సాంకేతిక లోపం కానే కాదు
ఉద్దేశపూర్వకంగా ఇంధనం స్విచాఫ్ చేశాడు
అందుకే ఎయిరిండియా విమానం కూలింది
అమెరికన్ ఇన్వెస్టిగేటర్లను ఉటంకిస్తూ
ఇటలీ పత్రిక ‘కొరియరె డెల్లా సెరా’ కథనం
నాటి దుర్ఘటనలో మృతులు 260 మంది
అది గత ఏడాది జూన్ 12న జరిగిన వైమానిక దుర్ఘటన.. ‘ఎయిరిండియా ఫ్లైట్ 171’ (బోయింగ్ డ్రీమ్ లైనర్ 787) అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరింది. టేకాఫ్ చేసిన 32 సెకండ్లకే రెండు ఇంజిన్ల నుంచి చోదక శక్తి లభించక విమానం కూలిపోయింది. విమాన సిబ్బంది 12 మంది, ప్రయాణికులు కలిపి మొత్తం 241 మంది మరణించారు. వీరు కాకుండా శకలాలు నేలపై కూలిపోయి వైద్య విద్యార్థుల హాస్టల్ వద్ద ఉన్న మరో 19 మంది కూడా చనిపోయారు.
దాంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. విమానంలోని ఒక్క ప్రయాణికుడు మాత్రం మృత్యువును జయించి బతుకు జీవుడా అంటూ గాయాలతో బయటపడ్డాడు. ఇద్దరు పైలట్లలో ఒకరు ‘దాదాపుగా’ ఉద్దేశపూర్వకంగా ఇంధన స్విచ్చుల్ని ఆపివేయడం కారణంగానే విమానం కూలిపోయిందని, సదరు దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న భారతీయ ఇన్వెస్టిగేటర్లు ఆమేరకు ఆ అంశాన్ని పొందుపరుస్తూ తుది నివేదిక రూపొందిస్తున్నారని ఇటలీ వార్తాపత్రిక ‘కొరియరె డెల్లా సెరా’ బుధవారం ఓ సంచలన కథనం ప్రచురించింది. పాశ్చాత్య వైమానిక సంస్థల్లోని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ అది తాజా బాంబు పేల్చింది.
పెదవి విప్పని పౌర విమాన శాఖ
ఎయిరిండియా విమాన దుర్ఘటనకు సాంకేతిక లోపం కారణం కాదని తనిఖీల్లో తేలిందని, ఇంధనం మీటల్ని కదిలించిన పైలట్ ఎవరనేది కూడా కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్స్ (సీవీఆర్) విశ్లేషణ సందర్భంగా ఇన్వెస్టిగేటర్లు గుర్తించారని ఇటలీ పత్రిక కథనం తెలిపింది. దీనిపై ‘హిందూస్థాన్ టైమ్స్’ పత్రిక మరిన్ని వివరాలు తెలుసుకుందామని విమాన దుర్ఘటన దర్యాప్తు బ్యూరో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖను సంప్రదించినప్పటికీ అవి స్పందించలేదు. విమానంలో ఇంధన సరఫరాకు వీలు కల్పించే స్విచ్చుల్ని ఉద్దేశపూర్వకంగా ఎలా ఆఫ్ చేశారు? లేదా బాధ్యత వహించేది ఎవరు? అనే అంశమై తుది నివేదికలో పూర్తి వివరాలు ఉంటాయో, ఉండవో ప్రస్తుతానికైతే తెలియరాలేదు. ఈ దుర్ఘటనలో మరణించిన విమాన పైలట్ (కమాండర్) సుమీత్ సబర్వాల్ వివాదానికి కేంద్ర బిందువుగా, ప్రధాన అనుమానితుడిగా నిలిచారని ‘కొరియరె డెల్లా సెరా’ కథనం తెలిపింది. సుమీత్ సబర్వాల్ కుటుంబం, భారతీయ పైలట్ల సంఘాలు మాత్రం అతడి వైపే నిలిచాయి. విమాన తయారీదారు, దాని ఆపరేటర్, ఇతర అంశాలపై మరింత లోతుగా పరిశీలన జరగాలని ఇండియన్ పైలట్స్ అసోసియేషన్స్ డిమాండ్ చేశాయి.

