు అప్పగించకపోవడంతో ఆ దిగులుతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన భార్య కారం చిన్నక్కను కూడా అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. కారం లక్ష్మయ్యకు వేలేరుపాడు మండలం తిర్లాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 57, 60లలో 4.33 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనికి బదులుగా 2017లో జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం రెవెన్యూ సర్వే నంబర్ 118/1సీలో 4.33 ఎకరాల భూమిని జల్లేరు వాగు ఒడ్డున కేటాయించారు. అయితే, వరద ప్రవాహానికి ఆ భూమంతా కొట్టుకుపోయి, కనీసం అరెకరం భూమి కూడా మిగల్లేదు. అప్పటి నుంచి మరోచోట సాగుకు యోగ్యమైన భూమి చూపించాలని లక్ష్మయ్య అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. పీఓలు మారినప్పుడల్లా వినతిపత్రాలు సమర్పించడం పరిపాటైంది. స్వర్ణవారిగూడెంలో మిగులు భూమిగా ఉన్న సర్వే నంబర్ 33/1లో 4.00 ఎకరాలు, సర్వే నంబర్ 33/2లో 0.62 ఎకరాలను రెండేళ్ల క్రితం మండల సర్వేయర్, వీఆర్వో, వీఆర్ఏ పరిశీలించి చూపించారు. కానీ, స్వర్ణవారిగూడెం వీఆర్వో, వీఆర్ఏ, స్థానిక ఓ పార్టీ నేత కుమ్మకై ్క ఈ భూములను కాజేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపడితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. -
ముగిసిన సీబీఎస్ఈ టేబుల్ టెన్నిస్ పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీబీఎస్ఈ టేబుల్ టెన్నిస్ క్లస్టర్ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన ఉత్కంఠభరితమైన పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఆర్ రెడ్డి విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్ వీవీ బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ వల్లభనేని శ్రీకృష్ణ, ట్రెజరర్ ప్రసాదరావు, డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్, ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ కే.వెంకటేశ్వరరావు, సీబీఎస్ఈ అబ్జర్వర్ భూపతిరాజు రామకృష్ణంరాజు, సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పీ.సాయి కుమారి శంకర్ పాల్గొన్నారు. విజేతల వివరాలు ● అండర్–14 బాలుర విజేత – సామ్రాక్ స్కూల్, రన్నరప్ – లిటిల్ ఏంజెల్స్, వైజాగ్ ● అండర్ –14 బాలికల విజేత – శ్రీ ప్రకాష్, పెద్దాపురం, రన్నరప్ – టైమ్ స్కూల్ ● అండర్ –17 బాలుర విజేత – లిటిల్ ఏంజెల్స్, రన్నరప్ – హ్యాపీ వ్యాలీ, ఆగిరిపల్లి ● అండర్– 17 బాలికల విజేత – శ్రీ ప్రకాష్, రన్నరప్ – సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ● అండర్–19 బాలుర విజేత – చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్, రన్నరప్ – శ్రీ ప్రకాష్, పెద్దాపురం ● అండర్ 19 బాలికల విజేత – శ్రీ ప్రకాష్, పెద్దాపురం, రన్నరప్ – సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ సింగిల్స్ విభాగంలో ● అండర్ 14 బాలురు విజేత – సాయి మన్విత్, సామ్రాక్ స్కూల్, రన్నరప్ – హ్రిఆన్ కే సుచిత్ర స్కూల్ ● అండర్ 14 బాలికల విజేత – రిధి టొరో, టైమ్స్ స్కూల్, రన్నరప్ – హెత్విక కొల్లి ● అండర్ 17 బాలుర విజేత – జి.లోహిత్, ఎన్ఎస్టీ మాథ్యూస్, రన్నరప్ – ఉదయం కామ్రా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ ● అండర్ 17 బాలికల విజేత – జీ.గాయత్రి కృష్ణ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం, రన్నరప్ – టి.సాయి సుదీక్ష ● అండర్ 19 బాలుర విజేత – చేతన్ సాయి, చిరాక్ స్కూల్, రన్నరప్ – టీ.సాయి శ్రవణ్, శ్రీ ప్రకాష్, పెద్దాపురం ● అండర్ 19 బాలికల విజేత – మౌపర్ణ దాస్, శ్రీ ప్రకాష్ సినర్జీ, పెద్దాపురం, రన్నరప్ – ఎం. లినిషా, సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ -
వైఎస్సార్సీపీలోకి సత్యవరం టీడీపీ నాయకులు
పెనుమంట్ర: పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నా యకులు ఆదివారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఆచంట నియోజకవర్గ ఇన్చార్జి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ సర్పంచ్ దివంగత చుక్క అప్పారావు సోదరుడు చుక్క శ్రీనివాస్, పుష్పలత దంపతులతో పాటు వారి సోదరులు గౌతమ్‌కుమార్, 14 మంది టీడీపీ సీనియర్ నాయకులు ఆదివారం తూర్పుపాలెం శ్రీరంగనాథరాజును కలిశారు. వారితో పాటు గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెడ్డం విఘ్నేశ్వరులు, కుక్కల సూర్యనారాయణ, చెల్లబోయిన శ్రీను, కట్ట వెంకటేశ్వర్లు ముప్పిడి మోసే, గుబ్బల రామకృష్ణ, కట్ట మురళి, చొక్కాకుల నాగులు, మంగం మారేస్, ఖండవల్లి సురేష్ మంగం చిన్న వెంకటరావు తదితర నాయకులతో పాటు సుమారు 80 మంది కార్యకర్తలకు శ్రీరంగనాథరాజు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం కల్పిస్తున్నామని, అదే స్ఫూర్తితో కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలను కూడా అండగా నిలుస్తామన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ ప్రభు త్వం నెరవేర్చలేని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. మాట తప్పని.. మడం తిప్పని వైఎస్ జగన్మోహన్రెడ్డి, శ్రీరంగనాథరాజుల నా యకత్వంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు చె ప్పారు. పోడూరు జెడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు, మండల పార్టీ అధ్యక్షుడు గూడూరు దేవేంద్రుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు తమనంపూడి పల్లారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి టి. సూర్య వెంకట గణేష్ రెడ్డి, అయ్యప్పరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గడ్డం ఈశ్వరుడు, సీనియర్ నాయకుడు నల్లమిల్లి ప్రభాకర్ రెడ్డి, జక్కంచెట్టు శ్రీరాములు, పోతిమూడి రామచంద్రరావు, గుబ్బల వీరబ్రహ్మం, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుర్ర రవికుమార్ తదితరులు ఉన్నారు. -
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
ఆకివీడు: స్థానిక పెదపేటలో ఉంటున్న 17 ఇళ్లకు మార్కింగ్ వేసి భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని ఆలిండియా లాయర్స్ యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ప్రాంతాన్ని ఆదివారం ప్రతినిధి బృందం పరిశీలించింది. అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో నిర్మించుకున్న ఇళ్లను ఖాళీ చేయించాలంటే నోటీసులు ఇవ్వాలని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లతామన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దిగుపాటి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు కామన మునిస్వామి, జిల్లా కమిటీ సభ్యులు రామగాని కాస్ట్రో, సునీల్ కుమార్, వేగేశ్న సుబ్బరాజు పాల్గొన్నారు. -
ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేస్తే పట్టించుకోరా?
నూజివీడు: పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.80 లక్షలతో నిర్మించిన ఆసుపత్రి భవనం కిటికీల అద్దాలను ధ్వంసం చేస్తే అధికారులు ఎందుకు స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రశ్నించారు. నూజివీడులో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కిటికీల అద్దాలను ధ్వంసం చేస్తే దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరు కాపాడాలో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అద్దాలను పగులగొట్టి ఐదు రోజులైనా ఇంత వరకు మున్సిపల్ అధికారులు గాని, పోలీసులు అధికారులు గాని స్పందించకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చి రెండేళ్లైనా కూటమి పాలకులు అందులో ఆసుపత్రిని ఏర్పాటు చేయకుండా భవనాన్ని వృథాగా ఉంచుతున్నారని ధ్వజమెత్తారు. పట్టణంలోని ప్రజలకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కోనేరుపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అనేక ప్రైవేటు ఆసుపత్రిలు అందుబాటులో ఉన్నాయని, ఎమ్మార్ అప్పారావు కాలనీలో నివసిస్తున్న దాదాపు 8 వేల మంది పేద ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాలకులపై లేదా అని నిలదీశారు. తనకేదో పేరు వస్తుందని పాలకులు సంకుచిత స్వభావంతో ఈ భవనంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం లేదని దుయ్యబట్టారు. ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులు అద్దాలు ధ్వంసం చేసిన ఆసుపత్రి భవనాన్ని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, నాయకులు మస్తాన్‌వలీ, కాలి సుగుణరావు తదితరులు పరిశీలించారు. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడం దారుణమన్నారు. -
కొల్లేరు సంగతేంటి బాబూ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. ఆక్వా విద్యుత్ చార్జీలు తగ్గించి రైతులను ఆదుకుంటాం.. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా ప్రారంభించి పూర్తి చేస్తాం.. ఇలా లెక్కకు మించిన హామీలు గుప్పించారు. ఇక సూపర్‌సిక్స్ పేరుతో హామీలిచ్చి ఆడబిడ్డ నిధికి ఎగనామం పలికారు. ఉమ్మడి పశ్చిమకు లెక్కకు మించి హామీలిచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారు. ప్రభుత్వం కొలువుతీరి రెండేళ్లు అయినా హామీల అతీగతీ లేదు. సోమ వారం కై కలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. కొల్లేరు సరిహద్దులు సాధ్యమేనా? ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు, ఉండి, ఏలూరు నియోజకవర్గాల్లోని 9 మండలాల్లోని 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. మొత్తం 122 గ్రామాలు కొల్లేరు పరీవాహకంలో ఉన్నాయి. అభయారణ్యంలో జిరాయితీ భూములు 14,932 ఎకరాలు, డీ–పట్టా భూము లు 5,510 ఎకరాలు కలిపి 20,442 ఎక రాలు ఉన్నాయి. వీటిని మినహాయించాలని ప్ర భుత్వం సీఈసీని కోరింది. ఇదిలా ఉంటే ఇదిగో కొల్లేరు మిగులు భూములు ఇచ్చేస్తోన్నారు? పత్తేపురం వద్ద సొసైటీ భూములు కేటాయిస్తాం అంటూ రాజకీయ నేతలు పబ్బం గడుపుకోడానికి పదేపదే వల్లిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆధీనంలో సీఈసీ ఒకటి చెబితే దానిని ఇక్కడ కొల్లేరు ప్రజలకు మరో రకంగా నాయకులు చెబుతున్నారు. దీనిపై స్పష్టమైన హామీని సీఎం చంద్రబాబు నుంచి కొల్లేరు ప్రజలు ఆశిస్తున్నా రు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ (అ ప్సడా) చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. కంటి తుడుపు చర్యగా విద్యుత్ సబ్సిడీ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆక్వా రంగం దేశంలోనే ప్రథమ స్థానం సాధిస్తుండగా ఏలూరు జిల్లా కలిదిండి మండలం తలసరి ఆదాయంలో ఏపీలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. అలాంటి ప్రాంతానికి సీఎం విచ్చేస్తున్నారు. జిల్లాలో రాయితీ విద్యుత్ కనెక్షన్లు 16,332 ఉన్నాయి. జోన్, సాగు విస్తీర్ణంతో సంబందం లేకుండా ఆక్వా రైతులు అందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తానని, 500 ట న్నుల కెపాసీటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామని, ఏరియేటర్లు సబ్సిడీ ఇ స్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు.ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షల ఎకరాలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాలు మొత్తంగా 2.90 లక్షల్లో ఆక్వాసాగు ఉంది. మొత్తంగా 65 వేల మంది రైతులు ఆక్వాపై ఆధారపడి జీవిస్తున్నారు. మేత తయారు చేసే కంపెనీలు టన్నుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు (వనామీ రొయ్యల మేత కిలోకు రూ.8, టైగర్ రొయ్యల మేత కిలోకు రూ.10 చొప్పున) ధరలను పెంచేశాయి. మేత కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమంగా ధరలను పెంచుతున్నాయని రైతులు పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మేత బస్తాల ను రోడ్లపై తగలబెట్టారు. రైతులతో చర్చించకుండా ధరలు ఎలా పెంచుతారని నిలదీశారు. ఆందోళనలు తీవ్రంగా కావడంతో మే త ధరల తగ్గింపు విషయాన్ని సీఎం చెప్పింది ఒకటైతే క్షేత్రస్థాయిలో ధరల తగ్గింపు లేదు. హామీల అమలెప్పుడో? కొల్లేరు సరిహద్దులు మార్పు సాధ్యమేనా? ఆక్వా మేత ధరల తగ్గింపులో చెప్పింది ఒకటి.. జరిగింది మరొకటి క్రాప్ హాలీడేను ప్రకటిస్తున్న ఆక్వా రైతులు నేడు సీఎం చంద్రబాబు రాక ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం నిర్వాసితులకు పరిహారం, కొల్లేరు సరస్సు పరిరక్షణ అంటూ హామీలు గుప్పించారు. వీటిని అమలు చేయలేదు. కొల్లేరు సరస్సు పరిరక్షణపై నేరుగా కేంద్రంతో మాట్లాడే అవకాశం ఉన్నా శ్రద్ధ తీసుకోవడం లేదని కొల్లేరు వాసులు భావిస్తున్నారు. -
●రహ‘దారి’ద్య్రం
భీమవరం మండలంలోని కొత్తపూసలమర్రు నుంచి దొంగపిండి వరకు ఆర్అండ్బీ రోడ్డుపై భారీ గోతులతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇటుగా స్కూల్ బస్సులు, ఆటోలు, చేపల లోడుతో భారీ లారీలు, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ గోతుల్లో వాహనాలు దిగబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. అలాగే ఒళ్లు హూనమై పోతుందని అంటున్నారు. ఈ ప్రాంతంలో మరమ్మతులు చేస్తున్నా మళ్లీ గోతులు పడుతున్నాయని, వర్షం నీరు నిలిచి రోడ్డు మరింత అధ్వానంగా మారుతుందని చెబుతున్నారు. అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – భీమవరం అర్బన్ -
కోడిపందేలపై దాడి
నూజివీడు: మండలంలోని పాత రావిచర్లలో నిర్వహిస్తున్న కోడిపందేలపై ఆగిరిపల్లి పోలీసులు ఆదివారం సాయంత్రం మెరుపుదాడి చేశారు. గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారంటూ వచ్చిన విశ్వనీసయ సమాచారం మేరకు ఆగిరిపల్లి ఎస్ఐ హెచ్.నాగరాజు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పందెంగాళ్లు, చూడటానికి వచ్చిన వారందరూ పారిపోగా దాదాపు 13 ద్విచక్ర వాహనాలు, కోడిపుంజును స్వాధీనం చేసుకున్నారు. పాత రావిచర్లలో ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఆదివారం వస్తే మాత్రం గ్రామంలో అంకమ్మ తల్లి గుడి ఎదురుగా పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేలలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. దీనిలో భాగంగా నూజివీడు మండలం రామన్నగూడెం, కృష్ణాజిల్లాలోని ఉంగుటూరు మండలం పొట్టిపాడు, కోడూరుపాడు, హనుమాన్‌జంక్షన్, విజయవాడ సమీపంలోని నున్న తదితర గ్రామాల నుంచి కూడా కోడిపందేలకు తరలివచ్చారు. కోడిపందేలు జరుగుతుండగా పందెగాళ్ల మధ్య గొడవ జరగడంతో సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు దాడి జరిపారు. -
పాపికొండల వైపు పెద్దపులి
బుట్టాయగూడెం: గత నెల 30న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి పోలవరం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సంచరిస్తూ పశువులను హతమార్చింది. ఆదివారం లంకపాకల సమీపంలోని కాల్వ నుంచి నడుచుకుంటూ పాపికొండల అభయారణ్యంలోకి ప్రవేశించింది. బుట్టాయగూడెం మండలం వీరమద్దిగూడెం మీదుగా ముంజులూరు అటవీప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాపికొండల అభయారణ్యంలో దట్టమైన అడవిలో ఉండడం వల్ల అటవీశాఖ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. శనివారం గురుగుమిల్లి, గవరంపేటలో మూడు పశువులపై దాడి చేసిన పెద్దపులి శనివారం ఎక్కడా కూడా పశువులపై దాడి చేసిన దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. గిరిజన ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులిని అటవీశాఖ అధికారులు త్వరితగతిన పట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ పెద్దపులి సంచారంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారన్నారు. అలాగే అనేక పశువులను పులి హతమార్చడంతో తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని అన్నారు. పరిహారం మాట ఎలా ఉన్నా పశువులను కాపాడాలని ప్రజలపై పులి దాడి జరగకముందుగానే పులిని పట్టుకుని జూకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. -
వాడపల్లి వెంకన్నకే శఠగోపం !
● వాడపల్లి ఆలయ సన్నిధిలో అన్నదానానికి రూ.1.5 కోట్ల సామగ్రి ● మూడేళ్ల క్రితమే సిద్ధం చేసిన పశ్చిమ మిల్లర్స్ అసోసియేషన్ ● గత సీజన్లో మిల్లర్ల నుంచి సుమారు రూ.4.5 కోట్లు వసూలు చేసిన ముఖ్య నేత ● ఇప్పటికీ అసోసియేషన్ గోడౌన్ వద్దే మూలుగుతున్న సామగ్రి ● ఆ సొమ్ములు ఏమైనట్టని రైస్ మిల్లింగ్ వర్గాల్లో చర్చ సాక్షి, టాస్క్‌ఫోర్స్: వాడపల్లి వెంకన్న పేరిట అసోసియేషన్ నేత వసూళ్లపై పశ్చిమ రైస్ మిల్లింగ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వెంకన్న సన్నిధిలో అన్నదానం పేరిట క్వింటాల్ ధాన్యానికి రూ.5 చొప్పున గత సీజన్లో సుమారు రూ.4.5 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అప్పటికే సమకూర్చిన సామగ్రి ఇప్పటికీ మూలన ఉండగా ఆ సొమ్ములు ఏమాయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రూ.1.50 కోట్ల సామగ్రి జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు అనుబంధమైన గోదావరి సొసైటీ గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించింది. భీమవరం, తాడేపల్లిగూడెంలోని కిచెన్స్ ద్వారా ఆహార పదార్థాలను పాఠశాలలకు సరఫరా చేసేవారు. ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని విద్యార్థుల కోసం పాలకొల్లులో కిచెన్ నిర్మించాలని 2021–22లో సొసైటీ నిర్ణయించింది. అందుకోసం చైన్నె నుంచి లక్ష మందికి ఏకకాలంలో అన్నం, సాంబారు, కూరలు సిద్ధం చేసేందుకు దాదాపు రూ.1.5 కోట్ల విలువైన బాయిలర్, స్టీమ్డ్ కుకింగ్ వెసల్స్‌ను చైన్నెలో తయారుచేయించి తీసుకువచ్చారు. అవసరమైన షెడ్లు నిర్మాణాలు చేపట్టారు. అప్పటికే ఈ నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్న భోజనం వంటలు చేస్తున్న మహిళలు ఉపాధి కోల్పోతారని భావించి కిచెన్ ఏర్పాటు ఆలోచనను అసోసియేషన్ విరమించుకుంది. ద్వారకాతిరుమల స్వామివారి సన్నిధిలో అన్నదానం నిమిత్తం గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని అసోసియేషన్ సామగ్రిని సమకూర్చింది. అదే మాదిరిగా పాలకొల్లులో కిచెన్ కోసం తె చ్చిన సామగ్రిని వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి భక్తులకు అన్నదానం కోసం దేవస్థానానికి అందించాలని నాడు గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఉన్న చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సొసైటీ చైర్మన్ పెనుమర్తి కృష్ణంరాజు, అసోసియేషన్ సభ్యులు భావించారు. ఈ మేరకు ఆలయ కమిటీతో చర్చించగా డైనింగ్ హాల్ సిద్ధమైన తర్వాత సామగ్రిని తీసుకువెళతామని సభ్యులు చెప్పినట్టు సొసైటీ నేత ఒకరు తెలిపారు. హాల్ సిద్ధం కావడంతో సామగ్రి కోసం ఆలయ ప్రతినిధులు 2024లో అసోసియేషన్ నేతలను కలిశారన్నారు. స్టీమ్డ్ కుకింగ్ వెసల్స్ వాడపల్లి వెంకన్న భక్తులకు అన్నదానం పేరిట 2024–25 మిల్లింగ్ సీజన్‌కు గాను గతేడాది మార్చిలో టన్ను ధాన్యంపై రూ. 50ల చొప్పున అసోసియేషన్ నేత ఒకరు దాదాపు రూ.4.5 కోట్ల మేర మిల్లర్లు నుంచి వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే వంట సామగ్రి ఇంకా తాడేపల్లిగూడెం రూరల్ పెదతాడేపల్లిలోని రైస్‌మిల్లర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవరణలో ఉందంటున్నారు. కిచెన్‌లో సామగ్రిని అమర్చడం, డైనింగ్ టేబుల్స్ నిమిత్తం రూ.50 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, రూ.కోట్లల్లో కలెక్షన్ ఎందుకు చేశారని, ఇప్పటికి సామగ్రి పంపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకన్న భక్తులకు అన్నదానం కోసమని వసూలు చేసిన సొమ్ములు ఏమైనట్టని మిల్లర్లు చర్చించుకుంటున్నట్టు సమా చారం. కాగా సదరు నేత కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, అధికారుల అండదండలతో ఇ ష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మిల్లింగ్ వర్గా ల్లో టాక్. ఆయనతో మనకెందుకొచ్చిన గొడవన్నట్టు మిన్నకుండి పోతున్నారంటున్నారు. -
కబ్జా కోరల్లో చెరువులు
లింగపాలెం: లింగపాలెం మండలంలో పలు ఇరిగేషన్ చెరువులు ఆక్రమణలతో బక్కచిక్కిపోతున్నాయి. మండలంలో సుమారు 96 ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలతో చెరువు గర్భాలు కుచించుకుపోవడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. వీటితో చెరువు ఆయకట్టదారుల పంటలకు నీరు చాలక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షాలకే చెరువులు నిండుతున్నాయని దీంతో సాగు నీరు సమృద్దిగా ఉండటంలేదని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు గర్భాల వైశాల్యం తగ్గిపోవటంతో నీరు త్వరితగతిన అయిపోవటంతో పంటలకు సాగు నీటి కొరత ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. ఈ చెరువు ఆక్రమణలు కారణంగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు పడి రెండు మూడు సార్లు చెరువులు నిండితే గానీ పంటల సాగుకు నీరు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ ఆక్రమణలు ఇలాగే కొనసాగితే చెరువు గర్భాల వైశాల్యం పూర్తిగా తగ్గి, సాగుకు నీరు నిల్వ ఉండేపరిస్ధితి ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పలువురు అటవీ భూములను ఆక్రమించుకుని సాగుచేస్తున్నారు. ఆక్రమణలు కొందరు అధికారుల కనుసన్నల్లో సాగడంతో ఈ అక్రమాలకు హద్దూ అదుపు లేకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూబాగోతాలపై సమగ్ర విచారణ జరిపించి అక్రమంగా సాగుచేస్తున్న అటవీ భూములతోపాటు చెరువుల ఆక్రమణదారుల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
భీమవరం (ప్రకాశంచౌక్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. కొమరం భీమ్ చిత్రపటానికి జేసీ కేఆర్ కల్పశ్రీ, కలెక్టరేట్ ఏఓ ఎ.వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి.పుష్పరాణి, గిరిజన సంక్షేమ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ సమావేశం నిర్వహించారు. గిరిజన సంస్కతి, సాంప్రదాయాలు, హక్కులు, విద్యా, సామాజిక, ఆర్థిక అభివద్ధి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. జిల్లా ప్రోగ్రామింగ్ మేనేజర్ ఎ.శ్యాం, గిరిజన నాయకులు సాలా మల్లేశ్వరరావు, కుతాడి శ్రీనివాసరావు, మేకల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: అమరావతి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం తణుకు బాలుర ఉన్న త పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభించే పోటీల్లో జి ల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. పోటీలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభిస్తారని చెప్పారు. -
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. ఆగిరిపల్లి: మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో గ్రావెల్ లోడుతో వెళ్తున్న లారీ బంగారు దుకాణంలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. గ్రామస్తుల వివరాలు ప్రకారం ఆదివారం సాయంత్రం గ్రావెల్ లోడుతో లారీ అతివేగంగా విజయవాడ వెళుతుండగా నెక్కలం గొల్లగూడెం వద్దకు రాగానే ఎదురుగా కారును తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న శ్రీకృష్ణ జ్యువెలరీ షాపు దుకాణంలోకి దూసుకుపోయింది. అక్కడే ఉన్న వారు గమనించి వెంటనే పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రతిరోజు వందలాది గ్రావెల్ లారీలను మద్యం మత్తులో అతివేగంగా నడిపి ఆందోళనకు గురి చేస్తున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
చిట్టీల పేరుతో దగా
● ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు ● రూ.40 కోట్ల టోకరాపై ఏజెంట్లను నిలదీస్తున్న బాధితులు తణుకు అర్బన్: శ్రీదుర్గా భవాని చిట్స్ అండ్ ఫైనాన్స్ పేరుతో రూ.40 కోట్లకు టోకరా వేసిన వ్యవహారం తణుకు నియోజకవర్గంలో సంచలనం రేకెత్తించగా, ఈ ఘటనకు సంబంధించి బాధితులు భారీ స్థాయిలో బయటకు వస్తున్నారు. గత 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తూ అందరినీ నమ్మించిన ఫైనాన్స్ వ్యాపారి గోలి శ్రీనివాసరావు మోసంతో పేదవర్గానికి చెందిన బాధితులు అల్లాడిపోతున్నారు. తణుకు ఇరగవరం కాలనీ అక్షయనగర్‌లో అధునాతన వసతులతో విలాసవంతంగా నిర్మించుకున్న నాలుగు అంతస్థుల భవనంలో నివసిస్తున్న గోలి శ్రీనివాసరావు చిట్టీల పేరుతో పేదవర్గాల నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్న విషయం తెలిసిందే. ఆదివారం వివిధ ప్రసార సాధనాలు, పత్రికల్లో వచ్చిన వార్తలతో బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. తణుకు కేంద్రంగా నిర్వహించిన ఈ దోపిడీలో ఇరగవరం మండలంలో అధిక శాతం బాధితులు ఉండగా, అత్తిలి, పెనుమంట్ర తదితర ప్రాంతాల్లో సైతం అనేకమంది మోసపోయారు. దీనిపై ఇప్పటికే ఇరగవరం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. చిట్టీల వ్యవహారం బయటపడడంతో రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తణుకు పోలీస్ స్టేషన్‌కు ఏజెంట్లు గోలి శ్రీనివాసరావు చిట్టీల సంస్థలో పనిచేసిన ఏజెంట్లు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. సంస్థను నమ్మి డబ్బు కట్టిన బాధితులు తమను నిలదీస్తూ ఒత్తిడి చేస్తున్నారంటూ పోలీసులను వేడుకున్నారు. తాము చిట్టీల సంస్థలో పనిచేశామని, బాధితుల నుంచి డబ్బులు తీసుకుని సంస్థకు చెల్లించామని వారు చెబుతున్నారు. ఈ సంస్థలో 20 మందికి పైగా ఏజెంట్లు పనిచేస్తున్నట్లు సమాచారం. చిట్స్, ఫైనాన్స్ పేరుతో మోసానికి పాల్పడిన గోలి శ్రీనివాసరావు ఆచూకీ ఇంకా దొరకలేదు. బాధితులంతా పేదవర్గానికి చెందినవారే అధికంగా ఉండడంతో వారి నుంచి ఒత్తిడి పెరుగుతోంది. శ్రీనివాసరావు, అతని కుటుంబసభ్యుల ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో ఆచూకీ లభించడంలేదని బాధితులు వాపోతున్నారు. చిట్టీల శ్రీనివాసరావు వ్యవహారాన్ని పోలీసులు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. మోసం భారీ స్థాయిలో ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చిట్టీల వ్యవహారంలో ఎంతమంది బాధితులు ఉన్నారు, మొత్తం ఎంత అనే కోణంలో పోలీసులు ఇప్పటికే కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతోపాటు సంస్థలో పనిచేస్తున్న ఏజెంట్లను కూడా ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు బాధితులు వస్తుండడంతో అసలు మోసపోయిన మొత్తం రూ. 40 కోట్లేనా లేక మరింత ఎక్కువ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆక్వా రైతుల పోరాట ఫలితమే
పాలకొల్లు సెంట్రల్: అందరూ సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి నిదర్శనం ఆక్వా రైతులందరికీ రాయితీ యూనిట్ ధర నిర్ణయానికి కారణమని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు బోణం చినబాబు అన్నారు. ఆదివారం స్థానిక కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని ఉండేవన్నారు. ఆక్వా జోన్లో ఉన్న రైతులకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ వర్తించేదని నేడు నాన్ ఆక్వా జోన్లో ఉన్న ఆక్వా రైతులకు కూడా రూ.1.50 విద్యుత్ యూనిట్ ధరను వర్తింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. ఈ విజయానికి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు ఆధ్వర్యంలో చేసిన పోరాట పలితమేనని అన్నారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న పాలకొల్లు రామచంద్రా గార్డెన్స్ వెనుక భాగంలో ఉదయం 10 గంటలకు ఆక్వా రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బుట్టా రామ్‌కుమార్‌లతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పెన్మెత్స సత్యనారాయణ రాజు, సజ్జా బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచర్ల అరెస్టు
కుక్కునూరు: కుక్కునూరు మండలంలోని గుండంబోరు వద్ద మహిళ మెడలో బంగారు గొలుసు తెంచుకుని కారులో పారిపోతున్న నలుగురిని తెలంగాణ సరిహద్దులోని గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాధితుల సమాచారం ప్రకారం.. గుండంబోరులో చర్చికి వెళ్ళి తిరిగి వస్తున్న ఒక మహిళను కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్రస్ అడుగుతున్నట్లు నమ్మించి మాటలు కలిపారు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని కారులో పరారయ్యారు. గమనించిన బాధితురాలి బంధువులు వెంటనే వాహనంలో వారిని వెంబడించారు. నిందితుల కారు వేగంగా వెంకటాపురం రహదారి మీదుగా తెలంగాణ సరిహద్దుల్లోకి దూసుకెళ్లింది. ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామానికి చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఢీకొట్టడంతో కారు ముందు భాగం దెబ్బతిని అక్కడే నిలిచిపోయింది. అనుమానంతో స్థానిక తిమ్మంపేట గ్రామస్తులు కారులోని వారిని అడ్డుకోగా, అప్పటికే వెంబడిస్తూ వచ్చిన బాధితురాలి బంధువులు అక్కడికి చేరుకుని అసలు విషయం తెలిపారు. దీంతో గ్రామస్తులు నలుగురు నిందితులను పట్టుకుని ములకలపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి నిందితులను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం కుక్కునూరు పోలీసులకు అప్పగించారు. -
వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షురాలు జానకిరెడ్డి మృతి
చింతలపూడి: వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ ఏఎంసీ చైర్పర్సన్ జగ్గవరపు జానకిరెడ్డి(60)ఆకస్మికంగా కన్నుమూశారు. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం ఆదివారం ఉదయం తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడుతుండగా, ఆమెకు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. కుటుంబసభ్యులు, అనుచరులు వెంటనే స్పందించి మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యలో ఏలూరు సమీపానికి చేరుకునేసరికి ఆమె పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. జానకిరెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది. నిరంతరం ప్రజల్లో ఉంటూ, పార్టీ బలోపేతానికి విశేష సేవలందించిన నాయకురాలిని కోల్పోవడం తీరని లోటని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు, మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు, మండల అధ్యక్షుడు ఎస్.రమేష్‌రెడ్డి, పట్టణ వైపీపీ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, ఎ.సుబ్బారావు తదితరులు జానకిరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. పాలకొల్లు సెంట్రల్: ధార్మిక సామాజిక పరిషత్ ఆధ్వర్యంలో సూర్యహోమం నిర్వహించారు. ఆదివారం స్థానిక హనుమాన్ కాలనీలో ఉన్న సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో 324వ సూర్యహోమం ఘనంగా చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సూర్యహోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పురోహితుడు రవీంద్ర బ్రహ్మత్వంలో ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ ఈ హోమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ హోమంలో పి.సత్యనారాయణరాజు, నిర్వాహకులు గాదె బాబు, నంబూరి పుల్లయ్య, జగపతిరాజు, సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు. మండవల్లి: కొల్లేరు వరద నీటిని, ఉప్పు నీటిని నియంత్రించే రెగ్యులేటర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ఎస్ భాస్కరరావు పేర్కొన్నారు. ఆదివారం మాట్లాడుతూ కొల్లేరు సరస్సుకు తిరిగి గత వైభవం రావాలన్నా, పక్షుల, మత్స్యకారుల జీవనం సజావుగా సాగాలన్నా, మత్స్య సంపద సమృద్ధిగా పెరగాలన్నా రెగ్యులేటర్ నిర్మాణమే మార్గమని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరు సరస్సుకు భారీగా నీరు చేరుతుందని నీటిని నియంత్రించలేక పోవడంతో ఈ నీరంతా సముద్రంలో వృథాగా పోతుందన్నారు. నీరు ఎగతన్ని కొల్లేరులో కలవడంతో నీరు ఉప్పుమయమై భూములు చౌడుబారుతున్నాయని చెప్పారు. బుట్టాయగూడెం: కేఆర్‌పురం ఐటీడీఏలో ఆదివారం జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని జెడ్పీటీసీ మొడియం రామతులసి తీవ్రంగా ఆరోపించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి జరిగే గిరిజన పండుగలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతోపాటు తనకు ఆహ్వానం రాలేదని ఆరోపించారు. ఈ సంఘటనతో ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌ల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రామతులసిని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తెల్లం రమణ, మాజీ సర్పంచ్‌లు కూరం వెంకటేశ్వరరావు, బన్నే బుచ్చిరాజు, తెల్లం వెంకాయమ్మ, తెల్లం రాముడు, మాల్చి వెంకన్నబాబు, జోడే సత్యదుర్గాప్రసాద్, ఎంపీటీసీ గాలి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు. -
