చంద్రయాన్-4 దిగేది... అచ్చోటనే! | ISRO has selected a location for Chandrayaan-4 | Sakshi
Sakshi News home page

చంద్రయాన్-4 దిగేది... అచ్చోటనే!

Feb 9 2026 2:12 PM | Updated on Feb 9 2026 3:41 PM

ISRO has selected a location for Chandrayaan-4
  • చంద్రుడిపై ‘విక్రమ్’ ల్యాండర్ 
  • దిగేది ‘మోన్స్ మౌటన్’ పర్వతం వద్దనున్న చదునైన ప్రదేశంలో..

జాబిలి దక్షిణ ధ్రువంపై 2028లో ‘విక్రమ్’ ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఉండే సమతల ప్రదేశాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. ‘చంద్రయాన్-2’ ఉపగ్రహంలోని కెమెరా తీసిన ఛాయాచిత్రాలను విశ్లేషించి వారు ల్యాండింగ్ ప్రాంతంపై తాజా నిర్ణయం తీసుకున్నారు. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగాల్సిన ప్రదేశానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఐదు పారమితులు పెట్టుకున్నారు. 

అవి... ఆ ప్రదేశంలోని నేల వాలు 10 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. పెద్ద శిలలు అంతగా ఉండకూడదు. 11-12 రోజులపాటు నిరంతర సూర్యకాంతి అందుబాటులో ఉండాలి. అక్కడ బిలాలు (గోతులు) కూడా ఎక్కువగా ఉండరాదు. భూమితో నేరుగా రేడియో కమ్యూనికేషన్స్ అవకాశం ఉండాలి. ఇందుకోసం వారు చంద్రుడిపై ‘మోన్స్ మౌటన్’ పర్వతం చుట్టూ గల ఐదు ప్రదేశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. 

ఆ ఐదింటిలో ఒకటి శాశ్వత చీకటి ప్రదేశం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. మిగతా నాలుగు స్థలాలకు ఎంఎం-1, ఎంఎం-3, ఎంఎం-4, ఎంఎం-5 అని పేర్లు పెట్టారు. వారి పరిశీలనలో వాటిలో ఎంఎం-4 సురక్షిత, ఆశాజనక స్థలంగా తేలింది. అందుకే చివరికి దాన్ని ఎంపిక చేశారు. ఈ స్థలం చంద్రుడి ఉపరితలంపై 84.289 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 32.808 తూర్పు రేఖాంశం నడుమ ఉంది. దీని నేలపై సగటు వాలు 5 డిగ్రీలు మాత్రమే. అంటే దిగేటప్పుడు ల్యాండర్ పడిపోయే, దొర్లే అవకాశాలు తక్కువ. 

పైగా, ఈ ప్రదేశంలో చుట్టూ గల కొండల తాలూకు నీడ పడే అవకాశాలూ పరిమితం. తద్వారా విద్యుదుత్పత్తి కోసం ల్యాండర్ సౌరఫలకాలకు చాలినంత సూర్యకాంతి దొరుకుతుంది. ల్యాండింగ్ ప్రదేశం ‘ఎంఎం-4’కు సంబంధించిన ఓవరాల్ రిస్క్ స్థాయిని 9.89 శాతంగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఎంఎం-1, ఎంఎం-3 ప్రదేశాల రిస్క్ స్థాయి 12 శాతం కంటే ఎక్కువ ఉంది. ఇక ‘ఎంఎం-5’ స్థలంలో ల్యాండింగ్ విషయంలో సేఫ్ గ్రిడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి.అందుకే అంతిమంగా ‘ఎంఎం-4’ను ఎంపిక చేశారు. 

చంద్రుడి ఉపరితలం నుంచి మట్టి, శిలలు సేకరించి వాటిని భూమికి తీసుకురావడం చంద్రయాన్-4 మిషన్ లక్ష్యం! ఇందుకోసం రోబోటిక్ ఆర్మ్స్, చోదక వ్యవస్థలను ఇస్రో అభివృద్ధి చేస్తోంది. 
-  జమ్ముల శ్రీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement