ఫైళ్లు కదలవు.. సమస్యలు తీరవు
1,500 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో..
భీమవరం(ప్రకాశం చౌక్) : పాలనా సౌలభ్యం, ప్రజ లకు పరిపాలన అందుబాటులో ఉండటంతో పా టు సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలను పునర్విభజన చేశారు. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడింది. ఈ ప్రాంత ప్రజలకు కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రజల సమస్యలు తీరడం లేదు. అర్జీలు అందించి నెలలు గడుస్తున్నా భూసమస్యలు పరిష్కారం కావడం లేదు.
నెలల తరబడి పెండింగ్‌లోనే..
కలెక్టరేట్‌కు వచ్చే రెవెన్యూ శాఖకు సంబంధించి ఫైళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. రెవెన్యూ సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందిస్తే తర్వాత ఫైల్ సిద్ధం చేయడానికి నెల రోజులు, అక్కడ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపించడానికి మరో నెల రోజులు, అక్కడ నుంచి కలెక్టరేట్‌కు పంపించడానికి మరో నెల రోజులు ఇలా మూడు నెలలు సమయం పడుతుంది. అలాగే కొన్ని తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లోనే నెలల తరబడి పెండింగ్‌లోనూ ఉండిపోతున్నాయి. చివరకు కలెక్టరేట్ కు వచ్చినా ఫైల్ జాయింట్ కలెక్టర్, కలెక్టర్ లా గిన్‌కు వెళ్లడానికి మరో మూడు నుంచి ఆరు నెలలు సమయం పడుతుంది. అది కూడా అర్జీదారులు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులు చూట్టూ తిరిగితే గానీ ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. కలెక్టర్, జేసీ లాగిన్‌కు వెళ్లిన ఫైల్ కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి.
పైసలిస్తేనే ముందుకు..!
భూ సమస్యల, మార్పులు చేర్పులపై దరఖాస్తులు ముందుకు కదలలాంటే వసూళ్ల పర్వం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీ ఓ కార్యాలయాల్లో పైసలిస్తేనే ఫైళ్లు కలెక్టరేట్‌కు చేరుతున్నాయని, లేకుంటే నెలల తరబడి నిరీక్షణ తప్పదనే విమర్శలు వస్తున్నాయి. సమస్యలు వేగంగా పరిష్కారం కాకపోవడంతో ప్రతి సోమ వారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో మళ్లీ మళ్లీ అవే అర్జీలు వస్తున్నాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పట్టించుకుని అర్జీలను వేగంగా పరిష్కరించాలని అర్జీదారులు కోరుతున్నారు.
భీమవరం మండలం గుట్లపాడుకు చెందిన ఓ రైతు తన భూమిని 22ఏ నుంచి తొలగించాలని కోర్టు ఆర్డర్ ఉందని ఏడాది క్రితం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందజేశారు. ఆర్డీఓ కార్యాలయం ద్వారా కలెక్టరేట్‌కు దరఖాస్తు చేసుకోగా.. నెలల తరబడి సదరు రైతును తిప్పుకుని చివరకు ఆ పని చేయలేమని కలెక్టర్, జేసి చేతులు ఎత్తేశారు. దీంతో సదరు రైతు కోర్టు ఆర్డర్ అమలు చేయలేదని మరలా కోర్టును ఆశ్రయించాడు.
ఆకివీడుకు చెందిన ఓ మహిళ తన అడంగల్‌లో భూ విస్తీర్ణానికి సంబంధించి సరిచేయాలని దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి అక్కడి నుంచి కలెక్టరేట్‌కు చేరడానికి మూడు నెలలు పట్టింది. కలెక్టరేట్‌కు చేరి ఆరు నెలలు గడిచింది. మహిళ కుటుంబసభ్యులు నెలల తరబడి కలెక్టరేట్‌లోని అధికారుల చుట్టూ తిరిగితే ఇటీవల జాయింట్ కలెక్టర్ లాగిన్‌కు వెళ్లింది. అయినా ఇప్పటికీ ఫైల్ క్లియర్ కాలేదు.
ముందుకు కదలని భూ సమస్యల దస్త్రాలు
నెలల తరబడి లాగిన్లలోనే..
అధికారుల తీరుతో అర్జీదారుల అసంతృప్తి
కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు
కలెక్టర్, జేసీ సమీక్షా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, పర్యటనల కారణంగానే ఫైల్స్ క్లియర్ చేయడంలో ఆలస్యమవుతోందని తెలుస్తోంది. తమ ఫైళ్ల పరిస్థితిపై అడిగితే కలెక్టరేట్ అధికారులు ఇదే సమాధానమిస్తున్నారని అర్జీదారులు ఆవేదన చెందుతున్నారు. నరసాపురం, భీమవరం ఆర్డీఓ కార్యాలయాల నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 500 నుంచి 1,500 వరకు ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్టు అంచనా. వాటిలో 22 ఏ, భూ విస్తరణ, వర్గీకరణ తదితర భూ సమస్యల ఫైళ్లు ఉన్నాయి. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