తుది నివేదికపై రాజకీయ ప్రభావం?
ఎయిరిండియా విమాన దుర్ఘటన దర్యాప్తులో అమెరికన్ ఇన్వెస్టిగేటర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. గత ఏడాది డిసెంబరులో ఏఏఐబీకి చెందిన భారతీయ దర్యాప్తు బృందం వాషింగ్టన్ వెళ్లింది. కూలిన ఎయిరిండియా విమానం ‘బ్లాక్ బాక్స్’ను దర్యాప్తు బృంద సభ్యులు అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా మండలి (నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు)కి చెందిన ప్రయోగశాలల్లో మరోసారి విశ్లేషించారు. ఇందులో ప్రత్యేకించి విమానం క్యాబిన్ ఆడియో రికార్డింగ్స్ మీద వారు దృష్టి పెట్టారు. పొరపాటు వల్ల దుర్ఘటన సంభవించలేదని, ఇంధన స్విచ్చులను ఏ పైలట్ ఆఫ్ చేశారో కూడా ఆడియో విశ్లేషణలో బయటపడిందని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ‘కొరియరె డెల్లా సెరా’ పేర్కొంది.
అమెరికన్ ప్రయోగశాలల్లో జరిపిన ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్) విశ్లేషణ కూడా సబర్వాల్ వైపే తప్పు చూపిస్తోంది. ఇంజిన్లు పనిచేయని క్రమాన్ని పరిశీలిస్తే... తొలుత కెప్టెన్ (కమాండర్ సుమీత్ సబర్వాల్) కూర్చునే ఎడమ వైపు ఇంజిన్ షట్ డౌన్ అయిందని, ఆ తర్వాత కుడి వైపు ఇంజిన్ షట్ డౌన్ అయిందని తెలుస్తోంది. ఆ సమయంలో విమానాన్ని సబర్వాల్ పర్యవేక్షిస్తుండగా (మానిటరింగ్), ఫస్ట్ ఆఫీసర్ కుందర్ (కో-పైలట్/సెకండ్ ఇన్ కమాండ్) కుడి వైపు కూర్చుని విమానాన్ని (పైలటింగ్) నడుపుతున్నారు. విమానాన్ని పైకి, కిందికి, పక్కలకు తిప్పడానికి పైలట్లు తమ ఎదురుగా ఉండే ‘కంట్రోల్ యోక్’ ఉపయోగిస్తారు. చాలినంత ఇంధనం అందక, చోదక శక్తి లోపించి ఎయిరిండియా విమానం కిందికి కూలిపోబోతున్న ఆఖరి క్షణాల్లో... అది ప్రయాణించే ఎత్తును పెంచేందుకు ఫస్ట్ ఆఫీసర్ కుందర్ ప్రయత్నించారు. అందుకు ఆయన వాడిన ‘కంట్రోల్ యోక్’ ఉన్న పొజిషన్ ఓ సాక్ష్యంగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
ఇక సబర్వాల్ ముందున్న కంట్రోల్ యోక్ మాత్రం ‘స్థిరమైన స్థితి’లో అలాగే ఉంది. అంటే... విమానం కిందికి కూలిపోతున్నప్పటికీ దాన్ని పైకి, ఎత్తుకు లేపడానికి సబర్వాల్ ప్రయత్నించలేదని ఇటలీ పత్రిక కథనం పేర్కొంది. అయితే ఈ ‘తుది నిర్ధారణలు’ రాజకీయ నాయకత్వ పరిశీలనకు వెళ్లవచ్చని, జాతీయంగా తీవ్ర వివాదాలకు తావివ్వకుండా మరింత జాగ్రత్తగా తుది నివేదిక రూపొందవచ్చని... పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికన్ ఇన్వెస్టిగేటర్లను ఉటంకిస్తూ ‘కొరియరె డెల్లా సెరా’ తన కథనం రాసింది.
-జమ్ముల శ్రీకాంత్ (Credit: Hindustan Times).