క్షీరారామం.. మోక్షధామం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో 10 రోజులు విశేష పూజలు జరుగుతున్నాయి. సోమవారం లోక కల్యాణార్థం ఉదయం 7.15 గంటలకు (ఆరుద్ర నక్షత్రం) జలాభిషేకం నిర్వహించనున్నారు. ఆదివారం ఆలయ అ భిషేక పండిట్ భమిడపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, సుబ్బయ్యల బ్రహ్మత్వంలో 108 కలశాలతో మహాన్యాసం, రుద్రాభిషేకం, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావ (రాము), ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: ఆరుగొలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 5, 6వ తరగతి, జూనియర్ ఇంటర్లో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎం.దుర్గారావు ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 10 సీట్లు, 6వ తరగతిలో ఒక సీటు, జూనియర్ ఇంటర్ (10వ తరగతిలో 400లకు పైగా మార్కులు వచ్చిన వారు) ఎంపీసీ గ్రూపులో ఎనిమిది సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. ఆసక్తి గల వారు ఎస్సీ విద్యార్థులు ఈ నెల 10న గురుకులంలో సంప్రదించాలని కోరారు. కలిదిండి(కై కలూరు) : ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కలిదిండిలో పర్యటించనున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పర్యటన వివరాలు వెల్లడించారు. మీ భూమి–మీ హక్కు పట్టాల పంపిణీలో భాగంగా ఇక్కడకు రానున్నారని, ఉదయం 10.45 గంటలకు ఇక్కడకు చేరుకుంటారన్నారు. హెలీప్యాడ్, సభ, సమావేశ స్థలాలను ఆదివారం పరిశీలించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వీ, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జేసీ, ఆర్డీవో, సబ్ కలెక్టర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
ఆక్వారంగం బలోపేతానికి కృషి
ఆక్వారంగంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి సమస్యలను పరిష్కరించేందుకు ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తోంది. 8లో uఅభివృద్ధి పనుల ముసుగులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో రామన్నగూడెం రావుల చెరువు వివాదాలకు నిలయంగా మారింది. 8లో uఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. డీఎస్సీ అక్రమాలపై విచారణ, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం, ఆచంట, పాలకొల్లు, భీమవరం, తణుకు ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. తాడేపల్లిగూడెంలో.. డీఎస్సీలో దొడ్డిదారిన జరిగిన నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 7 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. నీట్ అక్రమాలపై కేంద్రమంత్రి రాజీనామా చేసినట్లుగానే, డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఆచంటలో.. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఆచంటలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆచంట, పెనుమంట్ర, పోడూరు, పెనుగొండ మండలాల నుంచి వందలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. యువతకు అండగా ఉంటామన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భీమవరంలో.. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నేతృత్వంలో భీమవరంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక సర్టిఫికెట్లు రాక అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలకు లోకేష్ బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తణుకులో.. ఎన్నికల సమయంలో డీఎస్సీ కోసం మొదటి సంతకం చేస్తామన్న కూటమి నేతలు అభ్యర్థులను దగా చేశారని నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల విమర్శించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో ఆమె మాట్లాడుతూ.. మెరిట్ అభ్యర్థులను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాలకొల్లులో.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం డీఎస్సీని అవినీతి, అక్రమాలకు నిలయంగా మార్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద మూడో రోజూ రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడదల చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేయాలినేను ఎంఏ, బీఈడీ చదివాను. గత డీఎస్సీలో కష్టపడి చదవడంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి కాల్ లెటర్ కూడా వచ్చింది. ఉద్యోగం ఇచ్చే సమయానికి మెరిట్ జాబితాలో నా పేరు లేదు. న్యాయం కోసం మంత్రి లోకేష్‌తో పాటు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నాలాంటి ఎంతోమంది మోసపోయిన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి. – తగరం నాగరాజు, లింగపాలెం నేను బీఎస్సీ, బీఈడీ చదివాను. డీఎస్సీలో ఎలాంటి అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కట్టబెట్టడం వల్ల మాలాంటి మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అక్రమాలకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించి మోసపోయిన నిజమైన అభ్యర్థులను ఆదుకోవాలి. – వెలగలేటి వెంకటేశ్వరరావు, కొత్తూరు, కామవరపుకోట మండలం డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడిస్తారు? జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు -
మళ్లీ తిరిగొచ్చిన పెద్ద పులి
బుట్టాయగూడెం: తెలంగాణలోని అశ్వారావుపేట నుంచి మళ్లీ ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించిన పెద్దపులి బుట్టాయగూడెం మండలంలో భయాందోళనలు సృష్టిస్తోంది. శనివారం తెల్లవారుజామున గవరంపేట, గురుగుమిల్లి గ్రామాల శివారులో కట్టేసి ఉన్న రెండు ఎద్దులు, ఒక ఆవుపై దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం లంకపాకల సమీపంలోని కొండకాల్వ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో రేపల్లె, రేగులపాడు, డోలుగండి, మోదేలు, అలివేరు, లంకపాకల, గుళ్లపూడి, వీరమద్దిగూడెం తదితర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పశువులను ఇళ్ల వద్దే సురక్షితంగా కట్టేయాలని, రాత్రి వేళల్లో బయట తిరగవద్దని, పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. డీఎఫ్ఓ సందీప్‌రెడ్డి, జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారి దుర్గాకుమార్‌బాబు నేతృత్వంలో మహారాష్ట్ర బృందాలు, బెంగళూరు వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ నిపుణులు, ఆరుగురు ట్రాంక్విలైజింగ్ షూటర్లు రంగంలోకి దిగారు.లంకపాకల సమీపంలో ప్రత్యేక బృందాలు గురుగుమల్లిలో పెద్దపులి దాడిలో మృతి చెందిన ఎద్దు -
26న గీత కార్మికుల ధర్నా
భీమవరం: మద్యం షాపులు పెంచాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి హెచ్చరించారు. శనివారం భీమవరంలో కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన సంఘ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన భీమవరం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు కల్లుగీత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కల్లుగీత వృత్తిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా, ప్రభుత్వం ఆదుకోకపోయినా బ్రతుకుతెరువు కోసం తాటి చెట్లు ఎక్కుతూ జీవనం సాగిస్తున్న గీత కార్మికుల పొట్టలు కొట్టడం అన్యాయమన్నారు. భీమవరం: జిల్లాలో శనివారం నిర్వహించిన టెట్ పరీక్షకు 34 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ తెలిపారు. మొత్తం 450 మంది అభ్యర్థులకుగాను 416 మంది హాజరయ్యారని, పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో శనివారం నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షా కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి మొత్తం 329 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 167 మంది హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 162 మంది హాజరుకాగా, 13 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేశాయి. పరీక్షలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఎక్కడా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిపించారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.2,32,549 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిర్వహించిన ధర్మకర్తల మండలి సాధారణ సమావేశంలో పలు అభివృద్ధి పనుల టెండర్లకు ఆమోదం తెలిపినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ రాజాన సత్యనారాయణ, ఆలయ సహాయ కమిషనర్, ఈఓ ఆర్వీ చందన వెల్లడించారు. స్వామివారి గర్భాలయ ద్వారాలకు వెండి తాపడం వేయడంతో పాటు, అన్నదాన భవనంలో భక్తుల సౌకర్యార్థం స్టీలు బల్లలు, వంటల తయారీకి స్టీమ్ సౌకర్యం కల్పించే పనులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు స్వామివారికి విశేష అలంకరణ జరిపించారు. ఉదయం 6 గంటల నుంచి మొదటి మార్గంలో భూవరాహ స్వామి దర్శనం అనంతరం భక్తులు ఏడు శనివారాల కాలినడక దీక్షలు ప్రారంభించారు. దీక్షాపరుల కోసం ప్రత్యేక ఉచిత దర్శనం, అష్టోత్తర పూజల నిమిత్తం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన మండపంలో ఉచిత అన్న ప్రసాద వితరణ చేపట్టారు. దాతలను ఆలయ మర్యాదలతో శేషవస్త్రాలు కప్పి, ప్రసాదాలతో ఘనంగా సన్మానించారు. -
కొండలపైనే జీవనం.. సంక్షేమానికి దూరం
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన తెగల్లో కొండరెడ్డి గిరిజనులు ఒకరు. వీరు నేటికీ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వారి సంప్రదాయ పంటలైన జొన్న, సామలు, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాగే పలు గ్రామాల్లో వెదురు అల్లికలు, తేనె, చింతపండు, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. వారాంతపు సంత, ఇతర ప్రభుత్వ కార్యాలయ పనుల నిమిత్తం మాత్రమే కొండ దిగి కిందకు వస్తుంటారు. వీరికి ప్రధానంగా పోడు వ్యవసాయమే జీవనాధారం. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు కావొస్తున్నా నేటికీ కొండరెడ్డి గిరిజనులు కొండ ప్రాంతంలోనే జీవనం సాగిస్తూ, ప్రకృతిమాత ఒడిలోనే జీవిస్తున్నారు. ప్రకృతే దైవం : ఆదివాసీ గిరిజనులు ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రావి, వేప చెట్లను ముత్యాలమ్మగా భావిస్తారు. ముఖ్యంగా బాట పండుగ, పప్పుల పండుగ, మామిడికాయ పండుగ వంటి పండుగలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే, గిరిజనుల్లోని కోయ తెగవారు భూదేవి పండుగను తొలకరి సమయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నేటికీ ఈ పండుగ సంప్రదాయం సజీవంగా కొనసాగుతోంది. జగన్ పాలనలో సంక్షేమానికి పెద్దపేట : గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారు. సుమారు 3,220 మంది గిరిజనులకు 69,814.72 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేశారు. ‘రైతు భరోసా’ పథకం ద్వారా రైతులకు ప్రతిఏటా రూ.15,000 పెట్టుబడి సాయం అందేలా కృషి చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు సైతం మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొండపైన ఉన్నవారికి కూడా పింఛన్లు ఇంటికే అందేలా చేశారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా సుమారు రూ.50 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అలాగే మారుమూల గ్రామాల ప్రజలకు డోలి కష్టాలు తప్పించేందుకు బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. గిరిజనులకు పునరావృతమవుతున్న కష్టాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో అమలైన కొన్ని సంక్షేమ పథకాల అమలులో మార్పులు చోటుచేసుకున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డీసీఎం వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు అందించేవారు. ప్రస్తుతం ఆ విధానం నిలిచిపోవడంతో గిరిజనులు మళ్లీ వాగులు దాటుతూ, తలపై బియ్యం మూటలు పెట్టుకుని మైళ్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా కోడికూయక ముందే మారుమూల కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి సైతం పింఛన్లు అందేవి. ప్రస్తుతం ఆ పింఛన్లు అందడానికి వారం రోజులకు పైగా సమయం పడుతోందని గిరిజనులు వాపోతున్నారు. అదేవిధంగా వైద్యసేవల పట్ల కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. పోడు వ్యవసాయం ఇలా..సంప్రదాయ డోలు వాయిద్యాల నృత్యం చేస్తున్న గిరిజనులు జొన్న పంటను రోకలితో దంచుతూ..వన దేవతకు పూజలు చేస్తున్న గిరిజనులు జగన్ పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్ద పీట మారుమూల గ్రామాల్లో సైతం విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కూటమి ప్రభుత్వంలో గిరిపుత్రులకు కష్టాలు పునరావుృతం నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేకంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు బీవీ కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం ఏలూరులోని రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నియోజకవర్గాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లపాటు స్టైఫండ్ అందించారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తం రూ.10 వేలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం విచారకరమన్నారు. వృత్తిపరమైన దాడులు, బెదిరింపుల నుంచి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలో లీగల్ సెల్ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీవీ కృష్ణారెడ్డి, సీహెచ్ రాజేంద్రప్రసాద్‌లను నాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నియోజకవర్గాల అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి (ఏలూరు), జేడీ గాంధీ (నూజివీడు), అడ్డగర్ల రాంబాబు (కై కలూరు), యర్రా సురేష్ (దెందులూరు) తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మండలి కృష్ణారావు శత జయంతి వేడుకలు
యలమంచిలి: శ్రీకృష్ణదేవరాయల 518వ పట్టాభిషేకం, దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శతజయంతి స్మారక వేడుకలు ఒకే వేదికపై నిర్వహించడం సంతోషదాయకమని ఏపీ నాటక పరిషత్‌ల సమాఖ్య అధ్యక్షుడు బుద్ధాల వెంకట రామారావు అన్నారు. పాలకొల్లులోని లయన్స్ కమ్యూనిటీ హాల్లో శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం సాహితీ సభ, ప్రతిభా సత్కార కార్యక్రమం జరిగాయి. ఈ సందర్భంగా సమాజానికి విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థినుల భువనవిజయం సాహితీ రూపకం, చైతన్య ప్రసాద్ అభ్యుదయ గీతాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యర్రంశెట్టి వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ సభలో పెనుమాక రామమోహనరావు, గుండా రామకృష్ణ, కడిమిళ్ల వరప్రసాద్ శతావధాని, సివివి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లవానితిప్ప రోడ్డులో ఉన్న పంటకాలువ రేవులో శనివారం సుమారు 75 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. వీఆర్వో అమిరపు నాగవరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రహ్మాన్ తెలిపారు. ఉండి: ఎదురుగా వస్తున్న లారీకి దారిచ్చే క్రమంలో ఓ ట్రాక్టర్ పంట కాలువలోకి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ల మండలం సీసలిలో ఇటుకలు దిగుమతి చేసుకుని అత్తిలి వైపు వెళ్తున్న ట్రాక్టర్, పెదపుల్లేరులోని ఆర్అండ్బీ రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీకి దారి ఇచ్చేందుకు ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని పక్కకు తీశాడు. అక్కడ రోడ్డు మార్జిన్ లేకపోవడంతో నియంత్రణ కోల్పోయి పంట కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్లో ఐదుగురు ప్రయాణిస్తుండగా, వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
