అయోధ్య రామమందిరంపై బాంబు దాడి యత్నం కేసులో అరెస్టైన అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి జైలులో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. నిన్న ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అతనిపై అరుణ్ చౌదరి అనే వ్యక్తి దాడి చేసినట్లు పేర్కొన్నారు.
నిన్న రాత్రి పదునైన ఆయుధంతో రహ్మన్ తలపై దాడి చేయగా అతనికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారని పేర్కొన్నారు. కాగా అతనిపై దాడి చేసిన అరుణ్ చౌదరి జమ్మూకశ్మీర్ కు చెందిన వ్యక్తి అని తెలిపారు. ప్రస్తుతం రహ్మన్ ఫరిదాబాద్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
2025లో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, హర్యాణా స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడులు చేసి రహ్మాన్ ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతని చేతిలో రెండు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే అనంతరం జరిపిన విచారణలో రహ్మాన్ నకిలీ ధృవపత్రాలతో ఫరీదాబాద్ లో నివసిస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.
అనంతరం అతని వద్ద స్వాధీనం చేసుకున్న వీడియోలలో రామమందిరానికి సంబంధించిన కీలక చిత్రాలు వీడియోలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే అతనికి ఐఎస్ఐతో సంబంధం ఉన్న సంస్థల ద్వారానే బాంబులు అందినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అతని హత్య చేయడానికి గల కారణాలు తెలియదని.. ఎందుకోసం అతనిపై దాడి చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.


