సినిమాలకు ప్రేరణ నిజ జీవిత గాథలు. కొన్ని విజయ గాథలకు ప్రేరణ సినిమాలు. అలా అచ్చం సినిమాలా సాగిన ఒక నిరుపేద జీవితం, ఆయన సక్సెస్ జర్నీ ఆ తరువాత సినిమాకు ప్రేరణగా నిలిచింది. పట్టుదల , కఠిన శ్రమతో, అడ్డంకులను అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చనే స్పూర్తిని రగిలించింది. మరి ఆ విజయగాథ ఏంటో తెలుసుకుందాం పదండి.
బిహార్‌లోని పాట్నాలోని విశున్‌పూర్ పక్రి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆదిత్య పాండే. ముగ్గురు సోదరీమణులలో అతను చిన్నవాడు. దృఢ సంకల్పంతో UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఈ విజయం వెనుక ఒక తిరస్కారం.. ఆ తిరస్కారంనుంచే విజయాన్ని వెదుకున్న తీరు గురించి తెలుసుకుంటే హృదయం ఉప్పొంగక మానదు.
ఆదిత్య 8 , 9 తరగతులలో బాగానే చదివాడు. 10వ తరగతిలో ప్రేమ మొదలైంది. ఆ మైకంలో చదువును నిర్లక్ష్యం చేశాడు. ఫలితాల్లో వెనుకబడ్డాడు. ఫలితంగా తండ్రి అతన్ని పాట్నాకు తిరిగి పంపాడు. అటు ప్రియురాలు కూడా అవమాన పర్చింది. అది అతణ్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఎదురుదెబ్బతో తన జీవితాన్నిదిద్దుకోవడానికి వాడుకన్నాడు. ఆదిత్య తన శక్తిని కొత్త లక్ష్యం వైపు మళ్లించాలని అపుడు ప్రతిన బూనాడు. తాను కచ్చితంగా తాను ఐఏఎస్ చదవాలని.
ఇంజనీరింగ్ నుండి IAS వరకు
12వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయ కంకర్‌బాగ్‌లో విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత, ఆదిత్య బాగా రాణించాడు. పంజాబ్‌లోని LPU నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పొందినప్పటికీ, తన నిజమైన అభిరుచి ఇంజనీరింగ్‌లో లేదని ఆదిత్య గ్రహించాడు. విడిపోవడం వల్ల కలిగే బాధ అతన్ని వెంటాడు తున్నప్పటికీ, తన కోరికతో 2018లో IIT రూర్కీ నుండి MBA పట్టా పొందాడు. ICICI బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరాడు.
2020లో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలి UPSC పరీక్షకు సిద్ధమయ్యాడు. UPSC పరీక్షలో మూడుసార్లు విఫల మైనప్పటికీ, నిరాశపడలేదు. తత్వశాస్త్రం తన ఐచ్ఛిక సబ్జెక్టుగా ఉండటంతో, అతను UPSC ఫలితం 2021లో కేవలం 2.5 మార్కుల తేడాతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఢిల్లీలో ఐచ్ఛిక సబ్జెక్టుల తయారీ కోసం మాత్రమే కోచింగ్‌పై ఆధారపడుతూ, ఇతర సన్నాహాల కోసం పూర్తిగా స్వీయ అధ్యయనంపై దృష్టి పెట్టాడు. అలా పూర్తి అంకితభావం, కృషి, దృఢ సంకల్పంతో తన మూడవ ప్రయత్నంలో UPSC పరీక్షలో 48వ ర్యాంకును సాధించగలిగాడు. అలా 2022లో కృషి, దృఢ సంకల్పం ఫలించింది.
ఆదిత్య జీవితం స్ఫూర్తిదాయకమైన కథ. కష్టాలు,నష్టాలు ఎన్ని వచ్చినా, ఎన్ని ఎదురుదెబ్బలు, చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వచ్చినా కలలను నెరవేర్చుకోవాలనే సంకల్పమే ధైర్యం. అదే గొప్ప విజయాలకు పునాదిని నిరూపించివాడు. అలాగే తన చదువుపై తండ్రికున్న ఎన్నో సందేహాలను పటా పంచలు చేసినవాడు. అంతేకాదు ఆదిత్య సీరియస్‌గా చదువితే.. మీసం గీసుకుంటానని సవాల్ చేసిన ఉపాద్యాయుడికి తన ఐఏఎస్‌ను సగర్వంగా చూపించాడు.
షాదీ మే జరూర్ ఆనా
2017లో విడుదలైన షాదీ మే జరూర్ ఆనా మూవీకి ఆదిత్య కథే స్ఫూర్తి. నటుడు రాజ్‌కుమార్ రావు సత్యేంద్ర మిశ్రా (సత్తు) పాత్రను పోషించారు, ఆర్తి శుక్లా (కృతి ఖర్బంద)తో విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత IAS అధికారి అవుతాడు.