లారీ ఢీకొని వెల్డింగ్ కార్మికుడి దుర్మరణం
ముదినేపల్లి(కై కలూరు): ద్విచక్రవాహనాన్ని లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన ప్రమాదంలో వెల్డింగ్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ముదినేపల్లి సమీపంలోని బంటుమిల్లి రోడ్డులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ సత్యనారాయణపురానికి చెందిన షేక్ నాగుర్ వలీ (47) ప్రస్తుతం పెదపారుపూడి మండలం, రావులపాడులో నివాసముంటూ, పూర్ణ థియేటర్ సమీపంలోని ఓ షాప్‌లో గత మూడేళ్లుగా వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. సహచర కార్మికుడు దాసరి భరత్ చంద్రతో కలిసి సింగరాయపాలెంలో పని ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా, కోమర్రు అడ్డరోడ్డు వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న నాగుర్ వలీ కిందపడటంతో లారీ టైర్లు అతని నడుముపై నుంచి వెళ్లాయి. తీవ్రగాయాలపాలైన నాగుర్ వలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్ నడుపుతున్న భరత్ చంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భరత్ చంద్ర ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మన్యం బంద్ ప్రశాంతం
కుక్కునూరు / బుట్టాయగూడెం: జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయ చట్టాన్ని తీసుకురావాలని, 1/70 చట్టాన్ని పరిరక్షించాలని, ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు శనివారం చేపట్టిన రాష్ట్ర మన్యం బంద్ ప్రశాంతంగా జరిగింది. కుక్కునూరు మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి పాత బస్టాండ్ వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బంద్‌కు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు, పెట్రోల్ బంకులను మూసివేశారు. గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల వద్ద కూడా నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పిల్లి రామకృష్ణ మాట్లాడుతూ గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. జీవో నెం.3కి ప్రత్యామ్నాయంగా తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేయాలని, 1/70 చట్టం పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రరావు, గిరిజన సంఘం నాయకులు శ్యామల లక్ష్మణరావు, పట్ల లక్ష్మయ్య, కాక ఆనంద్, వర్షా నాగేశ్వరరావు, ఎం. ప్రశాంత్, షేక్ వలీ పాషా తదితరులు పాల్గొన్నారు. బుట్టాయగూడెంలో చట్టాల అమలు కోసం నినాదాలు బుట్టాయగూడెంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు సహకరించారు. స్థానిక బస్‌స్టాండ్ వద్ద గిరిజన సంఘ నాయకులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించి హక్కుల సాధనకు నినాదాలు చేశారు. రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ మంగరాజు, నాయకులు మొడియం నాగమణి, పోలోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జీలుగుమిల్లిలో ప్రధాన రహదారిపై నిరసన జీలుగుమిల్లి మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రధాన రహదారిపై ఆందోళనకారులు ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మొడియం నాగమణి, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కారం దారయ్య, నాయకులు కారం భాస్కర్, తెల్లం దుర్గారావు, సీహెచ్ కొండలరావు పాల్గొన్నారు. వేలేరుపాడు/పోలవరం రూరల్: వేలేరుపాడు మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మన్యం బంద్ విజయవంతమైంది. ఈ మేరకు శనివారం వారు గ్రామంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కారం దారయ్య పిట్టా ప్రసాద్ ధర్ముల రమేష్, పొట్ల మోహన్, గడ్డాల ముత్యాలరావు, బంధం ప్రసాద్, మడకం సునీత పాల్గొన్నారు. అలాగే పోలవంరలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏటిగట్టు సెంటర్ వరకు గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు, బొరగం భూచందర్రావు, మడివి చలపతిరావు పాల్గొన్నారు. -
ఆక్వా రంగం బలోపేతానికి కృషి
కై కలూరు: ఆక్వారంగంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి సమస్యలను సమిష్టిగా పరిష్కరించేందుకు ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీడబ్ల్యూఏ) కృషి చేస్తోందని సంఘ అధ్యక్షుడు తేతల శ్రీనివాస్, కార్యదర్శి బీవీ సతీష్ కుమార్ తెలిపారు. కై కలూరులోని కంఫర్ట్ ఇన్ హోటల్లో శనివారం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూఏ నూతన లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. సంఘ భవిష్యత్ కార్యాచరణ, సభ్యుల సంక్షేమం, ఆక్వారంగాభివృద్ధి, చేపలు–రొయ్యల ధరలు, మేతల వినియోగంపై సమగ్రంగా చర్చించారు. సెప్టెంబర్ 29, 30 తేదీల్లో విజయవాడ నోవటెల్ హోటల్లో జరగనున్న రొయ్యల రిటైల్ – 2026 కార్యక్రమం వివరాలను ప్రతినిధులు వెల్లడించారు. బ్లూబెల్ ఆక్వా కంపెనీ అధినేత సీతారామ్ ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ సమావేశంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేపట్టారు. ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు 250 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ సభ్యులు వైవీ రమణ, బీవీ నరసింహారావు, బీహెచ్ సుబ్బరాజు, జీఎన్వీడీ ప్రసాద్, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులు ఆర్.సతీష్, ఏ.శ్రీధర్, ప్రతినిధులు జీ.సునీల్‌కుమార్, ఏ.నాగేశ్వరరావు, జీ.నరేష్, బీ.వెంకటరత్నం, పీ.గోవిందరావు, ఆర్.శ్రీనివాసరాజు, ఫిషరీస్ న్యూస్ వ్యవస్థాపకుడు ఇందువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీటి తొట్టెలో పడి వృద్ధుడి మృతి
దెందులూరు : మండలంలోని కొవ్వలి గ్రామంలో నీళ్ల తొట్టెలో పడి సూరిలేటి రామారావు (65) అనే వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై డి. వెంకట్‌కుమార్ తెలిపారు. ఈ నెల 7న రాత్రి బాత్రూమ్కు వెళ్లిన రామారావు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. బాత్రూమ్ ఎదురుగా ఉన్న నీళ్ల తొట్టెలో పడి ఉన్న అతడిని వెంటనే బయటకు తీసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు టౌన్: నగర శివారులోని ఆటోనగర్ మురుగు కాలువ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు ఏలూరు రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు. వేలేరుపాడు : మండలంలోని శివకాశీపురం గిరిజన ప్రాథమికోన్నత బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి (13) మృతి చెందిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. కేఆర్‌పురం ఐటీడీఏ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు వార్డెన్ పండు ఇందు, హెచ్ఎం బి.గంగారత్నాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బాలికల పాఠశాలలో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయుడిని విజయవాడలోని ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆశ్రమ పాఠశాలలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైరింగ్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీడీ తెలిపారు. -
‘జైల్‌భరో’తో స్వచ్ఛంద అరెస్టులకు సిద్ధం
భీమవరం: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి సమాధానం చెప్పలేని ప్రభుత్వంపై జైల్‌భరో పేరుతో స్వచ్ఛంద అరెస్టులకు కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్ అన్నారు. ఈ నెల 10వ తేదీన క్విట్ కార్పొరేట్, క్విట్ నరేంద్ర మోదీ నినాదంతో జైలు భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు ప్రచారంలో భాగంగా శనివారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో బైక్ ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, విపరీతమైన ధరల పెరుగుదల, ఉపాధి కోతలు వంటి సమస్యలను దేశ ప్రజలపై మోపిందని విమర్శించారు. ఈ బైక్ యాత్రకు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సంఘీభావం తెలిపాయి. అనంతరం బైక్ యాత్ర ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి బస్టాండ్ మీదుగా తాడేరు, యమునాపల్లి, శృంగవృక్షం ప్రాంతాల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ నాయకులు ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు. -
రావుల చెరువు.. అక్రమాల దరువు
● అక్రమ తవ్వకాలతో తలకిందులైన రూపం ● నేతల కుయుక్తులతో కాంట్రాక్టర్ జంప్ ద్వారకాతిరుమల: రావుల చెరువు కొందరు టీడీపీ నేతలకు వరంగా మారింది అభివృద్ధి పనుల ముసుగులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో రామన్నగూడెం రావుల చెరువు వివాదాలకు నిలయంగా మారింది. 43.77 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కింద 114.98 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. పూడికతీత, గట్ల పటిష్టీకరణ, లాకుల ఏర్పాటు కోసం మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.94.30 లక్షల నిధులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మంజూరు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా మైనింగ్ నిధులు పొందిన ఏకై క చెరువు ఇది కావడం గమనార్హం. ఆదాయ వనరుగా మలుచుకున్న నేతలు నిబంధనల ప్రకారం 3 నుంచి 6 నెలల్లో పూర్తికావాల్సిన ఈ పనులు కొందరు స్థానిక టీడీపీ నేతల దందా వల్ల నిలిచిపోయాయి. అక్రమంగా మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఈ దోపిడీపై అధికారులను నిలదీసినప్పటికీ, ఈ దందా ఆగలేదు. రూ.35 లక్షల నష్టంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్ ఈ ఏడాది మార్చిలో విజయవాడకు చెందిన ఒక కాంట్రాక్టర్ రూ.25 లక్షలకు ఇరిగేషన్ టెండర్ దక్కించుకుని, మైనింగ్ శాఖకు మరో రూ.5 లక్షలు చెల్లించి పనులు ప్రారంభించారు. గతంలో నేతలు టిప్పర్ మట్టిని రూ.3,500కి విక్రయించగా, సదరు కాంట్రాక్టర్ రూ.2,500 చొప్పున 100 టిప్పర్ల మట్టి విక్రయానికి అనుమతి పొందారు. అయితే స్థానిక నేతలు ఆ టిప్పర్లను సూర్యచంద్రరావుపేట చెరువుకు మళ్లించడమే కాకుండా, టిప్పర్ యజమానులను సిండికేట్‌గా మార్చి రూ.1,000కే మట్టి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో దాదాపు రూ.35 లక్షల వరకు నష్టపోయిన కాంట్రాక్టర్, మే నెలాఖరులో పనులను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం దేవినేనివారిగూడెంకు చెందిన ఓ టీడీపీ నేత తన పేరు మీద ఉన్న అనుమతులతో మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను రామన్నగూడెంకు చెందిన ఒక జనసేన కార్యకర్త ఫొటోలు తీయడంతో వివాదం మరింత తీవ్రమైంది. ఈ విషయం తెలుసుకున్న సదరు టీడీపీ నేత, ఆ కార్యకర్తను తన ఇంటికి పిలిపించి తీవ్రంగా హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. -
సాంకేతిక నైపుణ్యాలతోనే విద్యకు సార్థకత
తాడేపల్లిగూడెం: విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి సాంకేతిక నిపుణులుగా తయారైనప్పుడే నేర్చుకున్న విద్యకు సార్థకత చేకూరుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కొత్త మధుమూర్తి పేర్కొన్నారు. పెదతాడేపల్లిలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాల 5వ గ్రాడ్యుయేషన్ డే శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని, ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. అతిథులుగా హాజరైన ఏఎస్ఎం టెక్నాలజీస్ ఎండీ రబీంద్ర శ్రీకాంతన్, ఈడీ అఖిల్ రబీంద్ర మాట్లాడుతూ పరిశ్రమల్లో సమష్టి కృషి, నైతిక విలువలు కీలకమని తెలిపారు. కళాశాల ఉత్తమ విద్యార్థి రాపర్ల ప్రసన్నకుమార్‌కు బంగారు పతకం, ప్రశంసాపతకం అందించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో పాలకవర్గ అధ్యక్షుడు గ్రంథి సత్యనారాయణ, కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు పాల్గొన్నారు. -
హత్య కేసులో జీవిత ఖైదు
కలిదిండి(కై కలూరు): హత్య కేసులో నేరం రుజువవడంతో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించిందని ఎస్పీ కే.ప్రతాప్ శివ కిషోర్ చెప్పారు. కలిదిండి పోలీసు స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడిస్తూ.. కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారం శివారు కట్టావానిపాలెంకు చెందిన కట్టా పెద్దిరాజులు ఆస్తి కుమారుడి పేరున రాయాలని అడిగినందుకు భార్య జయలక్ష్మీని కత్తితో పొడిచి హత్య చేశాడన్నారు. అనంతరం నిందుతుడు ఆత్మహత్య నాటకమాడి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు సేకరించిన శాసీ్త్రయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలతో నేరం రుజువైందన్నారు. మృతురాలి కుమారుడు రాము ఫిర్యాదుపై అప్పటి కలిదిండి ఎస్సై వీ.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేయగా, కై కలూరు రూరల్ సీఐ వి.రవి కుమార్ దర్యాప్తు జరిపి చార్జిషీట్ దాఖలు చేశారన్నారు. పోలీసు సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో విశేష కృషి చేశారని అభినందించారు. -
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారి ప్రాణం బలి
వేలేరుపాడు: అధికారుల నిర్లక్ష్యం కారణంగా 13 ఏళ్ల గిరిజన విద్యార్థిని నిండు ప్రాణం బలయ్యింది. తమ బిడ్డ ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సాధించి తమను పోషిస్తుందని ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. కానీ వారి ఒక్కగానొక్క బిడ్డ కలలు, తల్లిదండ్రుల ఆశలు అకాలంగా ఆవిరైపోయాయి. పాఠశాలలో లూజుగా వేలాడుతున్న విద్యుత్ తీగలే యమపాశాలుగా మారి చిన్నారిని బలి తీసుకున్నాయి. మండలంలోని శివకాశీపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాల అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది. ఈ పాఠశాలలో 144 మంది విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి ఘటనలో పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. చిందరవందరగా తీగలు : ఆశ్రమ పాఠశాల భవనాల్లో విద్యుత్ వైర్లు జాయింట్లతో చిందరవందరగా వేలాడుతున్నాయి. విద్యార్థిని దుస్తులు ఆరబెడుతున్న ప్రదేశంలో శాశ్వత విద్యుత్ వైరింగ్ లేదు. అక్కడ సాధారణ వైరుతో లైటు ఏర్పాటు చేసి, ఆ తర్వాత బల్బును తీసేశారు. అయితే, బల్బు తొలగించినా ఆ వైరుకు విద్యుత్ సరఫరా కొనసాగుతూనే ఉంది. పైగా ఆ లైవ్ వైరు లీడ్లు ఇనుప కిటికీకి ఆనుకుని ఉండటంతో విద్యుత్ ప్రసారమై, దానిని తాకిన పార్వతి షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాఠశాలలోని ఏ భవనం చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యం కళ్ల ముందే ఇది కనిపిస్తున్నా, సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో లేని సిబ్బంది ఆశ్రమ పాఠశాలలో యమపాశాలుగా విద్యుత్ తీగలు శివకాశీపురంలో విద్యార్థిని దుర్మరణం ఆ సమయంలో అందుబాటులో లేని సిబ్బంది చోద్యం చూస్తున్న ఐటీడీఏ అధికారులు పాఠశాలలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠాలు చెప్పడం మానేసి నిత్యం ఆఫీసు రూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారు. పాఠశాల భవనాల్లో విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో కేఆర్‌పురం ఐటీడీఏ అధికారులు కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. – మచ్చా కన్నయ్య, ఆశ్రమ పాఠశాల చైర్మన్ లక్ష్మీపార్వతీ విద్యుత్ షాక్‌కు గురైన సమయంలో వార్డెన్, హెచ్ఎంలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఉదయం 6 గంటలకే విద్యార్థిని మృతిచెందగా, వారు జంగారెడ్డిగూడెం డిపో ఆర్టీసీ బస్సులో ఉదయం 9 గంటలకు పాఠశాలకు చేరుకున్నారు. ఇది వారి విధుల పట్ల ఉన్న బాధ్యతారా హిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. నిబంధనలకు నీళ్లు కేఆర్ పురం ఐటీడీఏ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టారు. గిరిజన బాలికల పాఠశాలల్లో కేవలం మహిళా ఉపాధ్యాయులను మాత్రమే నియమించాలనే నిబంధన ఉన్నా, ఇక్కడ ఓ పురుష ఉపాధ్యాయుడిని నియమించడం అధికారుల నిర్లక్ష్యానికి మరో నిదర్శనం. -
డీఎస్సీ దీక్షలపై ఖాకీల కక్ష!
● మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని అడ్డుకున్న పోలీసులు ● ఏలూరులో కార్యాలయం వద్ద బైఠాయింపు ● గేటు వద్దనే రిలే నిరాహార దీక్షలు శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026దెందులూరు: దెందులూరు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరిని ఏలూరు రూ రల్ మండలం మాదేపల్లిలో జరిగే రిలే నిరాహార దీక్షలకు వెళ్లకుండా శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. 30 మంది పోలీసులు శాంతిభద్రతల సాకు తో ఏలూరులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గంటకు పైగా నిలిపివేయడంతో, ఆయన కార్యా లయం గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం అమలు అవుతుంటే, దెందులూరులో మాత్రం మరో రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మా జీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆ దేశించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి తప్పులు జరగనప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. శాంతియుతంగా మాదేపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే టెంట్ తీసేసి వాళ్లని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. అక్కడే ఉన్న టీడీపీ శ్రేణులను ఎందుకు అరెస్ట్ చేయలేదని, వారి మీద ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. ఏ అక్రమాలూ జరగలేదని చెబుతున్న ప్రభు త్వం సీబీఐ విచారణకు సిద్ధపడాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
అథ్లెటిక్స్‌కు మండపాక విద్యార్థిని
తణుకు అర్బన్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.నాగలక్ష్మి అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.ఫణిశ్రీ తెలిపారు. గతనెల 26న తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి భారతీయ విద్యాభవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ అండ్ అండర్–18 విభాగంలో 800 మీటర్ల పరుగులో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఈ ప్రతిభ కారణంగా ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని నాగలక్ష్మి ఎంపికై నట్లు వివరించారు. ఎంపికై న విద్యార్థినితోపాటు శిక్షణనిచ్చిన ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. -
కావడి సేవకు కదిలిన భక్తజనం
కై కలూరు: ఆడి కృత్తిక సందర్భంగా శింగరాయపాలెం సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన కావడి సేవ ప్రజల్లో భక్తి భావాన్ని నింపింది. కావడి ఉత్సవాన్ని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించి, భక్తులతో కావడి మోసి స్వామికి పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రం పళని మురగన్ క్షేత్రంలో నిర్వహించే కావడి సేవను గతేడాది నుంచి శింగరాయపాలెం దేవాలయంలో ప్రవేశపెట్టారు. కావడి సేవలో పసుపు వస్త్రాలు ధరించి 340 మంది భక్తులు పాల్గొన్నారు. శింగరాయపాలెం, చేవూరుపాలెం, శ్రీహరిపురం గ్రామాల్లో కావడి ప్రదర్శనలు చేసి అనంతరం స్వామికి సమర్పించారు. ఉదయం స్వామికి విఘ్నేశ్వర, గోపూజలు నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం స్వామికి శాంతి కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా చేపట్టారు. దేవస్థానం వద్ద 3,000 మందికి భారీ అన్నసమారాధన జరిగింది. కేరళ చండా మేళం, భారీ ఆకారంలో ఆంజనేయ బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి, ఆలయ ధర్మకర్తలు విమల, శ్రీనాగలలిత, శివరమేష్, కృష్ణ, సోవమ్మ, సుబ్బలక్ష్మీ, నాగలక్ష్మి, నాగ వెంకట రాధాకృష్ణ, నాగ శిరిష, నాగకొండ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నాయకులు పరసా విశ్వేశ్వరరావు, బొర్రా చలమయ్య, చల్లగుళ్ళ శోభనాద్రిచౌదరీ, కోడూరు శేషుబాబు, ఈడ్పూగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆడి కృత్తిక కావడి సేవ -
నిట్‌లో సింపోజియం
తాడేపల్లిగూడెం: ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ సాంకేతికత ఎంతో కీలకమని కోల్‌కతాలోని సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బిస్వరూప్ సత్పతి అన్నారు. నిట్‌లో శుక్రవారం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిపై పరిశోధన సింపోజియం జరిగింది. ఆధునిక పరిశోధనల్లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎలక్ట్రాన్స్ మైక్రోస్కోప్ , ప్రిన్సిపల్ టెక్నిక్స్ అండ్ అప్లికేషన్స్‌పై సింపోజియం నిర్వహించారు. ఆధునిక శాసీ్త్రయ పరిఽశోధనలు ముఖ్యంగా మెటీరియల్ సైన్సు, నానో టెక్నాలజీ, ఎనర్జీ మెటీరియల్స్, నానో మెటీరియల్స్ తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. ఆధునిక సాంకేతికత వాటి పని సూత్రాలు, పరిశోధనల్లో వాటి వినియోగంపై విద్యార్థులకు, పరిశోధకులకు అవగాహన కల్పించారు. బిస్వరూప్ సత్పతి ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ గురించి వివరించారు. ఐఐటీ ఖర్గపూర్కు చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్ అహిన్ రాయ్ స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోపీపై మాట్లాడారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారా పొందే సూక్ష్మస్ధాయి సమాచారం కొత్త పదార్ధాల రూపకల్పన, అధిక సామర్ధ్యం కలిగిన ఎనర్జీ స్టోరేజ్ పరికరాలు, బ్యాటరీలు, కాటలిస్టులు, సెమీకండక్టర్ పదార్థాలు, నానో మెటీరియల్స్ బయో మెటీరియల్స్ రంగాల్లో పరిశోధనలకు సాంకేతికతలు కీలకంగా ఉంటాయన్నారు. నిట్ డీన్ రవికిరణ్‌శాస్త్రి మాట్లాడుతూ ఆధునిక పరిశోధనల్లో అత్యాధునిక పరికరాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. అసోసియేట్ డీన్ తపస్ పరమాణిక్ అవగాహన కల్పించేందుకు ఈ సింపోజియంలు ఉపయోగపడతాయన్నారు. -
పొన్నమండకు ఘన నివాళులు
భీమవరం: అగ్నికుల క్షత్రియ జాతిపితగా, సంఘ సంస్కర్తగా పొన్నమండ లక్ష్మణస్వామివర్మ సమాజానికి విశిష్ట సేవలందించారని అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం లక్ష్మణవర్మ జయంతి సందర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అగ్నికుల క్షత్రియులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో, ఆయుర్వేదంలో పొన్నమండ విశేష సేవలందించారన్నారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ.ఇందుమతి పాల్గొన్నారు. కలెక్టరేట్లో.. భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్లో శుక్ర వారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొన్నమండ లక్ష్మణ స్వామివర్మ 157వ జ యంతి నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి జేసీ కేఆర్ కల్పశ్రీ పూలమాలలు వేసి నివాళులర్పించా రు. డీఆర్వో పి.ప్రభాకర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయానికి రూ.5 లక్షల విరాళం
కాళ్ల : కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులకు భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు శుక్రవారం తెలిపారు. కలవపూడికి చెందిన నల్లపురాజు చిన్నకృష్ణంరాజు, అచ్యుతాయమ్మ దంపతుల కుమారుడు నీలాద్రిరాజు, సౌజన్యలక్ష్మి దంపతులు దక్షిణం వైపు కేశఖండన శాల పక్కన భవనం నిర్మాణానికి రూ.5,01,116 అందించారన్నారు. నూజివీడు: లారీకి బ్రేకులు ఫెయిల్ అయిన నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీలో శుక్రవారం పెనుప్రమాదం తప్పింది. మెస్‌లకు బియ్యం లోడుతో ఉదయం 6.30 గంటల సమయంలో క్యాంపస్‌లోకి వచ్చిన లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో లారీ ఐ–3 భవనానికి, మెస్‌కు మధ్య ఉన్న రోడ్డులో ఐ–2, ఐ–1 భవనాల మధ్య వెళ్లి ప్రహరీగోడను ఢీకొట్టి ఆగింది. లారీ ఢీకొట్టడంతో గోడ పడిపోయింది. ఇదే సంఘటన విద్యార్థులు వెళ్లే సమయంలో జరిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
బాలిక అదృశ్యంపై కేసు నమోదు
భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలిక కనిపించడం లేదంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రహ్మన్ శుక్రవారం చెప్పారు. పట్టణంలోని శ్రీరామపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక గురువారం రాత్రి తల్లితో కలిసి ఇంట్లో నిద్రపోయింది. శుక్రవారం ఉదయం బాలిక కనిపించకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై చెప్పారు. భీమడోలు : భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం పట్టాలు దాటుతున్న ఓ గుర్తుతెలియని వృద్ధుడిని రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. ఆకివీడు నుంచి నిడదవోలు వచ్చి, అక్కడ నుంచి భీమడోలు వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటుందని.. షర్టుపై టైలర్ అని రాసి ఉందని చెబుతున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే ఎస్ఐ కృపాదానం తెలిపారు. ఆచూకీ తెలిస్తే 944041100 నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. చింతలపూడి: జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కె.వి.నాగ ప్రభు కుమార్ శుక్రవారం చింతలపూడి ఎకై ్సజ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులు, కేసు ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఎకై ్సజ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, విధి నిర్వహణపై పలు కీలక సూచనలు జారీ చేశారు. సర్కిల్ పరిధిలో నాటుసారా తయారీ, విక్రయాలు, అక్రమ మద్యం రవాణా, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ పి. అశోక్, ఎస్ఐ జె. జగ్గారావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై ఎస్.రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన గరిమెళ్ళ ధనలక్ష్మికి కృష్ణాజిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెం గ్రామానికి చెందిన సాగర్‌తో 2022వ సంవత్సరంలో వివాహం జరిగింది. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. భర్త సాగర్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, ఇందుకు కుటుంబ సభ్యులు గరిమెళ్ళ రాజయ్య సురేష్, గరిమెళ్ళ సురేష్, గరిమెళ్ళ మాధవ రామారావు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం బాధితురాలు ధనలక్ష్మి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై రవికుమార్ తెలిపారు. -
అరకమాలపై విచారణ జరిపించాలి
పార్టీ నాయకులు ముదుగురు సూర్యనారాయణ, మండల కొండలరావు, మోరు రామరాజు, ఆళ్ల సతీష్ చౌదరి, తేరా ఆనంద్ తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కేవరకు, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఇక్కడకు వచ్చి సంఘీభావం తెలిపారు. జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్ బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గంగరాజు, పళ్లెం ప్రసాద్, డీవీఆర్కే చౌదరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్‌చౌదరి, యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని, రజక విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కె.శేషు, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి ఏసు రాజు, మాజీ సర్పంచులు పి.సునీత ప్రభుదేవా, వరి నారాయణ, బాల, ఎంపీటీసీ పులవర్తి దేవానంద్, క్లస్టర్ ఇన్చార్జి తొత్తడి కృష్ణ, ప్రేమ్ బాబు, పార్టీ అధ్యక్షులు కురుమ ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్ యేసు, పెదవేగి మండల నాయకులు మేడికొండ కృష్ణారావు, పాలడుగు భానుప్రకాష్, బలుసు శేఖర్, చల్లగొల్ల తేజ, కార్యకర్తలు నియోజవర్గంలో వైఎస్సార్సీపీ అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు శ్రేణులు అభిమానులు ఉన్నారు. -
ఎంటీఎస్ అమలులో తీవ్ర జాప్యం
● హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని వైనం ● ఆర్జీయూకేటీ అధికారుల నిర్లక్ష్యం నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కోర్టు తీర్పుల మేరకు ప్రభుత్వం జీఓలు జారీ చేసి ఆర్థిక అనుమతులు మంజూరు చేసి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఎంటీఎస్ అమలుకు నోచుకోకపోవడంపై నాలుగు ట్రిపుల్‌ఐటీల్లోని బోధనా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా యూనివర్సిటీ అధికారుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాలున్నా విశ్వవిద్యాలయం వాటిని అమలు చేయకపోవడం పట్ల డొమైన్ మెంటార్లు, ఐటీ మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నాన్–టీచింగ్ సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం ఆర్థిక అనుమతి ఇస్తే వెంటనే ఎంటీఎస్ అమలు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తీరా ప్రభుత్వం వరుసగా జీఓలు జారీ చేసి ఆర్థిక అనుమతులు మంజూరు చేసిన తర్వాత, ఇప్పుడు అమలు చేయకుండా ఉండటానికి ఏవో సాకులు వెతికే పనిలో పడ్డారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం జీఓలు విడుదల చేసినా యూనివర్సిటీ ఎంటీఎస్‌ను అమలు చేయకపోతే న్యాయం కోసం ఇంకెవరి దగ్గరకు వెళ్లాలని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాకల్టీ, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు అమలు చేయాలి నాలుగు ట్రిపుల్ఐటీల్లో కలిపి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 63 మంది మెంటార్లు, 64 మంది ఐటీ మెంటార్లు, 126 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 29 మంది బోధనేతర సిబ్బందితో కలిపి మొత్తం 282 మంది ఉద్యోగులకు హైకోర్టు ఆదేశాల మేరకు ఎంటీఎస్ అమలుకు ప్రభుత్వం జీఓ నంబర్లు 78, 106, 124, 128, 143ను జారీ చేసింది. వీటిల్లో జీఓ నంబర్లు 78, 128లు ఐటీ మెంటార్లకు, జీఓ నంబర్లు 106, 124లు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, జీఓ నంబరు 143 మెంటార్స్‌తో పాటు 29 మంది బోధనేతర సిబ్బందికి సంబంధించినవి. 44 మంది ఐటీ మెంటార్లకు సంబంధించి మే 12న జీఓ వచ్చినా ఇప్పటికీ దానిని అమలు చేయలేదు. జీఓలు వచ్చి రెండు నుంచి మూడు నెలలు గడుస్తున్నా ఆర్జీయూకేటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కోర్టును ఆశ్రయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఫ్యాకల్టీ అందరూ కోర్టుకు వెళ్లి ఎంటీఎస్ అమలు చేయాలని ఉత్తర్వులు తెచ్చుకోవడంతో, 2010లో నియమితులైన దాదాపు 53 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకూ అమలు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ఆర్జీయూకేటీ ఉద్యోగులందరూ కోర్టు మెట్లు ఎక్కుతున్న నేపథ్యంలో ఇక్కడ పరిపాలన ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. నూజివీడులోని ట్రిపుల్ఐటీ ఎంటీఎస్ అమలు చేయాలని ఫ్యాకల్టీ ఎప్పటి నుంచో ఆర్జీయూకేటీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. యూనివర్సిటీలో ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి ఒకరు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోండి.. అమలు చేస్తాం అంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఫ్యాకల్టీ అందరూ ఒక కేడర్ తర్వాత మరొకరు వరుసగా కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెస్తుండటం, ప్రభుత్వం కూడా వరుసగా జీఓలు ఇవ్వడంతో ఇప్పుడు ఎంటీఎస్‌ను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావడంతో ఆ అధికారి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో పాలుపోక ఆర్జీయూకేటీ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వం జీఓలు జారీ చేసిన నేపథ్యంలో, జీఓ ఇచ్చిన నాటి నుంచే ఎంటీఎస్ అమలు చేయాల్సిందేనని ఫ్యాకల్టీ స్పష్టం చేస్తున్నారు. -
కామవరంలో పశువులపై పులి దాడి
బుట్టాయగూడెం: గత 10 రోజులుగా ఏలూరు జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి పోలవరం, గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పశువులను హతమారుస్తూ అటవీశాఖ అధికారులకు కంటిపై కునుకులేకుండా చేసింది. శుక్రవారం సాయంత్రానికి తెలంగాణ రాష్ట్రం ఆశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల, గోపన్నగూడెం వైపు వెళ్ళినట్లు గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున కామవరంలోని మడివి కృష్ణకు చెందిన ఆవు, గిత్తలపై దాడి చేసి పులి హతమార్చింది. పశువులపై దాడి చేసిన నేపథ్యంలో మళ్లీ వస్తుందనే అనుమానంతో రాత్రి 9 గంటల వరకూ సరిహద్దుల్లోనే జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌రెడ్డి పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. పులి ఏపీ బోర్డర్ దాటుతూ తెలంగాణ బోర్డర్లోకి వెళ్ళడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్లో కావిడిగుండ్ల నుంచే ఏపీలోకి ప్రవేశించి బుట్టాయగూడెం మండలంలో పలు పశువులపై దాడి చేసి చంపిన పెద్దపులి మొదటిసారిగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌కెమెరాకు చిక్కింది. మళ్లీ శుక్రవారం అధికారుల డ్రోన్ కెమెరాకు పులి ఒక ప్రదేశంలో దాగి ఉన్న దృశ్యం చిక్కింది. ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళిన పులి మళ్లీ పోలవరంలో ప్రత్యక్షమై గోదావరి ఈదుతూ పోలవరం జిల్లాలోకి వెళ్ళి మళ్లీ ఏలూరు జిల్లాలోని పోలవరం మీదుగా పలు మండలాల్లో సంచరిస్తూ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడు తెలంగాణలోకి వెళ్ళిన పెద్ద పులి తిరిగి వస్తుందా లేక మొదటిసారిగా వచ్చిన మార్గంలోనే వెళ్తుందా అనే విషయాన్ని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కామవరం సమీపంలో డ్రోన్ కెమెరాకు చిక్కిన పెద్దపులి మండలంలోని కామవరం సమీపంలో పెద్దపులి దాడిలో మృతి చెందిన గిత్త -
విద్యుత్ సబ్సిడీ కొందరికేనా?
భీమవరం: కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఆక్వా విద్యుత్ సబ్సిడీ అందరికీ దక్కే అవకాశం లేకపోవడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే జోన్ల ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నాయకులు, రెండేళ్ల తర్వాత నిర్ణయం తీసుకున్నా కొత్తగా విద్యుత్ కనెక్షన్లు పొందినవారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్సీపీ హయాంలో లభించిన మద్దతు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆక్వా రైతులకు యూనిట్‌ను రూ.1.50లకే అందించారు. దీంతో వేలాది మంది రైతులు మోటార్లు ఏర్పాటు చేసుకుని నిశ్చింతగా సాగు చేశారు. కోవిడ్ సమయంలో రొయ్యల ఎగుమతులు మందగించినప్పుడు ప్రభుత్వం స్పందించి, ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద అధికారులను నియమించి మద్దతు ధర దక్కేలా చూసింది. మేతల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడంతో రైతులంతా ప్రభుత్వానికి అండగా నిలిచారు. నెరవేరని హామీలు.. ఉధృతమైన పోరాటం కూటమి ప్రభుత్వం వచ్చాక సీడ్, ఫీడ్ ధరలు పెరిగి, రొయ్యల ధరలు పడిపోవడంతో రైతులు పోరుబాట పట్టారు. గత నెలలో వైఎస్ జగన్ భీమవరంలో నిర్వహించిన భారీ సభ ద్వారా రైతులకు మద్దతుగా ఉద్యమిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ అమలుకు ముందుకొచ్చింది. కొందరికేనా సబ్సిడీ? జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా, అందులో 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉనట్లు అంచనా. గతంలో 14,000 కనెక్షన్లకు సబ్సిడీ లభించగా, ప్రస్తుతం కొత్తగా మరొక 2,457 కనెక్షన్లకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అయితే, మరో 3,000 వరకు ఉన్న కొత్త విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీపై స్పష్టత లేదని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 90వేల ఎకరాల్లో రొయ్యల సాగు గత ప్రభుత్వంలో 14 వేల విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ అందరికీ సబ్సిడీ అంటూ కూటమి హామీ కొత్తగా ఇచ్చేది 2,417 కనెక్షన్లకే.. మరో 3 వేల మందికి మొండిచేయి ! -
చేనేతను ప్రోత్సహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): చేనేత ఉత్పత్తులను వినియోగించడం ద్వారా నేత కార్మికుల కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని జేసీ కేఆర్ కల్పశ్రీ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శనివారం 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ, సాంప్రదాయ చేనేత కళను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. యువత చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియను నేర్చుకోవడం ద్వారా ఈ కళ తరతరాలకు కొనసాగుతుందని తెలిపారు. 82 చేనేత స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల కింద మంజూరు చేసిన రూ.1.30 కోట్ల చెక్కును జేసీ కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు. చేనేత వస్త్రాలు తయారుచేస్తున్న ఎ.నాగేశ్వరరావు (రాయకుదురు), వి.కోటయ్య (దగ్గులూరు), మేక పూర్ణారావు (చింతపర్రు)ను సత్కరించారు. జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి ఎ.అప్పారావు, డీఆర్ఓపీ ప్రభాకర్, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భీమవరం: పాలకోడేరు మండలం మోగల్లు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎంవీ త్రినాథులను సస్పెండ్ చేసినట్టు డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్ శుక్రవారం తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం, విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందున త్రినాథులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు చెప్పారు. భీమవరం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.సుబ్బారావు తెలిపారు. జిల్లాలో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఆరు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలోని 193 బ్రాందీ షాపులు, 28 బార్లపై దాడులు నిర్వహించినట్టుచెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. బుట్టాయగూడెం: మండలంలోని మారుమూరు అలివేరు గ్రామంలో శుక్రవారం చిరుజల్లులు కురవడంతో చల్లదనాన్ని ఆస్వాదించేందుకు సమీపంలోని అడవి నుంచి నెమలి వచ్చింది. గ్రామ సమీపంలోని చెట్టు కొమ్మపై కొద్దిసేపు కూర్చున్న తర్వాత జల్లులు పడగానే కిందకు దిగి పురివిప్పి నర్తించింది. ఓ పక్క జల్లులు.. మరోపక్క మయూర నృత్యంతో ఈ ప్రాంతంలో వాతావరణం రమణీయంగా మా రింది. స్థానికులు ఈ దృశ్యాన్ని వీక్షించి సెల్ఫోన్లో బంధించారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ సింగిల్ మేజర్ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పిస్తున్నారని, ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లాలో హెల్ప్‌లైన్ సెంటర్‌గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అడ్మిషన్ ప్రక్రియలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు. మరిన్ని వివరాలకు హెచ్ఎల్సీ కోఆర్డినేటర్ కె.రమేశ్ 9247203460, వెరిఫికేషన్ ఆఫీసర్–1 ఎం.కృష్ణ చైతన్య 9490216357, వెరిఫికేషన్ ఆఫీసర్–2 పీఆర్ కావ్యశ్రీ 9441376464, ప్రిన్సిపల్ శ్రీనివాసరావును 9010042250 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పోలవరం రూరల్: గోదావరి వరద యథాస్థితికి చేరుకుంటోంది. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడం, నదిలోకి చేరే నీరు కూడా క్రమేపీ తగ్గుతుండటంతో వరద ప్రవాహం నెమ్మదిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 28 మీటర్ల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. స్పిల్‌వే నుంచి దిగువకు 2.47 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దిగువన వరద ప్రభావం తగ్గుతోంది. -
ఉత్సాహంగా క్రీడా పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నేటి యువత కూడా దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్ల స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. జిల్లాలో నియోజకవర్గ స్థాయి ఎంపికలు గత నెల 27 నుంచి 31 వరకు 7 నియోజకవర్గాలలో నిర్వహించామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్ తెలిపారు. మొత్తం 1,200 మంది క్రీడాకారులను 12 క్రీడాంశాల్లో జిల్లా స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేశామన్నారు. పోటీల తొలిరోజు ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, వెయిట్ లిఫ్టింగ్, అండర్–17 విభాగంలో వాలీ బాల్, కబడ్డీ, ఖో–ఖో అంశాల్లో జిల్లా స్థాయి ఎంపికలు, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ కె.జగదీశ్వరి, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎం.పార్థసారధి, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ బడేటి వెంకట రామయ్య, అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అదిరెడ్డి సత్యనారాయణ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలు మంగ, సెట్వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు -
కారుమూరిపై దుష్ప్రచారం తగదు
తణుకు అర్బన్: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కూటమి నాయకులు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా భయపడేది లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, తణుకు నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు వెంకట నాగు స్పష్టం చేశారు. తణుకులో డీఎస్సీ అవకతవకలపై గురువారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో వారు మాట్లాడారు. ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కివేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అయినప్పటికీ తాము దేనికీ వెనకంజ వేసేది లేదన్నారు. కూటమి నేతలు పెడుతున్న ఇబ్బందుల కారణంగానే కారుమూరి కుటుంబం కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉందని, రానున్న రోజుల్లో వారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. తణుకులో కూటమి నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ కార్యక్రమాలను ఆపలేరని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు భవిష్యత్తులోనూ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని వారు తేల్చిచెప్పారు. భీమవరం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ ఆవిష్కరించారు. చెకుముకి జిల్లా కన్వీనర్ రేపాక వెంకన్న బాబు మాట్లాడుతూ చెకుముకి సంబరాలు పాఠశాల స్థాయిలో ఈనెల 27న, మండల స్థాయిలో సెప్టెంబరు 11న, జిల్లా స్థాయిలో సెప్టెంబరు 27న, రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చింతపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం: జిల్లాలో పెనుగొండ, తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖాధికారులను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెనుగొండ విద్యాశాఖాధికారి డి.శుభాకరరావు, తాడేపల్లిగూడెం విద్యాశాఖాధికారి వి.హనుమలపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా వీరిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు అనిల్‌కుమార్ తెలిపారు. ఫ్యాప్టో హర్షం : అవినీతి వ్యవహారాలు, లంచగొండితనం, కక్ష సాధింపులతో ఉపాధ్యాయులను బెదిరించిన పెనుగొండ, తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయడం పట్ల ఫ్యాప్టో గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. రెండు నెలలుగా ఫ్యాప్టో జిల్లా కమిటీ చేసిన ఐక్య ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే ఈ చర్యలు తీసుకున్నారని ఫ్యాప్టో జిల్లా యూనిట్ అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భీమవరం: జిల్లాలో గురువారం జరిగిన టెట్ పరీక్షలకు 381 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ తెలిపారు. పరీక్షకు 415 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 34 మంది గైర్హాజరయ్యారని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో గురువారం రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం అమలుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల వయస్సు వరకు ఉన్న వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్క్రీనింగ్‌లో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలిన పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లేదా జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రానికి పంపాలని సూచించారు. జిల్లా ఆసుపత్రిలోని బాలల సత్వర చికిత్స కేంద్రం పనితీరు, సిబ్బంది సేవలపై నివేదికలను పరిశీలించి, ప్రజలు ఆ సేవలను పూర్తిగా వినియోగించుకునేలా తగు ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
అటవీ భూముల్లో అక్రమ మైనింగ్
ముసునూరు: మండల పరిధిలోని బలివే, గోపవరం శివారు వెంకటాపురం అటవీ భూముల్లో అక్రమ మట్టి, గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు నలుగురు కలిసి సిండికేట్‌గా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. ట్రాక్టర్ ట్రక్కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే వాహనాలను వేగంగా నడుపుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని, ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా మట్టి తోలకాలు నిర్వహించడంపై ప్రశ్నిస్తే, అనుమతి ఉందని, ఒకసారి, పర్మిషన్ లేకపోయినా మమ్మల్ని ఆపేది ఎవడు అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటవీ భూముల్లో మట్టి తవ్వకాలకు డబ్బులు ఇచ్చి అనుమతి తెచ్చుకున్నాం అని ధీమాగా సమాధానం చెబుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. సంబంధిత అటవీ, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని గ్రామీణులు కోరుతున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఉంగుటూరు: అమరావతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 కబడ్డీ పోటీల్లో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలవగా, ఆ జట్టుకు నియోజకవర్గం నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఉంగుటూరుకు చెందిన ఎం.దీక్షిత, పెదనిండ్రకొలను హైస్కూల్ విద్యార్థిని ఎం.ప్రియదర్శిని, కై కరం హైస్కూల్ విద్యార్థిని ఎస్. కనకదుర్గ ఎంపికై న వారిలో ఉన్నారు. అలాగే రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ జట్టుకు నియోజకవర్గానికి చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. పెదనిండ్రకొలను జెడ్పీ హైస్కూల్ విద్యార్థి సీహెచ్ బాబులు, కాగుపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి వై.సాయితేజ, గొల్లగూడెం సూర్య స్కూల్ విద్యార్థి టి.సాత్విక్, నారాయణపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఎ.రోహిత్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కారుమూరి పీఏ సురజిత్‌పై కేసు నమోదు తణుకు అర్బన్: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్సనల్ అసిస్టెంట్ సురజిత్‌పై తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేశారంటూ తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. అక్రమ కేసు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్సనల్ అసిస్టెంట్ సురజిత్‌పై అక్రమ కేసు నమోదుచేయడం దారుణమని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి అన్నారు. తణుకు కూటమి నాయకులు కారుమూరి కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని, తాజాగా పీఏ సురజిత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కూటమి నాయకుల ఒత్తిడి మేరకు నమోదుచేసిన అక్రమ కేసుపై లీగల్‌గానే పోరాడతామని స్పష్టం చేశారు. -
నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే సహించం
భీమడోలు: పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే సహించేది లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణకిరణ్ హెచ్చరించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజైన గురువారం ఆయన పొలసానిపల్లి, భీమడోలు గ్రామాల్లోని గురుకుల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, బాలికల వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పొలసానిపల్లి గురుకుల పాఠశాలలో వంటగది, బియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యత, ఎక్స్పైరీ తేదీలు, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి, మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. అనంతరం విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమై భోజన వసతులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా బాలికలు తమ సమస్యలను ఆయనకు లిఖితపూర్వకంగా విన్నవించారు. భోజనంలో ఉప్మా, పులిహోర సరిగా ఉండటం లేదని, చికెన్ సరిగా ఉడకడం లేదని ఫిర్యాదు చేశారు. అలాగే తమకు నచ్చని గోరుచిక్కుడు వంటి కూరగాయలనే ఎక్కువగా వండి పెడుతున్నారని, తాగునీటి ఎద్దడి కూడా ఉందని తెలిపారు. విద్యార్థులకు రుచికరమైన, శుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్‌దేనని స్పష్టం చేసిన ఆయన, ఈ సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం భీమడోలు జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి, స్టోర్ రూమ్, వంట పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై హెచ్ఎంను ప్రశ్నించారు. అలాగే భీమడోలు బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరిందని, తమను వేరే ప్రాంతానికి తరలించాలని కోరిన విద్యార్థినుల విజ్ఞప్తిపై స్పందిస్తూ, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆహార భద్రత కల్పించడమే ఫుడ్ కమిషన్ ముఖ్య ఉద్దేశమని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదన్నారు. పర్యటనలో భాగంగా టి.నరసాపురం పరిధిలోని సాగిపాడు అంగన్వాడీ కేంద్రం మూసివేసి ఉండడాన్ని, ద్వారకాతిరుమల మండలంలోని ఒక పాఠశాలలో 300 కోడిగుడ్లు కుళ్లిపోవడాన్ని గుర్తించామన్నారు. ఈ లోపాలన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేసి కమిషన్ చైర్మన్, సంబంధిత అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో సీఎస్‌డీటీ భరత్‌కుమార్, ఎంఈఓ–2 అయినపర్తి భాస్కర్‌కుమార్, ఐసీడీఎస్ పీఓ ఎంఎస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
నరసాపురం రూరల్ : మున్సిపల్ ఉపాధ్యాయులకు నిలిచిపోయిన పీఎఫ్ ఖాతాల నిర్వహణను వెంటనే పునరుద్ధరించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా పీఎఫ్ ఖాతాలు కేటాయించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎఫ్‌ఏపీటీఓ చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం నరసాపురం పట్టణంలోని మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలను సందర్శించిన ఆయన ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు బకాయి పడిన వేతనాలను వెంటనే చెల్లించాలని, అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. తల్లికి వందనం పథకం నిధుల నుంచి ఎయిడెడ్ పాఠశాలలకు కేటాయించాల్సిన రూ.2,000ను వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ ఉపాధ్యాయులను అంతర్ యాజమాన్య బదిలీల ద్వారా సొంత జిల్లాలకు పంపాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, 11వ పీఆర్సీ బకాయిలతో పాటు నిలిచిపోయిన నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ రామచంద్రరావు, రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ బాలాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై సమరభేరి
ఉత్సాహంగా క్రీడా పోటీలు ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి అమరావతి చాంపియన్‌షిప్ పోటీలను గురువారం ప్రారంభించారు. 8లో uకాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయం నానాటికి అభివృద్ధి చెందుతోంది. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 8లో uశుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి, భీమవరం: డీఎస్సీ –2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలేదీక్షలు గురువారం జిల్లా అంతటా మొదలయ్యాయి. పార్టీ శ్రేణులు, డీఎస్సీ బాదిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మేధావులు నడుమ పార్టీ నేతలు శిబిరాలను ప్రారంభించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి అర్హులకు న్యాయం చేయాలని, మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేయాలని, పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయా లని, హాస్టల్ విద్యార్థులకు వసతి దీవెన పథకాన్ని అమలుచేయాలని, నిరుద్యోగ యువతకు నెలనెలా రూ. మూడు వేలు భృతి చెల్లించాలని నినదించారు. తణుకులోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రిలే దీక్షల శిబిరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పార్లమెంట్ పరిశీలకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రారంభించారు. పాలకొల్లు, నరసాపురంలోని దీక్షా శిబిరాలను సందర్శించారు. తణుకు పరిశీలకుడు కొట్టు వెంకటనాగు, లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం పాల్గొన్నారు. ఆచంటలోని కచేరి సెంటర్ వద్ద నియోజకవర్గ కోఆర్డినేటర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ప్రారంభమైన దీక్షల్లో ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ వద్ద నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురాంనాయుడు ఆధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభించారు. భీమవరంలోని ప్రకాశంచౌక్ వద్ద నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దీక్షల్లో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి అల్లూరి రవిరాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి గంటా రాహుల్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పాలవెల్లి మంగ పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురం అంబేడ్కర్ సెంటర్ వద్ద దీక్షలు నిర్వహించారు. సీజీసీ సభ్యుడు పీడీ రాజు, పార్టీ నేతలు పాల్గొన్నారు. పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్ వద్ద దీక్షా శిబిరంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజి, గుణ్ణం నాగబాబు, చిగురుపాటి సందీప్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయ సరిత పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ కో–ఆర్డినేటర్ మంతెన యోగీంద్రబాబు ఆధ్వర్యంలో కాళ్లలోని బస్టాండు వద్ద ఏర్పాటుచేసిన దీక్షల్లో క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్, ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి బడుగు బాలాజి పాల్గొన్నారు. దీక్షాదక్షత నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు తరలివచ్చిన పార్డీ కేడర్, యువత, మేధావులు సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామాకు డిమాండ్ -
ఆరోగ్యకర సమాజానికి తల్లిపాలే పునాది
భీమవరం: ఆరోగ్యకర సమాజానికి తల్లిపాలే పునాది అని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం భీమవరం పట్టణంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ ప్రైమరీ పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించడం వల్ల అవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. శిశువుకు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. గర్భిణులు, బాలింతలు ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి పోషకాలు ఉన్నవాటిని తీసుకోవాలని, అంగన్వాడీల ద్వారా అందించే సంపూర్ణ పోషణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జ్ పీడీ పి.విజయలక్ష్మి, భీమవరం సీడీపీఓ టీకేవీ లక్ష్మీకాంతం, సూపర్వైజర్ డి.అనిల్‌కుమారి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ తప్పించుకున్న పెద్దపులి
అంకన్నగూడెం అటవీ ప్రాంతంలో సంచారం బుట్టాయగూడెం: గత కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి గురువారం కూడా వారికి చిక్కకుండా తప్పించుకుంది. పులిని బంధించేందుకు సుమారు 400 మందికి పైగా సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ, అది దొరకకుండా తిరుగుతూ చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ పులి జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా పెద్దపులి ఏ ఒక్క పశువుపై దాడి చేసిన సంఘటన జరగలేదు. అయినప్పటికీ, పులి ప్రస్తుతం మంచి ఆకలితో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి 10 గంటల వరకు పులిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, అది తప్పించుకు తిరుగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం పులి సంచరిస్తున్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే తెలంగాణ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రికి పెద్దపులి తెలంగాణ వైపు వెళ్తుందా, లేక మళ్లీ గుబ్బల మంగమ్మ గుడి వైపు వెళ్తుందా అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అనువైన ప్రదేశాల్లోనే పులి సంచరించినప్పటికీ, అటవీశాఖ అధికారుల వ్యూహాలను తిప్పికొడుతూ తప్పించుకు తిరుగుతోంది. ఒకవేళ పులి అటు తెలంగాణ వైపు వెళ్లినా, ఇటు గుబ్బల మంగమ్మ గుడి వైపు వచ్చినా అక్కడ దట్టమైన కొండలు, గుట్టలు, అడవి ఉండటంతో ఈ పరిస్థితుల్లో దానిని పట్టుకోవడం కష్టమేనని భావిస్తున్నారు. పులిని బంధించే ప్రయత్నాల్లో జిల్లా అటవీశాఖ అధికారి సందీప్ రెడ్డి, రాజమండ్రి సీసీఎఫ్ టి.జ్యోతి, జంగారెడ్డిగూడెం, కన్నాపురం రేంజ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దాతల సహకారం.. అభివృద్ధికి శ్రీకారం
కాళ్ల : పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం, కాళ్ల మండలం కాళ్లకూరులో స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నానాటికీ సుప్రసిద్ధ క్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. తిరుపతి తరహాలోనే ఏటా స్వామివారి ఊరేగింపు నిర్వహించేందుకు ఆలయ మాడవీధుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు దాతల ప్రోత్సాహంతో సుమారు రూ.3 కోట్లతో ఆలయాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రగతిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ● ఆలయంలోని తూర్పు, ఉత్తర రాజగోపురాలకు దాత గాదిరాజు కిరణ్ కుమార్ వర్మ (కలిగొట్ల కిరణ్) సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో రాతి గుమ్మాలు, టేకు తలుపులు ఏర్పాటు చేస్తున్నారు. ● ఏలూరుపాడు గ్రామానికి చెందిన దాత దాట్ల శ్రీనివాసరాజు ఆర్థిక సహకారంతో రూ.12 లక్షల వ్యయంతో నూతన కేశఖండనశాల భవన నిర్మాణం చేస్తున్నారు. ● రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అన్నదాన భవన పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి రూ.60 లక్షలు, దాతల నుంచి రూ.40 లక్షలతో దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో రూ.25 లక్షల వ్యయంతో భగవాన్ ట్రేడర్స్ అధినేత నడింపల్లి వెంకట రామరాజు సహకారంతో నూతన వంటశాల, గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు సహకారంతో టైల్స్ పనులు చేపడుతున్నారు. ● అన్నదాన భవనాన్ని ఆనుకుని ముదునూరి వెంకట శివరామరాజు (పాందువ్వ శివ) సహకారంతో రూ.11.50 లక్షల వ్యయంతో 123 అడుగుల షెడ్ నిర్మిస్తున్నారు. ● మాడవీధుల ఏర్పాటు, అన్నదాన భవన మార్గం కోసం భక్తులు స్వచ్ఛందంగా 13 సెంట్ల (15 అడుగుల వెడల్పు) భూమిని అందజేశారు. అలాగే మాడవీధుల కోసం రూ.99 లక్షలతో ఐదున్నర సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీనికి గాను దాతలు ఇప్పటివరకు రూ.55 లక్షలు అందించగా, మరో రూ.44 లక్షలు సేకరించాల్సి ఉంది. భవిష్యత్తు ప్రణాళికలివే ● మాడవీధుల నిర్మాణానికి అడ్డుగా ఉన్న పాత వంటశాలను తొలగించి దాతల సహకారంతో కొత్త వంటశాల, ప్రసాదం ప్యాకింగ్ భవనం, ఆలయ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో పనులు ప్రారంభించి, నూతన సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ● దేవస్థాన ప్రాంగణంలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో నూతన మండపాన్ని నిర్మించనున్నారు. అక్టోబర్–నవంబర్ మాసాల్లో పనులు ప్రారంభించి నూతన సంవత్సరానికి భక్తులకు అందుబాటులోకి తెస్తారు. ● భక్తులకు స్వామివారి మూలవిరాట్ స్పష్టంగా కనిపించేలా ప్రస్తుతం గుడిలో ఉన్న 4 గుమ్మాలను మార్చి నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. ● తూర్పు రాజగోపురం వద్ద దానితో సమాన ఎత్తు కలిగిన భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఆవిష్కరించేలా ఒక దాత ముందుకు వచ్చారు. ● ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన దక్షిణం వైపు కాంపౌండ్ వాల్‌ను పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వామివారి సేవలో తరించేందుకు భక్తులు, దాతలు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. పెద్ద తిరుపతి మాదిరిగా మాడవీధులు, అన్నదాన భవనం, కేశఖండన శాల వంటి నిర్మాణాలు చేపడుతున్నాం. స్వామివారి కృప దాతలు, భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది. – అడ్డాల శివరామరాజు, ఆలయ చైర్మన్ కలియుగ దైవమైన కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి కృష్ణా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భక్తులు, దాతలు విశేషంగా ముందుకు వస్తున్నారు. ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో దాతలను ప్రోత్సహిస్తూ ఆలయంలో మరిన్ని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.అరుణ్ కుమార్, ఆలయ ఈఓ -
పోడు భూముల వసూళ్ల ఆరోపణలు నిరాధారం
టేకూరు గిరిజనుల వెల్లడి వేలేరుపాడు: పోడు భూముల పట్టాల పేరుతో తాము డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వేలేరుపాడు మండలం టేకూరుకు చెందిన పూరెం రమేష్, కట్కూరు జీసీసీ సేల్స్‌మ్యాన్ పూరెం వెంకటేశ్వర్లు, నూపా శ్రీనివాసరావు, నూపా వెంకటేశ్వర్లు, పూరెం నవీన్ స్పష్టం చేశారు. గురువారం వేలేరుపాడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమపై వచ్చిన ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న తమకు పోడు భూముల వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. టేకూరు గ్రామంలో అసలు 200 ఎకరాల పోడు భూమే లేదని తెలిపారు. ఏ ఆధారాలు లేకుండా గిరిజనుల నుంచి పట్టాల పేరుతో ఎకరానికి రూ.2 లక్షల చొప్పున, మొత్తం రూ.1.20 కోట్లు వసూలు చేశామంటూ కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు ప్రసారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమన్నారు. తాము ఎవరి వద్ద ఒక్క పైసా కూడా తీసుకోలేదని, వసూలు చేసినట్లు ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సవాలు చేశారు. తమ ఎదుగుదల ఓర్వలేక, పరువు ప్రతిష్టలను, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే న్యాయస్థానంలో పరువునష్టం దావాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఎల్‌నినోపై రైతులకు అవగాహన
కాళ్ల: ఎల్‌నినో ప్రభావంతో తగ్గుతున్న వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు రైతులకు అవగాహన కల్పించేలా కేవీకే, ఆంగ్రూ శాస్త్రవేత్తల బృందం గురువారం కాళ్ళ మండలంలోని కోపల్లె, సీసలి, కాళ్ళ, బొండాడ గ్రామాల్లో పర్యటించింది. పొలాలను పరిశీలించిన అనంతరం రైతులతో సమావేశమయ్యారు. కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లికార్జునరావు మాట్లాడుతూ వర్షపాతానికి అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. నేలలో తేమను నిలిపేందుకు మల్చింగ్, అంతర దుక్కి పద్ధతులు పాటించాలని, సకాలంలో సమతుల్య ఎరువులు వేయాలని తెలిపారు. కరవును తట్టుకునే, స్వల్పకాలిక పంట రకాలను ఎంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి పి.రమేష్ నాయుడు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: అంతర్జాతీయ సాహితీ సంస్థ విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీల్లో తణుకుకు చెందిన ప్రముఖ కవి వీఎస్వీ ప్రసాద్ రెండు పురస్కారాలు సాధించారు. కనిపించని గాయం, గుండెకో వ్యథ అనే అంశాలపై నిర్వహించిన ఈ పోటీల్లో టాప్–20లో నిలిచినందుకు కళావేదిక అధ్యక్షురాలు కొల్లి రమాదేవి, జడ్జిలు జి.భవాని, అంజనీకుమారి, భవానిదేవి, సత్తివాడ శ్రీకాంత్, జంధ్యాల శరత్ బాబు, గేదెల శివప్రసాద్ ఆయనను అభినందించారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం) : ఎర్రకాలువ మిగులు భూమిలో సాగు చేసిన వరి పంటను కొంతమంది ఉద్దేశపూర్వకంగా ట్రాక్టర్‌తో దున్ని ధ్వంసం చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు ఏలేటి విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు పరిధిలోని ఈ భూమిలో పంట సాగు చేసుకుంటున్న తమకు రక్షణ కల్పించాలని కోరినా అధికారులు స్పందించలేదని వాపోయారు. అనంతరం స్థానిక సచివాలయం వద్ద గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. స్పందించకుంటే ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీతా, బొక్క వెంకటేశు, కలపాల వెంకయ్య, ఎడ్లపల్లి దుర్గారావు, ఎంకమ్మ, కలపాల నాగభూషణం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముసునూరు: ఇంజిన్ ఆపకుండా నిర్లక్ష్యంగా న్యూట్రల్లో ఉంచిన ట్రాక్టర్ వెనుకకు వచ్చి ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ముసునూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాకనాటి వెంకటేశ్వరరావు (64) పశువులను మేతకు తోలుకెళ్తుండగా, సందు దారిలో ఆగి ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా వెనక్కి వచ్చి ఢీకొట్టింది. ట్రాక్టర్ చక్రం తలపై నుంచి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహానికి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరవాసరం: మండలంలోని పెరికిపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తెగిపడటంతో రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన సనకం వెంకటేశ్వరరావుకు చెందిన పశువుల పాక వద్ద గురువారం విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పాక వద్ద ఉన్న పాడి గేదె, దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. బాధితుడు తీవ్రంగా నష్టపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితుడికి పరిహారం అందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉండి: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తలపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం ఉండి శివారు నక్కరాజుగుంట ప్రాంతానికి చెందిన అందుకూరి మౌనిక, అందుకూరి కిరణ్‌లు 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో రూ.5 లక్షలు కట్నంగానూ, ఐదు కాసులు బంగారం ఇచ్చారు. ప్రస్తుతం కిరణ్ హైదరాబాద్‌లో ఉంటూ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇటీవల ఆమె అత్తతో కలిసి అదనంగా రూ.2 లక్షలు నగదు తేవాలని వేధిస్తున్నాడు. దీంతో మైనిక పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై హెచ్.మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమి ప్రభుత్వానిది దుర్మార్గ పాలన
తాడేపల్లిగూడెం అర్బన్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. తాడేపల్లిగూడెంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవరపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పోలీసులు తగిన భద్రత కల్పించలేదని విమర్శించారు. జగన్ వచ్చే హెలీప్యాడ్ ప్రాంతాన్ని హైవేకు పక్కనే ఏర్పాటు చేయడం కుట్రపూరితమన్నారు. జగన్‌ను దగ్గర నుంచి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారని, ఆ సమయంలో పార్టీ నాయకులు, మంత్రులు కిందపడిపోయార న్నారు. తాను కూడా కింద పడిపోగా తాడేపల్లిగూడెం 23వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అఖిల్ తనను లేపడంతో మిగిలిన వారిని తాము పైకి లేవదీశామన్నారు. నేతలు, కార్యకర్తలు కిందపడిపోయేలా జనం మీదపడినా పోలీసులు నియంత్రించలేకపోయారని, ఇది చంద్రబాబు, లోకేష్‌ల కుట్రలో భాగమేనని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ శాఖలను అనుయాయులకు అప్పగించి వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని కొట్టు మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం, మామిడి, మిర్చి వంటి పంటలకు గిట్టుబాటు ధర దక్కకుండా వ్యాపారులు, దళారులతో కూడిన సిండికేట్ దోపిడీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చి, పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకుండా నీరుగార్చారని ఆరోపించారు. కొందరికి మాత్రమే అరకొర సొమ్ములు అందాయని విమర్శించారు. డీఎస్సీ–25 నియామకాల్లో మెరిట్ అభ్యర్థులను పక్కనపెట్టి, అర్హత లేని వారి నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు కట్టబెట్టారని కొట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దుర్మార్గ పాలనను ప్రజలు, ముఖ్యంగా జెన్‌జీ తరానికి చెందిన యువత నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. నాయకులు కర్రి భాస్కరరావు, చెన్నా జనార్దన్, ముప్పిడి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ -
అన్నదాతలూ.. తస్మాత్ జాగ్రత్త
● ఎల్‌నినో ప్రభావం నుంచి పంటలను కాపాడుకోవాలి ● వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన ముసునూరు : రైతన్నలు తమ పంటలను ఎల్‌నినో ప్రభావం నుంచి కాపాడుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచించారు. మండలంలోని వలసపల్లిలో బుధవారం మండల వ్యవసాయ శాఖాధికారి ఆలూరు చాముండేశ్వరి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ కంబాట్ బృందం, ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పంటల సాగుపై ఎల్ నినో ప్రభావం అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్తలు డా. కె.ఫణికుమార్, డా.ఎన్. నాగేంద్ర బాబు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ప్రధాన పొలంలో వరి పంట సుడులు తిరిగి ఎండినట్లయితే, పంట తిరిగి కోలుకోవడానికి లీటరు నీటికి 20 గ్రాముల యూరియా కలుపుకొని పిచికారీ చేసుకోవాలని సూచించారు. రసాయనిక ఎరువుల మోతాదును 25 శాతం వరకు తగ్గించుకునేందుకు, జీవన ఎరువులైన అజటోబాక్టర్, అజోస్పిరిల్లమ్ను ఎకరాకు 500 గ్రాముల చొప్పున 500 లీటర్ల నీటిలో కలిపి అందించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలుగా మినుములు, పెసలు, కందులు సాగు చేసుకోవాలన్నారు. విత్తనం వేసే ముందు బంకమట్టి, బూడిద నీటిలో కలిపి విత్తన గుళికలు తయారు చేయాలని తెలిపారు. దీనివల్ల మొలక శాతం తగ్గకుండా, పురుగు బారిన పడకుండా, వర్షం పడే వరకు విత్తనాలకు నష్టం వాటిల్లదని వివరించారు. రైతు సమాచార కేంద్రం పొందుపరిచిన యూట్యూబ్ లింక్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని, పంటలకు సంబంధించి రూపొందించిన సాంకేతికతను వీక్షించాలని కోరారు. రైతులు సాగులో ఖర్చు తగ్గించుకుని అదనపు ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ సునీత, రైతు సేవా కేంద్రం, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
స్నేహ సౌధం
మోతీనగర్: ఆపదలో ఉన్న సమయంలో సొంత బంధువులు, కుటుంబ సభ్యులు సైతం ఆదుకోవడం అరుదు. అలాంటిది పాతికేళ్ల క్రితం తమతో పాటు కలిసి పనిచేసిన ఒక మిత్రుని బీదరికానికి చలించి ఇల్లు కట్టించి ఇచ్చిన మరో మిత్రుడి ఔదార్యమిది. సుమారు 25 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామానికి చెందిన కేల వెంకట్రావు అలియాస్ సురేష్, మరో నలుగురు మిత్రులు హైదరాబాద్ వచ్చారు. గాయత్రినగర్ డివిజన్ శ్రీ వివేకానందనగర్‌లో నివాసం ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందారు. అందులో వెంకట్రావుతో పాటు వచ్చిన మిగిలిన నలుగురు మిత్రులు ఇక్కడ ఉండలేక తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయారు. అందులో గోవిందు అనే మిత్రుడు ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడని వెంకట్రావు తెలుసుకున్నారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలున్నారని తెలుసుకుని.. ఆయనకు శాశ్వతంగా నిలిచే సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. వెంకట్రావు తన మిత్రుడు సత్తిబాబు సహకారంతో గోవిందు కోసం స్వగ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేపట్టారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా గోవిందుకు తెలియకుండా.. ఆయనతోనే గృహప్రవేశం సైతం చేయించి ఇంటిని అప్పగించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ సంపాదనలో కొంతైనా ఆపదలో ఉన్న వారికి అందించి ఆదుకోవాలన్నారు. -
డీఎస్సీ అక్రమాల నిగ్గు తేల్చాలి
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి ● దగాపడ్డ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ రిలే దీక్షలు ● నేడు జిల్లా అంతటా నిర్వహణ ● 10న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు సాక్షి, భీమవరం: మెగా డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. సీబీఐ విచారణ జరిపించి అక్రమాల నిగ్గు తేల్చాలని. అర్హులకు న్యాయం చేయాలని, లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని తదితర డిమాండ్లతో గురువారం నుంచి జిల్లా అంతటా రిలే దీక్షలు నిర్వహించనుంది. 10న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు చేయనున్నారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసిన టీచర్ల నియామకాల్లో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేపట్టగా, స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టులకు రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాగా ఎంపిక చేశారు. కనీస అర్హతలు లేకున్నా శాప్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి వేలాది మంది అభ్యర్థులు డీఎస్సీకి హాజరయ్యారు. వీరిలో క్వాలిఫై అయిన పలువురు అభ్యర్థులకు కాల్ లెటర్లు సైతం వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నేరవేరిందని సంబరపడేలోపే వారి ఆశలపై చంద్రబాబు సర్కారు నీళ్లు చల్లింది. దేశంలో ఎక్కడాలేని విధంగా మెరిట్ లిస్ట్‌ను మార్చేసింది. అర్హులకు అన్యాయం చేస్తూ మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. సర్కారు కుట్రలను ఎండగడుతూ ఆధారాలను సైతం చూపింది. వీటిని పక్కనపెట్టి సవ్యంగా నియామకాలు చేసినట్టు సర్కారు క్లీన్‌చీట్ ఇచ్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. డీఎస్సీ–2025లో అక్రమాలు జరగకపోతే సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఒప్పుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీపై సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని, అక్రమాలకు నైతిక బాద్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ అందని విద్యాకానుక కిట్లు ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడం, పాఠశాలలు తెరిచి నెలన్నర రోజులైనా ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేయకపోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం తదితర సమస్యలతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సూపర్స్సిక్స్లోని నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి హామీని కూటమి ప్రభుత్వం అమలుచేయకపోవడంతో నిరుద్యోగ యువత అవస్థలు పడుతున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలకు అపూర్వ స్పందన ఆయా డిమాండ్ల సాధన కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు జిల్లా అంతటా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించడంతో పాటు జిల్లా నాయకత్వం, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సోమ, మంగళవారాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలకు అపూర్వ స్పందన వచ్చింది. యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అభ్యర్థులు హాజరై తమ గళాన్ని వినిపించారు. భీమవరం: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న డిగ్రీ, పీజీ, ఇంటర్, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ బుధవారం కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. అంబేద్కర్ సెంటర్లో జరిగిన నిరసనలో జిల్లా కన్వీనర్ రాయి వెంకట దుర్గా సాయి మాట్లాడుతూ రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రవేశాలు ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారని తెలిపారు. అన్ని కోర్సుల ప్రవేశాలను తక్షణమే పూర్తి చేయడం, విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకటించడం, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించడం చేయాలన్నారు. జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ కళాశాలల ఫీజుల దోపిడీని నియంత్రించి, ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కన్వీనర్ శ్యామ్ విజయరాజ్, కార్యదర్శి సాయిరాం, తేజ, ప్రశాంత్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరంలో బుధవారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎస్‌ఆర్‌కెఆర్ కళాశాల, డీఎన్నార్ కళాశాలల్లో రెండు షిప్టులుగా పరీక్ష నిర్వహించారు. ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో మొత్తం 450కి 418 మంది అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ అనిల్ కుమార్ తెలిపారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను జిల్లాలో విజయవంతం చేయాలి. గతంలో ఎప్పుడులేని విధంగా మంత్రి లోకేష్ కనుసన్నల్లో డీఎస్సీలో కుంభకోణం జరిగింది. అడ్డగోలుగా స్పోర్ట్స్ కోటా పెట్టి టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టి అర్హులకు అన్యాయం చేశారు. దీనిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు, 10వ తేదిన భారీ ర్యాలీని విజయవంతం చేయాలి. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎస్సీ అక్రమాలపై విచారణ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగభృతి పథకం అమలు, తదితర డిమాండ్లపై గురువారం నుంచి ఆదివారం వరకు జిల్లా అంతటా నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్షల నిర్వహణకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈమేరకు భీమవరంలోని ప్రకాశంచౌక్ సెంటర్, నరసాపురంలోని అంబేడ్కర్ సెంటర్, ఆచంటలోని కచేరి సెంటర్, తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్, తణుకు రాష్ట్రపతి రోడ్డులోని బాయ్స్ హైస్కూల్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం, పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్, ఉండి నియోజకవర్గానికి సంబంధించి కాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలేదీక్షలు మొదలుకానున్నాయి. సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, నిరుద్యోగులు, అభ్యర్థులు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. -
దారులన్నీ దేవరపల్లి వైపే..
ప్రమాదభరితంగా కల్వర్టులు ఆకివీడు మండలంలోని జాతీయ రహదారి 165పై పలుచోట్ల కల్వర్టులు, రోడ్డు మార్జిన్లు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. 10లో uకావడి సేవ మహోత్సవానికి ముదినేపల్లి మండలం శింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం సిద్ధమైంది. 10లో uగురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026ద్వారకాతిరుమల: పొగాకు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి విచ్చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాల నుంచి భారీ సంఖ్యలో పొగాకు రైతులు, పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు తరలివచ్చారు. హెలీప్యాడ్‌కు చేరుకున్న వైఎస్ జగన్‌కు మాజీ హోం మంత్రి తానేటి వనిత, విశాఖ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జై జగన్ నినాదాల మధ్య రోడ్డు మార్గంలో పొగాకు వేలం కేంద్రానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. చూడాలన్న తపనతో.. వైఎస్ జగన్‌ను ఒక్కసారైనా చూడాలన్న తపనతో వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు చెట్లు, లారీలు, ఇతర వాహనాలపైకి ఎక్కి మరీ అభిమాన నేతను చూసి సంబరపడగా, మార్గమధ్యంలో క్రేన్ సాయంతో భారీ గజమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. రహదారులన్నీ జన సందోహంతో కిక్కిరిశాయి. భద్రతా వైఫల్యం : హెలికాప్టర్ దిగగానే అభిమానుల ఉత్సాహం కట్టలు తెంచుకుంది. జగన్‌ను దగ్గరగా చూసేందుకు కొందరు బారికేడ్లు దూకగా, మరికొందరు వాటిని పడగొట్టి హెలీప్యాడ్ వైపు పరుగులు తీశారు. వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తగినంత మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వచ్చాయి. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అడుగడుగునా అడ్డంకులు : ట్రాఫిక్ నియంత్రణ పేరుతో పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పలుచోట్ల అడ్డుకున్నారు. దేవరపల్లి డైమండ్ సర్కిల్ వద్ద బైక్‌లు, కార్లలో వస్తున్న కార్యకర్తలను నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో వారు పొగాకు వేలం కేంద్రానికి చేరుకోలేకపోయారు. యాదవోలు–దేవరపల్లి రహదారిలోనూ వాహనాలను నిలిపివేయడంతో కార్యకర్తలు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వైఎస్ జగన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, తెల్లం బాలరాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, తాడేపల్లిగూడెం, చింతలపూడి నియోజకవర్గాల ఇన్చార్జులు వడ్డి రఘురామ్, కంభంపాటి విజయరాజు తదితరులు ఉన్నారు. అభయమిస్తూ.. మాట్లాడుతున్న వైఎస్ జగన్. చిత్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, మాజీ మంత్రి వనిత, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, భీమవరం కన్వీనర్ చినమిల్లి, మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు ఘన స్వాగతం.. వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న మాజీ మంత్రి వనిత, భీమవరం కన్వీనర్ చినమిల్లి జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: పొగాకు రైతుల ఇబ్బందులపై దేవరపల్లికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రావడంతో రైతులకు భరోసా కలిగిందని పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలను బుధవారం ఆయన అభినందించారు. డీఎన్నార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో కిలో రూ.289 ధర పలికిన పొగాకు నేడు రూ.236కి పడిపోయిందన్నారు. నాడు వైఎస్ జగన్ రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆందోళన కార్యక్రమానికి జెన్‌జీ యువత పెద్ద ఎత్తున తరలిరావడం ప్రభుత్వంపై విరక్తికి కారణమని చెప్పారు. జిల్లాలో ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు డీఎన్నార్ పిలుపునిచ్చారు. అభిమాన పరవళ్లు వైఎస్ జగన్ పర్యటనలో జన జాతర ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలిన పొగాకు రైతులు, పార్టీ శ్రేణులు వైఎస్ జగన్ భరోసాతో రైతులకు ఊరట భద్రతా వైఫల్యాలు, పోలీసుల అడ్డంకులు ఎదురైనా పర్యటన జయప్రదం -
వైఎస్సార్సీపీని అణగదొక్కాలని చూస్తున్నారు
నూజివీడు: పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి రాష్ట్రంలో వైఎస్సార్సీపీని అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అది సాధ్యమయ్యేది కాదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నూజివీడులో బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫాపై రాజకీయంగా కక్ష కట్టి కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు పెట్టడం దారుణమన్నారు. ఆయన అందుబాటులో లేకపోతే ఆయన కుమార్తె నూరీ పాతిమా ఇంటితోపాటు ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఏడెనిమిది ఫ్లాట్లను రాత్రిపూట తనిఖీ చేయడం దారుణమన్నారు. ఇటీవల ఆలూరులో ఒక మహిళను వేధించినట్లు, చీర చించినట్లు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టారని, తీరా చూస్తే ఆమె భర్తే చించి కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలా లేనిపోని కేసులు నమోదు చేసి వైఎస్సార్సీపీ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను జైల్లో ఉంచాలనే చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ గొంతును నొక్కేయడానికి మాత్రం పోలీసు వ్యవస్థను వాడుతోందన్నారు. పొగాకు రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి వెళ్తే అక్కడ ఒక్క పోలీస్ లేడన్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వేలాది మంది ప్రజలు వస్తే ప్రభుత్వం సెక్యూరిటీని ఇవ్వకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ నేతల అక్రమ అరెస్టులపై రాబోయే రోజుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించి కార్యాచరణకు దిగుతామన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, గుంటూరు సిటీ అధ్యక్షురాలు నూరీఫాతిమా, తాడికొండ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు, విజయవాడ సిటీ నాయకులు పోతిన మహేష్, గుంటూరు ఏఎంసీ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
ఏలూరు జీజీహెచ్‌లో అమానుష ఘటన
బాలింతకు హెచ్ఐవీ అంటూ వైద్యుల నిర్లక్ష్యం ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పేదవర్గాల ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. అప్పులు చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని స్థితిలో ఉన్న పేదలు ఏలూరు జీజీహెచ్‌కు వైద్యం కోసం వస్తుంటారు. అయితే, ఇక్కడ గర్భిణులు, బాలింతలు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా మారాయి. రోజుకో సంఘటనతో ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ వైద్యులు, సిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. తాజాగా, ఒక బాలింతకు రక్త పరీక్షల రిపోర్టులో హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందంటూ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులందరినీ పిలిచి అందరి ముందూ అవమానకరంగా మాట్లాడారని బాధితులు చెబుతున్నారు. తీరా బుధవారం అదే బాలింతకు ఏలూరులోని ప్రైవేటు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేయించగా ‘నెగిటివ్’ రావడంతో బాధితురాలి భర్త, బంధువులు ఏలూరు జీజీహెచ్‌లో ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే? ఏలూరు జిల్లా కై కలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఓ మహిళ ప్రసూతి కోసం ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చేరింది. ఆమె జీజీహెచ్‌లో చేరిన వెంటనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వైద్యులు ఆమెకు రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో బాలింతకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందంటూ ఆసుపత్రిలో హడావిడి చేశారు. బాధితులకు కౌన్సిలింగ్ ఇవ్వడమో, లేదా గోప్యంగా చెప్పి వైద్య చికిత్స అందించడమో చేయకుండా.. ఆమె బంధువులందరినీ పిలిచి మరీ అవమానకరంగా మాట్లాడటం పట్ల వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లో బయటపడిన నిజం బుధవారం ఏలూరులోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఆమెకు మళ్లీ రక్త పరీక్షలు చేయించగా హెచ్ఐవీ ‘నెగిటివ్’ వచ్చింది. దీంతో బాధితురాలి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు జరిగిన అవమానంతో తీవ్ర మానసిక వేదనకు గురై చనిపోదామని నిర్ణయించుకున్నామని, తీరా బయట రక్త పరీక్షలు చేయిస్తే నెగిటివ్ వచ్చిందని బాధితులు తెలిపారు. ఏలూరు జీజీహెచ్‌లో వైద్యం సరిగా అందించే పరిస్థితి లేదని, ఇక్కడి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాలింత భర్త కన్నీటిపర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రమాదభరితంగా జాతీయరహదారి కల్వర్టులు
మూలలంక బోదెకు ఉన్న పిట్టగోడలు కూలిపోయి ప్రమాదభరితంగా ఉన్న కల్వర్టు ప్రధాన సెంటర్లో కల్వర్టు పిట్టగోడ పడి అండలు జారుతున్న దృశ్యం ఆకివీడు: జాతీయ రహదారి నెం.165పై పలుచోట్ల కల్వర్టులు, రోడ్డు మార్జిన్లు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఈ మార్గంలో చాలా కల్వర్టులు పురాతనమైనవి కావడంతో పిట్టగోడలు విరిగిపోయాయి. గంగానమ్మ కోడు, అయిభీమవరం రోడ్డు, తెల్లవంతెన, మాదివాడ సెంటర్ల వద్ద కల్వర్టులు కుంగిపోయి, నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎదురుగా వాహనాలు వస్తే కిందపడిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు శాశ్వత మరమ్మతులు చేయకుండా, కేవలం రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. అలాగే, వర్షపు నీటితో నిండిన ప్రమాదకర మార్జిన్లు, ఆక్రమణల వల్ల రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఎన్‌హెచ్ అధికారులు స్పందించి, శిథిలావస్థలో ఉన్న కల్వర్టులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. -
కృషి, క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు
భీమవరం: కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని తిరుపతి ఐఐటీ ఫౌండర్, డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. భీమవరం స్థానిక భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఐఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించేందుకు కష్టపడి చదవడంతో పాటు కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఐఐటీ, ఏఐ విద్యకు సంబంధించిన విద్యార్థుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో భవన్ స్కూల్స్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, భవన్ స్కూల్స్ సెక్రటరీ సామంతపూడి శ్రీరామరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ కొత్త శ్రీమన్నారాయణ శ్రీనివాస్, భవన్ స్కూల్ డైరెక్టర్ మంతెన వెంకట రఘుపతి రాజు, ప్రిన్సిపాల్ గౌరవ్ శర్మ పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ -
శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను పాటించాలి
పెదవేగి : కొప్పాకలోని వరి పొలాలు, పీఏసీఎస్‌ను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో పాటు ఆర్ఎస్కే అసిస్టెంట్‌తో పంటల ప్రస్తుత పరిస్థితి, సాగు విస్తీర్ణం, పంట ఎదుగుదల దశ, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు, ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ, అలాగే పీఎంఎఫ్‌బీవై పంట బీమా నమోదు పురోగతి, రైతుల స్పందనపై సమగ్రంగా ఆరా తీశారు. డైరెక్టర్ మాట్లాడుతూ... పీఎంఎఫ్‌బీవై పంట బీమా పథకంలో అర్హులైన ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకొని, గడువులోపు ప్రీమియం చెల్లించి తమ పంటలను ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షించుకోవాలని సూచించారు. రైతులు సహజ వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, నేల సారాన్ని పెంపొందించి, వాతావరణ మార్పులను తట్టుకునే స్థిరమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, ఏలూరు ఏడీఏ ఈ అనిలకుమారి, డీపీఎం శ్రీ బి.వెంకటేష్, డీఎం (మార్క్‌ఫెడ్) ఎల్డీవీ ప్రసాద్ గుప్త, పీఏసీఎస్ చైర్పర్సన్ కొసరాజు వీరవెంకట వరప్రసాద్, పీఏసీఎస్ సెక్రటరీ రమేష్, వీరగంటి రాంబాబు, వేగొంట శ్రీనివాసరావు, ఆర్ఎస్కే సిబ్బంది, ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణలో ఇల్లు తొలగిస్తున్నారని..
బుట్టాయగూడెం : రోడ్డు విస్తరణ పనుల్లో ఇల్లు తొలగింపునకు గురవుతుందన్న మనస్తాపంతో జీలుగుమిల్లి మండలం కనకాపురంనకు చెందిన వి.శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం జాతీయ రహదారి భూసేకరణలో భాగంగా శ్రీనివాస్ ఇల్లు కూల్చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కొందరు వ్యక్తులు వెంటనే స్పందించి అతని చేతిలోని పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. రోడ్డు వెడల్పు పనుల్లో మొదట తన నివాసాన్ని తొలగించమని అధికారులు చెప్పారని, కానీ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శ్రీనివాస్ తెలిపాడు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.


